మెదడుకు మేత - 31
పద్యాల్లో పొడుపులు
1 .నారీ లలామ నీ పేరేమి చెపుమన్న
తన చేత ఎడమ నేత్రమును చూపె
మత్తేభ యాన నీ మగని పేరేమన్న
తన చేతి జీర్ణ వస్త్రమును చూపె
వెలది నీకేమైన బిడ్డలా చెపుమన్న
కరమొప్ప మింటి చుక్కలను చూపె
కుటిల కుంతల నీదు కులము నామంబన్న
పంజరంబున ఉన్న పక్షి చూపె
ప్రభువు మీ కెవరన్న గోపకుని చూపె
ధవుని వ్యాపార మేమన్న దంద మిడియె
చతుర మతులార ఈ ప్రౌఢ జాణ తనము
తెలిసి కొనరమ్మ బుద్ధి కౌశలము మెరయ
2. ఎలనాగ నీ దేశ మేదేశ మన్నను
చెలి వంగ మానొక్క చేత చూపె
భామరో! నీ వున్న పట్టణంబేదన్న
చంద్రుని గూడి పాషాణ మనియె
ఇందీవరాక్షి! నీ ఇల్లెక్కడన్నను
తలనీరు మోసె నత్తరువు కింద
ఏజాతి కోమలీ! ఎరిగింపుమన్నను
ఏటిలో రెణ్ణెల్లు ఇసుక పుచ్చె
ఇంతి నీకు విలువ ఎంతని అడిగిన
చుక్క జూపి సుదతి సున్న చుట్టె
సమ్మతిగ చెప్పరో సుదతులార
చెప్ప లేకున్న నగుదునే చిన్ని నగవు
Comments
Post a Comment