నాకు నచ్చిన కథలు

 నాకు నచ్చిన కథలు


దశాబ్దలకు ముందు చదివిన అమరావతి  కథల్ని నిన్న మొన్న మల్లేశ్వర రావు గారి కంఠంలో అడపా దడపా కొంత హడావిడిగా విన్నాను. మనసంగీకరించ లేదు. ఈ రోజు అదే పనిగా తీరిక కల్పించుకొని ఆసాంతం విన్నాను. అవి కథలు కావు . జీవిత సత్యాలు. కథలు వింటుంటే ఆ మనుషులు , పరిసరాలు, సన్ని వేశాలు దర్శన మిచ్చాయి. ఇప్పటికిప్పుడు వెళ్లి అమరేశ్వరాలయాన్ని, పరిసరాల్ని, కృష్ణమ్మను. చూస్తూ పరవశంలో మునిగి పోవాలనిపించింది.


ఊరూ వాడ , చెట్టూ గుట్ట, కొండా కోనా, చెరువూ దొరువూ, వాగూ వంకా నదులైనా, సముద్రాలైనా వాటితో  మమేకమై జీవనం సాగించి మట్టి లో కలిసి పోయిన మనుషులెందరో ఉంటారన్నది సత్యం. వాళ్ల జీవితాల్ని ఆకరాగా చేసుకొని ఒక ప్రాంతానికి సంబంధించిన జీవన విధానాన్ని శంకర మంచి లాగా కళ్లకు కట్టించే కథకులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. మనుషుల మధ్య ఉన్న అంతరాలు, స్థాయీ బేధాలు, హంగులూ, ఆర్భాటాలు , కలిమీ లేమీ , కష్టాలు, నష్టాలు , భార్యా భర్తల మధ్య సరససల్లాపాలు, గొడవలూ,  గందర గోళాలు  , ఉన్న వాడి దౌర్జన్యాలు, లేని వాడి భయభక్తులు , మనుషుల మధ్య వైరుధ్యాలు , బతుకు తెరువు కోసం వెంపర్లాటలు -- ఇవి అన్ని చోట్లా ఉండేవే . కానీ ప్రాంతీయమైన ప్రత్యేకతలు కూడా ఉంటాయి వాటిని శంకర మంచి  సజీవంగా చిన్న చిన్న కథల ద్వారా కళ్ల ముందు నిలబెట్టేశారు.సహజ సుందరమైన ఆ కథలను మల్లేశ్వరరావు గారు ఎప్పటి లాగే వారి గాత్రం ద్వారా ప్రాణ ప్రతిష్ట చేసి రెట్టింపు ఆస్వాద యోగ్యం చేశారు. . మంచి కథలను ఎన్నుకొని చదివి అందరికీ వినిపించాలనే సదాశయం గొప్పది. 

Comments