అల్లాడిన ఆడబతుకు

 కథ :


అల్లాడిన ఆడబతుకు 

మా ఊర్లో స్కూలుకు వెనక పక్కగా ఓమోస్తరు వీధి లాంటి చిన్న సందు ఉండేది. ఆ సందులో ఎదురుబదురుగా ఎనిమిదిండ్లు.

       
        ఇండ్లంటే పెద్ద పెద్ద మేడలూ మిద్దెలూ కావు . పెంకుటిండ్లూ కావు. కొట్టాలు. అటు ఇల్లూ కాక ఇటు పాకా కాక మద్దిస్తంగా ఉన్నవి. చుట్టూ బారెడెత్తు గోడ. ఫైన వెదురు వాసాలు. వాటిని కప్పుతూ టెంకాయ కీతులు. దాని పైన వాన నీళ్లు ఇంట్లో కురవకుండా ఉండడానికి బోదతో కప్పినవి కొన్ని, తాటి మట్టలతో కప్పినవి కొన్ని. నిటారుగా ఇంట్లోకి చొరబడడానికి వీళ్లేని వాకిండ్లు . వాళ్ల ఆర్థిక స్థితి గతులకు అద్దం పడుతున్న ఆ గుడిసిండ్లలో ఒక్కో ఇంట్లో ఒక్కో కాపురం.

        వాళ్లలో మారు మనువుంది. అయినా ఆ ఇండ్లలో ఉండే వాళ్లందరూ పద్ధతిగా ఒక పెండ్లి చేసుకొని , పిలకాయిల్ని కని గుట్టుగా సంసారం చేసుకుంటున్నోళ్లే.

        ఎగతాళికి  కూడా వేరే వాళ్లతో పరచికాలాడ్డం ఆ ఆడోళ్లలో చూడలేదు. ఉర్లో పెద్ద వాళ్లనయినా, చిన్న పిల్లల నయినా  ' నాయినా' అని ఆప్యాయంగా నోరారా పిలవడమే వాళ్ల సంస్కారం.
ఆ ఎనిమిది కుటుంబాల్లో కొత్త పల్లోని కుటుంబం మరీ మంచిది.

        పొద్దున్నే వినాయక స్వామి గుడి దగ్గర 'శుక్లాంబరధరం విష్ణుం - శశి వర్ణం చతుర్భుజం'  అనే పాటతో మా ఊరిలో చైతన్యం మొదలవుతుంది. పిల్లా పాపతో సహా లేచి ఎవరి పనుల్లో వాళ్లు తలమునక లయిపోతారు .

        కొత్త పల్లోళ్ల కుటుంబం ఉదయాన్నే పనీ పాటా ముగించుకోని చద్దన్నం కట్టుకోని బండమీదికి పోయే వాళ్లు.

        కొత్తపల్లాయనికి స్థిరాస్తులు లేవు. కొద్దిగా మెట్ట పొలం ఉంది. అందులో పండే వేరుశనక్కాయిలు సంవత్సర మంతా వాళ్ల వరకు తినడానికి,  ఊరిబిండికి బొటా బొటిగా సరిపోతాయి. శరీర కష్టం మీద ఆధార పడి బతుకున్నారు. పెద్ద కూతురు మల్లమ్మ. రెండో కూతురు సావిత్రి. వీళ్లిద్దరూ వాళ్లమ్మ ఆదెమ్మతో కలిసి కంకర కొట్టే వాళ్లు . పెద్ద కొడుకు నాగన్న, తండ్రీ కలిసి కట్రాళ్లు కొట్టి మలిచే వాళ్లు . చిన్న కొడుకు శివ మాత్రం మూడవ తరగతి చదువుతున్నాడు.

        ఒక రోజు భార్యా భర్తా కలిసి కూతురు మల్లమ్మను తీసుకొని మా యింటి కొచ్చినారు. తాంబూలంలో పండ్లూ పూలూ పెట్టి మల్లమ్మతో మా అవ్వకు, అమ్మకు ఇప్పించి మొక్కించినారు.

        మల్లమ్మకు పెళ్లి కుదిరిందట. మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏనుగుంట పల్లెలో వాళ్ల మేనత్త కొడుకుతో పెళ్లి. వాళ్లు అంతో ఇంతో పొలం పుట్రా ఉన్న వాళ్లు. అందుకే సంబంధం కాయం చేసుకున్నాము అనింది ఆదెమ్మ.

        వాళ్లు ఇంటికొచ్చి తాంబులం పెట్టినారంటే భూములున్న రైతు కుటుంబాల వాళ్లు వాళ్ల కున్న బియ్యమో, పప్పో ఇచ్చి పంపడం మా ఊరి పద్ధతి.

        మా అమ్మ ఓ పది శేర్ల బియ్యం గంపలో పోసి ఇచ్చింది. ఒక చేట నిండా ఎండు మిరప కాయలిచ్చింది. చింత పండుంటే పెట్టమని  ఆదెమ్మ  అడిగింది.  లేదనకుండా రెండు కిలోల దాకా చింత పండు ఇచ్చింది. వాళ్ల నాయన కట్టెలు కావాలన్నాడు. 'నా పక్క చూస్తూ వీళ్ల నాయన వచ్చినాక చెప్తాను , ఒకటో రెండో మాన్లు నరుక్కుందువు కానీ' అని హామీ ఇచ్చింది మా అమ్మ.

        పెళ్లి మా ఊర్లో కాదు. మొగిలి దేవస్థానంలో. అందుకే క్షేమంగా వెళ్లి లాభంగా రండి ' అని మాఅవ్వ  , అమ్మ దీవించి పంపించినారు .

        పెళ్లయిన మధ్యానం మొగిలి నుంచి నేరుగా మా ఊరికొచ్చినారు కొత్త దంపతులు . మెడలో పూలమాలలతో.  రచ్చ దగ్గరున్న వినాయక స్వామికి కాయ గొట్టి కర్పూరం హారతిచ్చి మొక్కుకున్నాక నేరుగా మా యింటికొచ్చి మా నాయన అమ్మ అవ్వలకు ఆకు వక్క ఇచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం  తీసుకున్నారు.
   
        ' పిల్లా పాపలతో సుఖంగా నూరేండ్లు వర్ధిల్ల'  మని మా అవ్వ వాళ్లని దీవించింది. మా అమ్మ వాళ్ల నెత్తిన చేతులు పెట్టి ఏమని దీవించిందో కాని ఆమె పెదవులు మాత్రం కదలడం చూశాను. ఆ తర్వాత మా అవ్వ చెప్పడంతో తాంబూలంలో జాకెట్టు గుడ్డ పెట్టి మల్లమ్మకు బొట్టు పెట్టి చేతిలో పెట్టింది మా అమ్మ.

        మా అమ్మంటే మల్లమ్మకు వల్లమాలిన ఇష్టం. మా బాయికి మంచి నీళ్ల కోసం వచ్చినప్పుడు మా అమ్మను పలకరించకుండా వెళ్లేది కాదు. మా అమ్మ చేతిలోని ఆపనీ ఈపనీ అందుకొనేది. ఏ పనీ లేకుంటే అడగకుండానే కట్టెల వామి దగ్గరికి వెళ్లి వాదెడు కట్టెలు తెచ్చి పొయ్యి దగ్గర వేసేది. .

        అత్తగారింటికి వెళ్తున్న మల్లమ్మ.                    ' పొయ్యొస్తానక్కా'  అని కళ్ల నీళ్లు పెట్టుకొంది.

        ' కూత వేటు దూరంలో ఉండే ఊర్లో నిన్నిచ్చినారు. అనుకుంటే గంట లోపలే ఈడికి రావచ్చు. ఎందుకే ఏడ్చేది? సంతోషంగా పొయిరా'  అని మందలింపు, ఓదార్పు  కలిపి అన్నా మా అమ్మ కళ్లలోనూ నీళ్లు పారాడినాయి.

         మల్లమ్మ మా ఊరికొచ్చినప్పుడంతా మా ఇంటి కొచ్చి మా అమ్మతో  కష్టం సుఖం చెప్పుకొనేది.

        ఒక సారి వాళ్ల నాయిన , అమ్మ మల్లమ్మను వెంట బెట్టుకొని మా ఇంటికి మద్దిస్తాని కొచ్చినారు.

        'నువ్ జెప్పు కమలమ్మా,  మొగోడన్నాక పది మందితో పోతాడు వస్తాడు . దాన్నంతా పట్టించుకుంటే అవతాదా? సంసారమన్న్యాక సవాలక్ష సమస్యలుంటాయి. కష్టం సుకం అన్నింటినీ బూదేవి మాదిరిగా ఓర్సుకోవాల గానీ నాకు మొగుడొద్దు నేనాడుండను ఒచ్చేస్తానంటే పద్దతిగా ఉంటాదా? నలుగురూ ఏమనుకుంటారు? సంసారం గుట్టు వ్యాది రట్టు అన్యారు. మొగునిలో ఎన్ని అనాకారి లక్షణాలన్నా  ఉండనీ , అన్నీ  కడుపులో  ఏసుకోని గుంబనంగా కాపురం సేసుకోవాల .... ' మాయమ్మ ఏం చెప్పాలనుకునిందో కానీ ఆదెమ్మే అన్నీ చెప్పేసింది.

        మా అమ్మ కూడా మల్లమ్మతో ‘ కమలక్క కూడా ఏమి ఇట్లా చెప్తా ఉందే అని అనుకోవద్దు పాపా. నీకు నువ్వే సంసారాన్ని అగుడు సేసుకోవద్దు. జరిగిందేదో జరిగి పోయింది. తెంపుకోవాలంటే క్షణం పట్టదు. సమయం చూసి మొగుణ్ణి నీ పక్క తిప్పుకొనే ప్రయత్నం చెయ్యి. మంచి మాటలతో చెడు తిరుగుళ్లు మానిపించు. మీయమ్మ చెప్పినట్లు అన్నీ ముడేసుకుంటే కాదు. దానితో ఉండాడు కానీ నిన్ను ఒద్దనుకోలేదు. నీ కడుపులో ఒక కాయ కాసిందంటే సంసారం దాని కదే ఒక దారి కొస్తుంది. కాదూ కూడదంటే నీ బిడ్లిని సూసుకోని నీ జీవితాన్ని ఎల్ల బారించ వచ్చు. ' అంటూ బుద్ధీ మద్దీ చెప్పింది.

        మల్లమ్మ ఉలక లేదు పలకలేదు. మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండి పొయ్యింది. 'పొయ్యొస్తా కమలమ్మా'  అని వాళ్లమ్మ కదలగానే మల్లమ్మ ఆవు వెంట నడిచే దూడలా తల వంచుకొని వెళ్లి పోయింది.

                ***************

               మల్లమ్మ మొగుడు మురగేశుడు. పెడాత్రం మనిషి. పెళ్లికి ముందే చెడు తిరుగుళ్లు మరిగిన వాడు . ఇద్దరు ముగ్గురు ఆడ వాళ్లతో వాడి కప్పటికే శారీరక సంబంధాలున్నాయి. ఆ ఆడ వాళ్లు కూడా పెళ్లయి కాపురాలు వెలగ బెడుతున్న వాళ్లే.

        మురగడు ఒడ్డూ పొడుగుతో ఎర్రగా బుర్రగా ఉంటాడు. పెళ్లి చేస్తే గుట్టుగా ఇంటి పట్టున పడి ఉంటాడని వాళ్లమ్మ అయ్య ఆలోచించినారు. వాడి విషయం తెలిసిన వాళ్లెవ్వరూ కూడా పిల్లనివ్వరని వాళ్లకు తెలుసు. అయితే మల్లమ్మ పుట్టినప్పటి నుంచి మురగని పెళ్లాం గానే పెరిగి పెద్దయింది. మల్లమ్మకు కూడా బావ మురగడంటే వల్ల మాలిన అభిమానం. వాడి చెడు తిరుగుళ్ల సంగతులేవీ మల్లమ్మ చెవి దాకా చేర లేదు.

        పెళ్లయి అత్తగారింట్లో అడుగు పెట్టిన నెల రోజులకే అసలు రంగు బయట పడింది. అప్పటి నుండీ మల్లమ్మ మనసులో మల్లగుల్లాలు పడుతూనే ఉంది.

        ఆ ఊర్లో చిల్లరంగడి పెట్టుకున్న నరసమ్మతో సరసాలాడడాన్ని కళ్లారా చూసిన మల్లమ్మ కంటికి కడివెడుగా కన్నీళ్లు పెట్టుకుంది. అత్త రాజమ్మ  దగ్గర మొత్తుకుంది.  మొగుడు రానీ చూస్తానని సవాలు కూడా విసిరింది.

        అత్త ఏమీ ఎరగనట్లే ఉండిపోయింది. మురగడు ఇంట్లోకి రాగానే ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది. చూసి కూడా మల్లమ్మ మూతి ముడుపుకు కారణం అడగలేదు. అన్నం తింటుంటే తల్లి మంచీ చెడ్డా నూరి వాడి చెవిలో పోస్తూనే ఉంది. అయినా అవేవీ వాడి తలకెక్క లేదు. తిని తన దారిన తాను బయటికి వెళ్లి పోయాడు.

        మొగుడు అట్లా వెళ్లి పోవడం గమనించిన మల్లమ్మకు కంట్లో కారం పోసినట్లయింది. ఏమట్లా ఉండావు అని మొగుడు అడిగితే గట్టిగానే సమాధానం చెప్పాలనుకుంది మల్లమ్మ.

         నువ్వెట్లుంటే నాకేమి అన్నట్లు పట్టించుకోకుండా వెళ్లి పోయిన భర్త మల్లమ్మ మనసులో మంటలే రేపాడు. ఆరోజంతా కూడూ నీళ్లూ లేకుండా గడిపింది. మేనత్త ఎంత అడుక్కున్నా ససేమిరా అంది. 

       సంద కాడ ఇంటి కొచ్చిన కొడుకుతో మల్లమ్మ విషయం ప్రస్తావించింది తల్లి. 'తిన కుంటే మాడేది దాని కడుపే కదా. ఏమి కొంప మునిగి పోయిందని అది తిండి మానేసింది. 'అని మల్లమ్మకు కూడా వినిపించేట్లు గట్టిగానే అన్నాడు.

        ఆ మాటలు మల్లమ్మ చెవిలో పడినా కొట్లాడాలని ఇంత సేపూ ఎదురు చూసిన మల్లమ్మ మౌనంగానే ఉండిపోయింది.

        రాజమ్మ వాడిని పెరట్లోకి లాక్కు పొయ్యింది. కాళ్లా వేళ్లా పడింది.అది బంగారం రా , దాన్ని నిర్లక్ష్యం చేస్తే పుట్టుగతులుండవనింది. ఇంటి ఇల్లాలు కండ్లలో నీళ్లు పెట్టుకొని నట్టింట్లో బాధ పడితే ఇంటికి మంచిది కాదనింది. మల్లమ్మను పలకరిస్తాను అనే దాకా మంచి చెడ్డా చెప్పి ఇంట్లోకి పిలుచుకోనొచ్చింది.

        కోపంతో కొంతసేపు మల్లమ్మ మూతి బిగించు కొంది.  మొగుడు అడుక్కొనే దోరణిలో దగ్గరికి తీసుకోవడంతో మల్లమ్మ కోపం గాలిలో కలిసిపోయింది.

        ఒక గాడిలో పడి నడుస్తున్న మల్లమ్మ జీవిత గానంలో  మళ్లీ కొన్నాళ్లకు అపశ్రుతి పలికింది.

        మల్లమ్మ మామ మునెయ్య.  ఆ ఊరిలో వైద్యుడుగా పేరు పొందిన వాడు. తేలు కుట్టినా , దిష్టి తగిలినా మంత్రమేస్తాడు. కడుపు నొచ్చినా చెవి నొప్పి అన్నా, ఒళ్లు వెచ్చబడినా చిన్నా చితకా చిట్కా వైద్యంతో బాగు చేస్తుంటాడు. అందు వల్ల వైద్యం చేయించుకున్న వాళ్లు పండిందీ ఎండిందీ వాళ్ల కున్నప్పుడు అంతో ఇంతో ఇస్తుంటారు.  వాళ్ల మంచితనం తెలిసిన ఊర్లో వాళ్లకు మురగడి చిల్లర బుద్ధులూ తెలుసు. వజ్రం కడుపులో ఓగు పుట్టింది అనుకొనే వాళ్లు.

        వాళ్లకు  కొంత వరి పండే పొలం, కొంత మెట్ట చేనూ ఉంది. కష్ట పడి వాళ్ల పని వీలైనంత వరకు వాళ్లే చేసుకుంటారు. అవి నాట్లు వేసే రోజులు . ఇంట్లో అందరూ పొలం పనిలో తలమునకలుగా ఉన్నారు. వాళ్లకు వంట చేసుకొని తీసుకు పోవడానికని మల్లమ్మ ఇంటి దగ్గరే ఉండి పోయింది.

        పదకొండుకంతా వంట పూర్తి చేసింది. తను ముందే వెళ్తే నారు కట్టల్ని మడిలోకి చేర్చడమో , గొడ్లకు గడ్డి కొయ్యడమో చెయ్యొచ్చనుకొని సంగటి తట్ట నెత్తి మింద పెట్టుకొని బయలు దేరింది.  చేను దాటి చెరువు కట్ట దాటి అడ్డ దారిలో తొందరగా వెళ్లొచ్చని నీళ్లు లేక ఎండి పోయిన వంకలో దిగింది.  చెప్పులు లేని కాళ్లు ఇసుకలో చుర్రుమన్నాయి .

        వంక దాటి అటు వైపు అడిగు పెట్టింది. కుప్పి రెడ్డోళ్ల పండి ఎండిన జొన్న చేను మొగదల లోకి వచ్చింది.  ఇంకో ఐదారు కయ్యలు దాటితే కానీ వీళ్ల  నారుమడి రాదు.

      ఉన్నట్టుండి జొన్న చేనులో సర సరా శబ్దమయ్యింది. మెత్తని గడ్డి మీద నడుస్తున్న మల్లమ్మ గెనిం మలుపులో ఆ శబ్దానికి ఉలిక్కి పడి ఆగి పోయింది. మొదట పాము ఏమో అని భయ పడింది. శబ్దం ఎక్కువగా రావడంతో ఎద్దో , ఎనుమో చేన్లో పడి మేస్తోందనుకొంది. ఒకడుగు  వెనక్కి వేసి మలుపులో నిలబడి తొంగి చూడ బట్టింది. ఆ తర్వాత ఆమె కళ్ల ముందు పడ్డ దృశ్యం మల్లమ్మ నవనాడుల్ని కుంగ దీశాయి.

        జొన్న చేను మధ్యలో నుంచి మల్లమ్మ మొగుడు మెల్లగా నడుచుకొంటూ బయటికి వచ్చాడు. ఎండుటాకు పైన పడ్డ అడుగులు  ఎంత మెల్లగా నడిచినా శబ్దం చేస్తున్నాయి. ఎవరూ లేరన్న ధీమాతో  బయటికి వచ్చిన మురగడు ఇటూ అటూ చూసి ' ఎవరూ లేరు వచ్చేయ్ ' అన్నాడు. ఆ మాటలు విని ఉలిక్కి పడింది మల్లమ్మ .

       అడుగులో అడుగు వేసుకొంటూ బయటికి వచ్చి ఒగలొలకబోస్తూ మురగడి దగ్గర నిలబడింది  నీలమణి .  చీర సర్దుకొంటున్న నీలమణిని చూడగానే జొన్న చేలో ఏమి జరిగిందో అర్థమయింది మల్లమ్మకు.

        తన అంచనా నిజమే అన్నట్లు వాడు చెదిరిపోయిన నీలమణి వెంట్రుకలను సర్ది మళ్లీ ఒకసారి దాన్ని గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టుకొని అటు వైపు నడుచు కొంటూ వెళ్లి పోయాడు. వాడు వెళ్లిన ఐదు నిముషాలకు ఏమీ ఎరగనట్లు పదడుగులు ముందుకేసి ఉత్తర వైపుకున్న గెనింపైనుంచి నడుచుకొంటూ మలుపు తిరిగి మామిడ తోట గెట్టెక్కి మాయమై పోయింది నీలమణి . అంతవరకు ఆ దృశ్యాన్ని చాటుగా నిలబడి చూసిన మల్లమ్మను ఎవరూ గమనించ లేదు.

        దానికి మొగుడున్నాడు. ఎంతకు తెగించినారిద్దరూ అనుకొంటూ మల్లమ్మ మడి దగ్గరికి చేరే సరికి ఏమీ ఎరగనట్లు అడుసు పొలంలో అండదీస్తూ ఉన్నాడు మురగడు. అత్త, మామ, మరో కూలి మనిషి  నారు పెరికి కట్టలు కట్టడంలో మునిగి ఉన్నారు.

        మల్లమ్మ సంగటి తట్టను నారుమడి పక్కనున్న  బాదం చెట్టు కింద దించి ఎవరికీ చెప్ప కుండా ఇంటిదారి పట్టింది. అత్త పిలుస్తున్నా  తిరిగి చూడలేదు. మొగుడూ పెళ్లాలు కొట్లాడు కున్నారనుకోడానికి వాడు ఇక్కడే ఉన్నాడు. మధ్యలో కొంత సేపు బీడి కాల్చుకోడానికి  వెళ్లినట్లున్నాడు. కాబట్టి మొగుడు పెళ్లాల మధ్య తగాదా కానే కాదు అనుకున్నారు అత్తమామలు.

        సాయంకాలం ఇంటికి రాగానే ఇంటి తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప దర్శన మిచ్చింది. పక్కింటి తాయారమ్మ బీగం చెవులు తెచ్చి రాజమ్మ చేతికిచ్చి మల్లమ్మ పుట్నింటికి పోయిందని చెప్పింది.

        'ఆ నాతో చెప్పిందిలే. నేనే పొయిరమ్మన్నాను'  అని అబద్ధం చెప్పింది రాజమ్మ .
 
        కొడుకు ఇంటికి రాగానే 'ఏం జరిగిందిరా ' అని నిలదీసింది.

        మొదట అంగడామె విషయంలో గొడవ జరిగినప్పటి నుంచి సఖ్యత గానే
ఉన్న మురగడికి మల్లమ్మ అలిగి పోవడానికి కారణాన్ని ఊహించ లేక పోయాడు. జొన్న చేనిలో తను నీలమణితో కలిసిన విషయం కూడా మల్లమ్మకు తెలిసే అవకాశం లేదనుకున్నాడు. చేను నుంచి బయట బడిన పావు గంటకు గాని మల్లమ్మ నారు మడి దగ్గరికి రాలేదు. పైగా ఆ దారిలో ఎందుకొస్తుంది ? ఇలా సాగుతున్నాయి మురగడి ఆలోచనలు .

        మర్నాడు రాజమ్మ నాట్ల పనిని భర్తకు వదిలి పెట్టి పుట్నింటికి పయనమై వెళ్లింది. అక్కడికెళ్లిన తర్వాత గానీ ఆమెకు అసలు విషయం తెలియ లేదు. అత్త వాడి సంగతి నేను చూస్తా అని ఎంత అడుక్కున్నా రానంటే రానని మొండికేసింది మల్లమ్మ.

        కోపమా తాపమా అని అలిగి పుట్నింటి కొచ్చిన కూతుర్ని వెంటనే పంపడానికి వాళ్లమ్మా నాన్నలకు కూడా ఇష్టం లేదు. ' ఆ గాడ్ది కొడుకు మారడు. నా కూతుర్ని పంపను'  అని చెల్లెలితో తెగేసి చెప్పినాడు వాళ్ల నాన్న.

        నాట్ల పనులు పుట్టి మునిగి పోతుండడంతో రాజమ్మ వెంటనే బయలుదేరి ఏనుగుంట పల్లె దారి పట్టింది.

        వచ్చింది ఊరికే ఉండి పోలేదు. కొడుకును చెడా మడా తిట్టి పోసింది. ' నీకేం పొయ్యే కాలం రా . ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా . సిగ్గూ ఎగ్గూ లేదా? బంగారట్లా పెండ్లాన్ని పక్కన పెట్టుకొని కూలినాలి జనంతో కులకతా ఉండావు. ఆ బేవర్సలు దుడ్ల కోసం అన్నీ ఒదులుకుంటారు. వాళ్లెంట బడి మా పరువు బజార్న కలపతా ఉండావు ' అని మొగాన ఉమ్మేసింది.

        మురగడు తన తప్పును ఒప్పుకోలేదు. సరి కదా! నీలమణి మొగం కూడా చూడ లేదని బొంకాడు.

         నాట్లు రెండు రోజుల్లో పూర్తయినాయి. కొడుకు తప్పు లేదన్న వర్తమానాన్ని మోసుకొని రాజమ్మ మళ్లీ మల్లమ్మ దగ్గరికొచ్చింది.

        నిజం ఒప్పుకున్నా మల్లమ్మ మొగున్ని క్షమించేదేమో ! అసలు నీలమణి మొగం కూడా చూడలేదని బొంకడం మల్లమ్మ మనసును విరిచేసింది. దాని ఎంట్రుకలు ఎగదోసి పైట సర్ది, కౌగలంచుకొని, మురిపెంగా ముద్దు పెట్టుకోవడాన్ని కళ్లారా చూసిన విషయాన్ని మళ్లీ  అత్తకు విన్నవించుకొంది.

       ' ఆ నీతి లేని మనిషికి పెళ్లాం గా ఉండడం కంటే ఏ బాయో కుంటో చూసుకోవడం మంచిదని మల్లమ్మ రానని చెప్పింది. ఆ సమయంలోనే మల్లమ్మను వెంట బెట్టుకొని వాళ్లు మా అమ్మ దగ్గరికి రావడం .

        మా అమ్మే కాకుండా ఊర్లో పెద్ద మనుషులు కూడా నీతి మాటలు నూరి పోయడంతో మల్లమ్మ మళ్లీ మొగినిల్లు చేరింది.

        మూడు దినాల తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి పాళెమోళ్ల  బాయిలో దూకేసిన  మల్లమ్మ అందరి కళ్ల లోను కన్నీళ్లు తెప్పించింది. ఆ పాపంలో నాకూ భాగముందని మా అమ్మ తెగ బాధ పడింది.

        మల్లమ్మను చావుకు పురికొల్పిన విషయాలేవో ఎవరికీ తెలియవు.

         కానీ మా ఊరి పెద్ద మనుషులు ఒకటై ఏనుగుంట పల్లెకు వెళ్లి మురగడిపై మల్లమ్మ చావుకు కారణం నువ్వే అంటూ విరుచుకు పడ్డారు .

        'మా పక్కింటి పెరుమాలయ్యతో అది ఉంటే పట్టుకున్నాను. అది నాతప్పా. నేను ఏమీ అనకనే అవమానం తట్టు కోలేక బాయిలో దూకింది'  అని బుకాయించాడు మురగడు.

        నెలకు ముందు పెరుమాలయ్య భార్య చని పోయింది. ఆస్తి పాస్తులు, దిక్కూ దివాణం లేని పెరుమాలయ్య దినకార్యాలు పూర్తి చేసుకొని గుళ్లూ గోపురాలంటూ దేశాలు పట్టి పోయినాడు. అతడు అలాంటి వాడు కాడని అందరికీ తెలుసు కూడా! ఐతే ఏ పుట్టలో ఏ పాముందో అనుకొనే వాళ్లూ లేక పోలేదు. ఇప్పటి కిప్పుడు పెరుమాలయ్య వచ్చి నిజం చెప్పేదుండదు. అందుకని మురగడు భార్య పైనే అభాండం వేసి తప్పించుకో జూసినాడు.

         ' నిన్న తిరుమల లో కనిపించి మా తోనే ఉండి దర్శనం చేయించి ఈ రోజు ఉదయం తిరుపతి లో మమ్మల్ని బస్సు కూడా ఎక్కించాడు పెరుమాలు . నిన్న ఇక్కడ నీ భార్యతో నువ్వు చూడడ మేమిటి ' అని అప్పుడే ఊరు చేరిన ఆ ఊరి మోతుబరి రైతు నారాయణ రెడ్డి విషయం తెలుసుకొని చెప్పడంతో మల్లమ్మ పైన బడిన మచ్చ తొలగి పోయింది. భార్య చనిపొయిందని తెలిసీ కదలిక లేని మురగడిని చూసి  ఖచ్చితంగా మల్లమ్మ చావుకు మురగడే కారణమన్న నిర్ణయాని కొచ్చినారు అందరూ.

        మల్లమ్మ బావిలో దూకిందని తెలియగానే ఇంట్లో వాళ్లు ఏడుస్తూ వెంటనే  అటు పరిగెత్తి వెళ్లి పోయారు.

        అన్ని అక్రమ సంబంధాలతో అబద్ధాలతో తను తప్పు చెయ్యడమే కాక మల్లమ్మ మరణానికి కారణమైన మురగన్ని మునసబు ఆదేశంతో రచ్చ బండ దగ్గరున్న చెట్టుకు కట్టేశారు. పోలీసులు ఊరిలోకి రాకుండానే ఆ ఊరి మునసబు వేసిన శిక్ష అది.

         బుట్టనిండా ఆకులు , ఒక డబ్బా నిండా వక్కలు, సీసా నిండుకు సున్నం తెచ్చి పెట్టారక్కడ. ఊరిజనమంతా అక్కడే ఉన్నారు. నీలమణి ఎటు పొయిందో అయిపు లేదు. అంగడామే అడ్రస్ లేదు. వాడితో అక్రమ సంబంధాలు పెట్టికున్న అడ వాళ్లు మూలకొకరు పరారైనారు .

        ' తాను తప్పు చేసి భార్య పైన అభాండం వేసి ఆమె చావుకు కారణమైన మురగడిని  తప్పులేదని అనుకొనే వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లి పోండి. వాడు తప్పు చెయ్యడం కాక ముత్యం లాంటి మల్లమ్మ పైన నింద మోపాడు అని నమ్మే వాళ్లు వరసగా  వచ్చి తాంబూలం తీసుకొని నమిలి వాడి మొహాన ఉమ్మండి. అదే వాడికి శిక్ష. ' అని ఆజ్ఞ జారీ చేశాడు మునసబు .

        ఏ ఒక్కరూ ఇంటి మొగం పట్టలేదు తాంబూలం కోసం వరసగా బారులు తీరారు. అవమానంతో మురగడు నోరు తెరవకుండా పశ్చాత్తాపంతో  తలదించుకున్నాడు.

        కొడుకు ప్రవర్తనతో రోసి పోయిన రాజమ్మ కొడుకు గురించి ఆలోచించ లేదు. కోడలు  బావిలో దూకిందనగానే పాలెం వాళ్ల బావి వైపు పరుగు బెట్టింది కదా! కొత్త పల్లోని కుటుంబంతో పాటు అక్కడే ఉండిపోయింది ర

Comments