హాస్యగానికి తేలు కుడితే హాస్యం కింద పోతుంది

 హాస్యగానికి తేలు కుడితే హాస్యం కింద పోతుంది


ఉదయం నుంచి తెల్ల వారే దాకా సాగే వీధినాటకాల్లో అలసిపోయిన ప్రధాన పాత్ర ధారులకు మధ్యలో విశ్రాంతి నివ్వడానికి కొన్ని హాస్య పాత్రలుంటాయి. తోలు బొమ్మలాటలో హాస్యం పండించే పాత్రలు కేతిగాడు, బంగారక్క. వీధినాటకాల్లో విదూషకుడు , పిల్లే బిత్తిరి గాడు లాంటివి .

ఒక ఊరిలో విరాట పర్వం వీధి నాటకం వేస్తున్నారు. భీముడు కీచకుడు పాత్ర దారులు పరస్పరం పోరాడి అలసి పొయారు. కీచకుని వధ జరిగింది . యుద్ధ ఘట్టం ప్రేక్షకులకు కూడా నిద్ర తెప్పించింది. అటువంటి సమయంలో హాస్య పాత్రలు ప్రవేశించి నవ్వించడం మొదలు పెట్టాయి. తల్లులు పడుకున్న పిల్లల్ని లేపి కూర్చోబెట్టారు. భార్యా భర్తల మధ్య జరుగుతున్న వివాదాన్ని హాస్య పాత్రధారులు రక్తి కట్టిస్తున్నారు . భార్య పాత్ర భర్త పాత్రను వెంటబడి తరుముతుంటే  ' లబో దిబో , కుయ్యోమొర్రో అని అరవ బట్టి నాడు ఆ భర్త. . హాస్యం లో భాగమను కొని ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతున్నారు. అందరూ నవ్వుతుంటే స్త్రీ పాత్రధారి రెచ్చి పోయి భర్తను ఇంకా వేదించ సాగింది. కొంత సేపటికి  ఆ విదూషకునికి  చెమట్లు పట్టి చలువలు కమ్మి కిందికి ఒరిగి పోయాడు. చూస్తే తేలు తోక పైకెత్తుకొని వెళ్తోంది. లబో  దిబో మంటే హాస్యం లో భాగమనుకున్నారు . అప్పుడు పుట్టిందీ సామెత. జరిందొకటైతే వ్యక్తిని బట్టి , సమయాన్ని బట్టి ఇంకొకటనుకున్నప్పుడు ఈ సామెతను వాడతారు.

మహాసముద్రం దేవకి

Comments