అత్తే రాసుకున్న రాత

 కథ :


అత్తే రాసుకున్న రాత

పుట్నింటికి బయలు దేరిన నీలావతి అత్త అశీర్వాదం కోసం ఆమె కాళ్లకు మొక్కింది.

కోడలుకు మంచి జరగాలి అనే మనసులేని అత్త ఆదెమ్మ సుబం పలకరా సుబ్బన్నా అంటే పెండ్లి కూతురు ముండేడ అన్న్యట్లు ‘ఇదో ఇప్పుడే సెప్తా ఉండా, ఈ సారి కూడా ఆండ బిడ్డి నెత్తుకోని వొచ్చినావనుకో ఇంటి లోపలికి కూడా రానీయను.ముత్తిం మాదిరిగా ఉండే మొగ బిడ్ని తెస్తివా సరే ! లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా?' నిర్మొహమాటంగా అనేసింది.

అత్త మాటలకు బిత్తర పోయిన నీలావతి అత్త పక్క అయోమయంగా సూసింది.

'ఏమట్ల సూస్తావ్. సెప్పింది  అర్థం  కాలేదా ? యా ఇంటికో బోయే ఆండ బిడ్డి మాకక్కర్ల్యా . ఈ ఇంటి పేరు జెప్పే నా మనవన్ని  తెచ్చి నా సేతిలో బెట్టాల'

అక్కని తీస్క పోవడాని కొచ్చిన నీలావతి తమ్ముడు సుధీర్ తేడాగా ఉన్న అత్త మాటల్ని నిజమనుకో లేదు.

'ఏం జోకులేస్తావత్తమ్మా. ఆడ పిల్ల బుడ్తాదా, మొగ పిలగాడు పుడ్తాడా అనేది మన సేతుల్లోనే ఉంటుందని ఇన్నాళ్లు నాకు తెలవనే తెలవదే' అని అత్త నీలా వతినే అనుకరిస్తూ అన్నాడు. నీలావతి పక్క తిరిగి ! అక్కో , నీకాడ బిడ్లు ఇస్టమని నాకు తెల్సు గానీ మనవడు కావాలని అత్తమ్మ అంతగా అడగతా ఉంది కదా ! ఈ సారి అత్తమ్మ కోసం మొగ పిల్లోన్నే కందువు గానీ ఆ మంత్ర మేదో ఇప్పుడే అత్తమ్మ నడిగి తెల్సుకో ! లేకుంటే తిప్పలు పడతావు జాగ్రత్త! ' అన్నాడు .

మూతి మొట మొట లాడించు కుంటా సుధీర్ పక్క గుర్రుగాచూసింది అత్త ఆదెమ్మ .

నీలావతి ఖర్మ కాలిందో, మంచికే జరిగిందో బొమ్మ లాంటి ఆడ బిడ్డ పుట్టింది. ఆ రంగు, వెడల్పాటి కళ్లు ఒత్తయిన నల్లని జుట్టు, చిన్నగా కొసదేలి ఉన్న ముక్కు చూసి నీలావతి పుట్నింటి వాళ్లు మురిసి పోతూ అత్తింటి వాళ్లకు వర్తమానం పంపించారు.

నీలావతి మొగుడు రఘురాం ఆగ మేఘాల మీద ఆస్పత్రికి చేరుకున్నాడు.

అంపకం పెడుతూ అత్త చెప్పిన మాటలు గుర్తొచ్చి మొగుడు ఏమంటాడో అని ఎదురు చూస్తున్న నీలావతి అతని ప్రసన్న వదనం చూసి ఊపిరి పీల్చుకుంది.

బావ వచ్చాడని తెలిసి బావ మరిది ఇంటి నుంచి టిఫిన్ పట్టుకొని ఉరుకుల పరుగుల మీద వచ్చాడు. ఇద్దరున్నారు కదా అని తల్లి స్నానం  చేసి ఒకే సారి భోజనం తీసుకొస్తా అని ఇంటికి వెళ్లింది.

' నేనుంటానుగా నీ పనేమైనా ఉంటే చూసుకో ' అని బావమరిదిని కూడా వెళ్ల మన్నాడు రఘురాం .

ఆలూ మొగుళ్ల మధ్య నేనెందుకులే అనుకున్న సుధీర్ ఇంటికి వచ్చేశాడు.

రఘురాం పాపనుచూసి మురిసిపోయాడు. సుతారంగా తాకుతూ ' ఎవరి పోలికంటావ్ ? ' అడిగాడు . మళ్లీ తనే సమాధానం చెప్తూ -'నాకైతే మా అమ్మ పోలికనిపిస్తుంది' అన్నాడు.  . ఆ మాట వినిన నీలావతి మొగం మింద నీలి నీడలు కమ్ముకున్నాయ్.

ఉన్నట్టుండి భార్య మొగం పైన దిగులు చూసి
' ఏం మా అమ్మ పోలికతో పుట్టడం నీకు ఇష్టం లేదా ? ' అడిగాడు.

'అది కాదు ' అని తను కాన్పు  కొచ్చిన సమయంలో అత్త హెచ్చరించిన మాటల్ని తూ ఛా తప్ప కుండా చెప్పింది.

అమ్మ పైకి అలా అంటుంది కానీ పుట్టింది ఆడ బిడ్డే అని తెలిసీ వెంటనే గుడికి వెళ్లొచ్చింది తెలుసా ' అన్నాడు .

ఆ మాటలు వినిన నీలావతి కొండెక్కినంత సంబర పడి పోయింది.  తల మీద ఉన్న పెద్ద భారాన్ని దించి పక్కన పెట్టినట్లనిపించింది .

మూడవ రోజు డిశ్చార్జ్  అయి ఇంటికి వచ్చిన నీలావతి మర్నాడు భర్త ఊరికి బయలుదేరి వెళ్తుంటే ఇంకో రెండు రోజు లుండమని బతిమాలింది.

చాలా అర్జెంట్ పనులున్నాయంటున్న అల్లుడితో పదహైదవ రోజున పాపకు నామ కరణం చేస్తామని, మంచి పేరేదైనా ఆలోచించమని ఇంటిల్లి పాదీ రెండు రోజులు ముందే రండని రఘురాం తో చెప్పింది నీలావతి తల్లి సుభద్రమ్మ.

'అలాగే అత్తమ్మా ' అని బయలు దేరాడు రఘురాం .

ఇంటికెల్లంగానే అమ్మ మళ్లీ ఏం రాద్ధాంతం చేస్తుందో అని బస్సులో కూర్చున్నప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు.

నీలావతి దగ్గర తను అబద్ధం చెప్పాడు . ఆడపిల్ల పుట్టిందని తెలియగానే శివమెత్తిన దానిలా ఊగి పోయింది తల్లి . కోడల్ని చూడొద్దని, అదింక ఈ ఇంటికి వచ్చే అవసరం లేదని తెల్చి చెప్పింది.

ఏ బిడ్డయిన మన రక్తం పంచుకు పుట్టే వాళ్లేగా. అది మన చేతుల్లో పనా. మూర్ఖంగా మాట్లాడకమ్మా . నీకూ ఉన్నారుగా ఇద్దరాడ పిల్లలు . అది నీ తప్పంటావా ? ప్రశ్నించాడు కొడుకు .

' అదంతా నాకు తెలియదు. ఆ ఇద్దరి బిడ్డల్ని సాకి సంతరించి పెళ్లిళ్లు చెయ్యడానికి మీ నాయన, నేను పడిన అగ చాట్లు నీకేం తెలుసు. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చ లేక మీ నాయన ఉరేసుకొని ప్రాణాలే తీసుకున్నాడు . చాలు నాయినా. ఈ ఇంట్లోకి ఆడపిల్లను తెచ్చే  ప్రసక్తే
లేదు ' కోపంతో ఊగి పోతూ అంది.

బారసాలకు బయలు దేరుతున్న కొడుకును వద్దని వారించింది. తల్లి మూర్ఖత్వాన్ని పెడచెవిని పెట్టిన రఘురాం కూతుర్ని చూడ్డానికి వెళ్లిపోయాడు. పాపకు ఆశాలత అని పేరు  పెట్టుకున్నాడు .

తల్లిని దారికి తెచ్చుకోవడం ఎలాగో ఎంత ఆలోచించిన తట్ట లేదు రఘురాం కు .

బారసాల నుంచి ఇంట్లో అడుగు పెట్టిన కొడుకును తల్లి పలకరించ లేదు. కన్నెత్తి చూడలేదు. భోజనం కూడా పెట్టలేదు .

రఘురాం ' ఆకలవుతుంది అన్నం పెట్టమ్మా ' అని అడిగాడు .

' ఒకరికిద్దరు కూతుళ్లను కన్నావుగా ఇంకేం వాళ్లొచ్చి  వడ్డిస్తారులే ' అని ఈసడింపుగా అంటూ బుట్ట చంకలో పెట్టు కొని బావి దగ్గరకు కాబోలు వెళ్లి పోయింది.

రఘురాం మనసు గానుగలో  నలిగిన చెరుకు చందమయింది. ఆడ పిల్లలంటే అమ్మ భయ పడ్డానికి కారణ ముండొచ్చు. కాని ఎవరు పుడతారనేది మన చేతుల్లో లేదని తెలిసీ ఇలా ప్రవర్తించడం న్యాయమా? ఎలా ఆమెను దారికి తెచ్చుకోవడం?

పురిటి మంచం పక్క ఉయ్యాల్లో ఉన్న పసికందు మనసులో మెదిలింది. గులాబి మొగ్గలా తళుకులీనుతూ ఈ లోకం తీరు తెలియని చిట్టి పాప. తమ కలల పంట. ఆ పాపను రక్షించు కోవడం తండ్రిగా తన మొదటి కర్తవ్యం .

వెంటనే పెద్ద పిల్ల సూర్యకళ కళ్ల ముందు కొచ్చింది. రెండేళ్ల ఆ పాప ముద్దు మాటలు, ఆటలు గుర్తొచ్చి పాపను చూడక ఎన్నాళ్లయింది. మొన్న బారసాలలో చూశాడు .

నీలావతి తల్లికి పాపను చూసుకొంటూ కానుపు చెయ్యడం కష్టమని పాపను నీలావతి చెల్లి సుపర్ణ తీసుకెళ్లింది. సుపర్ణకు పెళ్లయి సంవత్సరం దాటింది. బెంగులూరు లో ఉంటారు. వాళ్లు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దను కొని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ . సుపర్ణ డిగ్రీ చేసింది. డిస్టన్స్ లో ఎం.ఏ చేస్తొంది. ఇంట్లోనే ఉంటోంది. పాపతో మంచి కాలక్షేపం ఇప్పుడు. 

నీలావతికి తిడుతూ పసి గుడ్డుకు కూడా శాపనార్థాలు పెడుతున్న  తల్లిని చూస్తుంటే కంపరంగా ఉంది రఘురాం కు.

సంస్కారం మరచిన తల్లిని పట్టుకొని వేళాడితే తన సంసారమే ముక్కలు చెక్కలు కావడం ఖాయం. ఇందులో నీలావతి తప్పు ఏముందని? చెయ్యని తప్పుకు అతి దారుణమైన శిక్ష విధించ మంటోది అమ్మ.

ఎంత ఆలోచించినా రఘురాంకు తల్లి ఆలోచనల్లో  అర్థం పర్థం లేదని పించింది. ప్రస్తుతానికి  అమ్మ మాటలను పట్టించుకోక పోవడమే మంచిది అనుకున్నాడు.

తన బిడ్డ బారసాలకు  అక్కా బావలు సుశీల , శ్రీరాంలు వచ్చారు. ఊర్లో దగ్గరి బంధువులున్నా ఎవరినీ పిలవ లేదు.

బారసాలకు తల్లి రానందుకు అత్తింటి వారు నొచ్చుకున్నారు. ఆమెకు బాగలేదంటే నమ్మారు. కానీ నీలావతికి కారణం తెలుసు. భర్త అందరితో కలిసి సరదాగా గడపడం అత్త రాలేదన్న బాధను మరిచేలా చేసింది.

రఘురాం తన పల్లెకు మూడు కిలో మీటర్ల దూరంలో మండల పరిధిలో ఉన్న ఊరిలో అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడు. ఇంటి నుంచే వెళ్తుంటాడు.

తన స్నేహితుని ద్వారా ఒక ఇల్లు చూసి పెట్టమన్న రఘురాం బిడ్డకు మూడో నెల రాగానే ఇంటికే తీసుకొచ్చాడు. అత్త రుస రుసలు చూసి నీలావతి  తల్లి నొచ్చుకునింది . ఉండ బుద్ధి గాక మర్నాడే ప్రయాణమై వెళ్లి పోయింది.

ఆ తర్వాత పెద్ద రచ్చే జరిగింది . ఆ రచ్చ భరించలేని రఘురాం  భార్యా బిడ్డలతో వేరింటి కాపురం పెట్టేశాడు. అప్పుడు కానీ వాళ్లు లేకుండా తను బతకడం ఎంత కష్టమో తెలిసి రాలేదా తల్లికి . తన తప్పు తెలుసుకొని బతిమాలి బామాలీ మళ్లీ కొడుకు పంచన చేరింది . చేరడమే కాదు . మనవరాండ్ర ముద్దు మురిపాలు చూసి వాళ్లను అక్కున చేర్చుకోకుండా ఉండలేక పోయింది. సంవత్సరం గడిచింది.

తడబడే బుడి బుడి అడుగులతో అన్నీ తనే నానమ్మకు అందించాలనే చిన్న మనవరాలిని చూసి మురిసిపోయింది . ఎప్పుడూ నానమ్మ కొంగు బట్టుకొని తిరుగుతూ , ఆమెతో కథలు చెప్పించుకొంటూ , నేనూ చెప్తా నంటూ ఆమె చెప్పిన కథలనే ముద్దు ముద్దుగా అమెకే చెప్తుండేవాళ్లు పిల్లలు .

నీలావతికి పనుల్లో సాయం చేసే అమ్మను చూసి ఆత్త ఆరళ్లు కొన్నాళ్లయితే కోడలి కొలుపులు కొన్నాళ్లని పెద్ద వాళ్లు ఎంత అనుభవంతో చెప్పారు అని అనుకోకుండా ఉండలేక పోయాడురఘురాం. 

మహసముద్రం దేవకి
         





















Comments