నాకు నచ్చిన మరో నవల.వాసిరెడ్డి సీతా దేవి - మట్టి మనిషి నవల

 నాకు నచ్చిన మరో నవల


వాసిరెడ్డి సీతాదేవి - మట్టి మనిషి

సాంఘిక ప్రయోజనం ఉన్న నవలలు రాసిన రచయిత్రులలో వాసిరెడ్డి సీతాదేవి ఒకరు. సమాజంలో సామాన్యంగా జరిగే సంఘటనలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలించి రాయడం వల్ల ఆమె నవలలు ఆణిముత్యాలయ్యాయి. తనదైన దృక్పథంతో ఆయా సమస్యలకు పరిష్కారాలను కూడా చూపి సాహిత్య రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె చూపిన పరిష్కార మార్గాల్లో మార్క్సిస్టు దృక్పథం కనిపిస్తుంది.

సీతాదేవి అభ్యుదయ రచయిత్రి. సాంఘిక సమస్యలను ప్రతిభావంతంగా,  చైతన్య పూరితంగా ప్రతిపాదించి నిరూపించగల దక్షత ఉన్న రచయిత్రి.

గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించిన ఆమె అలహాబాదు యూనివర్సిటీలో ఏం. ఏ. పట్టా పొందారు. 1951 నుండి ధర్మ క్షేత్రం, మృగతృష్ణ, బంధితుడు , సమత, రాబందులు- రామ చిలుకలు , మానిని- మనిషి, అడవి మల్లె మొదలైన నవలలు 40 కి పైగా రచించారు. వాటిలో నా మనసులో స్థిరంగా నిలిచి పోయిన నవల ' మట్టి మనిషి . ' దానికి కారణం నేనూ మట్టి మనిషిని కావడం, అందులోని పాత్రలు , సంఘటనలు అన్నీ కూడా నా జీవితానికి దగ్గరగా ఉండడం కావచ్చు

ఈ నవల 1970 లో ఆంధ్ర ప్రభ లో ఆదివారం అనుబంధంగా ధారావాహికంగా ప్రచురితమై పాఠకులు ఉత్కంఠతో ఎదురు చూసేలా చేసింది. వాస్తవికత ఆధారంగా వెలువడిన ఈ నవలను శేషాచలం అండ్ కంపెనీ వారు మార్చి  1972 లో పుస్తకంగా ప్రచురించారు. ఆ తర్వాత ఫిబ్రవరి  1976 లో  , మార్చి 1986 లో ప్రచురించబడి మూడు ముద్రణలతో తనపై ప్రజలకున్న ఆదరణను చాటుకొంది.

' మట్టి మనిషి' లో ఫ్యూడల్ వ్యవస్థ శిథిలమై పోతున్న దశలో ఆ వ్యవస్థ లోని దర్పాన్ని, విలాసాలను మానుకోలేని  భూస్వాములు తమ ఆస్తులను ఎలా నాశనం చేసుకున్నారు అన్న విషయం చిత్రితం. ఫ్యూడల్ వ్యవస్థకు , కాపిటలిజానికి మధ్య సంధి కాలంలో సాంబయ్య, వరూధిని పాత్రల దృష్టి కోణంలో ఈ నవలంతా నడిచింది.

పాలేరుగా ఉంటూ భూస్వామి ఎత్తుకు ఎదిగిన మనిషి సాంబయ్య. ఆ స్థితికి ఎదగడానికి అతడు చేసిన కృషి ఈ నవలలో కనిపిస్తుంది. మట్టి మనిషి నవల పేరులోనే  భూమిని నమ్ముకొని జీవించే ఒక రైతు కథ అని అర్థమవుతుంది. తాను పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడు రైతు పొందే ఆనందాన్ని ఈ నవలలో చూడగలం.

వాసి రెడ్డి సీతాదేవి తాను చెప్పదలుచుకున్న కథను పాత్రల ద్వారా నడిపిస్తూ అవసరమైనప్పుడు తాను ఆయా పాత్రల గురించి వివరిస్తూ కథను నడిపిస్తారు.

ఫ్యూడల్ వ్యవస్థ భూస్థాపితమవుతున్న దశలో వరూధిని తండ్రి బలరామయ్య అనవసరమైన ఆడంబరాలకు పోయి తలకు మించిన అప్పుల భారంతో కుప్పకూలిపోతాడు. నలుగురు కొడుకుల చదువుల కోసం వేలకు వేలు తగలేశాడు. ఇద్దరు కూతుళ్లకూ పెళ్లిళ్లు చేశాడు. చివరి కూతురు వరూధిని పెళ్లయ్యే నాటికి అప్పుల ఊబిలో ఉన్నాడు. ఆ స్థితికి తల వొగ్గి తన ఇంటిలో పాలేరుగా పని చేసిన ! ఊర బోయిన వెంకయ్య మనవడు వెంకట పతికి వరూధినిని ఇచ్చి పెళ్లి చేశాడు.

వరూధినిపై సినిమాల ప్రభావం ఎక్కువ.  పట్టణం పోకడలపై మోజు. భర్త తాను ఆశించినంత నాగరికుడు కాడన్న అసంతృప్తి ఆమెలో ఉంది.

మామ సాంబయ్య ఇస్తానన్న కట్నం  మొత్తం ఇవ్వలేదని కోడల్ని మొదట కాపురానికి తీసుకు రాలేదు. అయినా వరూధిని బాధ పడలేదు. రోగిష్టి తండ్రికి సేవ చేస్తూ పుట్టింట్లోనే ఉండి పోయింది. అన్నల వెంట తిరిగే అబ్బాయిల్ని చూసి వరూధిని కలవర పడేది. దిగులు పడేది కూడా .

వరూధిని కాపురానికి వచ్చిన తర్వాత భర్తను తన వశం చేసుకొని సాంబయ్యను లెక్క చెయ్యకుండా పట్టణంలో సినిమా హాలు కట్టి లక్షలు ఆర్జించాలను కొంది. దాని కోసం రామనాథ బాబు అనే అతనిని ఆశ్రయించింది అత్తింటి ఆస్తి మొత్తాన్ని అతని చేతిలో పోసి మోస పోయింది. ఆ మోసాన్ని తట్టుకోలేక చివరికి అతనిని చంపించబోయి తానే తప్పతాగి ప్రాణం తీసుకుంది .

వెంకట పతి తల్లి లేని తన కొడుకు రవిని అతని తాత సాంబయ్య దగ్గరికి చేర్చాడు. దిక్కులేని రవికి దిక్కులేని మట్టి మనిషి సాంబయ్య తోడయ్యాడు .

నవల మొదట గ్రామీణ వాతా వరణంతో మొదలై మధ్యలో పట్టణ వాతావరణాన్ని చేరింది. చివర  మళ్లీ  గ్రామీణ వాతావరణమే దర్శన మిస్తుంది .

'మట్టి మనిషి ' నవలలోని సంఘటనలు , సన్నివేశాలు అత్యంత సహజంగా కథకు బలాన్ని చేకూర్చే విధంగా చిత్రించ బడ్డాయి. ఆ సహజత్వమే పాఠకుని పట్టి చదివిస్తుంది.

రచయిత్తి సాధారణమైన పద చిత్రాలు,  వాక్య నిర్మాణం ద్వారా , జీవితాన్ని చదివే నేర్పుతో,  పరిష్కార మార్గంతో , ఒక భావ వాహికగా భాషను ప్రయోగించారు. సామాన్యునికి సంబంధించిన జీవితాంశాలను చిత్రించడానికి , భావ పరి పుష్టి కోసం, సహజత్వం కోసం అలంకారాలు, సామెతలు, జాతీయాలు, జంట పదాలు విరివిగా ప్రయోగించారు.

ఈనగాచి నక్కల పాలు చేయడం , నక్కకూ నాగ లోకానికీ సంబంధమా ? లాంటి సామెతల ద్వారా పరిస్థితిని కళ్లకు కట్టించే ప్రయత్నం చేశారు.

నవలలో జాతీయాల ప్రయోగం ద్వారా వాస్తవికత
కనిపిస్తుంది. 
ఉట్టి గట్టు కొని ఏలాడ్తది ( పుట : 37)
నోటి  కాడి  అన్నం  కుక్కల పాలైంది (54)
పెంట కుప్ప మీద కానీ ఏస్తే కళ్లకద్దుకొని  తీసుకుంటాడు ( 78)
అచ్చోసిన  ఆంబోతు (92)
ఎంగిలి చేత్తో కాకిని తోలడు (123)
కాకి ముక్కుకు దొండ పండు ( 127)
ఆకలి గొన్న ఎద్దు పెసర చేలో పడ్డట్టు (146)

ఇలాంటి ప్రయోగాలను విరివిగా  ఉపయోగించారు. వీటి వల్ల కథకు సహజత్వం, వాస్తవికత సిద్ధించాయి .

నీ సిగదరగ, బలాదూరు లాంటి గ్రామీణ ప్రయోగాలను చక్కగా ఉపయోగించారు . రాయీ రప్పా, అంగా పంగా , మంచీ సెబ్బర, చూపూ పలుకూ, గడ్డీ గాదమూ , దొడ్లూ దోవలు, తరుగూ బొరుగూ , కంపా కట్టే, ఉడుకు మిడుకు, పురాణాలూ పుణ్యాలూ - ఇలాంటి జంట పదాలను ప్రయోగించి సంభాషణల్లో వాస్తవికతను ప్రదర్శించారు .

పాఠకులకు వినోదంతో పాటు జీవిత సత్యాలను ఇతివృత్తం ద్వారా అందించ గల రచయిత్రి వాసి రెడ్డి. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. అది చూసుకోక జమిందారీ ఇంటి పిల్లను కోడలిగా తెచ్చుకోవడం వల్ల సాంబయ్య కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరయింది అన్న జీవిత సత్యాన్ని ఈ నవల ద్వారా  తెలియజేశారు రచయిత్రి.

ఇందులోని పాత్రలు వైవిధ్య భరితంగా మలచబడ్డాయి . భిన్న మనస్తత్వాలు అపురూపంగా చిత్రించబడ్డాయి. పరంపరాగతమైన అనుభవాలకు ఈ పాత్రలు ప్రతినిధులుగా నిలుస్తాయి. ఈమె చేసిన వర్ణనలు, భాషా ప్రయోగాలు , సంభాషణలు , వాస్తవికతకు దోహదం చేస్తాయి.

వాసిరెడ్డి సీతాదేవిగారి ' మట్టిమనిషి 'నవల  సమాజ జీవితానికి పట్టిన నిలువుటద్దం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

                         మహాసముద్రం దేవకి












Comments