కురపోళ్ల సిన్నిగాడు -కూతురు సుశీల
మా ఊర్లో కస్తూరి కత కంచికి సేరినాక ఆండ పిలకాయిలు ఏ మొగోల్లతోను దెగ్గిరి గాకుండా అమ్మ నాయిన్లు ఒక కన్నేసి పెట్టినారు .
మా ఊర్లో ఐద్దాకా ఇస్కూలుండాది. ఆ పైన సదవాలంటే సిత్తూరికి పోవాల్సిందే. ఆండ పిలకాయిలికి ఏమి సదువులే అని ఐదయిపోంగానే ఇంట్లో కూసో బెట్టేస్తా ఉండారు.
ఒకరో ఇద్దురో సిత్తూరి దాకా బొయ్యి సదువుకుంటా వుండేది మా ఊర్లో . ఆ పున్నెం మా నాయినికేదక్కింది. సిత్తూరికి పంపించి ఆడ బిడ్లిని సదివించిన మొదటి మొనగాడు మా నాయినే.
సుశీల గూడా అయిదయి పోంగానే సిత్తూరికి బొయ్యి సదువుకుంటానని శానా ఏడ్సింది పాపం. వాళ్లమ్మ దెగ్గిర సేరి గోంజారింది. అన్నం దినకుండా అలిగి పండుకొనింది.
కానీ ఏం లాబం? ఆ బిడ్డి ఏడుపును వాళ్ల నాయిన పట్టించుకుంటేనా .
' ఆ బిడ్డి సిత్తూరిస్కూలుకు బోతానని ఏడస్తా ఉందబ్బా. అన్నం కూడా తిన్లేదు ' అని పెండ్లాం నచ్చ జెప్పే ప్రయత్నం సేసింది.
ఆ మాటింగానే ఆడెగిరి ఈడ దూకినాడు సిన్ని గాడు. ' ఏడిస్తే ఏడవనీలే మనబోటోళ్లు అయిద్దాకా సదివించిందే ఎక్కువ. ఏదీ సూపెట్టు , మనిండ్లలో ఏ నా కొడుకు ఆండబిడ్లిని ఇస్కూలు
దాకా పంపించింది. ఏదో పోనీలే అనుకుంటే అంతా సెల్లాటమైపోయింది ' అన్న్యాడు కోపంగా
ఆట్లాడుకోను బొయిన సుశీల సందకాడిగ్గానీ ఇంటికి రాలేదు. వచ్చీ రాంగానే అగ్గిమింద గుగ్గిల
మైనాడు వాళ్ల నాయిన. 'బసివి మాదిరిగా ఊరు
దిరిగి ఇప్పుడొస్తా వుండావు , సిత్తూరు సదువులు గావాల్నా నీకు ' అని గాండ్రించినాడు. గుడ్లురమతా మింది మిందికీ కొట్ను బొయినాడు.
దాంతో బిత్తరపొయిందా బిడ్డి. ఆపైన సదుంకుంటాననే మాటెత్తితె ఒట్టు. వాళ్ల నాయన ఆ బిడ్డి సదువును కోణ్ని గంప కింద మూసి పెట్టేసినట్ల మూసి పెట్టి గుడ్లు పెట్టు పో అని అటకెక్కించేసి నాడు.
' ఏదీ కొంచం పుచ్చారు సెయిపో ఎట్ల జేస్తావో సూస్తాము, ఆ గురుకాకు పులగూరెనుప్పో నాయినా ' అని ఎట్ల సెయ్యాలో సెప్పి బాగుండాదని పొగిడి ఉబ్బించి ఉట్టి మింది కెక్కించి మెల్లింగా సట్టికుండా దాని నెత్తికి గట్టేసింది వాళ్లమ్మ రామక్క.
ఆ యమ్మ ఆవుల్ని మేపుకోని రానూ, గొడ్లకు కసువుకోసక రాను పరుగులు బారే పని లేకుండా పొతా ఉండాదిప్పుడు.
సుశీల ఇస్కూలుకు బోకుండా ఇంటికాడ పనులు సెయ్యడం వల్ల వాళ్ల సంసారం ఒక గాటిన పడింది.
నేలా నెట్రా లేని సంసారాన్ని ఎల్లిందడానికి వాళ్లకు ఆవులే ఆధారం. ఇప్పుడు పెండ్లాం కూడా అదే పనిమింద ఉండడంతో అప్పు సేసి ఇంగో ఆవును రొండు మేక పిల్లల్ని గూడా బట్టుకోనొచ్చినాడు సిన్నిగాడు.
మొగుడూ పెండ్లాలిద్దురూ పూటకు ఇంగో నాలుగు లీటర్ల పాలు ఎక్కువగా బోసి నాలుగు దుడ్లు సంపాయించి నెలకింత అప్పు తీర్చెస్తా ఉండారు.
రొండు మూడు కోళ్లు గూడా వీళ్లవి ఇంటి సుట్టుపట్లా నడమాడతా ఉండాయి. వాటిలో ఒకటి పిల్లల కోడి. పుంజు గూడా ఒకటుండాది. బాగా బలిసి నిగ నిగ లాడతా.
ఇద్దురు మనుసులు ఆవుల్ని ఇడి ఇడిగా పట్టు కోని మేపతా వుంటే అవి పాలు బాగా ఇస్తా ఉండాయి. రామక్క వక్కాకు తిత్తిలో కూడా నాలుగు సిల్లర దుడ్లు గల గల లాడతా ఉండాయిప్పుడు.
కోళ్లు బెట్టిన గుడ్లను, తినకుండా, అమ్మకుండా తవుడు గంపలో పొదగ బెట్టింది
రామక్క . పదైదు గుడ్లు పెడ్తే ఒకటి కూడా పోకు బోకుండా పిల్లలయినాయి. కానీ ఒక పిల్లని ఉన్నెట్లుండి ఒక నాడు గెద్ద తన్నుకు పొయింది.
సందకాడ కోళ్లను గంపకింద మూసి పెడతా పిల్లల్ని లెక్క బెట్టుకొని ఒగిటి తగ్గడంతో ఎంతో మదన పడి పొయింది రామక్క.
' ఏబ్రాసి ముండా, కన్న బిడ్లిని కాపాడుకొనేది రాదా' అని కోణ్నీ, 'ఏడ పెత్తనాలు జేస్తా ఉంటివి ఒగ పిల్ల ఉరువు లేదు. ఇంట్లో ఉండంగానే సరా! పోకూ వర్తూ సూసుకోవొద్దా' అని కూతుర్నీ తిట్టి పోసింది.
ఇంగా ఒక కోడి పొదుగులో ఉండాది. ' ఇదిగో పాపా ఇంట్లో పనంటే అంతన్నమొండి పెట్టేసి బసివి మాదిరిగా ఊరు దిరిగేసి రావడం కాదు. ఇంట్లో ఉండే కోడీ , కుక్క , పిల్లి లాంటి వాటిని కూడా అనవరించాల. కోడి పిల్లల్ని కాపాడ లేదనుకో నీ పని ఐపోతాది 'అని కూతుర్ని బెదిరించింది.
' పోమా నీకోళ్లేరిగిన పియ్యి తోసి పొయ్యలేక నా పనైపోతా ఉంది . ఇంగ వాటికి కాపలా గూడా కాయాల్నా. నీళ్లకూ నిప్పులికీ పొయి నప్పుడు వాటిని గెద్దెత్తు కోని. పొతే నేనే జవాబు దారా'. అని కూతురు కూడా గంప నోరు బెట్టుకొని వాళ్లమ్మను దబాయించింది.
' మేయ్ సుశీలా అరువూ తెరువూ ల్యాకుండా మాట్లాడితే నీకే నష్టం. సెప్తా ఉండా ఇను. కోళ్లతో, అవి బెట్టే గుడ్లతో ఒచ్చే ఆదీకం ఒక అణా కూడా మీ నాయినికి ఇచ్చేది లేదని సెప్పుండా. వాటిని బాగా సూసు కుంటి వనుకో, ఎడ పిల్ల లయినాక గుడ్ల కొస్తాయి. పుంజులు పెద్దయినాక వాటిని అమ్మి బంగారు కమ్మలెత్తిస్తాను. మేక పిల్లల్ని ఎందుకు బట్టుకున్యా ననుకుంటా ఉండావు' అని ఆశ బెట్టింది రామక్క .
స్తిరాస్తులు లేని ఒక తల్లిగా బతుకు పోరాటాన్ని , దుడ్లుంటే ఒచ్చే మర్యాదను కూతురికి అప్పుడప్పుడు నూరి పోస్తా ఉండాది. .
ఏడాడో సుట్టూ వుండే బయళ్లలో పారాడి మేత మేసే కోళ్లకు కాపాలా కాయడం బ్రెమ్మ దేవుడికి కూడా సాద్యం కాదని ఒగ దినానికే సుశీలకు తెలిసి పొయ్యింది.
అయినా పిల్లలన్నీ పదిలంగానే పెరిగి పెద్దయి పెట్టలు గుడ్ల కొచ్చినాయి. ఒగటి కాదు కదా. అవి ఏడాడో గుడ్లు పెట్టేస్తా ఉండాయి.
ఒగ దినం ఆవుల కొట్టంలో అటకమింది కెక్కిన పెట్టను సూసింది సుశీల . అది శాన్నాళ్లగా కొక్కరిస్తా ఉండాది. కాని గుడ్లు ఏడపెడతా ఉందో తెలీక అల్లాడతా ఉండాది.
గాట్లో మ్యావ్ మ్యావ్ అంటా పిల్లి ఆడాడే తారట్లాడతా ఉండాది. దాన్నించి గుడ్లను కాపాడు కోవాలంటే అటకెక్కి వాటిని తెచ్చుకోవాల.
సుశీలా వాళ్లిల్లు ఈది మొగదల్లో సిన్న సందులో ఉండాది. ఆ సందులో ఇంగో రొండిండ్లున్నాయి. వాళ్లు వీళ్లింటి ముందు నుంచే ఎలబారి పోవాల. ఆ రొండిండ్లలో ఒగటి గొల్ల గోయిందప్పది. ఇంగొటి కురపోళ్ల పండుది. పండు రామక్కకి బావ కోండాలు
అటకకు నిచ్చినేసుకోని ఎక్కే ప్రయత్నంలో సుశీల కాలు జారి కింద పడిపొయింది . అప్పుడే అక్కింటికి బోతా గోయిందన్న బామర్ది జయ చంద్రుడు ఆయమ్మ పడిపోవడాన్ని సూసి
పెరిగెత్తుకోనొచ్చి సుశీల పైకి లెయ్యడానికి సాయం సేసినాడు.
అప్పుట్నుంచి సందులోనించి అక్కింటికి పొయ్యే టప్పుడూ వచ్చేటప్పుడూ వాళ్ల మద్దిన సిన్న సిన్న పలకరింపులు , సిరునవ్వులు కొనసాగతా వొచ్చినాయి
గోయిందన్న సిల్లరంగడి పెట్టుకోనుండాడు. అంగిడి బాగా జరగతాది. మా ఊరి అంగిడాయన అంగిడెత్తేసినాక మా ఊర్లో అగ్గి పెట్టి కావాలన్న్యా , సోడా పొడి కావాలన్యా, వక్కాకు కావాలన్న్యా అదొకటే కదా !
కాలం దాని పాటుకది పరుగులు బారతా ఉండాది. . సుశీల తమ్ముడు పాండురంగడు సితూరిస్కూలుకు బొతా ఉండాడు.
ఎంత కోరికున్నిందో ఏమో సేతిలో క్యారీరు తమ్ముడు ఏలాడించుకుంటా బోతా ఉంటే ఎనక నించి సూసి కుశాల బడిపోతా ఉంది పాపం సుశీల
పులుసన్నమేనా, సిత్రాన్నమేనా, పెరుగన్నమేనా రుసిగా సేసిస్తా ఉంది తమ్మునికి.
' అందురూ నువు సేసిచ్చినన్నం శానా బాగుందన్న్యారుకా' అంటే సాలు మర్సనాడు మరింత బాగా సేసిస్తా ఉండాది.
పాండురంగడిప్పుడు ఎనిమిదిలోకొచ్చినాడు.
అట్టాంటక్క ఉన్నెట్టుండి ఇంట్లో కనిపించల్యా. యాడ బొయ్యిందో తెలీకుండా సుట్టు పక్కలంతా ఎతుకిలాడతా ఉండారుఇంట్లో వాళ్లు ముగ్గురూ. ఆ బిడ్డితో ఆట్లాడుకొనే, స్నేయితంగా ఉండే పిలకాయిల్నందరిని అడిగినారు. అది రాత్రయినా ఇంటికి రాలా.
రామక్కకు సిన్న అనుమానమొచ్చింది. 'రేయ్, గోయిందప్ప బామార్ది గాని. ఈ మద్దిలో వొచ్చిన్న్నాడారా' అని కొడుకునడిగింది.
' ఆ, మొన్నొచ్చి పొయినాడు ఏమీ' అడిగినాడు వాడు. 'సరే ఈ ఇసయాలేవీ ఎవురితోను మాట్లాడ బాక. మీయక్కేడ అని ఎవురయినా అడిగినారనుకో, మా పెద్దక్కోలూరికి బొయ్యింది అని చెప్పు .' అనింది.
అక్క కనిపించక పోవడానికి ఆ సారు ఒచ్చి పోవడానికి సంబంద మేమో తెలీక జుట్టు పీక్కున్న్యాడు వాడు
గొల్ల గోయిందప్ప బామార్ది జయచంద్ర బంగారు పాలెంలో లో పద్దాకా సదివి ఇంగాడ కాలేజి లేదని ఒచ్చి సిత్తూరులో సేరినాడు. రొండేండ్లు సిత్తూరులో ముగ్గురు మొగపిలకాయిలుతో కలిసి రూము తీసుకోని సదుంకున్న్యాడు.
ఆపైన టిచర్ ట్రైనింగ్ లో సేరినాడు.
అడపా దడపా , ఆదివారాల్లో అక్కింటికొచ్చి పొయ్యేటోడు . అట్లాంటప్పుడే సుశీల నిచ్చిని మింది నించి కింద బడ్డం .
పాండు గాడు ఆయబ్బోడొస్తే సాలు తోక బట్టుకొని తిరిగేటోడు. అగ్గి పుల్లలతో , సీట్ల పేకలతో, సిల్లర దుడ్లతో, ఏవేవో మ్యాజిక్కులు సేసి పిలకాయిల్ని అబ్బుర పరిసే వాడు జయచంద్ర. కథలు, జోకులూ సెప్పి నవ్వించే వోడు. సుట్టు సేరే పిలకాయిల్లో ఎందుకో గాని పాండు ఆ అయివోరు తనకే సొంతం అనుకొనే వాడు.
కొన్నాళ్లకు జయ చంద్రకు పాండుగాడు భక్తుడయిపొయినాడు. ' పక్కింటోల్లన్నకు శానా తెలివుండాదిమా , అబ్బబ్బా ఎన్ని తెలస్తాయో ' అని ఆ యబ్బోడు ఏమేమి సెప్పినాడో ఏయే కొత్తాటలాడించినాడో , మ్యాజిక్కులు ఎట్లా సేస్తాడో రేత్రి పండుకున్న్యప్పుడు అన్నీ వాళ్లమ్మకు అక్కకు సెప్పే వోడు.
పక్కిల్లె కాబట్టి పాండుకు జయచంద్రతో సనువు కూడా ఎక్కువ. పిలకాయి లందురూ కూడా జయచంద్ర ఎప్పుడొస్తాడా అని ఎదురు సూసే వాళ్లు.
జయచంద్రోల్లకు మంచి బూములే ఉండాయి. తిండీ గుడ్డకు లోటు లేదు.
రొండేండ్ల సదువు అయిపోయింది . ఇంగా సదవమని వాళ్ల నాయిన ఎంతగానో సతపోరినా ఇనలేదు.
'నేను నాకాళ్ల మింద నిలబడినాక ప్రవేటుగా సదుకుంటా నాయినా , ఇప్పుడు నాకు ఉద్యోగం సెయ్యాలని ఆశగా ఉండాది. ' అని ఆర్నెల్లు టీచర్ ట్రైనింగ్కి బొయ్యొచ్చి ఉద్యోగంలో సేరి
పొయినాడు.
కాని జయచంద్ర మనసులో ఇంగేదో ఉండాదని వాళ్ల నాయినికే గాదు, ఇంగో నరమానవునికి తెలియదు.
సుశీలకు సమత్సరం నుంచీ సంబందాలోస్తా పోతా ఉండాయి. పద్దినాలకు ముందు గోవిందప్పకు తెలిసినాయిన ఒచ్చినాడు.
' సిన్నాయినా ఈయన నాకు బాగా తెలిసినాయిన. పుత్రమద్ది వీళ్లూరు. . ఆ ఊర్లో మాయక్కనిచ్చినామని నీకూ తెలుసు. సూటిగా వుండే ఆవొకటి గావాలంటా. నీకయితే బాగా తెలస్తాదని పిల్చుకోనొస్తి ' అన్న్యాడు సిన్నిగాడోలింటి కొచ్చి.
ఒచ్చిన మనిసి మంచి నీళ్లు గావాలన్న్యాడు. సుశీల తెచ్చిచ్చింది. వచ్చినాయిన గొయిందన్న పక్క సూసినాడు. సిన్నిగాడు సూడకుండా ఇద్దురూ
ఏందో సైగలు సేసుకున్న్యారు.
' ఆదివార మొస్తే యాందమూర్లో ఎద్దల పర్స వుండాది. ఆడికి పోతే ఆవులు మస్తుగా వస్తాయి . మంచిది సూసి పట్టిస్తాలే ' అన్న్యాడు సిన్నయ్య. .
మద్యానం బోజనాలప్పుడు వాల్లు మాట్లాడుకొనే మాటల్ని బట్టి ఆయన ఆవు సాకు బెట్టి సుశీలను సూడ్డానికి వచ్చినట్లు , నచ్చినట్లు , మంచి రోజు సూసుకోని పిలగానితో వస్తామని చెప్పడం జయచంద్ర సెవుల్లో బడింది. మళ్లీ వారం దిరక్కుండానే సుశీల కనిపించకుండా బోయింది.
సుశీల పత్తా ల్యాకుండా బొయి రొండో దినానికి సేరుకునింది. రామక్క అనుమానమే
నిజమయ్యేట్లుండాది. ఎందుకైనా మంచిదని మొగుణ్ని మొగిలి దేవళానికి బొయ్యి ఇశారించుకోని రమ్మనింది.
ఆ దేవళంలో మా వూరి సుట్టు పక్కల పెండ్లి సేసే స్తోమత లేనోల్లు పదిమందితో బొయ్యి పెండ్లి సేసి ఉప్పిండి . కేసరీ తో పెండ్లయిందనిపిస్తారు.
ఇంగ దొంగ పెండ్లిండ్లు సేసుకొనే వాళ్లయితే ఒగరిద్దురు స్నేయితులతో బోయి , అట్లా గాదంటే ఇద్దురే బొయ్యి పూజారితో మంత్రాలు సదివించుకోని పెండ్లి గానించుకోని కాపురాలు పెట్టేస్తారు.
ఆ దిక్కున ఆలోచించిన రామక్క ' మిగిలికి బొయిరాపో పోకూ వర్తమానం తెలస్తాది.
ఆడ తెలియకుంటే జయచంద్ర వాళ్లురికి బోయి సూసి రాబో . జాగ్రత్త ఆండబిడ్డి యవ్వారం , మూడో కంటికి తెలీ కూడదు. అనీకు ముందే ముక్కు మిందుంటాది. కొట్ను బొయ్యి రచ్చ గిచ్చ సేసేవు, ' అని జాగర్తలు సెప్పి పంపించింది.
మొగిలి దేవళానికి పోగానే పెండ్లి ఇసయం తేలి పోయింది.
సిన్నిగాడు నేరుగా జయచంద్రుడోల్ల వూరి దారి బట్న్యారు.
ఊర్లో నగుబాట్లు కాకుండా , వాళ్ల నోరు మూయించాలంటే ఏం సెయ్యాలా అని ఆలోచ్చిస్తా వుంటే ఒక పక్క కస్తూరి, ఇంగో పక్క రాదాబాయి కండ్లలో మెదిలినారు.
జయచంద్రుడోల్ల ఇంటికి బొయ్యే పాటికి వాళ్లింట్లో అంతా గొడవ గొడవగా ఉండాది. ఊర్లో అందురూ గుస గుసలు బోతా వుండారు. వాళ్ల కులం గాని పిల్లను సేసు కున్న్యాడని ఇంట్లో వాళ్లు ఏడుపు తూడుపులతో ముక్కులు సీందు కుంటా ఉండారు. సిన్ని గాడు అప్పుడు బొయినాడు.
కూతురింటి పక్కిల్లె గదా వొరిగి పల్లి లో కాబట్టి అందురికీ ఒకరి కొకరు ముందే తెలుసు .
' అందురూ బాదలో వుంటే సందులో సడేమియా అని ఈయన ఇప్పుడు దిగబడినాడే ' అని తిట్టుకున్న్యారు.
ఇంట్లో వాళ్ల వాలకం చూసి పరిస్తితి అర్తమయింది సిన్నిగానికి . అదే పనిగా ఒచ్చినానా ? సల్లకొచ్చి ముంత దాచేదెందుకని వొచ్చిన విసయం ఇంటి యజమాని పరందామున్ని పక్కకు పిల్సి చెప్పినాడు.
జయచంద్ర పెండ్లి సేసుకున్న్యాడని తెలుసు. కానీ ఎవుర్ని? అనే ప్రెశ్నకు ఇప్పుడు జవాబు దొరికిందాయనకి .
' నీ కొడుకు ఏడ ఉద్ద్యోగం ? ' అని అడిగినాడు. బంగారు పాలెం దెగ్గిర రాగిమాను పెంటలో ' అన్న్యాడు.
' కులాంతరం కాబట్టి పిలకాయిలు ఇంట్లో పెద్దోళ్లకు తెలియకుండా ఈ పని సేసి నారేమో అని ' నసిగినాడు సిన్ని గాడు.
' మాకూ ఇప్పుడే తెలిసిందప్పా . కానీ దేవుని సాచ్చిగా వాడు ఎవురి మెడలో బొట్టు కట్టి నాడో మాత్రం ఇప్పుడు నువు సెప్పేదాకా తెలీదప్పా' అన్న్యాడు పరందాముడు.
ఇద్దురూ ఎవురికి వాళ్లు నా కొడుకు తప్పు సేసినాడని ఒకరు, నా కూతురు తప్పు సేసిందని ఒకరు మనసులోనే మల్ల గుల్లాలు పడతా ఉండారు.అట్లని వాళ్లు ఒగర్నొకరు , తిట్టుకో లేదు, కొట్లాడు కోలేదు.
జయచంద్రా వాళ్లకి ఇల్లూ వాకిలి నేలా నెట్రా బాగానే ఉండాది. పైగా టీచరుద్ద్యోగం అంటే మాటలా . ఇంత కంటే మంచి సంబందం రావడం కల్ల. సిన్ని గాడి ఆలోచనలివి.
'సుశీల పూల పొట్లం మాదిరిగా అందంగా ఉంటాదని వీళ్లకు తెలుదు. ఒడుపుగా ఇంటిని చక్క బెట్టుకుంటాదని కూతురు వాళ్ల పక్కంటి బిడ్డి గురించి మాటల మద్దిలో ఎన్నో సార్లు అనుండాది. కులం ఒగటే అడ్డు. ఇంట్లో ఆండోళ్లు , తమ్ముడు ఏమంటారో !' పరందాముని మనసు
సిన్ని గాని ఆలోచన ఇంకో రకంగా ఉండాది.
' ఒకనితో లేసి పొయిన ఆండ బిడ్డిని బలమంతంగా ఈడ్సుకోని ఇంటికి బోవచ్చు. పరువు గంగలో కలిసేది అట్ల బెడ్తే మళ్లీ ఆ బిడ్డిని ఎవురు సేసు కుంటారు? ' అని
సిన్ని గాడు ఉన్నెట్టుండి నోరు ఇప్పినాడు.
' ఏం చేద్దాం మామా' అని
' నువ్వే సెప్పు బావా' అన్న్యాడు పరందాముడు.
ఆ పిలుపుల్లోనే వాళ్ల మనసులు తెలిసి పొయి నాయి. వరసలూ కలిసి పోయినాయి.
ఉత్తముడయిన పరందాముడు కూడా ఆండ బిడ్డి పక్కనించే ఆలోచిస్తా ఉండాడు.
' మనం సేసేది ఏముండాదింక. వాళ్లు ఒకటై పొయినాక ' అన్న్యాడు పరందాముడు.
'సూడు బావా మనం రచ్చకేసు కోని వాళ్లను ఇడదీసినంత మాత్రాన ఒరిగేదేమన్నా ఉండాదా? అనుకొనే వాళ్లు కూడా మనం వాళ్లకు అండగా ఉంటే నోర్లు మూసు కుంటారు ' అన్న్యాడు సిన్ని గాడు.
ఈ లోపల ఏం జరిగిందో , ఏం మాట్లాడు కున్న్యారో ఇద్దురూ ఎడ మొగం పెడ మొగాలతో ఒకరి తర్వాత ఒకరు రాగిమాను పెంట సేరుకున్న్యారు. ఇస్కూలుకు లీవు బెట్టి జయచంద్రుడు కూడా ఇంట్లోనే ఉండాడు.
వాళ్ల నాయిన రాంగానే జయచంద్రుడు , ఆయనా కలిసి బయటికి బొయినారు. . సుశీలలో గుబులు మొదులయింది.
కొంచేపిటికే సిన్నిగాడు దిగినాడు. కల కల లాడతా వున్ని కొత్త పెండ్లి కూతురు వాళ్ల నాయిన్ని సూడంగానే ఉల్సర పోయింది. ఎందుకిట్ల సేసినానా అని బెంబెలెత్తి పొయింది.
తలుపెనక నించి బయటికి రావడానికే భయ పడింది. తండ్రి ఎంత మూర్ఖుడో ఆ బిడ్డికి తెలుసు.
' సిత్తూరిస్కూలుకు పోతానంటేనే ఒప్పుకోనొడు ఈ పెండ్లిని మాత్రం ఒప్పు కుంటాడా. నన్ను సంపేసేది కాయం ' అనుకుంటా ఉంది.
పిలవంగానే వాళ్ల నాయనికి బయ పడి ఆయనెంట గొర్రి మాదిరిగా తలొంచు కోని వొరిగి పల్లికి ఒచ్చేసింది. ఆడే సూస్తా ఉండి కూడా జయచెంద్రుడు అడ్డు పడనప్పుడు ఆ బిడ్డి మాత్రం ఏం సేస్తాది పాపం .
ఈ వూర్లో వాళ్లకు ఇసయం తెలిసి పోయినట్లే సిన్ని గాడు తిరిగి ఊరు చేరే పాటికి మా ఊర్లోను గుట్టు రట్టయింది.
కాని అలిగి పెద్ద కూతురింటికి పొయ్యిందని, వాళ్ల నాయిన బొయ్యి పిల్చుకోనొచ్చి నాడని అడిగినోళ్లకు అడిగినట్లే సెప్పింది. నమ్మి నొళ్లు నమ్మినారు. లేనోళ్లు 'ఆహా బిత్తిరీ' అనుకున్న్యారు.
వారం తిరిగింది . సుశీలకు మొగిలి దేవలం లో పెండ్లంట అని ఊరంతా సెప్పు కుంటా ఉండంగానే పచ్చి టెంకాయ మట్టలతో , గడపలకు పసుపు కుంకాలతో సిన్ని గాని ఇల్లు కళ కళ లాడింది.
దెగ్గిరి బందువుల్ని దీసుకొని పెండ్లికి బయలు దేరినారు. జయచంద్రుడోళ్ల అక్కోళ్లు నాలుగు దినాలుగా అయిపు లేరు.
ఆ పొద్దు సాయింత్రమే మేల తాళాలతో పెండ్లోళ్లు రచ్చ బండ దెగ్గిరి కొచ్చినారు.
జయచంద్రుని చిటికి నేలు పట్టుకొని సుశీల . కూడా వుండే బందు వర్గం లో గోయిందప్ప కుటుంబం. అందరి కండ్లు ఎడల్పయినాయి. నోళ్లు మూత పడినాయి.
రాదాబాయి పెండ్లి అనుభవంతో ఊర్లో వాళ్ల నోరు మూయించిన సిన్ని గాడిప్పుడు శానా మందికి ఆదర్శం. రొండో కులాంతరం పెండ్లి జరిగిన మా ఊరు మాకు గర్వ కారణం .
మహాసముద్రం దేవకి
10-11-2018
Comments
Post a Comment