చేదు అనుభవం

                      చేదు అనుభవం


 కథ :
      
'ఏ సీటు మీది '  ట్రైన్లోకి అడుగు పెడుతున్న చరితను అడిగాడు టి.సి

' ఎస్ - 12 , 58 ' కింద నిలబడి ఉన్న చరిత భర్త సునీల్ చెప్పాడు సమాధానం. అనితను ట్రైన్ ఎక్కించడానికి వచ్చాడతను

'58 వ సీట్ లో ఆల్రెడీ ఉన్నారే . వాళ్లు బెంగులూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు 'టి.సి అన్నాడు

' మాకు ఆ సీట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్పారే ' సునీల్ అన్నాడు .

'ఏదో పొరబాటు జరిగింది. బహుశా ఎస్ - 13 అయిఉంటుందేమో ! ' సందేహం వ్యక్తం చేశాడు టి.సి

' ఎలాగండి బెర్త్ లేకుండా నేనొక్కదాన్ని వెళ్లడం . కూర్చోడానికి కూడా వీలుండదు కదా ! ' దిగాలుగా అంది చరిత.

' నేనేదో ఒకటి చేస్తా లేమ్మా . మీరు నిశ్చింతగా ఉండండి ' టి.సి హామీ ఇచ్చాడు.

'టి.సీ చూస్తామన్నారు కదా! నువ్వింకేం దిగులు పడకు ' సునీల్  ధైర్యం చెప్పాడు.

' అయినా ఎస్- 12, 58 అని అంత ఖచ్చితంగా మీ కెవరు చెప్పారండి. ' అడిగింది చరిత.

'నాకు సీట్ కన్ ఫార్మ్  అయినట్లు మన భాస్కరే చెప్పాడు. టికెట్ వెనక రాసి పెట్టాను కూడా ' అని సునీల్ అంటుండ గానే ట్రైన్ కదలడం మొదలైంది .

' నువ్వేం వొర్రీ కాకు  . టీ. సి గారు బెర్త్ చూపెడతామన్నారు కదా! జాగ్రత్త . బై ' సునీల్ అంటుండగానే కదులుతున్న ట్రైన్ లోంచి చరిత మొహం కనుమరుగయింది .

లోపలికి అడుగుపెడుతుండగా అక్కడే నిలబడి ఉన్న టి.సి. 'లోపలికి పదమ్మా 'అని చెప్పడంతో బిక్కు బిక్కు మంటూ బ్యాగ్ లాక్కొంటూ లోపలి వైపుకు కదిలింది చరిత. పక్కకు ఒదిగిన టి.సి ఆమె వెనకే వెళ్లి ఏడవ నంబర్ సీటు చూపించి కూచోమన్నాడు .

' ఎస్- 13 లో ఎమో మీ సీటు ఓ సారి వెళ్లి చూసొస్తా'  అంటూ కదిలాడతను

చరిత  కూర్చున్న సీట్లో ఆ చివర ఒక సూట్ కేస్ పెట్టి గొలుసుతో తాళం వేసి ఉంది . దాని పైన మరో కిట్ బ్యాగ్ లాంటిది ఉంది.

అతను ఐదు నిముషాల్లో తిరిగొచ్చాడు.ఎస్- 13 లో  58 వ సీటు ఖాలీగా లేదమ్మా ' అని చావు వార్త చల్లగా చెప్పాడు. గొలుసుతో లాక్ చేసిన సూట్ కేస్ ను దించి సీట్ కింద సర్దాడు.

'మీరీ సీట్ లో పడుకోండి . నేనీ లోపల ఎక్కడైనా ఖాలీ ఉంటే సర్దుతా ' అంటూ కిట్ బ్యాగ్ లో నుంచి ఒక చార్ట్ బయటికి తీశాడు.

తనో సారి చూసి ' ఎక్కడా ఖాలీల్లేవు చూడమ్మా అంటూ చార్ట్ పేజీలను గబ గబ తిప్పుతూ చరితకు కూడా చూపించాడు.

'నువ్వు పడుకోమ్మా ' అంటూ చార్ట్ పట్టు కొని వెళ్లి పోయాడు.

తను ట్రైన్ ఎక్కే పాటికే ఎక్కడి వాళ్లక్కడ పడుకున్నారు. తన కోసమే ఎదురు చూస్తున్నట్లు టి.సి వాకిలి దగ్గరే నిలబడి ఉండడం తన అదృష్ట మనుకొంది చరిత.

జీరో బుల్బున్నా అనితకు నిద్ర పట్టదు.డోర్ దగ్గర సీటాయే.  వెలుతురు కళ్ల మీద పడుతుంటే కిటికీ వైపు తిరిగి పడుకుంది. కానీ కన్ను పొడుచుకున్నా నిద్ర పట్టడం లేదు.

నిద్ర లేకుంటే బుర్ర ఊరుకోదు . మనసులో ఏవేవో ఆలోచనలు సుళ్లు తిరుగుతుంటే చాల సేపు మేల్కొనే ఉంది. తర్వాత క్రమంగా నిద్రలోకి జారుకుంది.

కాళ్లకు ఏదో తగిలినట్టనిపించి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది  చరితకు. దిగ్గున తలెత్తి చూసింది. టి. సి  తన కాళ్ల దగ్గర కూచొని చార్ట్ తిరగేస్తూ పెన్ తో ఏదో నోట్ చేసుకొంటున్నాడు. చరితకు ఎలాగో అనిపించింది . వెంటనే లేచి ఈ చివర ముడుచుకొని కూచుంది.

చాలా ఆత్మీయత ఉట్టి పడే స్వరంతో ' మీరు పడుకోండమ్మా' అన్నాడు.

' మీకు ఇబ్బంది కదా ! నేను అక్కడ పడుకుంటాను ' అంది ఎదురుగా ఉన్న రెండు సీట్ల మధ్యకు దృష్టి సారించి .

'అక్కడెట్ల పడుకుంటారు. ఫరవాల్లేదు, మీరిక్కడే పడుకోండమ్మా ' అని లేచి ఎదురు సీట్లో కాలు ముడుచుకొని పడుకోనున్నతని సీట్లో ఈ చివర ఒదిగి కూర్చున్నాడు.

చరితకు పడుకో బుద్ధి కాలేదు. ఏడుపు ముంచుకొచ్చేట్లుంది. ఎన్నో సార్లు తను , సునీల్ వైటింగ్ లిస్ట్ లో టికెట్టు కొనుక్కొని ఆ తర్వాత స్టేషన్ సూపరిండెంట్ తో బెర్త్ కంఫార్మ్  చేసు కొని వెళ్ల లేదు. ఈ సారి అదీ తను ఒక్కతే వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందేమిటి? అని బెంగ పెట్టుకొంది మనసులో.

ఉదయం పదిన్నరకు రిజర్వేషన్ రూఢి అయిందని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది కూడా . అలా కానప్పుడైతే  ఇంతోటి సహాయం జరిగినందుకు చాలా సంతోష పడేదేమో!

ఆలోచనలతో మునిగి పొయిన చరితతో ' నాకు పని ఉందమ్మా పడుకోవడానికి లేదు. మీరు నిశ్చింతగా పడుకోండమ్మా ' అని అక్కడి నుంచి లేచి వెళ్లి పోయాడు.

'బతుకు జీవుడా' అనుకొంటూ పడుకుంది చరిత. కానీ నిద్ర మాత్రం పట్ట లేదు. ఈలోపల ఏదో స్టేషన్లో రైలాగింది. ఎంత సేపైనా కదల లేదు బండి.

మెల్లగా లేచి ఏ స్టేషనా అని కిటికీ పైకెత్తి చూసింది. గుంతకల్లు . ఇంకా గుంతకల్లేనా అనుకుంది. కింద ట్రైన్ కు బారెడు దూరంలో నిలబడి టి. సి ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

కూచోనుండడం చూశాడంటే మళ్లీ పడుకోండమ్మా అని తయారవుతాడు . ఎందుకొచ్చిన తలనొప్పి అని మెల్లగా కిటికీని కిందికి దించి పడుకుంది.

ఆలోచనలు తలకాయను తినేస్తున్నాయి. ఏదో సహాయం చేసినట్లుండాలని ఈ టి. సి డ్రామా ఆడ్డం లేదు కదా ! అనిపించింది . ఆ ఊహ రాగానే లేచి మసక వెలుతురులో సీట్లను 8 తో  గుణిస్తూ లెక్క పెట్టు కొని 58 వ సీటు దగ్గరికొచ్చి ఆగింది. అందులో ఎవరో మగ మనిషి గొంతు వరకు కప్పు కొని పడుకున్నాడు.

పాపం అతను అంత సహాయం చేస్తే అనవసరంగా అనుమానించానే అనుకొంది. సీటు దగ్గరికి వెను తిరిగింది. రెండడుగులు వేశాక ఎస్- 13 లో ఒకసారి చూసి రావాలనిపించింది.  బెంగులూరు నుంచి వచ్చిన వాళ్లు గుంతకల్లు లో ఎవరైనా దిగి ఉండక పోతారా అన్న ఆలోచన కూడా చరితకు లేక పోలేదు.

వెంటనే ఎస్- 13 లో అడుగు పెట్టింది. చక చకా సీట్లను గమనిస్తూ చివరి దాకా వెళ్లింది. ఎక్కడా ఖాలీ లేదు.

ట్రైన్ బయలుదేరుతున్నట్లు అనౌన్స్మెంటు వినిపించింది. అతను చూశాడంటే అసహ్యంగా ఉంటుందను కొంటూ గబ గబా  సీటు దగ్గరికి వచ్చేసింది. అప్పటికే అతను అక్కడ ఉన్నాడు . 'ఎక్కడికెళ్లావమ్మా'  అని అడగనందుకు సంతోషించింది.

మళ్లీ మర్యాద కోసం బెడ్షీట్ చేతిలోకి తీసుకొని
' మీరు పడికోండి ' అంది.

' అక్కర్లేదమ్మా , మీరు నిశ్చింతగా పడుకొని నిద్ర పోండి ' నేనలా కూచుంటాను అని మళ్లీ ఎదురు సీట్ కొసలో గోడ కుర్చీ వేసినట్లు కూచున్నాడు. చరిత అటు తిరిగి మరీ ముడుచుకు పడుకుంది. కానీ ఐదు నిముషాలు కూడా ఆ పొజిషన్ లో ఉండ లేక పోయింది. 

నిద్ర పోయిన తర్వాత తనకు ఒళ్లు తెలియదు కానీ మేల్కొని ఉంటే మాత్రం అటు ఇటూ కదులుతూనే ఉంటుంది. వెల్లికిలా కాళ్లు బార చాచి పండుకుంటేనే తనకు కాళ్లు నొప్పుల మూలంగా సౌకర్యంగా ఉంటుంది . ఇవన్నీ మనసులో మెదలగానే అది అయ్యేది కాదని దిగ్గున లేచి కూచుంది.

'అక్కడ సీటుంది. నేను వెళ్తానమ్మా , మీరు హాయిగా పడుకోండి ' అని అతను లేచి వెళ్లి పోయాడు.

'లోకంలో ఇంత మంచి వాళ్లు కూడా ఉంటారా ' అని అనుకోకుండా ఉండ లేక పోయింది చరిత. వెలుతురు కళ్ల మీద పడుతుంటే తన కెక్కడ నిద్రొస్తుంది. ఇంత దురదృష్ట కరమైన రోజు ఉండదేమో ! రాత్రంతా నిద్ర పోక రేపు వెళ్తున్న పని ఎలా చెయ్యాలో అనుకుంది.

అలా అనుకున్న చరితకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెనకే తెలియ లేదు.

కాళ్ల మీద చెయ్యి పడే సరికి ఉలిక్కి పడి కళ్లు తెరచింది. ఏం జరుగుతుందో అర నిముషం పాటు అర్థం కాలేదు . కాళ్ల మీదుగా ఒక చెయ్యి అటు వైపున్న కిటికీ కమ్మీని అందుకొనే ప్రయత్నంలో ఉంది. వెంటనే పైకి లేచింది. ఆ వూపుకు ఆ సీటులోనే సర్దుకొని పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న టి.సి కాళ్లు తన మొహాన్ని తాకి దబ్బున కింద పడ్డాయి. మనిషి తూలి పడబోయి లేచి నిల్చున్నాడు.

పై బెర్తు మీద పడుకున్నతను కళ్లుతెరచి చూసి భార్యా భర్తలనుకున్నాడు కాబోలు అటు పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు. ఆ అలికిడికి లేచిన కింది బెర్తు ఆవిడ బాత్ రూం వైపు వెళ్లింది.

లేచి కూచున్న చరితకు జరుగుతున్న దేమిటో తెలియగానే కంపర మేసింది. టి.సి తన తల వైపు కాళ్లు,  కాళ్ల వైపు తల పెట్టుకొని పడుకొనే ప్రయత్నంలో ఉన్నాడన్న మాట. అంటే బెర్త్ పైన తనతో పాటు అతను.

చరితను చూసి తడబడిన అతను ' చాలా కష్టంగా ఉంది కదమ్మా ' అన్నాడు. అప్పుడు చూసింది చరిత అతని ఎడమ చెయ్యి చాలా సన్నగా చిన్నగా ఉండడాన్ని. చరిత మారు మాట్లాడ కుండా తన దుప్పటి తీసుకొని క్షణాల మీద పక్కన ఉన్న 9- 12  సీట్ల మధ్యన కింద ఖాలీ  స్థలంలో దుప్పటి  పరుచుకొని ఊపిరి కూడా వదలకుండా బిగుసుకొని పడుకుండి పోయింది.

టి. సి ఆత్మీయత వెనక ఏదో దుర్బుద్ధి ఉన్నట్లు స్పష్టంగా తనకు అనిపిస్తోంది. లేకుంటే పరాయి స్త్రీ పక్కన సర్దుకొని పడుకొనే ప్రయత్నం చేస్తాడా ? అనుకోగానే ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాకినట్లనిపించింది. అర గంట తర్వాత ఒత్తిగిలి పడుకొని మెడ చాచి ఓర కంటితో గమనించింది. వాడు కిటికీ వైపు తిరిగి పడుకొని ఉన్నాడు.  అలా మేలుకొనే ఎంత సేపు ఉండి పోయిందో ! చరితకు ఒక యుగం గడిచినట్లుంది.

' ఆ ఛాయ్ .. ఆ గరం గరం ఛ్చాయ్ ' టీ అమ్మే వాడి గొంతు దూరంగా వినిపించింది . ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చి నట్లు కింద పడుకోవలసిన తన పరిస్థితికి సిగ్గనిపించింది. అక్కడక్కడ ఒకరిద్దరు లేచి కూచొని ఉన్నారు.  బెడ్షీట్ మడత పెట్టి బాగ్ లో సర్ది బాత్ రూం కు వెళ్లింది. సీట్లో ఆ వెధవ లేడు అయినా అక్కడ కూర్చో బుద్ధి కాలేదు.

చాలా సేపు సింక్ దగ్గరే గడిపి కాస్త దూరంగా మధ్య బెర్త్ దించుకొని కూర్చోనున్న ఆడ వాళ్ల దగ్గర కెళ్లి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు కూర్చుంది. టి.సి. మళ్లీ కనిపించనందుకు సంతోష పడింది. వెధవలాగున్నాడు. ఈ దురాలోచనతోనే తనకు అలాట్ అయిన బెర్త్ను కూడా కావాలనే లేకుండా చేసి నట్లున్నాడు. అందుకే తనకు మొహం చూపెట్ట లేక తప్పించుకున్నాడనుకొంది పదే పదే .

కాచిగూడలో ట్రైన్ దిగి నడుస్తున్న చరితను 'ఇబ్బందయింది  కదమ్మా' అని ఒక గొంతు పలకరించింది. ఆ గొంతున్న శాల్తీకి చిన్న ఎడమ చెయ్యి, బట్ట తల ఉన్నాయి.

చరిత చీత్కారంగా చూసింది. థ్యాంక్స్ చెబుతాననుకున్నాడేమో! వెధవ . అనుకుంది కసిగా '

' ఏమ్మా ?'అని రెట్టించాడు.
'మా ఊరికెళ్లిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం స్టేషన్ మాస్టర్ సమక్షంలో మా ఆయన చేత చెప్పిస్తాను ' అంది ముందుకు కదిలి పోతూ.

                               మహాసముద్రం దేవకి 
                                    10 -4 - 2020

Comments