రైతన్న పోరాట ఫలితం:

 కథ


రైతన్న పోరాట ఫలితం:

సూర్యుడు పచ్చని పంట పొలాలపై బంగారు వెలుగును విరజిమ్ము తున్నాడు. గాలి చల్లగా, మృదువుగా వీస్తుంటే పైరు పాపలు ఆనందంగా తలలూపు తున్నాయి.

పొట్టకర్రతో ఉన్న వారి పొలం పక్క కూచొని రైతు కూలీలు నలుగురు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు .

వాళ్ళలో  ఉన్న పెద్దాయన తన చేతితో అన్నం కలుపుతూ 'యీ బువ్వ ఎంత రుచిగా ఉందో కదా '  అన్నాడు.

మరొక కుర్రాడు,  'అవునవును ఈ గరుగాకు పప్పు కూడా అదిరింది"  అన్నాడు.

వారి మాటలు దూరంగా నిలబడి వింటున్నది భోజనం తెచ్చినామె
. "ఇవన్నీ మన కష్టానికి ఫలితం. కష్టపడి పనిచేస్తే, ఇలాంటి రుచికరమైన అన్నాన్ని ఎప్పుడూ  తినొచ్చు"  అంది.

'ఒక ఏడు వర్షాలు రాక పంట సరిగా పండ లేదు . నిరుడు పండినా దళారీలు దోచుకు పోయారు . ఈ ఏడు రాము అన్న పుణ్యమా అని మన కష్టార్జితం మనకు దక్కింది . వాళ్ళలో ఒకడన్నాడు.

భోజనం అయిన తరువాత వారు మళ్లీ పనిలోకి దిగారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరగు తున్నాడు. అయినా ఆ ఎర్రటి ఎండలో అలసట తెలియ కుండా పని చేస్తున్నారు వాళ్ళు.

ఆరుగాలం కష్టపడి పని చేసే రైతుకు అనుక్షణం భయమే. ఇప్పుడు తమ కష్ట ఫలితాన్ని తామే దక్కించు కోగలమన్న  ధైర్యం వాళ్ల మొహాల నిండా .అందుకే అంత ఉత్సాహం వాళ్లలో.

పొలం గట్టున  రైతు కూలీలు కూర్చుని భోంచేస్తున్న దృశ్యం చాలా సాధారణమైనదే. కానీ, అందులో ఒక అసాధారణమైన అందం ఉంది. అది కష్టానికి ఫలితం దక్కడం. పంటతో పాటు వాళ్ళ ఆశలు కూడా పండడం.

కొన్నేండ్లుగా అందరి కడుపు నింపే రైతులు పొట్ట చేత పట్టుకుని పొలాల్ని వదిలి నగరాలకు వలస పోతున్నారు.
దాన్ని అరికట్టాలని కంకణం కట్టుకున్నాడు ఒక రైతు బిడ్డ 

భోజనం చేస్తున్న వాళ్ళలో ఉన్న ఆ పెద్దాయన ఆ ఊరికే ఆదర్శం. అతని కొడుకు రాము సాక్షాత్తూ తండ్రి మాటను జవదాటని శ్రీరామచంద్రుడు కావడం అతని అదృష్టం .

సూర్యోదయం కావచ్చింది. గ్రామంలోని పొలాలన్నీ ఒక కొత్త శక్తితో నిండిపోయాయి . పక్షుల కిలకిలా రావాలు , గాలిలో తేలియాడే మట్టి వాసన - ప్రకృతి ఒక కొత్త రోజుకు సిద్ధమవుతోందా అనిపిస్తున్నది .

రాము ఒక యువ రైతు. తన పొలానికి బయలుదేరాడు. అతని చేతిలో ఒక కర్ర, భుజంపై ఒక అరక, ముఖంపై ఒక చిరునవ్వు - కష్టానికి సిద్ధంగా ఉన్న ఒక యోధుడి చిరునవ్వు అది.

చిన్న రైతు కుటుంబానికి చెందిన రాము చిన్నప్పటి నుంచే తన తండ్రితో పాటు పొలంలో పనిచేస్తూ వస్తున్నాడు. అతనికి పొలం పనులంటే ఎంతో ఇష్టం. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం అవి మట్టిపై తలలెత్తుకొని  పైకి వస్తుంటే చూడడం అతనికి  ఆనందం. దాన్ని పెంచి పెద్ద చేసి పంట ఒడుపుకోవడం అతని ధ్యేయం .

చిన్నప్పటి నుండి తండ్రితో పాటు పొలంగట్లపై తిరుగాడుతూ అవసరమయినప్పుడు పని చేస్తూనే కష్ట పడి ఎం. ఏ . దాకా చదువుకున్నాడు . కానీ  ఉద్యోగానికి ఎగబ్రాక లేదు .కొద్ది పాటి పొలం లోనే పని చేసి నలుగురి కడుపు నింపడంలో తృప్తిని వెతుక్కున్నాడు .

రాము ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడతాడు. ఎండకాస్తున్నా , వాన కురుస్తున్నా  చలి వణికిస్తున్నా  ఎప్పుడూ పనికి వెనుకాడదు . అతనికి సంకల్ప బలం ఎక్కువ .శరీరం ఒక యంత్రంలా పనిచేస్తుంది . ఆ చేసే పని వల్లే అతని కండలు రాటు దేలి బలంగా మారాయి.

రాము కష్టానికి ఫలితం కూడా బాగానే వచ్చేది. అతని పొలం ఎప్పుడూ పచ్చగా ఉండేది. పంటలు బాగా పండేవి. అందువల్ల అతని కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేది.

ఒకరోజు, రాము పొలంలో పనిచేస్తున్నప్పుడు తన చిన్న నాటి స్నేహితుడు అతనిని చూడ్డానికి  వచ్చాడు. అతను ఒక డాక్టర్.

డాక్టర్ రామును చూసి , "నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. నీ శరీరం చాలా బలంగా ఉంది. నువ్వు ఎప్పుడూ వ్యాయామం చేస్తుంటావా? అని అడిగాడు.

రాము "నా పొలం పనే నాకు వ్యాయామం"  అన్నాడు నవ్వుతూ.

"అద్భుతం! నీ పొలం పని నీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చిందా?" అని ఆశ్చర్య పోయాడు అతను.

రాము, "అవును. నేను నా పొలంలో ఎంతో కష్టపడతాను. ఆ కష్టం వల్ల నా శరీరం బలంగా మారింది" అని అన్నాడు.

డాక్టర్ రామును అభినందించి, "నీ కథ చాలా బాగుంది. నువ్వు ఒక మంచి ఆదర్శం. అందరూ నీలా కష్టపడితే,  ఆరోగ్యంగా ఉంటారు"  అన్నాడు. అతని కష్టం మరొక మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు సంతోషించాడు రాము .

రైతు కష్టం సాధారణ మైంది కాదు. అది ఒక ఆరోగ్యకరమైన కష్టం.  ఒక శక్తివంతమైన పని అని గుర్తించాడు డాక్టరు కూడా .పంట పండితే రైతు జేబు నిండుతుంది. అందరి ఆకలి తీరుతుంది అనుకున్నాడు కూడా.

చదువు కొని కూడా సేద్యాన్నే నమ్ముకున్న రాము అంతటితో ఆగలేదు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని తీరికున్నప్పుడు పక్క పల్లెల  కెళ్ళి యువకులకు అవగాహన కల్పించసాగాడు .

సమాజానికి రైతు వెన్నెముక అని చిన్నప్పుడు చదువు కున్న మాటను సార్థకం చేస్తూ వెన్నెముకగా మారాడు .
ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా చెప్పిన యీ మాటల్ని అతడు ఎప్పుడూ మరిచి పోలేదు.

'ఎట్టి చెత్తో అట్టి పొగ
ఎట్టి పొగో అట్టి మేఘం
ఎట్టి మేఘమో అట్టి వర్షం
ఎట్టి వర్షమో అట్టి పంట
ఎట్టి పంటో అట్టి తిండి
ఎట్టి తిండో అట్టి ఆరోగ్యం
ఎట్టి ఆరోగ్యమో అట్టి జీవితం '
అన్న మాటలు అతని మనసులో గట్టిగా నాటుకున్నాయి

ప్రకృతి గాలి,నీరు ,ఆహారం అన్నీ  ఇస్తుంది.  ప్రపంచ శాంతికి ప్రకృతి సహకారంతో పాటు మనిషి తోడ్పాటు అవసరమని నమ్మినాడు రాము .

ఆ ప్రకృతిని మనిషే నాశనం చేస్తున్నాడు.  చెట్లను నరికేస్తున్నాడు. నదులను కలుషితం చేస్తున్నాడు. భూమిని బలహీనపరుస్తున్నాడు. ఇలా చేస్తే మనిషి మనుగడ ఏమిటి? అని ప్రశ్నించి యువతలో ఆలోచనను రేకెత్తించే వాడు రాము .

'మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. ప్రకృతిని గౌరవించాలి. దానిని రక్షించాలి' అని ఖచ్చితంగా చెప్పేవాడు.

ప్రభుత్వాలు రైతులకు మద్దతు ఇవ్వాలి. వారికి మంచి ధరలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు అందించాలి అంటూ ఉద్యమాలు కూడా చేశాడు .

ప్రజలు క్రమంగా స్థానిక రైతుల నుండి ఆహారం కొనుగోలు చేసేట్లు చేశాడు. వాళ్ళ ఉత్పత్తులను ప్రోత్సహించేట్లు ఎన్నో చర్యలు తీసుకున్నాడు

ఒకప్పుడు రైతుకు కడుపు నిండా తిండి ఉండేది కాదు ' ఏటి కేతం బెట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకె రుగనన్నా- నేను గంజిలో మెతుకెరు గనన్నా ' అని వాపోయే రైతన్న ఇప్పుడు
తృప్తిగా ఉన్నాడు.

కొరివి కారంతో బతుకు వెళ్ళ బుచ్చే రైతన్నకిప్పుడు కంచం నిండా కూడు, తోడుగా కమ్మటి కూర , ఒంటి నిండా శక్తి, మొహం నిండా ఆనందం, నోటి నిండా కబుర్లు.ఇంత కన్నా రైతన్న ఆశించేది ఏముంది? రైతు సుఖంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లే కదా !

               ఆచార్య మహాసముద్రం దేవకి.












Comments