కుమ్మెత్తుకొని గూడూరుకు పోతుంటే ఏడు కుమ్ములెదురొచ్చినట్లు

 కుమ్మెత్తుకొని గూడూరుకు పోతుంటే ఏడు కుమ్ములెదురొచ్చినట్లు


రామేశ్వరం పొయినా శనేశ్వరం వదల్లేదని సామెత . ఉన్న ఊరిలో బతికి బట్టకట్ట లేమని నిర్ణయించుకున్నాడు ఒక పెద్ద మనిషి. ఎప్పుడూ సశ్య శ్యామలంగా ఉండే ఊరు చేరుకుంటే పనీ పాటలు దొరుకుతాయని, పిల్లల్ని పోషించు కోవచ్చని కడుపు చేత బట్టుకొని  తట్టా బుట్టా సర్దుకొని, కుటుంబాన్ని వెంట బెట్టుకొని బయలుదేరాడు. ఊరి పొలిమేర దాటేశాడు. సగం దూరం చేరు కున్నాడు. ఎదురుగా పెద్ద గుంపు చేరువవుతోంది. దగ్గరికి వచ్చాక ఎవరని విచారించాడు. మా ఊర్లో పనులు దొరకక వలస పోతున్నామన్నారు వాళ్లు. ఇక ఆ ఊరికెళ్లి ఎలా బతకాలి ?

' కుమ్ము' అంటే కుంపటి.  కష్టాల మీద కష్టాలొచ్చి బాధ పడుతుంటే, చేసిన ప్రయత్నాలు  విఫలమైనప్పుడు , ఏవైనా పనులకు ఆటంకం ఏర్పడినప్పుడు ' కుమ్మెత్తుకొని గూడూరుకు  పోతుంటే ఏడు కుమ్ములెదురయినట్లుందే నీ పరిస్థితి. ' అని సానుభూతిని వ్యక్తం చేసే సామెత ఇది. ఏ ప్రయత్నమూ ఫలించక దిగాలు పడి కూర్చున్న వాళ్ల నుద్దేశించి చెప్పే సామెత .

మహాసముద్రం దేవకి 

Comments