నా కు నచ్చిన నా కథ - నా విశ్లేషణ
ఈ శీర్షిక కింద నేను పరిచయం చేస్తున్న నా కథ
'పసుపు కుంకాలు'
నవ్య వార పత్రికలో మొదట ప్రచురితమై , శ్రీ లేఖ సాహితి ప్రచురించిన ' శ్రీ కుంజము ' ( జూన్ 2008 ) కథా సంకలనంలో చోటు చేసుకొని, నా ' కరేపాకు' ( డిసెంబరు 2019 ) సంపుటిలో ప్రచురించ బడిన కథ 'పసుపు కుంకాలు '
' కల్పనలతో కూడుకున్న వాస్తవాలు కథలు ' అన్న విషయం మనకందరికీ తెలుసు .
మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉన్న సంసృతీ సంప్రదాయాలను, ముఖ్యంగా వివాహ వ్యవస్థను దాన్ని అంటి పెట్టుకొని ఉన్న ఆచార వ్యవహారాలను గమనిస్తే స్త్రీల పరంగా విచిత్ర మైన, మనుషులు జీర్ణం చేసుకోలేని దారుణ మైన విషయాలెన్నో తెలుస్తాయి .
చరిత్ర తిరగేస్తే ... బాల్య వివాహం ఒక సాంఘిక దురాచారం. స్త్రీల పాలిట ఇదో పెద్ద శాపం. అది ఇంకా కొనసాగుతుండడం శోచనీయం. దాన్ని వెన్నంటే ఉన్న మరో దురాచారం సతీ సహగమనం. భర్త మరణం తర్వాత భార్యకు జీవించే హక్కు కూడా లేకుండా చేసిందది. 1829 లో అది నిషేధించ బడింది. ఆ తర్వాత గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లుగా వితంతువుగా శేష జీవితాన్ని గడిపే హక్కు స్త్రీకి లభించింది.
వైధవ్యం భారతీయ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో తన ప్రమేయం లేకుండా అంట గట్టబడి మానసికంగా నిరంతరం వేదనను పంచే , పెంచే దుర్మార్గపు దురాచారం.
ఒకప్పుడు భర్త మరణం తర్వాత స్త్రీకి ఎలాంటి కోరికలూ ఉండరాదు. ఉప్పు కారం లేని ఒంటి పూట భోజనంతో తృప్తి పడాలి. ఆకలైనా మళ్లీ తినడానికి వీలు లేదు. అలంకరణ విషయంలోను కఠినమయిన ఆంక్షలు . పుట్టుకతో ఉండే బొట్టు, పూలు, గాజులు ధరించరాదు. మంచి వస్త్రాలు ధరించరాదు.
అందాన్నిచ్చే జుట్టును ఉంచుకోరాదు. తెల్లని ముతక బట్టలు కట్టు కోవాలి. స్వేచ్ఛగా సంచరించ రాదు.
వితంతువు ఎదురయితే అశుభం, అపశకునం అని భావించే మూఢనమ్మకాలు, దాని చుట్టూ పుట్టలా పెంచేసిన కట్టుబాట్లు నిరంతరం అవమానాలకు గురి చేస్తుంటే దుర్భర మైన జీవితాన్ని గడపాలి. సుఖ సంతోషాలకు దూరమై బతికినంత కాలం అత్తింట్లోనో , పుట్టింట్లోనో బండెడు చాకిరీతో బతుకు వెళ్లదీయాలి. అదే పురుషుడైతే భార్య పోయిన వెంటనే మళ్లీ పెళ్లి చేసుకుంటాడు.
ఒకప్పటి ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగింది . ఇంకా అక్కడక్కడా ఉంది. ఆతర్వాత తిండి, బట్ట విషయంలో కొంత సడలింపు చోటు చేసుకుంది. స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ వివక్షను సహించ లేని సంఘ సంస్కర్తలు 1956 లో వితంతు వివాహ చట్టాన్ని తెచ్చారు .
పతివ్రతల కథల్ని కావ్యాలుగా రాసి, వీధి నాటకాలుగా ప్రదర్శించి, సినిమాల రూపంలో చూపించి స్త్రీలు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచననే అపచారంగా భావించే స్థితికి తెచ్చింది సమాజం. ధర్మ శాస్త్రాలు పురుషునికి అన్ని విధాలుగా స్వేచ్ఛనిచ్చి స్త్రీని మాత్రం అథః పాతాళానికి నెట్టేసింది . అందు వల్ల చట్టాలు కూడా స్త్రీల విషయంలో ఏమీ చేయ లేక పోయాయి.
పునర్వివాహ చట్టం వచ్చిన తర్వాత మొదటి వితంతు వివాహం 1881 డిసెంబరు 1 న జరిగింది . అయినా ఆ చట్టం సంప్రదాయాల బలం ముందు ఇంకా బతికి బట్ట కట్టడం లేదు.
సమాజం స్త్రీకి విధించిన దురాచారాలన్నీ వాళ్లలో మానసిక దౌర్బల్యాన్ని పెంచేవే . మానవత్వం మచ్చుకైనా లేకుండా ఎంతో మంది స్త్రీల జీవితాల్లోని వెలుగు రేఖల్ని చెరిపేశాయవి . బతికినంత కాలం ఎలాంటి సుఖ సంతోషాల్లేక చీకటి మయం చేశాయి. మనసులో కోరికలు చెలరేగుతున్నా సమాజం ఏమనుకుంటుందో అని ముందడుగు వెయ్యడానికి వెనకాడుతున్న పరిస్థితి.
అలాంటి కట్టుబాట్లకు వెరసి బతుకంతా భారంగా గడుపుతున్న ఒక అభాగ్యురాలి కథే ' పసుపు కుంకాలు '
ఈ కథలోని చిట్టి మా పక్కింటి అమ్మాయి . నా కంటే నాలుగేండ్లు చిన్నది. పెద్దల స్వార్థ పూరిత మైన ఆలోచనలకు చిట్టి జీవితం చిన్న వయసులోనే ఛిన్నాభిన్నమై పోయింది.
చిట్టి అప్పుడు ఎనిమిదవ తరగతి చదువు తుండేది. మా ఊరిలో 5 వరకే బడి. అందువల్ల మా ఊరి ఆడ పిల్లల చదువు అయిదు తోనే ఆగి పోయేది. మమ్మల్ని మాత్రం మా నాన్న మూడు మైళ్ల దూరంలో ఉన్న చిత్తూరికి పంపించి చదివించడం మొదలు పెట్టాడు. మేము రోజూ క్యారీరు కట్టు కొని బడికి పోవడం చూసిన చిట్టి కూడా ఏడ్చి మొత్తుకొని వాళ్ల నాన్నను ఒప్పించి ఆరులో చేరింది.
చేరిన రెండేండ్లకే దాని చదువు చట్ట బండలై పోయింది . దానికి ప్రధాన కారకురాలు వాళ్లవ్వ. వెనకుండి నడిపించిన అజ్ఞాత శక్తి వాళ్ల తాత .
ఆ రోజూల్లో పెళ్లి చూపులు అదే పనిగా ఏర్పాటు చేసే వాళ్లు కారు. ఎద్దుల కోసమనో , చుట్టపు చూపు గానో వచ్చి చూసి పోయే వాళ్లు. చిట్టి పెళ్లి చూపులు కూడా అలానే జరిగింది.
చిట్టి పెళ్లై పోయింది. అది కాపురానికి వెళ్లిన కొన్ని నెలలకే భర్త పాముకాటుతో కన్ను మూసి ఊరందరి చేత కళ్ల నీళ్లు పెట్టించాడు. పుట్టింటికి తీసుకొచ్చేయాలని అమ్మ నాన్నా ప్రయత్నించారు. మళ్లీ పెళ్లి చేస్తే తప్పేముందని మా మేనమామ ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్లింట్లో వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశాడు. మా అక్క, నేను కూడా చిట్టిని ఒప్పించాలని చాలా తంటాలు పడ్డాము. అది ఒప్పుకోలేదు, వాళ్ల పెద్ద వాళ్లూ పడనివ్వ లేదు. వాళ్లవ్వ ఆత్తింటి వాళ్లతో తెగ తెంపులు చేసుకోని ఇంటి పరువు తియ్యొద్దండి అది పద్ధతి కాదు అంది గట్టిగా. కోరు కున్న కొండ మీద వాన కురిసి ముసలామె మాటే నెగ్గింది . చిట్టి గర్భవతి అని తెలిసింది. వారసుని కడుపులో మోస్తున్న చిట్టిని వదులుకోవడానికి వాళ్లత్త మామలు ఒప్పుకోలేదు.
పెళ్లయ్యాక ఆడ పిల్లలు అరిందాల్లా తయారవుతారు. తొందరగా పెద్దరికం వచ్చేస్తుంది. ఆ పెద్దరికం తోనే చిట్టి అత్తగారింట్లోనే ఉండడానికి నిర్ణయించుకుంది.
చిట్టికి కొడుకు పుట్టాడు. అత్త మామలు కూడా కాలం చేశారు. మరిదికి తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి జరిపించింది. ఇద్దరికీ ఒక్కో కొడుకు. చెల్లెలు ఇంట్లో పని చూసుకుంటే చిట్టి పొద్దు పుట్టి పొద్దు మునిగేదాకా పొలం పనుల్లో తలమునకలుగా ఉండేది.తిండి మీద ధ్యాస లేదు. పండగ పబ్బాల పట్ల మనసు లేదు. పుట్టింటికి కూడా వచ్చేది కాదు. నేనీ కథ రాసి నప్పుడు అక్క చెల్లెళ్ల పిల్ల లిద్దరు ఒకడు కాలేజీలో ఒకడు స్కూల్లో చదువుతున్నారు. కొడుకును చూసుకొని అయినా సంతోషంగా ఉంటుందనుకొనే వాళ్లం.
పన్నెండేండ్ల క్రితం మాట. చాలా ఏండ్ల తర్వాత వాళ్ల పెద్దన్న చనిపోతే మా ఊరొచ్చింది చిట్టి. దాని ఆకారం చూస్తే చాలా భయ మేసింది. నేను వచ్చానని తెలిసి మాయింటి కొచ్చిన చిట్టిని మార్పు కోసం బలవంతంగా మా అక్కతో పాటు ( నేను కాలేజీకి వెళ్తే అక్క తోడుంటుందని ) అనంతపురం తీసు కొచ్చాను. అప్పుడు మేము క్యాంపస్ లోనే ఉండే వాళ్లం.
ఉదయం నాలుగింటికే లేచేది చిట్టి . పనామె వస్తుందన్నా వినేది కాదు . ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి , కసువూడ్చి, గిన్నెలు తోమి ఇంట్లో ఇంకేమీ పనిలేదని తీర్మానించుకున్న తర్వాత తోటంతా రాలి పడిన ఎండుటాకుల్ని ఊడ్వడం మొదలు పెట్టేది. ఏపనీ లేకుంటే చేట శనక్కాయిలు ముందర గుమ్మరించుకొని ఒలవడానికి కూర్చొనేది. రక రకాల టిఫిన్లున్నా ఒక్క రోజు కూడా ఎంత బలవంతం చేసినా ముట్టుకోలేదు. ఉదయాన్నే గుక్కెడు కాఫీ మాత్రం తాగేది. అదీ ఒక్కసారే . మధ్యాన్నం కూడ పప్పు, రసమన్నం తప్ప మరేదీ ఇష్ట పడేది కాదు. ఏ విషాద సమయంలో ఒంటి పూట భోజనం అలవాటు చేసుకుందో ! నోట్లో మాత్రం ఎప్పుడూ దుగ్గు పొడి నానుతూ ఉండేది.
చిట్టి జీవితాన్ని ఆధారం చేసుకొని నేను రాసిన పసుపు కుంకాలు కథ 'నవ్య' లో ప్రచురిత మైన తర్వాత చిట్టి జీవితాన్ని దెబ్బ దీసే సంఘటన మరొకటి జరిగింది. చిట్టి కొడుకు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. పొలం దగ్గరికి వెళ్లి ఎవరో అడవి పందుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తొక్కి అక్కడి కక్కడే చని పోయాడు. అది జరిగింతర్వాతే చిట్టి అనంతపురం రావడం.
చెల్లెలికి ఒక కొడుకని చెప్పాను కదా! రెండేండ్లకు ముందు బెంగులూరు నుంచి చిత్తూరికి స్నేహితునితో బైక్ లో వెళ్తూ దేవన హళ్ళి దగ్గర యాక్సిడెంట్లో చని పోయాడు. కథ రాసిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవి . చిట్టి జీవచ్ఛవంలా బతికే ఉంది. వాస్తవంగా జరిగినదిది .
కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి రాశాను. సహజత్వం కోసం మాండిలికాన్నే ఎన్నుకున్నాను . ఒక మనిషి పొయినప్పుడు. ఆత్మీయుల ఏడుపులు, తూడుపులు , ఇంటి అల్లుడు కాబట్టి పుట్టింటి వాళ్లు కూతురికి చివరి సారిగా పసుపుకుంకాలివ్వడం లాంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. బావి దగ్గరికి తీసుకుపోయి పూలు పసుపు కుంకాలు తీసేయడం, గాజులు పగల గొట్టడం, అందరు పట్టు కొని ఏడ్వడం చూస్తే తట్టు కోలేము. చిట్టికి కూడా అన్నీ అలానే చేశారు. ఆ ఘోరాల్ని రాయడం ఇష్టం లేక వాటి జోలికి నేను వెళ్ల లేదు
చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడకుండానే చిన్న తనంలో పెళ్లి చేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, భావి జీవితం ఎలా నిస్సార మైపోతుందో చెప్పడానికే ఈ కథ రాశాను .
క్షమించండి. పరిచయమే ఓ కథై కూర్చుంది. చదవాలంటే ఓపిక తెచ్చుకోవాలేమో ! కథా నేపథ్యం మాత్రమే చెప్పాను . విశ్లేషించాల్సింది పాఠకులు . ఆ భారాన్ని మీపై మోపుతూ సెలవు తీసుకొంటున్నా .
మహాసముద్రం దేవకి
17-1-2021
Comments
Post a Comment