నాకు నచ్చిన కవిత

 నాకు నచ్చిన కవిత


సిరి వడ్డే వర్థమాన తెలుగు కవయిత్రి, రచయిత్రి. ఆమె  రాసిన' తుషార మాలిక  ' అనే త్రిపాద  కవితా సంకలనం  లోని నాకు నచ్చిన , నా మనసును కదిలించిన , నన్ను నిరంతరం వెంటాడుతున్న ఒక చిన్న కవితను పరిచయం చేస్తున్నాను.

ఆధునిక కవిత్వం ఎన్నో కొత్త ప్రక్రియలకు జీవం పొస్తున్నది . వైవిధ్య భరితమైన కవితా పోకడలెన్నోరూపుదిద్దుకుంటున్నాయి. హైకూలు , నానీలు, రెక్కలు మొదలయిన కవితారీతులకు కాలం కలిసి వస్తున్న రోజులివి . అల్పాక్షరాలతో  అనల్పార్థ రచన కావించుటయె గాదె కవి వివేకంబు ' అన్నాడు పాలకురికి సోమనాథ కవి . పాఠకుని నుంచి తక్కువ సమయాన్ని తీసుకొని ఎక్కువ ఆలోచింప జేసే వాళ్లు ఉత్తమ రచయితలనిపించుకుంటారు అని సంస్కృతాంద్ర ఆంగ్ల సాహిత్యాలు చెబుతున్నాయి . సాహిత్యంలో సమాజం అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తుంది. బాహ్యాంతర్గత సంఘర్షణల  మూల రూపాలను సమర్థవంతంగా ప్రదర్శించేదే కవిత్వం అంటారు . ' కదిలేది కదిలించేది, పెను నిద్దుర వదిలించేదీ ' కవిత్వం .
అది విస్తృతమైన భావాన్ని అందించి ఎక్కువ సేపు ఆలోచనలని రేకెత్తించేదిగా ఉండాలి . గోరంత దీపం కొండంత వెలుగు నిచ్చినట్లుగా.

తెలుగులో చిన్న చిన్న మాటల్లో విశాలమైన భావసంపదను పొందు పరచి , సమాజం లోని లోటు పాట్లను ఎత్తి చూపి , పాఠకునిలో ఆలోచనలను రేకెత్తించే కవిత్వం రాసినవారు ఎందరో ఉన్నారు. వాళ్లలో నాకు బాగా నచ్చిన కవయిత్రి సిరి వడ్డే .

ఆమె ఎన్నో రచనలు  చేశారు . వాటిలో ' తుషార మాలిక ' తెలుగులో మొట్ట మొదటి త్రిపాద కవితా సంపుటి. ద్విపదలో రెండు పాదాలున్నట్లుగా త్రిపదలో మూడు పాదా లుంటాయ్. తుషార మాలికలో 1300 త్రిపదులున్నాయి. ముచ్చటగా మూడే పాదాల్లో చెప్ప దలుచుకున్న విషయాన్ని వాడిగా, వేడిగా పాఠకుని బుర్ర కూడా పదునెక్కే విధంగా చెప్పగల నేర్పు ఆమె సొంతం .

'అమ్మ కూడా పసిపిల్లనే
నన్ను కొట్టి తను ఏడుస్తుందేమిటో
వెక్కి వెక్కి '

ఇలా సృష్టికి మూలమయిన జన్మనిచ్చిన అమ్మతో మొదలు పెట్టి. పుట్టి పెరిగిన పల్లెను , వెన్నెల్లో విహరిస్తూ అనుభవించే తీయని విరహాన్ని ,గడచిన జీవితం లోని జ్ఞాపకాల అలలను - ఇలా ఎన్నో విషయాలను ఈ కవితల్లో అక్షరీకరించారు .

' జ్ఞాపకాలలో మాత్రం సజీవమే
నా బాల్యాన్ని మోసిన ఊరు
ఇప్పుడు శిథిల సాక్ష్యంగా మిగిలిపోయినా '

ఫ్రపంచీకరణ నేపథ్యంలో పల్లెటూళ్లలో వచ్చిన పరిణామాలకు సాక్స్యమీ మాటలు . పల్లెటూళ్లలో పుట్టి పచ్చని పంట చేల మధ్య ఊరి వాళ్ల అత్మీయతల మధ్య పెరిగి విదేశాలకు వలస పోతున్న వైనాన్ని , కుల వృత్తులు అంతరించి పోవడాన్ని , భౌతికంగా ఎవరికి వాళ్లే పరాయి వాళ్లుగా మారి పోవడాన్ని చెప్తుంది పై కవిత. ఇలా ఎంతో విస్తృతమయిన భావాల్ని  చిన్న చిన్న మాటల్లో పొదిగి అందించారామె.

ఇక నాకు నచ్చిన , నేను మెచ్చిన, నన్ను ఎన్నో రోజులు వెంటాడి వేదనను నింపి ఆలోచనల లో భారాన్ని పెంచిన ఒకే ఒక కవితతో ఈ చర్చను ముగిస్తాను

'ఉరితాడును నేస్తూనే ఉంటుంది
మనసులేని కొయ్య మగ్గం
చిరిగిన పంచలతోనో , కాలే కడుపులతోనో '

రెక్కాడితే కాని డొక్కాడని ఒక వృత్తిలోని జీవుల బతుకు  చిత్రాన్ని ఈ నాలుగు మాటలు అందిస్తున్నాయి . జీవన సంఘర్షణలను ,  చేనేత కార్మికుల బతుకులొని వెతలను ఇంత అర్థవంతంగా, సాభిప్రాయ సూచకంగా తెలియచెప్పడం అభినందనీయం.

ఎంతో మందికి అందమైన వస్త్రాలను నేసి వాళ్ల ఆనందానికి కారణ మైన మనిషి నేతన్న. చిరిగిన పంచలతో, ఆకలితో , అప్పుల ఊబిలో కూరుకొని అలమటించి అల్లాడి ఆకులుమేసి అలసి పోతున్నాడు .

అప్పుకూడా పుట్టదని తెలిసి,  అప్పిచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక , భార్యా బిడ్డలను పొషించలేని దీన స్థితిలో నేతన్నలెందరో ఆత్మ హత్యలు చేశుకున్న విషయం మన అందరికీ తెలుసు.  ఇప్పటికీ వాళ్ల పరిస్థితిలో మార్పు లేదు .  కొయ్య మగ్గం ఉరితాడును నేస్తూనే ఉంది.  నేసిన దారపు పురులే తాడుగా మారి ఉరి బిగించిన వైనాన్ని అక్షర మాలికలో అందంగా పేని అందించారు  కవయిత్రి.  చేర వలిసిన వాళ్లకు ఈ కవిత చేరి , కేవలం చేరడం కాదు , వాళ్ల మనసుల్ని తాకి వాళ్లలో కదలిక తీసుకు రావాలని ఆశిస్తూ -
ఉంటాను
మీ
దేవకి


Comments