కథ :
వాస్తు- వంకాయ
' వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే - కరెడ్ల కామక్క వంకాయల భారం తూగిందంట. అరువూ తెరువూ ఉండే మాట్లాడుతున్నావా? వాళ్లది ఇద్దరి సంపాదన. దానికి తోడు ఊర్లో అంతో ఇంతో పొలం పుట్రా ఉన్నోళ్లు . మనమెక్కడి నుంచి తెస్తాం '
ప్లాటు కొనమని అడిగి, కొనలేదని అలిగి అన్నం తినకుండా పండుకున్న పెళ్లాం నీరజని కాస్త గట్టిగానే మందలించాడు మహేష్ .
నీరజ వాళ్లు రాధిక వాళ్లు ఇరుగు పొరుగున ఉంటారు' ఇందమ్మా పులగూర అంటే ఇందమ్మా తీగూర 'అని ఏది చేసినా ఇచ్చిపుచ్చుకునేంత స్నేహం వాళ్లది
రాధిక ఉద్యోగిని . పొద్దున్నే టిఫిను , వంట చేసి, పిల్లలిద్దరికి క్యారీర్లు కట్టిచ్చి, తనూ బాక్స్ పెట్టుకొని ఉదయం తొమ్మిదింటికి ఆఫీసుకు పోతే మళ్లీ ఇంటికొచ్చే పాటికి ఐదున్నరవుతుంది. అదీ ఈ మధ్య టూవీలర్ కొనుక్కుంది. లేకుంటే ఆరు దాటేది.
రాధిక భర్త , నీరజ భర్త లిద్దరూ కాలేజీలో లెక్చరర్లు . మగ మహారాజులు. కాలేజీ వదిలాక తిన్నగా ఇంటికి రారు . వచ్చినా షటిల్ బ్యాట్లు పట్టుకొని స్టేడియం దగ్గర కాసేపు ఆడుకొని , కాసేపు కబుర్లు చెప్పుకొని ఏ ఏడింటికో వస్తారింటికి .
రాధిక పిల్లలు అయిదింటికి ఇంటికి వచ్చి నప్పుడు నీరజ దగ్గర తాళాలు తీసుకొని వాళ్లింటి కెళతారు.
రాధికకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ . ఇంట్లో ఎంత పనున్నా ఉన్న టైంలోనే ఓ అరగంట దగ్గర్లో ఉన్న పార్కు కెళ్లి నాలుగు రవుండ్లు తిరిగి వస్తే గానీ తృప్తి ఉండదు.
నీరజకు ఇంట్లో పని తప్ప వేరే పని లేకున్నా అలాంటి వాటి విషయంలో ఓపిక తక్కువ. అదీ కాక ఇంట్లో అత్తా మామ, కాలేజీలో చదివే ఆడ బిడ్డ, స్కూలు కెళ్లే ఇద్దరు కొడుకులు - ఇందరి ఆలనా పాలనా చూసుకోవాలి . ఇంకా మరిది రమేష్ తిరుపతిలో హాస్టల్ లో ఉండి చదువు కొంటున్నాడు.
రాధిక బలవంతం మీద నీరజ కూడా వాకింగ్ వెళ్లడం అలవాటు చేసుకుంది. వాకింగ్ చేసే అర గంట సేపు వాళ్లిద్దరూ ఇండ్లకు సంబంధించిన విషయాలన్నిటినీ మనసు విప్పి ఒకరికొకరు పంచు కుంటారు.
వాకింగ్ చేస్తూ మాట్లాడరాదని కొందరంటారు కాని మాట నోటికి వ్యాయామమని రాధిక నమ్మకం.
అలా వాళ్ల కబుర్ల మధ్యలో వాళ్లు స్థలం కొంటున్న విషయాన్ని నీరజకు చెప్పింది రాధిక . 'మీరూ కొనుక్కోరాదా 'అనింది.
దాని పర్యవసానమే నీరజ అలక పానుపు . పాపం అలిగే ముందు కూడా అన్ని పనులూ పూర్తి చేసి కానీ అలక పానుపు ఎక్క లేదు నీరజ .
రెండు దినాలుగా శత విధాలుగా భర్తను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చివరి ప్రయత్నం .
నీరజ కోరికలో న్యాయముంది. స్థలం కొందామనడం అత్యాశ కాదు. గొర్రె తోక బెత్తెడని ఒక్కడి సంపాదన కారణంగా సంసారంలో ఎదుగూ బొదుగూ లేదు.
లోన్ తీసుకొని చిన్న స్థలం కొనుక్కొని ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొంటే ఇప్పుడు ఇంటికి కడ్తున్న రెంట్ తో కంతుల వారీగా లోన్ తీర్చెయ్యొచ్చు కదా ! అన్నది నీరజ వాదన .
ఎదుగూ బొదుగూ లేని సంసారంలో ఏటా ఏడు చేటలప్పని ఇప్పటికే పర్సనల్ లోన్ తీసుకొని బైక్ కొన్నాడు. అది ఇంకా తీర లేదు. మళ్లీ లోన్ రావడం కష్టం అని మహేష్ అభిప్రాయం . వచ్చినా నెల నెలా జీతంలో పట్టిస్తే గడవడం కష్టమని చెప్పి చూశాడు.
నాలుగేండ్లకు ముందు మూడు లక్షలు ఎరియర్స్ వచ్చింది. నీరజకు అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. కానీ రమేష్ చదువుకు డబ్బు అవసరం ఉన్నందు వల్ల తన ఆలోచనను అదుపులో పెట్టు కుంది. ఈ సంవత్సరం రమేష్ చదువు పూర్తవుతుంది. అదొక ధైర్యం. అదే చెప్పింది భర్తతో .
అప్పుడు వేలల్లో ఉన్న స్థలాలు ఇప్పుడు లక్షల్లోకి మారాయి. ఇప్పుడైనా కళ్లు తెరవక పోతే సొంత ఇంటి ఆశ ఊహల్లోనే తెల్లారిపోతుందని నీరజ భయం.
' చూద్దాం' అని భర్త మహేష్ చెప్పిన మాటతో అలక పానుపు దిగిన నీరజ మర్నాడే రాధిక తెచ్చి ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన ప్లానును మహేష్ చేతిలో పెట్టి అతడు చూస్తుండగా వివరించడం మొదలు పెట్టింది.
నాలుగెకరాల్లో నాలుగు రకాలుగా వెయ్య బడిన ప్లాట్లు అవి. ముందు వరసలో తూర్పు దిశగా ఉన్న ప్లాట్లు అన్ని అయిపోయాయట. అవన్నీ అయిదు సెంట్ల ప్లాట్లు . ఖరీదు కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువ . తూర్పు ఉత్తరం రోడ్డున్న ప్లాట్లు పది సెంట్లకు అంటే రెండు ప్లాట్లకు రాధికా వాళ్లు రెండు లక్షలు అడ్వాన్సు ఇచ్చారట . ముప్ఫై అడుగుల రోడ్డుకున్న తూర్పు దిశ ప్లాట్లు కూడా అయిపోయాయని చెప్పారు.
ఒక పుణ్యదినాన భార్యా భర్తలిద్దరూ కలిసి ప్లాట్లు చూడ్డానికి వెళ్లారు. వాస్తు దృష్టి తో మంచి వనుకున్న వన్నీ బ్లాక్ చేసి పెట్టారు ఓనర్లు. అవి అయిపోయాయని చెప్పారు. కావాలంటే కొనుక్కున్న వాళ్లనడిగి ఇప్పిస్తా మన్నారు. ముందు రేటుకంటే కొంత లాభం వచ్చినా వాళ్లు ఇచ్చేస్తా రన్నారు. ఇదో బ్యుజినెస్ టాక్టిస్ అని వీళ్లకు అర్థమై పోయింది.
చివరి వరసలో వేసిన రెండున్నర సెంట్ల ప్లాట్లలో చివరిది కొంత క్రాస్ ఉంది. క్రాస్ తీసేస్తే రెండుంకాలు సెంట్లకు కూడా కొంత తక్కువగా మిగులుతుంది. క్రాస్ గా ఉన్న స్థలం ఆ ప్లాట్ తీసుకున్న వాళ్లకే ఫ్రీగా వదులుతామనడంతో తక్కువకు వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని తీసుకోవడానికి సిద్ధ పడ్డారు.
స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది.తెలిసిన ఇంజినీరుతో ప్లాన్ గీయించుకొచ్చినాడు మహేష్. రెండు చిన్న చిన్న బెడ్ రూంలు , ఒక హాలు , అగ్నేయంగా వంట గది, కొద్ది పాటి స్థలంలో వరండాలాంటి పోర్టికో.
రెండు బెడ్ రూముల్లో ఒక దానికి అటాచ్డ్ బాత్ రూం, ఒక కామన్ బాత్ రూం.
చూసిన వాళ్లు ' అయ్యో ! అని కొందరు , వాస్తు దోష ముందని కొందరు , ఆగ్నేయం పెరిగరాదని కొందరు, ఈశాన్యం కట్ కారాదని మరి కొందరు - ఇలా రక రకాలుగా నీరజ మనసును భయానికి గురి చేసి గుండెను పిసికి ముద్ద చేసి ఒదిలి పెట్టారు.
భర్త దగ్గర వాపోయిన నీరజను ' వినే వాళ్లుంటే నేనూ చెప్తాను వంద. స్థలం ఎట్లుంటే ఏమి? దానికి చెడు చెయ్యాలని ఎందుకుంటుంది. ? అదేమన్నా ప్రాణముండే మనిషా ? నీ చాదస్తం కాకపోతే! ' అని నీరజ భయానికి హేతువాదాన్ని అడ్డుగా వేశాడు మహేష్.
అప్పు చెయ్యకనే స్థలం సర్దుబాటయింది . ఇల్లు కట్టాలంటే బ్యాంకు లోన్ తప్పలేదు . నీరజకు పట్టరానంత ఆనందం. దాంతో అన్నీ తానే అయ్యి దగ్గరుండి చూసుకుంది.
క్రాస్ గా ఉన్న స్థలాన్ని కూడా వదలకుండా పక్క నించి పోవడానికి ఏర్పాటు చేసుకొని క్రాస్లను వదిలి ఒక చిన్న గదిని , బాత్రూమును ఏర్పాటు చేశారు
చిన్న స్థలమైనా ముచ్చటగా అమరింది ఇల్లు . సిమెంటు పలకలతోనే ఓపన్ కబ్బోర్డ్స్ పెట్టుకున్నారు ప్రస్తుతానికి.
కొత్త ఇంటి కల సాకారం కావడానికి ఆర్థికంగా మహేష్ అప్పులు చేసి ఎన్నో తిప్పలు పడ్డాడు. అంత కంటే ఎక్కువగా దగ్గరుండి పొదుపుగా ఇల్లు తయారుకావడానికి నీరజ చాలా శ్రమ పడింది .
రాధిక వాళ్ల ఇంటి నిర్మాణం ఇంకా పునాది దశలో ఉండగానే నీరజ వాళ్లు నలుగుర్ని పిలుచుకొని గృహప్రవేశం అయిందనిపించి ఇంట్లో కూడా చేరిపోయారు.
ఇంటి పని మొదలైనప్పటి నుంచి ఉదయాన్నే వంట కూడా పూర్తి చేసి అత్త మామలకు చెప్పి ఇంటిదగ్గరికి వెళ్లడం అలవాటు నీరజకు.
క్రాసుల్లో మిగిలి పొయిన కొద్ది పాటి స్థలంతో పాటు ఇంటి పనిలో వేస్టుగా మిగిలి పోయిన పెయింట్ డబ్బాలు , బక్కెట్లు విరిగిన మట్టి కుండలు, కుండీలు , ఎర్ర మట్టితో నింపి వాటిల్లో ఆకు కూరలు , కూరగాయలు పెంచడం మొదలు పెట్టింది నీరజ . కొంత వరకు లాభాలను కలిగించే కాలక్షేపమే అది . కూరగాయలు కొనే పని లేదు. తాజావి, ఆర్గానిక్ వి వీళ్లు తినగా మిగిలినవి తెలిసిన వాళ్లకు కూడా ఇస్తున్నామన్న తృప్తి మిగిలింది . అయినా ఏదో చెయ్యాలన్న ఉబలాటం నీరజను నిలువ నీయ లేదు .
కొబ్బరి మొక్కలు అమ్మకానికి వచ్చి ఉంటే రెండు కొని తూర్పు ఆగ్నేయం లో ఒకటి , ఉత్తరం వైపు మూరెడు స్థలముంటే ఒకటి పాతింది.
చుట్టపు చూపుగా ఇంటికొచ్చిన వాళ్ల పిన్ని 'అదేంటే నీరజా కొబ్బరి మొక్కలెక్కడైనా తూర్పు వైపు నాటుకుంటారా ? ఎత్తు పెరిగే చెట్లాయే! ముందు వాటిని తీసేయ్ ' అని సలహా ఇచ్చింది.
నీరజ తనతో అన్నప్పుడు భర్త ఆ మాటల్ని కొట్టి పారేశాడు. ' వాస్తూ వంకాయ అంటూ నీ బుర్ర పాడు చేసుకోకు. చెప్పే వాడికి వినే వాడు లోకువ . అందరు చెప్పినట్లు ఆడక నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి . ఏం వాస్తు బాగా ఉన్న ఇండ్లలో వాళ్లకు కష్టాలు రావడం లేదా? , ఇంట్లో వాళ్లు చావకుండా గూటం కొట్టుకోనుండారా ? ' కాస్త కఠినంగానే మాట్లాడాడు మహేష్ .
అప్పట్నుంచి ఎవరెన్ని చెప్పినా పట్టించుకోవడం మానేసింది నీరజ .
ఆ ఏడు రమేష్ చదువు పూర్తయింది . క్యాంపస్ సెలెక్షన్స్ లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇంట్లో ఓ వారం రోజులుండి బెంగుళూరు ఉద్యోగంలో చేరి పోయాడు .
ఇంటర్ పూర్తయిన ఆడబిడ్డ మంజులను రమేష్ ఉంటాడని బెంగుళూరులోనే చేర్పించారు. ఆరు నెలలు రమేష్ పీ.జీ లో, మంజుల హాస్టల్లో ఉన్నారు. తిండి నచ్చక ఇల్లు తీసుకొని అన్నా, చెల్లి కలిసి ఉండాలని ప్లాన్ చేశారు కానీ ఆ ప్రతిపాదన అమలు కావడానికి మరో ఆరు నెలలు పట్టింది.
వదిన కమ్మగా వండి పెడితే తినడం అలవాటయిన మంజులకు ఇంట్లో పని భారం కూడా ఎక్కువవడతో అడపా దడపా తల్లి అక్కడే ఉండాల్సి వచ్చింది.
నీరజకు ఎదో చేసి నాలుగు రాళ్లు సంపదించాలన్న కోరిక ఎక్కువ కావడంతో కొత్త ఇంటికి రాగానే టైలరింగ్ నేర్చుకుంది. సెకండ్ హాండ్ మిషన్ కూడా కొనుక్కొంది.
పక్కన ఉన్న సింగిల్ రూమును బ్యూటీ పార్లర్ నడుపుతున్న మోహిని అనే అమ్మాయి, హైస్కూల్లో చదువుతున్న చెల్లెలితో పాటు ఉంటోంది . అద్దె పన్నెండు వందలు .
మోహినితో పాటు బ్యూటీ పార్లర్కు వెళ్లి రెండు నెలలు అసిస్టెంట్ గా ఉంటూ ఆ పనుల్లోను నైపుణ్యాన్ని సంపాదించుకొంది నీరజ.
కొన్నాళ్లకు మోహినికి పెళ్లి కుదరడంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోయింది.
అక్కడికి వచ్చే రమేష్ దగ్గర పిహెచ్. డి చేసే అమ్మాయి 'బ్యూటీ పార్లర్ నడపరాదా ?' అని వేసిన ప్రశ్నతో నీరజలో కలవరం మొదలయింది.
టవున్లో ఫుల్ టైం ఉండడానికి నాకెలా కుదురుతుంది ఉషా ? ' ఎదురు ప్రశ్న వేసింది నీరజ.
' టవున్లో ఎందుకాంటీ , పక్కన మోహిని ఖాళీ చేసిన మీ గదిలోనే పెట్టు కోండి' అని అందా అమ్మాయి . ఇంత దూరం ఎవరొస్తారని నీరజ అనుమానం .
ఉష సలహాతో కాస్త రేట్లు తగ్గించి పాంప్లెట్స్ ప్రింట్ చేసి లేడీస్ హాస్టల్ నోటీస్ బోర్డు లో పెట్టించింది.
నీరజ కిప్పుడు చేతినిండా పని , పర్స్ నిండా డబ్బులు, మనసు నిండా తృప్తి .
రెండేళ్లకు అప్పులన్నీ తీరిపోయాయి . నాలుగేండ్లకు ఘనంగా మంజుల పెండ్లి జరిగింది . రమేష్ కూడా ప్రేమ వివాహం చేసుకొన్నాడు . పిల్లలు చక్కగా చదువుకొంటున్నారు .
తూర్పు వాకిలి పెట్టుకొని పెద్ద బంగ్లా కట్టుకొని అనుకోకుండా జరిగిన కారు యాక్సిడెంటులో భర్తను పోగొట్టుకొని ఒంటరిగా అగచాట్లు పడుతున్న రాధికను చూస్తే మాత్రం నీరజ మనసు కకావికలమై పోతుంది. అలాంటప్పుడు మహేష్ తనతో అన్న మాటలు నీరజకు తప్ప కుండా గుర్తొస్తాయి
ఈ ప్లాట్ కొన్నప్పుడు వాస్తు సరిగా లేదని వారించిన వాళ్లలో రాధిక మొదటి వ్యక్తి కావడం రాధికను చూసినప్పుడల్లా నీరజకు గుర్తు వస్తూనే ఉంది.
'వాస్తు దోష వాస్తవాలు ' అనే పుస్తకం రాసిన మీ అన్న కాని అన్న అద్దింటి ఆంజనేయులు సొంత ఇల్లు కట్టుకుంటే కూలిపోయిందట చూడు' అని న్యూస్ పేపర్ను చేతిలో పెట్టిన మహేషును అయోమయంగా చూస్తూ పేపరందుకొంది
అగ్నేయం లో వంట ఇంటిని, నైరుతిలో బెడ్ రూం ఉండాలని చెప్పి ప్లాన్ గీయించు కున్న నీరజకు అప్పట్లో ఆ పుస్తకమే ఆధారం .
ఆ నమ్మకాలు నీరజ మస్తకంలో నుంచి వెళ్లి పోయి చాలా రోజులైంది.
అయినా ఆమెను ఆట పట్టిస్తూ పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చేసిన భర్త వైపు ఆరాధనగా చూసింది నీరజ.
మహాసముద్రం దేవకి
1-10-2019
Comments
Post a Comment