వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు

 వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు


కంసుడు తన పెద తండ్రి కూతురు దేవకిని వసుదేవుని కిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లతో పాటు రథంలో కంసుడు కూడా వసుదేవుని నగరానికి బయలు దేరాడు. ఆ సమయంలో ఆకాశ వాణి దేవకి అష్టమ గర్భంలో జన్మించే పుత్రుడు కంసుని సంహరిస్తాడని  పలికింది. వెంటనే దేవకిని చంప బోయాడు కంసుడు. వసుదేవుడు అడ్డు పడి పుట్టిన బిడ్డలను కంసునికే అప్పగిస్తానని వాళ్లను అతడే చంప వచ్చని వేడుకుంటాడు. అన్న మాట ప్రకారం వసుదేవుడు పుట్టిన ఏడుమందిని కంసునికి అప్ప జెప్పాడు.

ఒక సారి నారదుడు కంసుని వద్దకు వచ్చి దేవకీ వసుదేవులు దేవతలని కంసుడు మాత్రం రాక్షసుడని అందువల్ల అతనిని చంపడానికి దేవకి గర్భంలో పుట్ట బోతున్నాడని చెప్పాడు. కంసుడు వెంటనే దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. ఒకనాటి రాత్రి దేవకికి శ్రీ కృష్ణుడు జన్మించాడు. వెంటనే వాళ్ల సంకెళ్లు విడిపోయాయి. కాపలా వాళ్లు గాఢ నిద్రలో పడిపొయారు. కారాగారం తలుపులు వాటికవే తెరచుకున్నాయి. వసుదేవుడు ఆకాశ వాణి ఆదేశంతో గంపలో పిల్ల వాణ్ని తీసుకొని రేపల్లెకు బయలుదేరాడు. వెంటనే గాడిద అరవడం మొదలు పెట్టింది. కాపలా వాళ్లు  లేస్తారని భయపడ్డ వసుదేవుడు అరవొద్దని గాడిద కాళ్లు పట్టుకున్నాడు. ఈ కథ ఆధారంగా పుట్టిన సామెత ఇది. నీచులను, అల్పులను ప్రాధేయ పడవలసి వచ్చినప్పుడు ఈ సామెతను వ్యవహరిస్తారు .

మహాసముద్రం దేవకి

Comments