తాబోతే తవుడు లేదు రాయిరా సన్నాలకు చీటీ అన్నాడట
ఒక ఊరిలో ఒక మోతుబరి రైతు ఉండే వాడు. ఊరిలో చాల మంది అతని పొలంలో పనిచేస్తూ ఆధార పడి జీవనం సాగించే వాళ్లు . ఒక సారి వరసగా రెండేండ్లు కరువు దాపురించింది. పంటలు లేవు. గొడ్లకు మేత లేదు. అందరిండ్లలో తిండి గింజలు నిండుకున్నాయి. . రైతు పరిస్థితి కూడా అదే స్థితికి చేరింది. పశువులకు దాణా లేక బక్క చిక్కి పోతున్నాయి. అహం అడ్డొచ్చినా మనసు చంపుకొని పది బస్తాల తవుడు , బండెడు ఎండు గడ్డి కావాలని పొరుగు రాష్ట్రం లోని భూస్వామిని వెళ్లి అడిగాడు. ఇతని వ్యక్తిత్వ మంటే గిట్టని అతను నిర్మొహమాటంగా లేదని చెప్పేశాడు.
ఊర్లో అందరి చూపులూ మోతుబరి రైతు వైపే ఉన్నాయి. షావు కారు , పెద్ద మనిషి ఊరు బాగు కోసం ఏదో ఒక ప్రయత్నం చెయ్యక పోతాడా అని ఊర్లో అందరు ఎదురు చూస్తున్నారు.
ఒక రోజు అందరూ ఊరి రచ్చబండ దగ్గర చేరారు. రైతుకు విషయం చెప్పి రమ్మన్నారు. వచ్చాడు. ఊరి జనం మొత్తం పిల్లా పీచుతూ సహా అక్కడే ఉన్నారు. చూసేసరికి రైతుకు అహం పెరిగింది. మీసం మెలేశాడు. తనకు మించిన వాళ్లు లేరనుకున్నాడు. అందరి ముందు తగ్గడం బాగుండదు. అన్నీ విని ఆ ఊరి కరణాన్ని దగ్గరికి పిలిచి సన్న బియ్యం పంపమని పొరుగూరికి వెంటనే ఉత్తరం రాయమన్నాడు.అప్పుడు పుట్టింది ఈ సామెత. తానే స్వయంగా పోతే తవుడు కూడా ఇవ్వని మనిషి చీటీ రాస్తే సన్న బియ్యం పంపిస్తాడా?
ఏమీ లేకున్నా అందరి ముందు డంబాలు పలికే , ఆడంబరాలు చేసే వాళ్లను చూసి ఈ సామెతను ప్రయోగిస్తారు.
చాలాఆడంబరాన్ని దుయ్య బట్టడానికి వాడే సామెతలు ఉన్నాయి.
1. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగె నూనె.
2. అంటుకోను ఆముదం లేదు ఎద్దులింట్లో జగంజ్యోతి.
3 . తా తిన తవుడు లేదు వారానికో పంది పిల్ల
4. హారతియ్యను పల్లెం లేదు - హనుమంత రాయనికి తెప్ప తిరనాళ్లా
5. చేద లోకి దుత్త లేదు - చలివేంద్రం పెడతాడట
6 .ఆ రాత్రికి దీపం లేదు .అఖండ జ్యోతికి ఆలోచనలా
7 బాయిలో బండ బడా - బక్కెద్దు నేలబడా - చెరుకు తోటకు దుక్కా
8. కుక్కి మంచం కూలి పోయె - పట్టు పరుపుకు ప్రాకు లాటా
9. తింటున్నది విత్తనాల వడ్లు- కడుతున్నది దాపుడు చీరలు - షష్టి పూర్తికి ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగంట
10. తాగను గుక్కెడు నీళ్లు లేవు - తలంటుకు పది తప్పెలాల నీళ్లా
11. కూరకు లేదు నారకు లేదు - కూటి కుండ పెద్దది పెట్టు అన్నాడట
12. అడివి బందేరాకు తింటూ - అన్న వరం దాకా అన్నదానం చేస్తా అన్నాడట
13. మేఘాలు చూసి - మాగాణి పండుతుందా?
14. ఏంటి నారా చూసి - వింటి నార తెమ్మన్నాడట
15. కుల దైవాన్ని ధూపం లేదు - కోటి దేవుళ్ళకు ముడుపులా
16 . మాట్లాడను పస లేదు కానీ మంత్రాలు వల్లే వేస్తాడట
ఇలా అన్వేషించే కొద్దీ ఒక్కో భావానికి వందల కొద్దీ సామెతలు జన వ్యవహారం నుంచి లభ్యా మవుతాయి.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment