నాకు నచ్చిన రచన - భానుమతి 'అత్తగారి కథలు '
రచయిత్రి పరిచయం
ఒక వ్యక్తి గా అంతకు మించి ఒక మహిళగా పరిపూర్ణత సాధించిన అరుదైన, అపురూపమైన వ్యక్తి భానుమతి రామకృష్ణ. తెలుగు చలన చిత్ర చరిత్రలో కలకాలం గుర్తుంచుకో దగిన విశిష్టమైన వ్యక్తి. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. అసమాన గాయకురాలు. రచయిత్రి. చిత్రకారిణి. సంగీత దర్శకురాలు, స్టుడియో అధిపతి. దర్శక నిర్మాత. తన వ్యక్తిత్వ వైభవాన్ని శాఖోపశాఖలుగా విస్తరించుకో గలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఒంగోలు జిల్లాలోని దొడ్డవరం గ్రామంలో ఒక సంగీత కళాకారుల , సాహితీ వేత్తల కుటుంబంలో 1925 సెప్టెంబర్ 7 న భానుమతి జన్మించింది.
ఆడ పిల్లలకు చదువెందుకు అనుకొనే రోజుల్లో చదువు పట్ల ఆసక్తి లేకున్నా తండ్రి ప్రొద్బలంతో బడిలో చేరింది. అది మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లయ్యాక మెట్రిక్ చదువుతానని భర్త రామకృష్ణను కోరింది. కొడుకు భరణికి ట్యూషన్ చెప్పే మాష్టారి సాయంతో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1966 లో మెట్రిక్ , 1967 లో పి. యు. సి పాసయింది. పెళ్లికి ముందే వివిధ రకాల సాంస్కృతిక కార్య క్రమాల్లో పాల్గొంటూ , నాటకాలలో రక రకాల పాత్రలను పోషిస్తూ , పాటలు పాడుతూ 1939 లో సినీ రంగ ప్రవేశం చేసి వరవిక్రయం సినిమాలో కాళింది పాత్ర లో నటించింది.
తెలుగు సాహిత్య రంగంలో భానుమతి సృజన విలక్షణ మైంది. హాస్యరచయిత విశ్వనాథ కవి రాజుతో పరిచయంతో వాస్తవికతకు దగ్గరగా కథలు రాయాలన్న సత్యాన్ని ఆమె గ్రహించింది. మరో హాస్య రచయిత ముళ్ల పూడి వెంకట రమణ ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది.
ఆమె రాసిన తొలి కథ ' మరచెంబు' 1939 లో 'ప్రజామిత్ర'లో అచ్చయింది. మానవ జీవితంలో సంసార జీవనం ఒక భాగం. కుటుంబంలో ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలు ప్రధాన ఇతివృత్తాలుగా భానుమతి 'అత్తగారి కథలు ' రాసింది. వీటిలో అత్త ప్రధాన పాత్ర. మిగిలిన పాత్రలు ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంటాయి.
అత్తగారి కథల్లో వినోదమే ప్రధానం. అయినా ఉన్నత మధ్య తరగతి కుటుంబాల్లోని సదాచార సంప్రదాయాలు , తెలుగు వాళ్ల గృహ వాతావరణం, అత్మీయతలు వాటిలో ప్రతి బింబిస్తాయి . కలవారి కాపురాల్లో పెద్దతనానికి , కుర్రతనానికి మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణ లోంచి పుట్టుకొచ్చిన కథలివి. సాధరణంగా అత్తలో కనిపంచే గయ్యాళి తనం, కోడల్ని రాచి రంపాన పెట్టే స్వభావం ఈ అత్తలో మచ్చుకయినా కనిపించవు. కొడుకు, కోడలు , మనవడు అందరూ ఆమె వెంటే ఉంటారు. ఆమెకున్న ఆచారాల పట్టింపులు, నమ్మకాలు, వాటిని నెగ్గించుకోవాలనే పట్టుదల, ఇంటికి వచ్చి పోయే వారు, పని వాళ్లు, వాళ్లు పెట్టే ఇబ్బందుల వల్ల పొడచూపే అంశాలు అత్తగారి కథల్లోని అంశాలు. అవన్నీ ప్రధానంగా హాస్యరచనలు .
ఈ కథలు నాకు ఎందుకు నచ్చాయంటే ....!
మానవ జీవితంలో సుఖ దఃఖాలు సర్వ సాధరణం. దుఃఖంలో కూడా మానసిక ఆనందాన్ని కలిగించి బాధను కొంతవరకు ఉపశమింప జేసేది హాస్యం. కసువును కూడా రసం చేసుకో మన్నారు పెద్దలు. తృప్తితో కష్టాలను కూడా సుఖాలుగా మలుచుకోవడం మన చేతుల్లో ఉంది. అలాగే కష్టాల్లో ఉన్న వాళ్లను కూడా కడుపుబ్బ నవ్వించే శక్తి హాస్యానికి ఉంది. లోపాలను హేళన చేసి, అధిక్షేపించి సంస్కరించడానికి హాస్యం తోడ్పడుతుంది.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం ( గణపతి) , మునిమాణిక్యం నరసింహారావు ( కాంతం కథలు) , వాకాటి పాండురంగారావు ( ఆర్. చక్ర రావు కథ ) , ముళ్లపూడి వేంకట రమణ ( బుడుగు, జనతా ఎక్స్ప్రెస్ , మాహారాజా యువరాజు ) తెలుగులో హాస్య రచనలు చేశారు. కుటుంబ జీవితాన్ని చిత్రిస్తూ హాస్యాన్ని పండించిన వాళ్లు ముళ్లపూడి, భానుమతి.
అత్తగారి కథలు నాకు ఎంతగా నచ్చాయో చెప్పడానికి మాటలు చాలవు.
ఇతివృత్తాల ఎంపికలో , కథా కథనంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు.
హాస్య రచనలు కావడం
చదివే కొద్దీ ఇంకా చదవాలనిపించే శైలిలో సాగడం
భాష హాయిగా ఉండడం
సహజ సుందరంగా , హుందాగా సాగే కథా కథనం
కథలన్నిట్లోను తెలుగు, తమిళ సంప్రదాయాల మేలు కలయిక ఉన్నా నిండయిన తెలుగుదనం తొణికిసలాడడం
అప్పట మయిన తెలుగు జాతీయాలకూ , నుడులకూ ఆలవాలం కావడం
సామాజిక వ్యవస్థ లోని మూలాల్ని, విలువల్ని తెలుసుకొనే వీలుండడం
సమాజంలో కాల క్రమేణా ప్రజల వైఖరిలో వచ్చిన మార్పుల్ని అంచనా వెయ్యడానికి అవకాశ ముండడం
అయా పాత్రలకు అనుగుణంగా మాండలికాల్ని వాడడం
సామెతలు , జాతీయాలు , నానుడులను ప్రయోగించి సంభాషణలకు సహజత్వాన్ని తీసుకు రావడం
విభిన్న మైన కథాంశాలను తీసుకొని సమాజంలోని మనుషులకు , వాళ్ల మనస్తత్వాలకు ముడిపెట్టి సంప్రదాయాల గొప్ప తనాన్ని చాటి చెప్పడం
మూఢ నమ్మకాల్ని ఖండించడం. అవే నమ్మకాలు ఒక్కోసారి మనిషి తృప్తి చెందడానికి ఎలా తోడ్పడతాయో చెప్పడం
కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు కావడం
అత్తగారి పాత్ర తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక హాస్య స్త్రీ పాత్ర కావడం
ఆమె వాక్య విన్యాసం మనోహరంగా , హాస్య రస స్ఫోరకంగా, సుబోధకంగా ఉండడం .
అత్తగారి కథల్లో ఏ పేజీ చదివినా ఈ లక్షణాలన్నీ తప్పక దర్శనమిస్తాయి.
ఇందులో మొత్తం 24 కథలున్నాయి. వాటిలో ఒకటి రెండు అంశాలను మీకు రుచి చూపించే ప్రయత్నం చేస్తాను.
' అత్తగారు - పని వాళ్లు' కథలో వంట వాడు తిరు వెంగళాచారి. పని వాడు గుండు మణి. గొడ్ల వాడు సుబ్రమణి. పని మనిషి ఎల్లమ్మ . ఒక రోజు వంట వాడు రొప్పుకుంటూ ' పెద్దమ్మ గారూ ' అంటూ పరిగెత్తుకొచ్చాడు. అతని వెనకాలే పనివాడు గుండు మణి విసుక్కొంటూ వచ్చాడు
' ఓ రూపాయిలా పడేయండమ్మా హోటల్లో నన్నా తినొస్తాను. రోజూ ఎదవ తిండి తిన్లేక ఛస్తున్నా ' అంటాడు పని వాడు.
' చూశారా! చూశారా! ఎదవ తిండట ...' అంటూ వాపోతాడు వంట వాడు.
మాడిన పప్పు తెచ్చి నా మొహాన కొడితే ఎలా తినడం? పైగా మాడు కంపుతో నైనా తినొచ్చు . ఆ మాడు వాసన రాకుండా ఉండటానికి ఏదో శెంటు పోశాడమ్మ గారూ! వాంతి వస్తుంది. వొంటి కేసుకొనే శెంటు వంటకాల్లో ఏసుకుంటారటండీ ఎవరైనా ? ' అని వాపోయాడు గుండుమణి .
'హరి హరీ ! అది శెంటు కాదు . పన్నీరు పోశాను లక్షణంగా ' అంటాడు వంటవాడు
ఇద్దరూ వాదులాడుకొంటూ ' ఈ తిండి కుక్కలు కూడా తినవ్ ' అంటాడు గుండు .
'ఆ ఆ . తలపొగరు వెధవా ! ఏమన్నావ్? కుక్కలు కూడా తినవా? అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం ' అంటూ గయ్ మంది అత్తగారు
' రోజూ తినేయన్నీ మాడుస్తూ ఉంటే ఎట్టా తినేది?'
' నేను తింటం లేదట్రా? వాడు కావాలని మాడుస్తున్నాడా ? ఆ పనికీ ఈ పనికీ అటూ ఇటూ తిరగడంలో అడుగంటుతున్నాయి. ఆ మాత్రానికే అన్నం నేల కేసి కొడతావా? '
' అన్నం కాదమ్మా . పప్పు పన్నీరు పప్పు '
' ఏం రా ఏమైంది పన్నీరు పప్పుకు . లక్షణంగా ఘుమ ఘుమ లాడుతోంది.'
' అది కాదత్తా ! మాడిన పప్పులో పన్నీరు పొయ్యడ మేమిటి ? ఇది నేనెక్కడా విన్లేదే ' అన్నది కోడలు .
'అయ్యో ఆ మాడు వాసన రాకుండా ఉంటానికి నేనే జెప్పాను వాడికి. కాస్త పన్నీరు పొయ్య మని. లేకపోతే వాడికా తెలివి తేటలు కూడా ఎక్కడేడ్చాయీ ?' అంటుంది అత్త.
వంటవాడితో ఒకరోజు 'ఒరె వెంగళం రేపు మనవడికి పష్టుగా బాదం కీరు చెయ్యి ' అంటుంది అత్త .
' చిత్తం ! చిత్తం! అలాగే అంత కంటేనా ? ' అంటాడు .
కుటుంబ సభ్యులు భోజనానికి కూర్చున్నారు. వెంగళం వడ్డించడం మొదలు పెట్టాడు. పొగలు గక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి వాళ్ల ముందు పెట్టి మూత తీశాడు. గుప్పున ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ మసాలా , పన్నీరు అన్నీ కలిసిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దలయ్యేట్లు వచ్చింది.
' ఛీ ఛీ అప్రాచ్యుడా ఏమిట్రా ఈ ఖర్మం ' అంటూ అత్త ముక్కులు మూసుకొని కంచం దగ్గర్నుంచి చివాల్న లేచింది.
వంట వాడు ఆపాదమస్తకం ఒణికిపోతూ ' మీరు క్రీరు చెయ్యమన్నారు కదమ్మ గారూ ' అంటాడు . మిగిలిన వారంతా పక్కున నవ్వారు.
' క్రీరేమిట్రా '
' అదే ! అదే! బాదం క్రీరు '
' నీ క్రీరు మండిపోనూ! ఇదేం క్రీరురా ? మసాలా కంపు కొట్టుకుంటూ . లక్షణంగా తియ్యగా పాయసంలా ఉండాల్సిన బాదం కీరును ఈ గతి పట్టించా వేంట్రా? అసలిది నువ్వు చేశావా ఆ మసాలా వెధవ గుండు మణి చేశాడా?'
' ఎంత మాట. ఎంత మాట వాడు చెప్పాడు నేను చేశాను '
ఇలా ఈ కథలో ఇంకా సాగే సంభాషణలు కడుపుబ్బ నవ్విస్తాయి.
'అత్తగారు - పర్సనాలిటీ ' కథలో వెంకట్ అనే వ్యక్తి అత్త గారి అక్క కూతురు మనవడు . అప్పుడప్పుడూ అత్త వద్దకు వచ్చి పోతుంటాడు. గాలి కొడితే పడిపోయెంత సన్నగా , ఎత్తు పళ్లతో , పాలిపోయిన తెలుపురంగుతో ఉంటాడు.
'బెండ కాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికి రాదంటారు. మీ నాన్న నీకు పెళ్లీ పేరంటాలు చెయ్యదలుచుకోలేదా? ఉద్యోగం దొరికి రెండేండ్లయింది. ఇంకా ఎందుకాలస్యం? ' అని దీర్ఘాలు తీస్తూ అడుగుతుంది అత్త . ఇంట్లో వాళ్లు పట్టించుకో లేదంటాడు వాడు .
' ఛీ! ఫిచ్చి కుంకా! దిగులు పడమాక. మంచి సమ్మంధం నీకు నేను చూస్తాను' అంటుంది అత్త. వారం రోజులో సమ్మంధం చూసి వెంకట్ కు చెప్పగానే వాడు సంతోషంతో ఉక్కిబిక్కిరయాడు.
'పిల్లనెప్పుడు చూసొద్దం రా' అడిగింది అత్త. పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా నేను చూడక్కర్లేదు' అన్నాడు వాడు.
' ఇదేం విడ్డూరమ్రా! పెళ్లంటే నూరేండ్ల పంట. కండ్లకు గంతలు కట్టి చేస్తారా పెండ్లిండ్లు ' అని వెంకట్ ను పెళ్లి చూపులకు తీసుకెళ్లింది. ఆ పిల్ల బాగుంది కాని వెంకట్ ను చూసి 'నాకు పెళ్లే వద్దు' అనేసింది.
' ఎవరు చూసినా నీకు పర్షాల్టి( పర్సనాలిటీ) లేదంటున్నారు ఏదైనా తిని కాస్త బలం పట్టు ' అనిందత్త.
ఏం తినాలని అందర్నీ అడిగి ఉదయమే అర్ధశేరు వెన్న తిని ముఖం లోతుకు ఈడ్చుకు పోయి , గుడ్లు బయటి కొచ్చి, పళ్ళు మరి కాస్త పై కొచ్చి కాళ్లీడ్చుకొంటూ వచ్చాడు.
' అవ్వ! ఇదేం అన్యాయమ్రా' అని అడిగిన అత్తతో
' అదే అవ్వా జరిగింది . తిన్న వెంటనే కడుపులో పోట్లు, తట్టుకో లేక నేల మీద పడి పొర్లడం మొదలు పెట్టాను. ' అని వెంకట్ చెప్తుంటే అత్త నవ్వు ఆపుకోలేక పోయింది.
అత్త అలవాట్లు, అమాయకత్వం, గడుసుదనం, ఇతరులను ఆక్షేపించేందుకు వాడే పదజాలం నౌకర్లు చాకర్ల పట్ల ప్రవర్తించే తీరు నవ్వు తెప్పిస్తుంది.
' అత్త గారూ- అచ్చు తప్పులు ' కథలో ఏం జరిగిందో చూడండి. ఒకరోజు చాకలి ఉతికిన బట్టలు తెచ్చాడు. అత్త పద్దుల పుస్తకం చూసి
' అంట్ల వెధవా! అబద్దాలాడ కుండా చెప్పు. ఏమైనాయి పదిహేను పంచలు? ' అంటూ నిలేసింది చాకల్ని.
చెట్టంత చాకలి 'అన్యధా శరణం నాస్తి 'అంటూ అమాంతం అత్త ముందు సాష్టాంగ పడ్డాడు ఆ పంచలు నాకెయ్యలేదండమ్మగారో ' అంటూ.
' నొర్ముయ్ ! దొంగ భడవా ! ఇంత అబద్దాలా? నిక్షేపం లాంటి నిక్కరుపారేస్తే పారేశావ్ . బంగారం లాంటి పదిహేను పంచలు ఏంచేశావో చెప్పు ' అంటూ బడిపంతుల్లాగా పెన్సిల్ ఝలిపించింది.
నేలకు అంటుకు పోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకున్నాడు. ' ఆ తిరుపతి ఎంకన్న సాక్షిగా నిక్కరు గానీ నా కెయలేదండమ్మ గారూ ! అంటూ.
' ఛీ నోర్ముయ్ దొంగ గాడిదా ! నీ తలకాయంత అక్షరాల్తో రాసిన నా లెక్క తప్పంటావురా? లెక్క పొరబాటు నా వంశంలో లేదు తెలిసిందా? ఛీ వెధవా ! పళ్లు రాలగొడ్తాను. పొరబాటు రావడానికి ఒకటా రెండా ! పెదిహేను పంచలు ... ఏం చేశావో చెప్పు ' అంటూ గాంధారంలో గద్దించింది అత్త.
మర్నాడు తల్లికిజబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్లిన పని పిల్ల వాడు వచ్చాడు. విషయం విని ' అరె! అన్యాయంగా ఉందే. బహుశా నేనూరికెళ్లానని తెలిసి వాడీ నాటకం ఆడుంటాడు . నేనే గదమ్మా వేసి బిల్లు కూడా తెచ్చాను . ఉండండి నేనిప్పుడే వెళ్లి ఆ లాండ్రీ వాడి పని పట్టిస్తాను ' అంటుంటే వెల వెల బోతుంది అత్త.
ఇలా అత్తగారి కథల నిండా గిలిగింతలు పెట్టే సున్నితమైన హాస్యం పాఠకులకు ఆహ్లాదాన్ని పంచుతింది. మరి ఈ కథల్ని ఇష్టపడని వాళ్లుంటారని నేననుకోను . చదవని వాళ్లు చదివి చూడండి .
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment