కళాత్మకం

    కథ


కళాత్మకం

   ఐదేండ్ల కల నిజమవుతున్న వేళ. . ఇన్నేండ్ల  నిరీక్షణ కాపుకొచ్చి పండై తియ్యని మధురిమను రుచి చూపించడానికి కొద్ది నిముషాలు మాత్రమే ఉన్నాయి.

         ఉదయమే శుభ ముహూర్తంలో కొన్ని వేల చేతుల్లో  నుంచి పూరేకులతో నిండిన పచ్చని అక్షతలు తల మింద వర్షపు జల్లులా కురుస్తుంటే , సునీల్ చేతి వేళ్లు సుతారంగా హసిత మెడమీద గిలిగంతలు పెడుతుండగా మూడు ముళ్లు వేసి ఆ ముడుల పైన పసుపు కుంకుమలద్ది గట్టి మేళం సద్దు మణిగాక పక్కన అంటి పెట్టుకొని కూర్చున్నాడు.

        క్యూలో వచ్చి అక్షింతలు వేసి భోజనాల వైపు నడక లేస్తున్నారు ఆహ్వానితులు.  వాళ్ల మొహాల వైపు చూస్తూ, వాళ్ల పలకరింపులకు స్పందిస్తూ, పెదాల పైన దరహాసాలను సింగారించుకున్నా వధూ వరుల మనసులు మాత్రం వాళ్ల అధీనంలో లేవు. అవి మధురోహలను తనివి తీరా ఆస్వాదిస్తూ తమ సమాగమానికి తొందర పడుతున్నాయి.

       పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలు ముగిశాయి. దగ్గరి బంధువులు తప్ప ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లి పోయారు. కొత్త దంపతులు తిరుమలకు వెళ్లారు. పెళ్లి కొడుకుతో చెల్లెలు సుచిత్రను , వాళ్ల మేనత్త కల్యాణిని ఉంచి మిగిలిన వాళ్లు పెళ్లి కొడుకు ఊరికి ప్రయాణ మైనారు. రేపు అక్కడ రిసెప్షన్ ఉంది. వెళ్లేటప్పుడు అందర్నీ రమ్మని ఆప్యాయంగా పిలిచారు.

     హసితకు అమ్మ లేదు. నాన్న ఉన్నా లేనట్టే.  అన్న వదినలున్నారు. పెళ్లి కాని చిన్నన్న, చెల్లెలు హర్షిత వున్నారు.

        తిరుమల నుంచి ఊరు చేరిన కొత్త దంపతులతో వినాయక  స్వామి గుళ్లో పూజ తర్వాత ఇంటికి తీసు కెళ్లాలని  కారును గుడి సమీపంలో ఆపారు. ఈ కారులో వచ్చిన సునీల్ చెల్లెలు, మేనత్త దిగి గుడిలో కెళ్లారు. కాయ కర్పూరం తెచ్చేదాకా వీళ్లను ఇక్కడే ఉండమన్నారు.

        ' మన తొలి రాత్రి ఇక్కడే కదా! ' అడిగాడు సునీల్ . అతని చేతిలోని హసిత చెయ్యి మెల్లగా కదిలింది .

        ఆ మాటతో సిగ్గుల మొగ్గయిన హసిత వణికే పెదవులతో ' ఏమో! ' అంది.

        ' మిద్దె పైన ఆరు బయట ఏర్పాటు చెయ్యమను ' ఆనాడు కొంటెగా చూస్తూ

      ఆ మాటలకే హసిత మనసు వశం తప్పినట్లయింది.

        గుళ్లో కొబ్బరి కాయ కొట్టి మొక్కుకున్న తర్వాత అందరూ ఇంటి కెళ్లారు. పెళ్లి కొడుకు వాళ్ల బంధువులు వెళ్లి పోయినా మిగిలి ఉన్న బంధువులతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది . తిరుగు పెళ్లికి వెళ్లడానికి బస్సు మాట్లాడారు . నాలుగైదు కార్లు కూడా వెళ్తున్నాయి. పచ్చని పందిట్లో పిల్లల ఆటలు పాటలు , అరుపులు చెప్పనలివి కావడం లేదు . ఒక వైపు బంతులు తీర్చి  భోజనాలు వడ్డిస్తున్నారు.

       హసిత వాళ్ల పెద్దమ్మ వాళ్లింట్లో మొగ పెళ్లి వాళ్లు ముగ్గురికీ పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హసితకు అర్థమయింది.

        మొదటి రాత్రి ఏర్పాట్లేవీ మచ్చుకైనా కనిపించ లేదు. సునీల్ ఖచ్చితమైన మనిషి. ఏదైన అనుకుంటే జరిగి తీరాల్సిందే. హసిత ఏం చేస్తుంది పాపం.

          సిగ్గు వదిలి వదిన నీరజను పిల్చి అడిగింది. ఇక్కడ ఈ ఒక్క రాత్రే ఉంటారు కదా! మూడు నిద్రలు చేసే వీలు లేదు అందుకని .. నసిగింది. అక్కడితో ఆగలేదు .నీరజ హసిత వాళ్ల పెద్ద పెద్దమ్మ చెవిలో వేసింది. ఆమె హసితతో మాట్లాడింది.
       
        ' ఏమో పెద్దమ్మా. వాళ్లు ఈ రోజే మంచిదని చెప్పారట. ' అంది సిగ్గుతో తలవంచుకొని.

        సరే! ఉత్తరం దిక్కున్న గదిలో నేల మిందనే పరుపులేసి పండ్లు ఫలహారలు, పాలు పెట్టారు. హసితే వెళ్లి ఆ మాట తన శ్రీవారితో చెప్పింది.

        ' మిద్దె పైన ఆరు బయట కాదా ? ' అడిగాడు. కాదని తల ఊపి అక్కడుంటే ఇంకా ఏం చెప్ప మంటాడో తన వాళ్ల తో  అనుకొని అక్కడి  నుంచి తుర్రుమంది.

        స్నానం చేసి వచ్చి మొదటి రాత్రి కోసం తెచ్చుకున్న తెల్ల చీర కట్టుకొంది. తన స్నేహితురాలు హేమలత తలదువ్వి పొడువాటి జడకు మల్లె పూలు అల్లి మరువం, ధవనం, మొల్లలు, మల్లెలు, కనకాంబరాలు కలిపి కట్టిన మాలను నాలుగు మూరలు తలలో తురిమి సగం జడదాకా వేళాడ దీసింది.

        పిల్లా పాపలతో పాటు పెద్ద వాళ్లు కూడా సందు దొరికిన చోట మేను వాల్చి మెల్లగా నిద్రలోకి జారుకొంటున్నారు .

        హసిత పాలరాతి బొమ్మలా సింగారించుకోని పాత పెట్టె మీద కొలువు తీరి  ఇప్పుడే వస్తామని వెళ్లిన వదిన, స్నేహితురాళ్ల కోసం ఎదురు చూస్తోంది. . పెద్దమ్మ,  మేనత్తలు , పిన్ని వాళ్లు రేపు తీసుకు పోబోయే సారెను పెద్దింట్లో కూర్చొని సర్దుతున్నారు.

        హసిత మనసు నాలుగు నెలల వెనక్కి వెళ్లి ఒక చోట తిష్టవేసి కూర్చుంది.

        తను ఇంజినీరింగ్  చేసే కాలేజీలో సీనియర్ అయిన సునీల్ తో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలలో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. సునీల్ అప్పటికే క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ కూడా తెచ్చుకున్నాడు. బెంగులూరులో ఉంటున్న సునీల్  హసిత చివరి ఎగ్జాం రోజు చెన్నైకి అదే పనిగా వచ్చి కలిశాడు. ఇద్దరూ ఎగ్జాం హాల్ నించి హోటల్లో భోంచేసి మ్యాట్నీ చూసి నేరుగా బీచ్ కి వెళ్లారు. చాలా రద్దీగా ఉందా రోజు. అలా నడుచుకుంటూ జనాలు లేని చోటు చూసి కూర్చున్నారు. ఆ పరిసరాలు, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను రెట్టింపు చేస్తుంటే శారీరకంగా ముందుకు వెళ్లడానికి వాళ్ల సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయారు. కానీ కోరికలకు  కళ్లెం వెయ్యలేక సునీల్ తన మనసును హసిత ముందు పెట్టాడు.

        ' నువ్వు నా సొంతమైన మరుక్షణం నించి నిన్ను ఒక్క రోజు కూడా దూరంగా ఉంచను . ఆరు బయట వీలైతే సముద్రం ఘోషపెడుతూ మన హద్దుల్ని  చెరిపేస్తూ కానీండని మన కలయికకు ప్రోత్సహిస్తుంటే పున్నమి చంద్రుడు సంపూర్ణంగా తన వెన్నెలను కురిపించి ఆశీర్వదిస్తుంటే, నిర్జనమైన ఆకాశం పందిరి కింద చల్లని సైకత తిన్నెలపైన మనిద్దరం ఒక్కటి కావాలి హసితా'  అని తన ఒడిలోకి లాక్కొని కోరికలను ఒక వైపు అదుపులో పెట్టుకుంటూ తియ్యని ముద్దొకటిచ్చి వదిలి పెట్టి దూరంగా జరిగాడు .

        పండు వెన్నెల సాక్షిగా చెప్తున్నా సముద్ర తీరాన కాకున్నా చల్లని వెన్నెల నీడలో నున్నని ఇసుక తిన్నెపై  చేను చేను కలిసినట్టుగా మేను మేను కలుపుకొని పవ్వలించాలి మనం . తియ్యటి కబుర్లు చెబుతున్న నీపెదవులకు నా పెదవులతో  తాళాన్ని వెయ్యాలి .చేతిలో చెయ్యి కలిపి కళ్లలో కళ్లు కలిపి పాతాళపు లోతుల్లోకి  ఇద్దరం జారి పోవాలి . అక్కడ ఒక్కసారిగా ఇద్దరం కలిసి జలకాలాడాలి. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగసి పడే అలలలా మన కోరికలు  బుసలుకొడుతూ పైకి లేవాలి . ఆ తర్వాత మనకు మనసులతో పని లేదు . వాటికక్కడ విశ్రాంతి ఇద్దాం . శరీరాలు వాటికవే ఏకమై  ఆకాశపు అంచుల వైపు పరుగులు పెట్టాలి ... '

        'హసితా ' అని స్నేహితురాలు చెయ్యి పట్టి ఊపే దాకా ఈ లోకంలో లేదు హసిత .

        నీరజ , హేమలత తోడు రాగా పాల గ్లాసుతో పడకటింట్లో అడుగుపెట్టింది హసిత. వీళ్ల కేమి తొందరని చెప్పుకొని నవ్వుకుంటారేమో అని ఒక పక్క ఉన్నా తనకు ప్రియమైన , తనకు సొంతమైన భర్త కౌగిట్లో ఎప్పుడెప్పుడు వాలి పోదామా అన్న తొందర మరో పక్క  ఉసిగొల్పుతోంది.

        తలుపుకు గడియ పెట్టి భుజం మీద చేతులు వేసి అపురూపమైన  వస్తువు ఎక్కడ చేజారి పొతుందో అన్నంత ఒడుపుగా హసితను పరుపు దాకా నడిపించు కొచ్చి తన ఒళ్లో కూర్చుండ బెట్టు కొన్నాడు సునీల్ .

        ముద్దులతో ముంచెత్తిన సునీల్ 'హసితా నీకు గుర్తుందా ? మదరాసు బీచ్లో నేను నీతో అన్న మాటలు . మరి ఇప్పుడేమిటి ఇలా అనుకొంటున్నావా? ఇది నా తొందరపాటు కాదు చెలీ . ఈ నాడే మనం మూడు ముళ్లతో ఏకమయ్యాము.మన ఇద్దరిని ఒకింటి వాళ్లను చేసిన ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా! అందుకే మొదటి రాత్రి పేరుతో ఈ ఏర్పాటు చెయ్యమన్నాను . ' అంటూ జేబులో  చెయ్యి పెట్టి ఒక హారాన్ని బయటికి తీశాడు. లైట్ తీసేయడం వల్ల చిమ్మ చీకటిగా ఉన్న ఆగదిలో ఒక్క సారిగా  మెరుపు మెరిసినట్లయింది.

        ఒడిలో కూర్చో బెట్టుకొని చెవి దగ్గర గుస గుసలాడుతున్న తన ఇష్ట సఖుని మాటల్ని వింటూ మైమరచి ఉన్న హసిత మెడలో చల్లగా ఏదో ప్రాకి నట్లయి కదల బోయింది. కదలకుండా రెండు చేతుల్ని ఆమె చుట్టు వేసి హృదయానికి గట్టిగా హత్తు కొని మెల్లగా కుడి చేతిని వదిలి ఆమె చుబుకాన్ని పట్టుకొని తన వైపు తిప్పు కొని అందిన చోటల్లా ముద్దులు పెట్టి ఆమెను పరుపుమీద పడుకో బెట్టాడు. 'ఈ రోజుకిది చాలు.  మిగిలింది మన ఊరిలో.  చాలా అలసి పోయావు . రేపు నీకు నిద్ర పోయే అవకాశం ఉండదు. . హాయిగా నిద్రపో ' అంటూ హసితకు అంటి పెట్టు కొని పడుకొని ప్రేమగా పసిబిడ్డను తల్లి జోకొట్టినట్లు జోకొట్ట సాగాడు.

        హసిత శరీరం తన అధీనంలో లేదు. సిగ్గు వదిలి అతనిని కౌగలించు కొంది. అతని నిబ్బరానికి చకితురాలయింది.

        అత్తింట్లో. కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి పూజ చేయించినారు . ఆ రాత్రి రిసెప్షన్ పూర్తి అయ్యేసరికి పదకొండు దాటింది. పెద్ద వాళ్లు ఏర్పాటు చేసిన పడకటింటిని కాదని కారులో పెళ్లాన్ని తీసుకొని హోటల్ గదికి వెళ్తున్న సునీల్ను చూసి ముక్కు మీద వేలేసు కొని చూస్తూ ఉండిపోయారు అప్పటి వరకు మేల్కున్న వాళ్లు.

         స్నానం తర్వాత పాల మీగడలాంటి తెల్లటి చీరను ముత్యాలు పొదిగిన నగల సెట్టును   హసిత కిచ్చి తయారుకమ్మన్నాడు. తను తెల్లని పంచె, జుబ్బా ధరించాడు. మల్లెల్ని తనే స్వయంగా హసిత తలలో తురిమాడు. మద్రాస్ బీచ్ లో సునీల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి హసితకు . ఈ రోజూ నిన్నటి లాగే కాబోలనుకుంది.

         తన ప్రమేయం లేకుండా సునీల్ చెప్పినట్లు నడుచుకోంటొంది హసిత. చెప్పు లేసుకొని బయలుదేరమని గదికి తాళం పెడుతున్న భర్తను కళ్లార్ప కుండా చూసింది.

        పుచ్చ పువ్వులా వెన్నెల . వేసవి కాలం.  సన్నగా ఒయ్యరంగా ఒంపులు తిరిగి పారుతోంది సెలయేరు. తెల్లగా మెరుస్తున్నాయి ఇసుక మేటలు . హసితను ఇష్టంగా పట్టుకొని నడిపిస్తూ ఆమెతో పాటే ఇసుక తిన్నెపై వాలిపోయాడు సునీల్. తనను తీసుకొచ్చింది సెలయేటి పాయల్లో పవ్వలించడానికని హసితకు అర్థమై పోయింది. అనుకున్న పనిని సాధించి తీరుతాడు తన భర్త అని హసితకు అర్థమై గర్వంతో పొంగి పొయింది . వీళ్లిద్దరి వాలకాన్ని చూసి ' అబ్బో' అనుకొంటూ నెలరాజు  సిగ్గుతో మబ్బుల చాటుకు చేరుకున్నాడు.
       
మహాసముద్రం దేవకి

       

Comments