ఘంటా కర్ణుడికి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించినట్లు

 ఘంటా కర్ణుడికి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించినట్లు


ఘంటాకర్ణుడు ఒక బ్రహ్మ రాక్షసుడు. గొప్ప ఈశ్వర భక్తుడు. అతని భక్తికి మెచ్చి బోళా శంకరుడు పిశాచాది గణాలపై ఆధిపత్యాన్ని కట్ట బెట్టాడు. అతడు అర్ధరాత్రి పిశాచాలను వెంట బెట్టుకొని లోకమంతా సంచరిస్తూ పచ్చి మాంసం తింటూ, పచ్చి రక్తం తాగుతూ విచ్చల విడిగా ప్రవర్తించే వాడు.

శివ భక్తుడయిన అతనికి విష్ణువంటే గిట్టదు. అతడు బ్రహ్మణులకు అండగా ఉంటాడని బ్రాహ్మణులపై కోపాన్ని చూపే వాడు. వాళ్లను చంపి రక్తమాంసాలను తినడమంటే చాలా ఇష్టం. తినేటప్పుడు వాళ్ల నోటినుండి వెలువడే
' నారాయణా ' అనే విష్ణునామస్మరణ వినాల్సి వస్తుందని చెవులకు గంటలు కట్టుకొనే వాడు. ఆ కారణంగా అతనికి'  ఘంటా కర్ణుడు 'అనే పేరు వచ్చింది. విష్ణు ద్వేషి అయిన అతనికి ' ఓం నమో నారాయణాయ ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తే ఫలితం ఉంటుందా? అలాంటి గురువుకు అతడిచ్చే గురుదక్షిణ ఘోరమైన చావే కదా! మొండి వాళ్ల చేత వాళ్ల కిష్టం లేని పనిని చేయించలేము  అనే భావాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

మహాసముద్రం దేవకి 

Comments