పరిశోధనలో పదనిసలు - 11
నా పరిశోధనకు కావలసిన వస్తు సామగ్రి సిద్ధమయింది. ఇంక రాయడం తరువాయి. మొదట బాలసాహిత్యానికి సంబంధించి పలువురి వ్యాసాలు క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకున్నాను . బాల్యమంటే ఏమిటో అందరి నిర్వచనాలు కోడ్ చేస్తూ నేనూ నిర్వచించాను.
బాల్యం పుట్టినప్పటి నుండి ఎంతవరకు అనే విషయం లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు 14 యేండ్ల వరకు బాల్య దశ అన్నారు. కొందరు 16 అన్నారు . మరికొందరు 18 వరకన్నారు. వాళ్లు చెప్పిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ ఫుట్ నోట్స్ లో వాళ్లు ఎక్కడ చెప్పారో రెఫరెన్స్ లు ఇస్తూ నా అభిప్రాయంగా 15 వరకు బాల్యమని నిర్ణయించాను.
మా గైడు నిర్మలా మేడం కు మా చిన్నాన్న గారికి చూపిస్తే థీసిస్ గాలివాటంగా కాకుండా రెఫరెన్సు లు ఇస్తూ రాసినందుకు మెచ్చుకున్నారు.
అంతకు ముందే చాలా మంది పరిశోధక గ్రంథాలను చూశాను . ఎలా రాయాలో అర్థం చేసుకున్నాను . మొదటి రెండు చాప్టర్ లు రాయడానికి మొదలి నాగభూషణ శర్మ గారి తెలుగు నవలా వికాసం బాగాతోడ్పడింది. ఇక్కడ ఆయన గురించి కొంత చెప్పడం అవసరం.
మొదలి నాగభుషణ శర్ గారు ఏడేండ్ల వయసు నుండే కళారంగానికి సేవ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. నటన, నాట్యం , రచన, పరిశోధన , ప్రచురణ, ప్రదర్శన, ఆయన నర నరాల్లో పాతుకు పోయిందని చెప్పాలి. 70 కి పైగా నాటికలను రాసి ప్రదర్శించారు. నటరాజ రామకృష్ణతో కలిసి నాటక రంగాన్ని అభివృద్ధి చేశారు. కన్యా శుల్కంలో మధురవాణి పాత్రను పోషించి యాభైకి పైగా ప్రదర్శన లిచ్చారు. ఆంగ్లనాటకాలను మన సంస్కృతికి అనుగుణంగా అనువదించి ప్రదర్శించారు .తోలుబొమ్మల కళాకారులను జపానుకు తీసుకెళ్లి చాలా నగరాల్లో ప్రదర్శన లిచ్చి తెలుగు వాళ్ల ఖ్యాతిని అంతర్జాతీయం చేశారు.
ధర్మవరం రామ కృష్ణమాచార్యులు, ఈలపాట రఘురామయ్య, స్థానం నరసింహారావు మొదలయిన వాళ్ల జీవిత చరిత్రలు రాశారు. తెలుగు జానపద కళా రూపాలపై పరిశోధన చేశారు. సురభి నాటక రంగ చరిత్రను రాశారు. మధ్యలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రంగాల్లో ఎవరైనా పరిశోధన చేస్తే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని.
హైదరాబాదులో ఉస్మానియాలో వారిని మూడు సార్లు కలిసిన విషయం చెప్పడం మరిచే పోయాను . ఆయన రాసిన తెలుగు నవలా వికాసం నవలల పైన పరిశోధన చేసే వాళ్లకు ఒక మార్గదర్శి. వెలుగును ప్రసాదించే దారి దీపం .
పెద్దవాళ్లలో ఒక వయసు వచ్చాక పెద్దగా పెరుగుదల ఉండదు. పిల్లలకు అలా కాదు. శారీరకంగాను, మానసికంగాను వాళ్లలో కలిగే మార్పులు ప్రతి ఆరు నెలలకు స్పష్టంగా కనిపిస్తాయి . అందుకని పదిహేనేండ్ల బాల్యాన్ని మూడు దశలుగా విభజించి శ్రవ్య, దృశ్య . పఠన సాహిత్యాల్లో వాళ్లు కనబరిచే అభిరుచులను ప్రస్తావించాను . ఆతర్వాత బాల సాహిత్యమంటే ఏమిటో చెప్పాను. పెద్ద వాళ్ల సాహిత్యం కంటే అది భిన్నంగా ఎలా ఉంటుందో చెప్పాను. బాల సాహిత్య స్వరూప స్వభావాలను అంచనా వేశాను. ఒక్కో దశలో పిల్లల మనస్తత్వం లో వచ్చే మార్పులు గురించిచెప్పాను.
రెండవ చాప్టర్ ' బాల సాహిత్య వికాస చరిత్ర ' దీనికి సంబంధించిన వస్తు సామగ్రి సేకరించడానికి నేను పడ్డ తిప్పలు గురించి ముందే చెప్పాను కదా! దాన్నంతా క్రమంలో అమర్చేసరికి నా తల ప్రాణం తోక కొచ్చింది. కొత్త టాపిక్ ఎందుకు తీసుకున్నానా అని వాపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ప్రాచీన కాలంలో పిల్లలకు ప్రత్యేకంగా రచనలంటూ లేవు . రుక్మిణీ కల్యాణం , గజేంద్ర మోక్షం, సుమతి శతకం, వేమన శతకం మొదలైన పెద్ద వాళ్ల సాహిత్యం నుంచి కొన్ని భాగాలను ఎన్ను కొని బాలసాహిత్యం కింద జమకట్టి అదీ విద్యనభ్యసించే పిల్లల చేత బలవంతంగా కంఠస్థం చేయించే వారు.
ఆధునిక యుగ ప్రారంభంలో సంస్కృతం లోని పంచతంత్ర కథలు తెలుగులోకి అనువదించ బడ్డాయి. అవన్నీ పశుపక్ష్యాదుల్ని పాత్రలు గా తీసుకొని అల్లిన నీతి కథలు . అవి పిల్లల ప్రపంచంలో అద్భుతమైనవని చెప్పాలి.
ఆంగ్ల సాహిత్య ప్రభావ కారణంగా పిల్లలకు ప్రత్యేక మైన సాహిత్యం అవసరమని గుర్తించిన కొంతమంది రచయితలు ప్రత్యేకంగా పిల్లల కోసం రచనలు చెయ్యడం మొదలు పెట్టారు . ఎన్నో ఆధునిక సాహిత్య ప్రక్రియలకు ఆద్యులయిన వీరేశలింగం పంతులు గారే ఇంగ్లీష్ లోని
' Aesop's fables ను ( ఈసపు నీతి కథలు) 'నీతి కథా మంజరి ' పేరుతో తెలుగులోకి సులభ గ్రాంథికంలో అనువాదం చేశారు. ఒక కథ చెప్పడం దాని సారాంశాన్ని చివర ఒక ఆట వెలది పద్యంలో పొందు పరచడం ఆయన చేసిన పని . ఉదాహరణకు ఒక పద్యం చూద్దాం.
అనుభవంబును బట్టియే అవని యందు
జనులకును తెల్వియబ్బుట సహజ గుణము
కాలు గాలి శ్రమంపడు గండు పిల్లి
నిప్పు వద్దకు పోవునే ఎప్పుడయిన
స్త్రీల కోసం' సతీ హిత బోధిని , ' స్త్రీ నీతిదీపిక ' రాసిన పంతులు గారు పిల్లల కోసం బాదంకాయ, కణుదురీగ , వెలలేని చిన్న మూలిక మొదలయిన రచనలు చేశారు. కాని అవన్నీ సరళ గ్రాంధికం లోనే ఉన్నాయి.
సులభమైన శైలిలో వ్యావహారిక భాషలో ఉంటే పిల్లలే స్వయంగా చదుకుంటారని భావించి గురజాడ అప్పారావు ఒక గేయం రాశాడు. అది కొంచం చూద్దాం. చిన్నప్పుడు మీరు పాడుకొనే ఉంటారు. ఆ గేయం:
అరటి కాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి
కలిసి మెలసి తిందాం
కతలు వెతలు విందాం
ఏనుగెక్కి మనం ఏ ఊరెళదాం
ఏనుగెక్కి మనం ఏలూరెళదాం
గుర్రమెక్కి మనం ఏ ఊరెళదాం
గుర్ర మెక్కిమనం గుంటూరెళదాం
ఇలా సాగుతుందా గేయం . గురజాడ గారు రాసిన పూర్ణమ్మ కథను కొంత ంసంది బాల సాహిత్యం కింద జమకట్టారు. ' తల్లులు గన్నా పిల్లల్లారా' అని సంబోధించినాడు కాబట్టి .
బహు భాషా వేత్త , హేతువాది , వ్యావహారిక భాషోద్యమానికి ప్రాణం పోసిన గిడుగు తామ్మూర్తి పంతులు గారి కుమారుడు గిడుగు సీతాపతి . అతనే అసలు సిసలైన బాల సాహిత్యానికి ఆద్యుడు . నవల, కథానిక మొదలయిన ఆధునిక ప్రక్రియల లాగే బాల సాహిత్యం కుడా ఆంగ్ల భాషా ప్రభావం వల్లే తెలుగులో ప్రవేశించింది.
తొమ్మిదవ తరగతిలో The boys own Annual అనే పుస్తకం గిడుగుకు బహుమతిగా లభిస్తే పిల్లలే స్వయంగా అర్థం చేసుకోగలిన అందులోని రచలను చూసి అలాంటి రచనలు తెలుగు పిల్లలకు అందుబాటులోకి తేవాలని స్వయంగా రచనలు చేసి బాలానందం, బాలవినోదం పేర్లతో పుస్తకాలు ప్రచురించారు . ఆయన రచనల్లో ఎలుకా- పిల్లి, రైలు బండి, చిలుకమ్మ పెండ్లి , ఈగా- సాలీడు గేయాలు బాగా ప్రచారాన్ని పొందాయి.
అతని తర్వాత స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన చింతా దీక్షితులు పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా గేయాలు రాసి 'లక్క పిడతలు ' పేరుతో ప్రచురించారు. అందులో హనుమంతుని తోక అనే గేయం పిల్లలందరిని బాగా ఆకట్టుకొంది.
ఆధునిక బాలసాహిత్యం పుట్టి వికసించడానికి వీళ్లిద్దరూ ఆద్యులు . తర్వాత చాలా మంది బాల సాహిత్య రచనలు చేశారు . బాల సాహిత్య వికాసంలో ప్రధానంగా నేను పొందు పరచిన వివరాలు ఇవి .
బాల సాహిత్య రచయితలు
పిల్లల పత్రికలు
బాలానంద సంఘాలు
బాలల సంస్థలు
బాల సాహిత్య రచనాలయాలు
బాలల చలన చిత్రాలు
బాలల అకాడెమీ .
ఇవన్నీ కూడా బాల సాహిత్యం ఒక ప్రత్యేక పక్రియగా నెలకొనడానికి తోడ్పడ్డ అంశాలే . ఈ వివరాలు తెలుసుకోవాలంటే నా ' తెలుగు బాల గేయ సాహిత్యం ' చూడండి .
మహాసముద్రం దేవకి
24 - 10 - 2022
Comments
Post a Comment