పుల్లయవ్వారం
ఒకానొక ఊరిలో రామయ్య , ధనమ్మ అనే దంపతులుండే వారు. వాళ్లకు చాలా కాలానికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాళ్లు ఆ పిల్లవాడికి పుల్లయ్య అని పేరు పెట్టుకొని అపురూపంగా పెంచుకొంటుండే వారు. కానీ ఉత్త వెర్రి బాగుల వ్యవహారం వాడిది. పుల్లయ్యకు వయసు పెరిగిందే కాని బుర్ర పెరగ లేదు.
ఒక రోజు పుల్లయ్యకు ఎంత ప్రయతించినా నిద్ర పట్ట లేదు 'రేపు మన పుల్లయ్యను వేమవరం పంపిద్దాం' అని తల్లితో తండ్రి అనడం వాడి చెవుల్లో పడింది.
' తెల్లారే దెప్పుడు? తండ్రి తనకు చెప్పే దెప్పుడు? నేను వెళ్లొచ్చెదెప్పుడు? ఎలాగూ నిద్ర పట్టడం లేదు కదా! ఇప్పుడే వెళ్ళొస్తే ఒక పని ఐపోతుంది. అమ్మ నాన్న కూడా సంతోష పడతారు ' అనుకున్నాడు పుల్లయ్య. వెంటనే వేమవరం దారి పట్టాడు. కాళ్లీడ్చుకుంటూ వెళ్లి ఉదయానికంతా తిరిగి వచ్చేశాడు.
తండ్రి ఎప్పుడెప్పుడు పిలుస్తాడా? అని ఎదురుతెన్నులు చూస్తున్నాడు. వేమవరం వెళొచ్చానని తెలిస్తే తన ముందు చూపుకు తల్లి దండ్రులు ఎంత సంతోష పడతారో ! అని లోలోపలే మురిసి పోతున్నాడు.
తండ్రి నుంచి పిలుపు రానే వచ్చింది. వెంటనే వెళ్లి బుద్ధిగా తండ్రి ముందు చేతులు కట్టుకు నిలుచున్నాడు . వస్తున్న ముసి ముసి నవుల్ని దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
' పుల్లయ్యా! నువ్వొక సారి వేమవరం దాకా వెళ్లి రావాలి నాయనా ' అన్నాడు తండ్రి . తన తెలివి తేటలకు తండ్రి ఎంత సంతోషిస్తాడో! అని తెగ సంబర పడి పోతూ హుషారుగా ' నాకు తెలుసు మీరు వెళ్లమంటారని , అందుకే రాత్రే వెళ్లోచ్చేశాగా! అన్నాడు.
' ఎందుకు వెళ్ళినట్టు ?' అడిగాడు తండ్రి . ' ఎందుకో మీరు అమ్మతో అది చెప్ప లేదుగా ! వేమవరం పంపిద్దాం అని మాత్రమే చెప్పారు' అన్నాడు.
దీనిని బట్టే ' పుల్లయవ్వారం ' అనే మాట వాడుకలోకి వచ్చింది. ఏదయినా పనిని అపసవ్యంగా చేసినప్పుడు (ఇలాంటి తిక్క బాగుల పని ) 'పుల్లయ్యవ్వారం లాగుందే' అని ,
' పుల్లయ్య వేమవరం వెళ్లి నట్లుందే ' అని ఈ సామెతను వాడుతారు.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment