ఆషాఢభూతి

ఆషాఢభూతి


దేవశర్మ అనే ఒక సన్యాసి ఊరూరూ తిరుగుతూ దైవ భక్తిని  బోధించే వాడు. భక్తులిచ్చిన డబ్బుకు బంగారం కొని బొంతలో దాచి పెట్టుకొని ఆ బొంతను చంకలో పెట్టుకొని వెళ్తుండే వాడు. ఆషాఢ భూతి అనే దొంగ దీన్ని గమనించాడు. అతి వినయంగా సన్యాసి దగ్గరికి వెళ్లి ' స్వామీ! సంసార బాధలు పడలేక జీవితమంటేనే రోత పుట్టి అన్నీ వదిలి వచ్చేశాను. అశాశ్వతాలైన శరీర సౌఖ్యాలు , చంచల మైన సిరి సంపదలు నాకు వద్దు. మీ శిష్యుడిగా చేర్చుకొని మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి' అంటూ కాళ్లకు నమస్కరించాడు. దేవ శర్మ అతని మాటలను నమ్మి రెండో ఆలోచన లేకుండా శిష్యునిగా చేసుకున్నాడు.

సన్యాసి మాత్రం ఆ బొంతను ఒక్క క్షణం కూడా విడిచి పెట్టే వాడు కాదు. శిష్యుని చేతికి ఇచ్చే వాడు కాదు. ఒక రాత్రి వాళ్లు ఒక ఇంటి అరుగు మీద పడుకొని ఉదయాన్నే లేచి ప్రయాణ మయ్యారు. దారిలో ఆషాఢ భూతి తన బట్టలకు అంటు కొన్న చీపురు ముల్లును చూచి బాధ నటిస్తూ ' స్వామీ ఎంత అపరాధం జరిగి పోయింది. ఆ ఇంటివారి చీపురు ముల్లు నా బట్టకంటుకొని వచ్చేసింది. తృణమే కావచ్చు. పరుల సొమ్మును తీసుకోవడం మహా పాపం కదా!  వెంటనే ఇచ్చేసి వస్తాను ' అని కొంత దూరం వెళ్లి ఆ ముల్లును పడేసి వచ్చాడు. ' నా శిష్యుడు పరుల సొమ్ము ముట్టడు అని భావించిన ఆ సన్యాసి ప్రయాణంలో సంధ్య వార్చడానికి చెరువులో దిగుతూ బొంతను శిష్యుని కిచ్చాడు. అతడది తీసుకొని ఉడాయించాడు .

ఈ కథ ఆధారంగా పుట్టిన సామెతే ' ఆషాఢ భూతి.' మెల్లగా దగ్గర చేరి మాయ మాటలతో నమ్మించి ఆఖరికి పెద్ద నష్టం వచ్చేలా మోసం చేసే వాళ్లను ' ఆషాఢ భూతి అంటుంటారు.

మహసముద్రం దేవకి 

Comments