నాకు నచ్చిన పాత్ర
అమ్మకు ఆదివారం లేదా - కథానిక- నచ్చిన పాత్ర
ఈ కథలో నాకు నచ్చిన పాత్ర రుక్మిణి. కథ ప్రారంభం నుంచి చివరి దాకా ఉన్న పాత్ర.
రుక్మిణి భర్త నిర్లక్ష్యానికి, లెక్క లేని తనానికి, మొసానికి గురైన సగటు మహిళ. భర్త ఇంకో స్త్రీతో కాపురం పెట్టాడని తిండి తినకుండా చీకట్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. పదమూడేండ్ల కొడుకు లేచి వచ్చి తనతో పాటు తన భుజం మీద తలవాల్చి ఏడుస్తుంటే కొడుకు ఏడుపు చూళ్లేక తను ఏడుపాపుతుంది.
అమ్మా! ఏం చెద్దాం అని కొడుకు అడగ గానే ఆమె శరీరం పులకరించింది. 'ఎక్కడికయినా పోయి బతుకుదాం ' అని కొడుకు అనగానే ' నీ చదువూ ' అంటుంది బేలగా. మానేస్తా నంటాడు కొడుకు.
ఇద్దరూ వెళ్లి పోయి వాళ్ల చేతనయిన పని చేసుకొంటూ బతుకు తుంటారు. కష్ట పడి చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ మురళి రజని అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టమే నా ఇష్టమని సంతోషించింది రుక్మిణి. ఆ l వేరే కులం అని తెలిసి మరీ సంతోష పడింది. రిజిష్టరాఫీసులో పెళ్లి చేసుకున్నందుకు ఎంతో పొంగి పోయింది.
పెళ్లి నాటికి రజని జీతం వెయ్యి. మురళి జీతం పదిహేను వేలు దాటింది. నా జీతం తో పోలిస్తే నీ జీతం పదిహేనో వంతు కూడా లేదే అన్నాడని రజని అత్త తో నవ్వుతూ చెప్తుంటే రుక్మిణికి కోపం వచ్చింది. కొడుకు సరదాగా అన్నానంటే ' అదేం సరదా, ఎవరి ఉద్యోగం వాళ్లకు గొప్ప. చిన్నప్పటి సంగతులన్నీ మర్చి పోయినట్లున్నావే నేను ఆయాగా పని చేస్తే వంద రూపాయలిచ్చే వారు. అదే మహా ప్రసాదమని బతికాము గుర్తు లేదా ' అని మురళి సిగ్గు పడేట్లు p
మళ్లీ ఒక రోజు నీ ఉద్యోగం లేకుంటే ఏమవుతుంది? మానేయి అన్నప్పుడు రజిని మనసు నొచ్చుకొని కళ్ల నీళ్లు పెట్టుకొంటుందని కంగారు పడింది. నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి అని కొడుకును కోప్పడింది.
మొదట్లో భార్యా భర్తలు రాత్రి పూట కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినే వారు. రజని ఏదైనా నవల చదువుతుంటే తను పడుకొని సంతోషంగా వినే వాడు. కలిసి పాటలు వినే వారు. రజనితో మాట్లాడ్డానికి తహ తహ లాడే వాడు. అలాంటిది అన్నాలు తిందామా అని రజని అడిగితే బిజినెస్ జర్నల్లో మొహం పెట్టు కొని నువ్వు తినెయ్ నేను మళ్లి తింటా నంటున్నాడిప్పుడు.
మెతక మనిషి రజని మనసు కష్ట పెట్టు కొంటుందేమో అని రుక్మిణికి దిగులు . మొహం వేలాడేసుకొని ముభావంగా తిరుగుతుంటుందే కాని భర్తను నిలదీయదే అని బాధ. ఎం చెప్తాడో కాని కాసేపటికి నవ్వు మొహంతో కనబడి అత్త గారి భయాల్ని వమ్ము చేస్తుంటుంది రజని.
అన్ని చికాకులూ ఒక ఎత్తయితే శ్రీలత తో వ్యవహారం ఒక ఎత్తు . ఎలా సహిస్తుందో అనుకుంటుంది . రజని ఏదైనా చదువుతుంటే వింటున్న మురళి ఫోన్ రాగానే పరిగెత్తుతాడు. శ్రీలతతో కబుర్లు చెపుతూ ఎంత సేపైనా రాకుంటే కాచుక్కూచుంటుందే కాని పుస్తకాన్ని విసిరి కొట్టి పోదే అని అత్త బాధ.
మురళి గోవా నించి ఇంటికి రాగానే లత చేరిందా అని వాళ్లింటికి ఫోన్ చేసి వాకబు చేశాడు. చేరలేదని తెలిసి కంగారు పడ్డాడు. స్నానం చేసొచ్చి ఫోన్ వచ్చిందా అని అడిగాడు. లేదని చెప్తే ఫోన్ దగ్గరికి పరిగెత్తి తనే చేశాడు.
అన్నం పెట్టేదా అని రజని అడిగితే జవాబు చెప్ప కుండా నీ జ్వరం తగ్గిందా అని తల్లి గది లోకి వెళ్లాడు. జ్వరం నాకు కాదు . భోంచేసి రాపో నీతో మాట్లాడాలి అంటుంది. తీరా తిని వెళ్లాక ఏమీ లేదంటుంది. తల్లి మొహం చూసి ఏదో ఉందని బలవంతం చేశాడు.
తల్లి కొడుకును తీక్షణంగా చూసి శ్రీలతతో ఆ వ్యవహార మేమిటని ప్రశ్నించింది. అదేం లేదన్నాడు. నువ్వు రజనిని నిర్లక్ష్యం చెయ్యడం నేను గమనించ లేదా అని నిలదీసింది.
'భార్యతో పది నిముషాలు మాట్లాడను టైం దొరకదు కానీ ఆ అమ్మాయితో గంటలు గంటలు కబుర్లు చెప్తావు. ఎంత మోజు లేక పోతే తలకు మర్దనా చేస్తావు. చేతులు లాగి సరసాలాడుతావు? ' అని నిలదీస్తుంది.
'మీ నాన్న లాంటి వాడికి వేరు కాపురం పెట్టడం తప్పని పించదు. నీకు పరాయి స్త్రీ తో సరదాగా తిరగడం తప్పని పించదు. ఈ తప్పొప్పులు మీరు నిర్ణయించుకుంటే కాదు. ఆ కష్టం కట్టుకున్న వాళ్లకు తెలుస్తుంది'. అని నిష్టూర మాడుతుంది .
'రజనీతో నీ మీద ఇష్టం పోయిందని చెప్పేయి. నీ దారిన నీవు వెళ్లి పో. అంతకే ఆ అమ్మాయి చచ్చి పోదు. నన్ను పెళ్లి చేసుకున్న వాడు వదిలి పెడితే నేను చచ్చి పోయానా? శ్రీలతతో మాట్లాడుకొని తొందరగా ఏర్పాటు చేసుకో ! ఆ మాటే చెప్పాలనుకున్నా' అంటుంది.
ఎవరి దారి వారు చూచుకుందాం. నా కుట్టుపని నాకుంది. అంటుంది. మురళి జవాబు చెప్ప లేదు.
రజనీ అత్త కోపాన్నీ, భర్త నిస్సహాయతనీ ఎన్నడూ చూడ లేదు.
'రజనీ కూర్చో నీతో మాట్లాడాలి ' అంది.
శ్రీలతతో వ్యవహారం నీకెలా ఉందో నాకు తెలియదు. నేను మాత్రం భరించ లేను. నువ్వు పుస్తకం చదువుతుంటే అవతల ఆ మనిషి ఫోన్ చెయ్య గానే నిన్ను తోసి పారేసి ఆ మనిషితో కాలక్షేపం చేస్తాడు. నీ రక్తం ఉడికి పోవడానికి అది చాలు. అయినా నిమ్మకు నీరెత్తినట్లుంటావు. మురళికి నీ మీదిప్పుడు ప్రేమ లేదు. ఇంకో దారి ఏర్పడే దాకా నేను నీకు అండగా ఉంటాను. ఈ బందిఖానా నుంచి అతనిని పంపించెయ్. లేదా అతనిని చూడనట్లు వదిలేస్తా నంటావా నీ యిష్టం . మీ ఇద్దరూ ఏదో ఒకటి తేల్చుకొని చెప్పండి ' అంటుంది.
రజని చెంపల మీద జల జలా కన్నీళ్లు. మురళి' ఛ ఛ అలాంటిదేమీ లేదు ' అని తన రుమాలుతో రజని కన్నీళ్లు తుడుస్తాడు. అతని కళ్ల లోనూ నీళ్లు
సహృదయురాలయిన ఆ అత్త రుక్మిణి కొడుకు తప్పులను వేలెత్తి చూపి కోడలికి అండ దండగా ఉంటుంది. అలాంటి అత్తాకోడండ్ల అనుబంధం ఎంత ముచ్చటగా ఉంటుంది. ఈ కథ చదివి కొంత మంది అయినా మారతారనిపిస్తుంది. మంచి కథ రాసిన రంగనాయకమ్మకు అభినందనలు .
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment