పుంగనూరు సంస్థానం

 



పుంగనూరు సంస్థానం

చిత్తూరు జిల్లాలో చిత్తూరు నుంచి 58 కిలోమీటర్ల దూరంలో తిరుపతి బెంగులూరు  హైవే పైన ఉంది పుంగనూరు. ఆ సంస్థానం ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేది. ఒక రోజు రాజు వేటకు వెళ్లాడు. కానీ వస్తానన్న రోజుకు తిరిగి రాలేక పోయాడు .ఇంతలో రాణి గారికి జబ్బు చేసింది. రాజు గారికి ఆ వార్త తెలియ చెయ్యాల్సిన బాధ్యత మంత్రి పైన ఉంది. అ మంత్రి దగ్గర ఇద్దరు సేవకు లుండే వారు. ఒఠ్ఠి తెలివి తక్కువ వాళ్లు. ఒకడు హిందువు. ఒకడు మహమ్మదీయుడు . ఆ మంత్రి ప్రతి పనికి హిందువునే పంపుతాడని మహమ్మదీయ సేవకునికి కోపం.

ఈ సారి మహమ్మదీయ సేవకునికి ఆ పని అప్పగించడంతో అతను సంతోషంగా బయలు దేరాడు. ఉదయాన్నే బయలుదేరి ఎండెక్కేదాకా ప్రయాణం చేశాడు. అలసి పోయి కొంతసేపు సేద దీరుదామని ఒక చెట్టు కింద పడుకొని గాఢ నిద్రలో మునిగి పోయాడు. ఆ సమీపంలో ఉన్న ఒక ఊరిలో గ్రామాధి కారికి గడ్డం గీసే క్షురకుడు మరో గ్రామం నుంచి ఆ దారిలో బయలుదేరాడు.

ఆ గ్రామాధికారి పరమ కోపిష్టి. కత్తి మెత్తగా తెగకుంటే క్షురకుడిని చితక బాదే వాడు. అందుకని ప్రతి నిముషం కత్తి పదును చూసుకుంటుండే వాడు.

చెట్టు కింద నిద్ర పోతున్న సేవకుని చూడగానే కత్తి పదును చూసుకోవాలనుకున్నాడు. గడ్డం నున్నగా గొరిగేశాడు. అయినా ఆ సేవకునికి మెలకువ రాలేదు. కత్తి బాగా తెగుతున్నదన్న సంతోషంతో ఉల్లాసంగా అతను పొరుగూరికి వెళ్లి పోయాడు. కానీ కత్తిని సామాన్లలో సర్దుకొంటూ అద్దం అక్కడే మరిచి పోయాడు.

సేవకుడు నిద్ర లేచాడు. పక్కనే ఉన్న అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గడ్డం లేదు. ఆశ్చర్య పోయాడు. అద్దంలో గడ్డం లేని ప్రతిబింబం చూడగానే మంత్రి మీద అతనికి వెర్రి కోపం వచ్చేసింది. ' అరె ! మాకు పంపిస్తానని తన హిందువు బంట్రోత్తుకే పంపించుకున్నాడు ' అని తెగ తిట్టుకున్నాడు మంత్రిని.

ఎక్కువ మంది మూర్ఖులున్న చోటును
' పుంగనూరు సంస్థానం' అనడం అప్పటి నుండి పరిపాటి అయ్యింది

మహాసముద్రం దేవకి

Comments