నాకు నచ్చిన గాయకుడు

 



నాకు నచ్చిన గాయకుడు : ఘంటసాల
పరిచయం

సామాన్యుల నుంచి మాన్యుల దాకా అందరినీ ఆకర్షిస్తున్న వినోద సాధనం సినిమా . రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య సాగే సినిమాలో మూడు నిముషాల్లో ముగిసి పోయేది సినిమా పాట. తెలుగు చలన చిత్ర రంగం లో 1931 లో టాకీ యుగం మొదలయి నప్పటి  నుంచి  లక్షకు పైగా పాటలు పుట్టాయి. కొన్ని పుబ్బలో పుట్టి మఖలో మాయమైతే కొన్ని ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.

సినిమా పాట సమాహార కళ. సాహిత్యం, సంగీతం గానం, నృత్యం, అభినయం, చిత్రీకరణలతో కూడుకున్నది. పాటకి తాళం, లయ, గతి, శ్రుతి, యతి , ప్రాస మొదలయిన నియమాలుండడం వల్ల, నాదాన్ని ఆశ్రయించడం వల్ల శ్రవణ పేయంగా ఉంటాయి.

పాట రాయడం ఒక ఎత్తు. దానికి సంగీతం సమకూర్చడం మరో ఎత్తు. శ్రుతి రంజకంగా పాడడం గాయనీ గాయకుల వంతు. మంచి గాత్రమున్న గాయకుల వల్ల పాటకు ప్రాణం వస్తుంది. అలాంటి మధురమైన కంఠాన్ని వరంగా పొంది పాటకు ప్రాణం పోసిన గాయకుడు ఘంటసాల.

ఘంటసాల గారి గొంతులో తేనెలూరుతుంటాయి. పాటలోని అక్షరాలు, పదాలు , అవి అందించే భావాలు ఆ తేనెలో మునిగి, బాగా నాని తియ్యదనాన్ని  సంతరించుకొని బయటికి వస్తాయి. ఒక విందులో ఘంటసాల పాయసం తాగుతుంటే గొంతులోకి జారుతున్న ఆ పాయసం అనుకున్నదట ' అబ్బా ! ఈ గొంతు ఎంత తియ్యగా ఉంది '  అని. తియ్యదనానికే తీపినిచ్చే తియ్యని కంఠం ఘంటసాలది.

తెలుగు సినీ గాయకుల్లో మొదటి స్థానం ఘంటసాలకే. మధుర గాయకుడుగా పేరు పొందిన ఘంటసాల గొంతు వినబడితే చాలు అమృత వర్షం కురుస్తున్న భావన  కలుగుతుంది. మనసు ఉత్తేజిత మవుతుంది. శరీరం పులకించి పోతుంది. అది ప్రణయ గీత మైనా, విషాద గీత మైనా, భక్తి గీత మైనా, శ్రామిక గీతమైనా, వ్యక్తి ఆరాధన అయినా, పండగ పాటైనా, పెళ్లి పాటైనా, ఆరడి గీతమైనా , పద్యం, స్తుతి,దండకం, హరికథ, అష్టపది, యక్షగానం ఇలా ఏదైనా కావచ్చు బంగారానికి పరిమళమద్దినట్లు సర్వ సుగుణాలనూ సంతరించు కొని బయటికి వచ్చి అందరినీ అలరించడానికి సిద్ధమై పోతుంది.

ఘంటసాల పుట్టింది 1922 డిసెంబరు 4 న కృష్ణా జిల్లా లోని చౌటపల్లిలో. తండ్రి సూరయ్య , తల్లి రత్తమ్మ కూడా సంగీతజ్ఞులు. తండ్రి మృదంగం కూడా వాయించే వాడు. వారి ఆరుగురి సంతానములో మూడవ వాడయిన ఘంటసాలకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర రావు. 11 ఏండ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. అప్పటి ఆచారం ప్రకారం రత్తమ్మకు గుండు గీయించి మూల కూర్చో బెట్టారు. రత్తమ్మ తమ్ముడు ర్యాలి పిచ్చిరామయ్య రత్తమ్మ పెద్ద కూతురు జయప్రదను పెళ్లి చేసుకొని కుటుంబభారాన్ని మోస్తూ వచ్చాడు.

తండ్రి మరణం తర్వాత ఘంటసాల చదువు సరిగా సాగ లేదు.  గురువులకు శుశ్రూషలు  చేస్తూ , వారాలతో పొట్ట నింపుకుంటూ,  సంగీత సాధన చేస్తూ ఆ విద్యను సార్థకం చేసుకోవాలనే పట్టుదలతో  చౌటపల్లికి తిరిగి వచ్చి సంగీత పాఠాలు చెప్పాడు. పండుగల్లో పెళ్లిళ్లలో కచేరీలు చేశాడు. నాటకాలాడాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.

1972 లో రవీంధ్ర భారతిలో సంగీత కచేరీ చేస్తూ గుండె నొప్పి రావడం తో నెల పాటు ఉస్మానియా  జనరల్ ఆస్పత్రిలో ఉన్నాడు. అప్పుడు
'ఇది సంధ్యా సమయం
ఇది చీకటి ముసిరే తరుణం
బాటసారీ తెలుసుకోవోయ్
బాటసారీ మేలుకోవోయ్' అని రాసుకున్నాడు.

మృత్యువంటే భయం లేని వ్యక్తి పాడుకున్న పాట అంటూ --

' బహుదూరపు బాటసారీ
ఇటు రావోయ్ ఒక్కసారి
అర్థరాత్రి పయన మేల నోయి
పెను తుపాను రేగ నున్న దోయి '

అని స్మశానానికి తరలిపోతున్న శవయాత్రను చూసి రాసుకొని పాడుకున్నాడు. ఘంటసాల రచయిత కూడా .

నాటకాల్లో వేషాలు వేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకొంటున్న సమయంలో రత్తమ్మ అన్న వెంకరత్న శాస్త్రి రెండవ కుమార్తె సావిత్రి నిచ్చి 1944 మార్చి ౩ న పెళ్లి జరిపించారు. తన పెళ్లిలో తానే సంగీత కచేరీ చేసి బంధుమిత్రులందరినీ పరవశింప జేశాడు.

ఘంటసాల పెళ్లికి 600 రూపాయలు అప్పు అయింది. చౌటపల్లి నించి చెన్న పట్నం వెళ్లడానికి. రెండు నెలలు నాటకాలాడి 50 రూపాయలు కూడ గట్టుకొని గోరంత ఆశతో కొండంత విశ్వాసంతో చెన్న పట్నం చేరుకున్నాడు.

ప్రముఖ చలన చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్యకు ఘంటసాల వెంకటేశ్వర రావును పరిచయం చేశాడు సముద్రాల. నెలకు 75 రూపాయల జీతంతో సీతారామ జననం సినిమాలోకి తీసుకున్నాడాయన. చిత్తూరు నాగయ్య 'త్యాగయ్య'  సినిమాలో వేషం ఇవ్వడమే గాక బృంద గానాల్లో పాల్గొనే అవకాశం కల్పించాడు. నాగయ్యను పితృసమానంగా,  గురువుగా  భావించే వాడు ఘంటసాల. అడపా దడపా రేడియోలో పాటలు పాడుతూ ' స్వర్గ సీమ'  లో భానుమతితో కలిసి మొదటి సారిగా యుగళ గీతం పాడాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని  పాటలు పాడాడు. సంగీత దర్శకత్వం వహించాడు. కొన్ని చిత్రాలను నిర్మించి తన తమ్ముడు సదాశివుని చిత్ర నిర్మాతగా నిలబెట్టాడు. తి.తి.దే . లో ఆస్థాన విద్వాంసుడయ్యాడు. 1970  లో పద్మశ్రీ బిరుదు పొందాడు. విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశాడు.

ఈ పరిచయం చెయ్యడంలో నా ఉద్ధేశం ఏమంటే విజయ శిఖరాలను అందుకోవడానికి లక్ష్యం ప్రధానం కాని పేదతనం అడ్డుకాదని చెప్పడానికే. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని కాక కష్టాల్లో పుట్టి , కన్నీళ్లతో పెరిగి స్వయశక్తితో పైకి వచ్చిన ఘంటసాల జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
ఘంటసాలకు గాత్రం ఒక వరం. ఆ వరానికి తోడుగా పాటలు పాడడం లో ఎన్నో మెలకువలను పాటించాడు. తనకు తనే సాటి అని ఎవ్వరూ పోటీ లేరని నిరూపించుకున్నాడు. మచ్చుకు కొన్ని పాటల్ని చూద్దాం .

'వెలుగు నీడలు' సినిమా లోని 'పాడవోయి భారతీయుడా ' అనే పాట ఘంటసాల పాడిన దేశభక్తి గీతాల్లో మకుటాయమానంగా నిలిచి పోయింది. 1961 లో రాయబడిన ఆ పాటలోని కులమత బేధాలు, భాషా ద్వేషాలు, అవినీతి, బంధుప్రీతి , చీకటి వ్యాపారం, పదవీ వ్యామోహం ఈ నాడు ఎంత తీవ్రతరం దాల్చాయో అందరికీ తెలిసిందే . రవి గాంచనిచో కవి గాంచునే కదా !అన్నట్లు శ్రీ శ్రీ సమాజ భవిష్యత్తును ఆనాడే చూశాడనిపిస్తుంది. పాట పొడవునా సమాజం లోని దుర్మార్గాన్ని చీల్చి చెండాడిన శ్రీ శ్రీ పాట చివర ప్రగతి శీల దృక్పథంతో

' సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం '

అంటూ కర్తవ్యాన్ని ప్రబోధించాడు. ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే శుభం జరుగుతుందన్నాడు.
శ్రీ శ్రీ ఏ ధ్యేయంతో ఈ పాటను రాశాడో అంతకు మించిన బాధ్యతతో ఘంటసాల తన కంఠం ద్వారా మెరుగులు దిద్ది ఎన్ని సార్లు విన్నా మరీ మరీ వినాలనిపించేత గొప్పగా పాడాడు.

'అల్లూరి సీతారామ రాజు' సినిమా లోని శ్రీ శ్రీ రాసిన ' తెలుగు వీర లేవరా' పాట తెలుగు వారిని రెచ్చ గొట్టి విప్లవ జ్వాలల్ని రగిల్చిన గీతం. ఇందులోని

' ప్రతి మనిషి తొడలు గొట్టి సింహాలై  గర్జించాలి'

అనే చోట మనిషి - ఏకవచనం. సింహాలు  బహువచనం . కానీ ఘంటసాల ఉద్వేగ భరితంగా పాడిన స్వర ఝరిలో ఆ తప్పిదాన్ని ఎవరూ గుర్తించ లేక పోయారు.

ఏ రసావిష్కరణకు సంబంధించిన దయినా కావచ్చు . మాటకన్నా పాట చాలా  శక్తివంత మయింది అని తను పాడిన పాటల ద్వారా నిరూపించిన వాడు ఘంటసాల.

శృంగార రసావిష్కరణకు పునాది ప్రేమ. ఎన్నో రకాల ప్రణయ గీతాలకు తన గానం ద్వారా ప్రాణం పోశాడు ఘంటసాల. ప్రేమ భావాల్లో ప్రధాన్స్మైన విరహ గీతాలను ఆలపించి ఎడంగా ఉన్న ప్రేమికుల మనోభావాలు ఎలా ఉంటాయో చూపించాడు.

' రాణీ రత్నప్రభ ' సినిమాలో ఆరుద్ర అందమైన అలతి అలతి పదాలతో

' నిన్న కనిపించింది - నన్ను మురిపించింది
అందచదాల రాణి- ఆ చిన్నది '

అనే పాట రాశాడు. సాలూరి రాజేశ్వర  రావు సంగీతం సమకూర్చిన ఆ పాటను గాన మర్మ యోగి వాళ్లిద్దరి మనసెరిగి పాడి అందరి మన్ననలను అందుకున్నాడు. ఇలా ఎన్నో ప్రణయ  గీతాలను శ్రోతల మనసు పొరల్లోకి చొచ్చుకొని పోయే విధంగా పాడి తన గళం నుంచి  శ్రోతల ( ప్రేమికుల ) హృదయాల్లోకి చొప్పించి వాళ్లు కూడా ఆ అనుభూతిని ఆస్వాదించే విధంగా చేశాడు.

నిన్న లేని అందమేదో
నన్ను దోచుకొందు వటే
నీవేనా నను తలచినది
ఈ నాటి ఈ హాయి
చిగురాకులలో చిలకమ్మ
కొండగాలి తిరిగింది
మౌనముగా నీ మనసు పాడిన
అయినదేమో అయినది
పాడుతా తీయగా
ముద్దబంతి పూలు బెట్టి
ఆడుతు పాడుతు పని చేస్తుంటే
కారులో షికారుకెళ్లే
ఎక్కడ ఉన్నా ఏమైనా
మనసు గతి ఇంతే
కల కానిది విలువయినది

ఇలా సంయోగ,  వియోగ , సందేశాత్మక మైన పాటలెన్నిటినో భాషలోను. భావ ప్రకటన లోను సాహితీ విలువలు దిగజారకుండా ఆలపించి అజరామరం చేశాడు ఘంటసాల .

సాహిత్య ప్రపంచంలో కాలానుగుణంగా వస్తున్న పురాణాలు, ఇతిహాసాలు, ఇతర కావ్యాల్లోని కవితా విశేషాలను విశేషంగా ఉపయోగించుకున్న పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలన్నిటి లోను  సంస్కృత శ్లోకాలకు స్థానం లభించింది.

ఒకప్పటి చిత్ర నిర్మాతలు ప్రతి చిత్రం విజయవంతం కావాలని 'శుక్లాంబరధరం విష్ణుం' లాంటి సంస్కృత శ్లోకాలతో చిత్ర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించే వాళ్లు. అలాంటి శ్లోకాలను, భగద్గీతను ఎంతో భక్తి పారవశ్యం తో పాడాడు ఘంటసాల.

భారతీయ సంస్కృతికి పట్టు కొమ్మలు భారత భాగవత రామాయణాలు. ఆయా ఇతివృత్తాలతో కూడిన సినీ సన్ని వేశాలలో పద్యాలెన్నో చోటు చేసుకున్నాయి. శ్రోతల హృదయాలు తాదాత్మ్యం చెందే విధంగా పద్యాలను ఆలపించించిన భావ గాయకుడు ఘంటసాల.

'పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమయిన ఈ విషయం గురించి శోకింప తగదు' అని ' జాతస్య హి ధ్రువో మృత్యుర్ధృవం ... శ్లోక భావం. భగద్గీత లోని ఇలాంటి శ్లోకాలు ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఏ దేవాలయానికి వెళ్లినా ఘంటసాల గాత్రంలో నుంచి వినిపిస్తుంటాయి.

ఘంటసాల చని పోయి దశాబ్దాలు గడిచినా ఉరూరా ఒక ఘంటసాల ఉన్నాడు. కళాకారునికి మరణం లేదని నిరూపిస్తూ ఉన్నాడు.

రాళ్లను కరిగించే గాయకుడు లేక పోవచ్చు కానీ తన గానం ద్వారా గుండెల్ని కరిగించే గాయకుడు ఉన్నాడు. అతనే ఘంటసాల.

నవరసాలను తన గాన కళా నైపుణ్యంతో పాటల్లో ప్రదర్శించి వినే వాళ్లను రసానందంలో ముంచి తేల్చి , నవ్వించి , కవ్వించి, కన్నీళ్లు పెట్టించి, గుండెను బరువెక్కించి  , ప్రేమ సాగరంలో ముంచెత్తి, ఓదార్చి, సేద తీర్చి, ధైర్యం చెప్పి... ఇలా ఎన్నో భావాలకు జీవం పోసిన ధన్య జీవి ఘంట సాల. తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంత కాలం ఘంటసాల గొంతు వినిపిస్తూనే ఉంటుంది.

మహాసముద్రం దేవకి
       

Comments