నాకు నచ్చిన కథ
అమ్మకు ఆదివారం లేదా
రంగనాయకమ్మ రాసిన 'అమ్మకు ఆదివారం లేదా' కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో 20-11-1996 లో ప్రచురితం.
ఆడవాళ్లకు ఇంటి పనుల నుంచి ఆదివారం సెలవు ఇవ్వాలనే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని తెలిసి ఒక కుటుంబం లోని ఆడవాళ్లు దాన్ని అమలు చెయ్యడానికి ఎంత పొరాటం చెయ్యాల్సి వచ్చిందో చెప్పే కథ ఇది.
అది అన్నపూర్ణమ్మ ఇల్లు. ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు . పెద్దవాడు ప్రసాద్. రెండవ వాడు వాసు. అరుణ , కమల ఇద్దరు కోడండ్లు . చిన్న వాడు వేణు. కూతురు రేఖ. వీళ్లిద్దరికి ఇంకా పెళ్లిళ్లు కాలేదు.
మసక మసకగా తెల్లవారుతుండగా పక్షుల కిల కిలారావాలు, వాటి విన్యాసాలు, అవి తినడానికి బయట వేసిన అంట్ల గిన్నెల నిండా మెతుకులు, చెట్ల పైన పాకుతున్న పురుగులు. వాటిని చూసి వీటికప్పుడే తెల్లారిందా అని అన్నపూర్ణమ్మ అనుకోవడంతో కథ మొదలవుతుంది. .
ఆమె భర్త అరవయ్యేండ్లన్నా నిండని జగన్నాధం గారు కూడా ఆ పక్షుల్లాగే ఇంకా తెల్లవారకనే లేచి ఏమీ చెయ్యడానికి పని లేదన్నట్లు ఎప్పుడూ దగ్గుతూ ఉంటాడు. దగ్గుతూనే మాట్లాడతాడు. ఆ దగ్గుకో భాష ఉంది. తొలి దగ్గుకు తొలి కాఫీ, మలి దగ్గుకు మలి కాఫీ .
అన్నపూర్ణమ్మ ఇంటి పని తప్ప మరో వ్యాపకం లేని మనిషి. అందరితో మెత్త గానూ, ఉలిక్కి పడుతూ, దీర్ఘాలు తిస్తూ మాట్లాడే తత్వం.
పాతికేళ్లు నిండిన పెద్ద కోడలు పొట్టిగా బొద్దుగా ఉండే అరుణ ఉదయాన్నే నీటుగా తయారై గానీ వంటింటి ఛాయలకు కూడా రాదు. ఆ రోజు ఆదివారం. ఉదయాన్నే తయారయ్యింది. కానీ వంటింట్లోకి వచ్చే ప్రయత్నమేమీ కనిపించ లేదు.
రెండో కోడలు పాతి కేళ్లు నిండని కమల కొంచం పొడవుగా , బక్కగా ఉంటుంది. తోడి కోడలు అరుణ లాగా షోకులు ఇష్టం లేదు. కురులను అలంకరించు కోదు. ఎప్పుడూ వేలు ముడే. ఉద్యోగస్తురాలు. ఆఫీసుకు వెళ్లే ముందు మాత్రమే రెండు పాయలు జడ అల్లు కొంటుంది. ఆఫీసులో కూడా రెండుచేతులు పైకెత్తి జడని కాస్తా వేలు ముడి లోకి తిప్పేస్తుంది. పెళ్లి చూపులప్పుడు కూడా వాసు సిగ్గు సిగ్గుగా చూస్తూ ఉంటే అటూ ఇటూ కదిలి జడని ముడి పెట్టేసింది. అందరూ ఈమెని వేలుముడి కమల అంటారు.
అన్నపూర్ణమ్మ కూతురు రేఖ తల్లి లాగే మెత్తని పిల్ల.
జనార్ధన రావు కాఫీ కోసం దగ్గుతాడు . పాలు వచ్చాయా అని పెద్ద కోడల్ని అడిగి వచ్చాయంటే గేటు దగ్గర సంచిలో ఉన్న పాల ప్యాకెట్లను తెమ్మంటుంది అత్త అన్నపూర్ణ. ఇవ్వాళ ఆడ వాళ్లకు సెలవు అని అరుణ కదలదు. రెండో కోడల్ని పిలుస్తుంది. ఎప్పుడూ లేనిది ఉదయాన్నే తలదువ్వుకొని జడ అల్లుకొని పేపర్ చదువు కుంటూ ఉంది కమల. ఈ రోజు ఆడవాళ్లకు సెలవు అంటుంది.' అత్తయ్యా మీరు కూడా తేవడానికి వీళ్లేదు అని శాసిస్తూ అడ్డు తగులు తుంది పెద్ద కోడలు అరుణ.
రోజూ జనార్ధనం పిట్టలతో పాటే లేస్తాడు. వాటి కిచ కిచలతో శ్రుతి కలిపినట్లు దగ్గుతూ ఉంటాడు
అది చూసి ' మనింట్లో పైసా ఖర్చు లేని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్' అని కామెంట్ చేస్తాడు వాసు. ఆ మాటతో ' పెద్దా చిన్నా లేదా ' అని దండించబోతాడు పెద్ద వాడు ప్రసాద్. 'పెద్దేమిటి చిన్నేమిటి ' అని అడ్డుతగులుతాడు వేణు. కాని చిన్న వాడని వదినలు ఏవైనా పనులు పురమాయిస్తే కాదనకుండా వెంటనే సైకిలు తీసుకొని సిద్ధమై పోతుంటాడు వేణు.
కానీ ఆ రోజు వేణుని కూడా ఏ వదినా లేప లేదు. భర్త కాఫీ కోసం దగ్గుతున్నాడని అత్తకు తెలుసు. మీరూ తేకండి పాలు, వెళ్లి కొడుకుల్ని లేపండి అని కోడండ్ల హుకూం. అయ్యో! కాఫీ ఇవ్వలేక పోయానే అని అత్త గారి ఆరాటం. ఇంకా పడుకోనున్న వేణుతో 'నువ్వు లేవొద్దు మీ అన్నల్ని లేపు 'అంటారు వదినలు
ఈ లోపల కూతురు రేఖ లేచొచ్చి మెట్ల మీద కూర్చొని విషయం తెలిసి 'రాత్రి ఏదో సరదాగా అనుకున్నాం కదా' అంటుంది. సరదా లేదు గిరదా లేదు, నిజంగా గట్టి గానే అనుకున్నాం' అంటారు వదినలు . ప్రసాద్, వాసులు లేచి వచ్చి 'కాఫీ అయిందా ' అని అడుగుతారు. ఈ రోజు ఆడవాళ్లకు సెలవని కాఫీ మీరే చేసి మాకూ ఇవ్వండని అంటారు ఇంటి కోడండ్లు
ఈ లోపల ప్రసాద్ కొడుకు దొడ్డికొస్తుందంటూ వస్తాడు. అరుణ భర్తను తీసుకు పొమ్మంటుంది. రేఖ తీసుకు పోవడానికి లేస్తే వారిస్తుంది. విధి లేక తీసుకు పోయిన ప్రసాద్ కోపంతో వాడి తొడ మీద గిచ్చడం , వాడు ఏడుస్తూ నాన్న దగ్గరికి ఇంకెప్పుడూ పోను అనడం ఆదివారం నిన్ను నాన్నే సాకాలి అని అరుణ అనడం చూసి ప్రసాద్ ససేమిరా అంటాడు.
ఎట్టకేలకు వేణు కాఫీలు తెచ్చి అందరికీ ఇస్తాడు. టిఫిన్ తయారు చెయ్యమని భర్తల్ని తొందర పెడతారు వీళ్లు . హోటల్ నుంచి తెప్పిస్తా మంటే ఒప్పుకోరు. భోజనానికి అందరూ హోటల్ కు పొదామంటే లెక్కలేసి ఆటోలతో సహా వెయ్యి రూపాయలవుతుందని తెలిసి కొంప కొల్లేరవుతుందని నెత్తి బాదుకొంటుంది అన్న పూర్ణమ్మ.
ఇంతలో పంచ కట్టు, చొక్కా, పై పంచె, వేళ్లకు ఉంగరాలు, బుగ్గన వక్క పొడితో ' ఏమయ్యారు? ఒక్కరూ పలకరే' అంటూ పెళ్లిళ్లకు, విందులకు వంటలు చేసే నలభై ఏండ్ల వయసున్న హనుమంత రావు వస్తాడు.
' రా మామయ్యా' అంటూ ఆహ్వానిస్తాడు ప్రసాద్.
' మంచి రసకందాయం లో వచ్చావే' అన్న అన్నపూర్ణమ్మ మాటకు ' ఏం? ఇంట్లో పాయసం గానీ చేస్తున్నారా? ' అని సంతోషిస్తాడు హనుమంతు.
' ఎవరూ చేసేది? ఆడవాళ్లు పనులు కట్టి పెట్టి కూచున్నారు. మగ వాళ్లు అంత కన్నా మేం చెయ్యం అంటున్నారు ' అని దీర్ఘం తీస్తుంది అన్నపూర్ణమ్మ.
'సరిపోయింది మా ఇంట్లోను ఇదే కథ నడుస్తోంది. మొదట అల్పాహారం చేసి ఆ తర్వాత పూర్ణాహారం చేసి ఆ తర్వాత ఆవిడ చీరలు ఉతకాలట . వాదించి వాదించి ఇప్పుడే వస్తానుండు అని ఇలా తప్పించు కొచ్చా '
అంటాడు హనుమంతు.
వంట చెయ్యడం వచ్చిన హనుమంతరావు కూడా ఒక్క రోజు ఇంట్లో వంట చెయ్యడానికి ఇష్ట పడడు. ఇంట్లో వంటా వార్పూ ఆడ వాళ్లు చెయ్యాల్సిందే
అంటాడు .
ఆడ పిల్లలు అమ్మల కడుపుల్లోంచి వంట పాత్రలతో పుట్టు కొచ్చారా ? అని కొప్పడతారు కోడండ్లిద్దరు. భారతీయ సంస్కృతి ప్రకారం ఆడవాళ్లే వంట చెయ్యాలని మగవాళ్లు. ఆ భారత దేశమే ఇప్పుడు చట్టం తెచ్చిందని ఆడవాళ్లు . వాదనలోకి దిగుతారు . ఆ మాటకు హనుమంతు 'ప్రభుత్వం ఇవ్వాలో మాటంటుంది, రేపో మాటంటుంది అదీ ఎన్నాళ్లో చూద్దాం ' అంటాడు ఉక్రోషంతో. చివరికి మొగాళ్ల మొహాన ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని వాదనను కట్టి పెడతారు.
వేణూనే ఉప్మా కూడా చేసి అందరికిఅందిస్తాడు , హనుమంతుకు తప్ప. నీకు వంట వచ్చీ అత్తయ్యకు చేసి పెట్టక ఇలా తప్పించుకు వచ్చినందుకు నీకు పెట్టనంటాడు నిర్మొహమాటంగా . 'రేపు నీ పెళ్లానికి కూడా అన్ని పూటలూ నువ్వే చేసి పెట్టు పెళ్లాన్ని కూచో బెట్టి' అంటాడు వెటకారంగా హనుమంతు. ఇద్దరూ చేసుకోవాలి అంటాడు వేణు. ఆ మాటకు వదినలిద్దరూ ఎగతాళిగా నవ్వి ' ఒక్క రోజు చెయ్య మన్నందుకే మన్నూ మిన్నూ ఏకం చేస్తున్నారు రోజూ చెయ్య మంటే అయినట్లే' అని మరిది మాట్లల్ని ఎగర గొడతారు .
మామయ్య సాయంతో వంట చేసి మనం పక్కన పెట్టుకొని వాళ్లకు ఉప్పెక్కువేసి పారేద్దామా అంటాడు వాసు. చివరికి అది కుదిరేది కాదని తీర్మానిస్తారు.
మీరిక్కడున్నారా అంటూ వస్తుంది హనుమంతు భార్య శకుంతల. పొరుగింటావిడ కావేరి భర్త రాత్రి షిఫ్టుకు వెళ్లి సోమవారం పొద్దున్న దాకా రానని కబురు పెట్టాడట అని వాపోతుంది శకుంతల .
ప్రసాద్ తను 8 గంటలు రోజూ డూటీ చేస్తున్నానని నువ్వు ఇంట్లో రోజుకు అరు గంటలు మాత్రమే పనిచేస్తావు కాబట్టి ఆది వారం కూడా నువ్వే పని చేయాలి అని అరుణతో వాదనకు దిగుతాడు. అంతటితో ఊరుకో లేదు. ఉన్న పళంగా బయటికి వెళ్లి 'నన్ను డాక్టర్ ఈ రోజంతా రెస్ట్ తీసుకోమని చెప్పార'ని సర్టిఫికేట్ తెచ్చు కుంటాడు.
ప్రేమ ఏమాత్రం లేని భర్త దగ్గర ఉండనని కమల ఇంటినుంచి వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది.
'నాకు ఉద్యోగం లేదు ఏదైనా పని దొరికే దాకా నీ దగ్గరే ఉంటాన'ని అరుణ కూడా బట్టలు సర్దుకుంటుంది.
' ఎన్నాళ్లు కాపురం చేసినా మగవాళ్లకు గుడ్డి గవ్వంత అభిమానం కూడా ఉండదు . నేనూ మీతో వచ్చేస్తా' నంటుంది శకుంతల , నేనూ మీతో వచ్చేస్తానని రేఖ కూడా తయారవుతుంది. నేనూ మీ తోటే అని వేణు అంటాడు. అమ్మా నాన్నల్ని కూడా తీసు కెళ్లి పోదామని అందరూ మాట్లాడు కుంటారు.దాంతో కొంత కదలిక వస్తుంది మగ వాళ్లలో
వాళ్లు వెళ్లి పోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించిన జగన్నాధం కొడుకుల్ని పిల్చి సర్ది చెప్పుతాడు. మామయ్య దగ్గర వంట వచ్చే దాకా నేర్చుకొని వచ్చే వారం పులిహోర గారెలు వండి పెట్ట మంటాడు. దగ్గు తగ్గాక నేను మూలల్లో పేరుకున్న బూజులు , చీడ పట్టిన మొక్కలను బాగు చేస్తానంటాడు. హనుమంతుని పిలిచి ' ఆడ పిల్లలు ముద్దుగా అడిగితే వంట చేసి పెట్ట లేరా' అని దండిస్తాడు. వాళ్లు వంట చేస్తారు మీ బ్యాగుల్లో సర్దుకున్న బట్టల్ని కబ్బోర్డ్స్ లో పెట్టేసు కోండి అని కోడండ్లకు చెప్తాడు. వాళ్లు ఆ మాటతో ఎగిరి గంతేస్తారు
రేఖ కోసం పెళ్లిళ్ల పేరయ్య వస్తాడు. 'నేను సంపాదించే దాకా ఇంకో ఆలోచన చెయ్యను. ఆడ మగ తేడా లేకుండా సమానంగా చూసే మనిషి దొరికే దాకా పెళ్లి ప్రసక్తి తీసుకు రాకండి ' అని ఖచ్చితంగా చెప్పేస్తుంది రేఖ. పేరయ్యను పంపించి ఇంట్లోకి వస్తూ ' హనుమంతూ ఇప్పుడు ఇంటికేం వెళ్తారు. సాయంకాలం వెళ్దురులే ' అంటుంది అన్నపూర్ణమ్మ.
ప్రసాద్ సంతోషంగా' మామయ్యా పద వంట మొదలు పెడదాం ' అంటాడు.
పని మనిషి లక్ష్మికి కూడా ప్రతి ఆది వారం సెలవు ప్రకటించి అంట్లు కడగతానన్నా వద్దని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మంటారు కోడండ్లు .
అరుణ బొడ్లో చెంగు దోపేసు కుంటూ అందరికీ ఆర్డర్లు జారీ చేస్తుంది.
రేఖను అంట్లు తోమెయ్య మంది. వాసును వంటింట్లోకి వెళ్లి సాయంకాలం గారెల కోసం పప్పు నాన బెట్టి కొబ్బరి పచ్చడి చెయ్య మంటుంది. అత్తను మామయ్యకు, చిన్ని గాడికి స్నానం చేయించ మంటుంది. కమలను గదులు ఊడ్వమని చెప్పి చిన్నిగాడికి కూడా నీతో పాటు చిన్న చీపురిచ్చి నేర్పించ మంటుంది. నేను బట్టలుతికేస్తా నంటూ అంత వరకు కాఫీ టిఫిన్లు చేసి అందించిన మరిదితో 'వేణూ నువ్వు స్నానం చేసేసి ఏదయినా బుక్ చదువుకో పో'అంటుంది.
చిన్ని గాడితో 'పిన్ని దగ్గర ఊడ్వడం నేర్చుకో , ఈ లోపల నాన్నా తాతయ్య వంట వండేస్తారు అప్పుడు తిందువు గానీ ఇక మీదట నాన్నా నేనూ కలిసి నిన్ను సాకుతాం సరేనా ? చీపురు తెచ్చుకో పో ' అంటుంది.
ఆడ వాళ్లు వంట పని తప్ప మిగిలిన పనుల్లోకి దిగడం చూసి చిన్నిగాడు ముందుగా నానమ్మ దగ్గరికి పరిగెత్తి ' నానమ్మా! అమ్మకు ఆదివారం ఉందంటా, లేదంటా ' అనడంతో కథ ముగుస్తుంది.
ఇంట్లో ఆడవాళ్లకు సవాలక్ష పనులుంటాయి. మగ వాళ్లకు అన్ని అమర్చి చేతి కందివ్వాలి. ఇంట్లో పెద్ద వాళ్లను చూసుకోవాలి. అడిగినప్పుడంతా కాఫీలు అందించాలి . ఇంటికి బధువులొస్తే వాళ్లకూ అన్నీ చేసి పెట్టి సంతోష పెట్టాలి. పిల్లల పనులన్నీ చూడాలి . వాళ్లకు నలతగా ఉంటే రాత్రంతా మేలు కోవాలి. క్యారీర్లు కట్టి వాళ్లకు కావాల్సిన వన్ని అందించి బడికి పిల్లల్ని, ఆఫీసులకు మగవాళ్లను పంపించాలి.చివరికి భర్తకు బూట్ పాలిష్ కూడా భార్యే చెయ్యాలి. అన్ని పనులు చేసే అమ్మలకు ఒక్క రోజంటే ఒక్క రోజు సెలవిచ్చి వాళ్ల కోరిక తీర్చడానికి మగ మహారాజులకు మనసు రాదు. ఎంత భీష్మించుకు కూర్చున్నా ససేమిరా వంట పని ఇంటి పని చెయ్యడానికి ఒప్పుకోరు. ఉద్యోగం చేసే స్త్రీ అయినా , ఒంట్లో నలతగా ఉన్నా ఈ పనులన్నీ చచ్చినట్లు ప్రతి రోజూ చేసి తీరాల్సిందే . ఈ అన్యాయాన్ని గమనించి కనీసం ఒక్క రోజన్నా వాళ్లను సుఖ పెట్టాలని ప్రభుత్వం చట్టం తెస్తే దాన్ని అమలు చెయ్యడానికి ఘోరంగా అడ్డు తగులు తారు. ఉక్రోషంతో ఈ ప్రభుత్వానికి ఓటెయ్య కూడదు అని గుస గుస లాడు కుంటారు. చట్టాలన్నీ అమలవుతున్నాయా అలాగే ఇదీను అని ఎదురు మాట్లాడుతారు. ఒకాయన ఇంటి నుంచి తప్పించుకొని వస్తే, ఇంకొకతను ఆదివారం ఇంటికే రాడు. ఇంకొందరు హోటల్లో తెచ్చి పెట్టే ఆలోచన చేస్తారు కానీ వంట చేసే ప్రయత్న మన్నా చెయ్యరు. మీరే వంట చేసెయ్యండి సాయంకాలం సినిమాకు పోదాం అని ఆడవాళ్లకు ఆశ చూపుతారు.
మగ వాళ్లు ఇంటి పనులు చెయ్యడం నామోషీ అనుకుంటారు. అహంకారంతో ఆడవాళ్లను బానిసలుగా చూస్తారు , ఏ ఒక్క పనిలోనూ సాయం చెయ్యక పోవడం అటుంచి అది మీ బాధ్యత అని నొక్కి చెప్తారు. ఇది ఇంటింటి భాగోతమే. అన్నపూర్ణమ్మ కొడుకులు కూడా వాదోప వాదాలతో పబ్బం గడుపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తారు కానీ పనులు పంచుకోవడానికి సిద్ధ పడరు.ఒక రోజు చేస్తే ఏమవుతుందిలే అనుకోరు. చివరికి ఆడవాళ్లు ఇల్లొదిలి పెట్టి వెళ్లి పోతాం అంటే అప్పుడు విధి లేని పరిస్థితుల్లో వంట చెయ్యడానికి ఒప్పుకుంటారు. అప్పుడు కూడా మిగిలిన పనులన్నీ ఆడవాళ్లకే వదిలి పెడతారు.
ఆడ వాళ్లను మీ హక్కుల్ని మీరు కాపాడు కోవాలి అని చెప్తుందీ కథ . ఆడ మగ తేడా లేకుండా అన్నీ సమానంగా పంచు కోవాలనే సందేశాన్ని అందిస్తుంది. అలాంటి భావాలున్న వాని కోసం ఎదురు చూసి పెళ్లి చేసుకొమ్మంటుంది. ఎదిరించో, బెదిరించో అనుకున్నది సాధించు కోవాలని చెప్తుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలతో ఇంటి పని చేయించినట్లే మగ పిల్లలతో కూడా చేయిస్తే సమస్యే ఉండదు. రచయిత్రి సూచించి నట్లు ఆ పని చెయ్య గలిగితే సమానత్వం దాని కదే సిద్ధిస్తుంది. అంటే ఈ సమస్యకు పరిష్కారం ఆడ వాళ్ల చేతిలోనే ఉందని చెప్తుంది ఈ కథ.
ఈ కథలో చెప్పినట్లు పురుషుల్లో మార్పు తీసుకు రావడానికి ప్రతి మహిళా ప్రయత్నించాలి. నేను అలాంటి ప్రయత్నం ఎప్పుడో చేశాను. బాబుతో కూడా పాపతో సమానంగా ఇంటి పనులు చేయించాను. కానీ సంపూర్ణంగా కాదు. పనిలో పాలు పంచుకోవాలని చెప్పడం కోసం మాత్రమే . అంత మాత్రానికే చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు మా బాబు. పని అందు కుంటాడు . చిన్నప్పటి నుండి ఆడా మగా తేడా లేకుండా పిల్లల్ని ఇంటి పనుల్లో భాగ స్వాముల్ని చేస్తే తప్ప కుండా మగ వాళ్లలో మార్పు వచ్చి తీరుతుంది . ఈ కరోన సమయంలో పని మనుషులను రానివ్వనప్పుడు ఇంటి పనిలో మగ వాళ్ల సహకారం కొంత వరకయినా చాలా మందికి ఉందనే అనుకొంటున్నాను .
చివరికి ఆడవాళ్లకు ఆదివారం సెలవు కావాలని ఎంత ప్రయత్నించినా అది పాక్షికంగానే అమలు అయింది.మొత్తం మీద అందరూ కలిసి తలా ఒక పని చెయ్యడానికి సిద్ధ పడడం సంతోషించ దగ్గ విషయం.
ఇంట్లో మగవాళ్లతో హక్కుల కోసం చేసే పోరాటంలో చోటు చేసుకున్న వాదోపవాదాలు , వ్యంగోక్తులు, వెటకారాలు, ప్రణాళికలు, ఎత్తుకు పై ఎత్తులు, ఆలోచనలు, గుసగుసలు, తీర్మానాలు, సర్దుబాటులు అన్నిటినీ ఆస్వాదించాలంటే కథను చదవాల్సిందే. చదివి మీ అభిప్రాయాలను, స్వీయ అనుభవాలను సమూహ సభ్యులతో పంచు కోండి.
మహాసముద్రం దేవకి
4-10-2020
Comments
Post a Comment