వరిగ పల్లె ముచ్చట్లు: 15
మా బాయీ కుంట
మా యింటి సుట్టూ చెక్కు బంది ఎకరా ఉంటాది. దాని వల్ల మాఇల్లు ఊర్లో ఇసిరేసి నట్ల ఊరికి కొంచిం దూరంగా ఒక సివరుంటాది.
ఏరు బందం పొయినప్పుడు మాతాత ఊరి మద్దిలో ఉండే ఇంటిని ఇద్దురు తమ్ముళ్ల కిచ్చేసినాడంటా . ఇంగాడ తావు ల్యాక పోతే ఊరి కానుకోనుండే ఎకరా సేన్లో కట్టు కున్న్యాడు ఇల్లు. అందుకే మమ్మల్ని సేన్లోళ్లని పిలస్తారు.
మా ఇంటి కాను కోనుండే ఎగవింటోళ్లు మా తాతోళ్ల కాలంలో ఏరు బందం పోతే వాళ్ల ఒగిల్లు నాలుగిండ్లయినాయి.
గొడ్లను కట్టేసు కోను, నీళ్లూ గీళ్లూ పోసు కోను పెల్లి గిల్లీ లేదని వగస్తా ఉండ్రంట వాళ్లు . ముఖ్యంగా స్తానం పాడూ సేసుకోను పెల్లి లేక ఆండోళ్లు పడే ఇబ్బందుల్ని గెవనించిన మా తాత ఒగ ఇరవై అంకనాల తావును ఉత్త పున్న్యానికి ఒదిలేసి 'కావల్సింది కట్టుకోపోండి ' అనేసినాడంటా .
రాను రాను వాళ్లే మాకు తల మింద పెద్ద గుండై కూసున్న్యారు. గెడ్డకు మించి నోళ్లయి మా బూములకే మెల్లింగా ఎసురు బెట్టడం మొదులు బెట్న్యారు .
కయ్యల కాడా , సేన్ల కాడా గెనాలు కొంచిం కొంచిం తొవ్వుకుంటా వాళ్ల బూముల్లో కలుపు కుంటా ఒచ్చినారు వాళ్లు .
మా గుర్రాలమిట్ట మామొళ్లది మా ఊర్లో రెండున్నరెకరాల సేనుంది. మేము పుట్టక ముందునుంచి ఉపరాలకు సెనిగ్గింజిలేసుకోని మేమే అనుభోగిస్తా ఉన్న్యాము దాన్ని . వాళ్లు ఈ ఊరికొచ్చి సేద్యం సెయ్యలేక మమ్మల్నే సేసుకోమన్యారంట. అయినా మాయమ్మ పెసులూ, అలసందలూ వాళ్లకు కావాల్సినంత పంపించి కొంచిమన్నా రుణం దీర్సు కొనేది.
అది ఎప్పుటి కైనా పొటుకే అని దుడ్లిచ్చి మా నాయిన పేరుతో రాసు కున్న్యాడు దాన్ని . ఆ సేన్లోకి బోనూ రానూ కట్టేగాలవ కట్ట మింద బండి బాట కూడా ఉండాది.
మాయమ్మా వాళ్ల నాయిన యాడేడ వాళ్ల సేన్లుండాయో ఆడంతా సుట్టూ గెనేల్లో తాటి ముట్టిల్ని నాటినాడు. దాన్ని సూసీ , మా తాత కూడా సెప్ప బట్టీ గుర్రాల మిట్టోళ్ల సేను సుట్టూ మాయమ్మ కూడా తాటి ముట్లు నాటిందంటా .
అవి మేము ఇస్కూలుకు బొయ్యే వొయసప్పుడు కాపు కొచ్చినాయి. మాంత మైన తాటి గెలలతో ఒక యాభై సెట్లదాకా ఉండేదా! ఎండా కాలం దినామూ తాటి నుంజులు తినడం తోటే మా కడుపులు నిండి పోయేవి.
తాటి కాయిలు కొట్టుకొని మా సేద్ది గాళ్లు ఇట్ల రాంగానే తాటిమాన్ల కాడ దొంగగా తాటి కాయిలు గొట్టుకొనే ఊర్లో వాళ్ల రావిడి ఎక్కువై రచ్చ రచ్చయ్యేది. దినామూ వాళ్లను అర్సీ అర్సీ మా యవ్వ మాయమ్మ అలిసి పొయ్యేటోళ్లు.
మా నాయిన మాత్రం ' ఊరికే ఎందుకు యాకారతారు. వాళ్లకు కాపలా ఉండడం మన తరం గాదు . అయినా అన్ని కాయిలు మనం మాత్రం ఏమి సేసు కుంటాము. పాపం , లేనోళ్లు. తినే ఓళ్లను తిననీయండి. పున్నిమన్నా దక్కతాది' అనేటోడు.
ఇప్పుడు మా నాయిన, అమ్మ ఇద్దురూ లేరు .
మా సిన్న తమ్ముడు కూడా కాలం సెయ్యడం , పెత్తమ్ముడు దేశం కాని దేశం అమిరికాకు బొయ్యి ఆడే ఉండి పోవడంతో ఎక్కడ ఈలు దొరికితే ఆడ సేనూ గీనూ , సెట్టూ సేమా ఎవురికి దొరికింది వాళ్లు వాళ్ల ఎదాన ఏసుకుంటా ఒచ్చినారు .
గుర్రాల మిట్ట సేనుకాను కోని మా ఎగవింటోళ్ల సేన్లుండాయి.
ఒగ దినం మా సెట్లలో తాటి మట్టలు కొట్టు కోని వాళ్ల సేన్లో అనగ బెట్టు కుంటా ఉండారని ఎవురో వొచ్చి సెప్తే మాయక్క పరిగెత్తి పొయ్యింది.
'ఏంది సంపూర్ణక్కా మా సెట్లలో మట్టల్ని అడక్కుండానే అన్ని కొట్టుకున్న్యారు? ' అని అడిగింది మాయక్క.
దానికి ఆ యమ్మ సెప్పిన జబాబింటే మీరూ ముక్కు మింద ఏలేసుకుంటారు.
' కనా . నాటింది మీయమ్మే నాయినా . కాదన్లేదు. కానీ అమ్మకు తెలీకుండా మా నేలలో నాటింది జోతీ. అందుకే అవి మొత్తంగా మాకే సెందతాయి కదరా' అనిందంటా నవ్వతా . సావు కబురు సల్లంగా సెప్పినట్లు .
ఏం మాట్లాడలో తెలీకుండా నోరు మూసు కోని ఒచ్చేసింది మాయక్క.
సందకాడ మా ఊర్లోనే ఉండే మా మేనమామకు ఇసయం సెప్తే ' యాడా బోదు సర్వే వాళ్లొస్తే తేలి పోతుంది. అయినా మిగిలిన మూడు పక్కల సేన్లలో వాళ్లూ మీ యమ్మ నాటిన సెట్లను మాదీ అని రాలేదు . ఈ పక్క మాత్రం వాళ్ల సేన్లో నాటిందంటనా మీ యమ్మ. ఏం మాటల్లే. మద్దిలో ఉండే గెనాన్ని ముక్కాలు బాగం ఒదిలి మీ సేన్లోనే నాటింది మీ యమ్మ. అది ఊరందరికీ దెల్సు. ఆ సెట్లు మీవే యాడికీ బోవు పో' అని దైర్నం సెప్పి పంపించి నాడు మా మామ.
మాది మొగ దిక్కు లేని సంసారం అయి పోయింది. బాయికాడికి పొయ్యేదెవ్రు? సెట్టూ సేనూ సూసు కొనేదెవురు? అందుకే ఇష్టా రాజ్య మైపోయింది.
ఎవురికి దక్కింది వాళ్లు సెట్లు కొట్టి అమ్ము కొనేది. సేన్లో అడక్కుండానే పంట బెట్టు కొనేది . దిక్కూ దివాణం లేని కొంపైపోయింది మాది.
మొన్నీ మద్య బాయి కుంటా సూసుకో కున్న్యా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్ని మా బావ కాలం జేసినాడు. అప్పుడు పొయినాము మా బాయి కాడికి. ఆయిన్ని తాపన జేసేందుకు . మా కడుపులు కాలి పొయినాయి. ఆడుండేది సూసే సరికి.
బాయి గుడ్డంలో మిరప సెట్లు నాటినారు. ఎవురంటే కిష్ణ మూర్తి అన్రి. మమ్మల్ని అడగలా పెట్టలా. ఇంగో సోట గొడ్లకు గెడ్డి ఏసు కున్న్యారు. ఎవురు అంటే ? మూర్తి గాడు అన్రి. ఇంగో పదైదు గుంట్ల గుడ్డంలో ఉలవలు సల్లినారెవురో! సుట్టు అడివి మాదిరుండే పెద్ద పెద్ద మాన్లన్ని ఒగటంటే ఒగటి లేదు .
నాలుగు దినాలు బొయినాక అదే పనిగా బొయినాము బాయి కాడికి . పొకూ వర్తూ తెల్సుకుందామని .
సెరువంతా యాడ సూసినా ఇటిక శూలలు . వగా వాకూ ల్యాకుండా అడ్డం దిడ్డంగా. ఇటికి పెల్లల కోసం తొవ్విన గుంతలు సెరువంతా బాయిల మాదిరిగా .
ఒకప్పుడు సెర్లో దూరి బాయి కాడికి బోతా వుంటే ఎంత కుశాలుగా ఉండేది. సెరువు నిండి నప్పుడు సూడాల దాని సొగసు . నడ్సి పొయ్యే దోవంతా కూడా నీళ్లుండేవి. ఆ నీళ్లలో కాళ్లను తప తప లాడించు కుంటా నడ్సే వాళ్లం. ఇప్పుడా దొవేమయ్యిందో !
సెర్లో ఒక కసిం గుంత ఉండేది .దాని సుట్టు రెల్లు పొదలు , సర్కారు సెట్లు . నీళ్ల తగ్గతా వొచ్చే కొద్దీ గ్యాలం ఏసి సేపలు పట్టు కొనే వాళ్లం. ఆకిరికి నీళ్లయి పోయి బురదలో కాళ్లు దిగబడతా ఉంటే ఊరి జనమంతా ఉల్స పిల్లల కోసం మంటి ముంతలు బట్టుకోని తారాడే వాళ్లు. ఆ కసిం ఇప్పుడు పూర్తిగా పూడిపోయుండాది.
సెరువు సుట్లా ఉండే బండ్రాళ్ల మద్దిన యాడ సూసినా అడివి మల్లి పొదలుండేవి. ఎండా కాలంలో ఆకులు రాలి పోయి తెల్లంగా ఎన్నెల మాదిరిగా ఇరగ కాసేవవి. ఏమైనాయో!
బల్చ సెట్లలో పండ్లు కోసుకొని తిన్ని గెవనం అట్లే ఉండాది. కానీ ఒక సెట్టు గూడా కంటికి కానరాలా.
ఆ తావంతా ఇప్పుడు కూలోళ్లు ఏసుకున్ని జోబిడీలతో నిండి పొయ్యుండాయి . ఒగ సిన్న ఊరు మాదిరుంది ఇప్పుడక్కడ .
దిస మొలతో వొళ్లంతా దుమ్ము గొట్టు కోని వాటి ముందు ఒక ముగ్గురు పిలకాయిలు ఆట్లాడు కుంటా ఉండారు . ఒక గుడిసి ముందు దగ దగా పొయ్యి మండతా ఉండాది . పొయ్యి మింద కుండలో ఎసురు కుత కుత లాడతా ఉండాది. పైకి ఎగబడి ఎకసెక్కా లాడే మరదలు పిల్ల మాదిరిగా వగలు బోతా ఉండాది పొగ .
జాకిట్టు కూడా ల్యాకుండా మాసిన సీరతో ఉన్ని యాబయ్యేండ్ల బాశాలి శాటలో బియ్యం సెరగతా రాళ్లేరుకుంటా ఉండాది .
పక్క గుడిసి ముందర ఒంటి మింద గుడ్డల్లేని రొండేండ్ల పిల్లది కాళ్లారేసుకొని రొండు కాళ్ల మద్దిలో ఉన్ని సత్తు బోకి లోంచి సద్దన్నం తింటా ఉండాది. . ఎదురుగా బలంగా ఉన్ని కుక్కొకిటి పండుకోని ఒగరస్తా ఆ బిడ్డినే గమనిస్తా తట్టలో సెయి బెట్టి నప్పుడు తట్ట పక్క, నోటి దగ్గరికి సెయి బొయినప్పుడు నోటి పక్కా సూస్తా ఉండాది. నాలుగు మెతుకులు ఇదిలిస్తా దేమో అని.
యాడేడ ఏ బండ ఎట్ల ఉండేది , ఏ చెట్టు యాడ ఉండేది కండ్లలో మెదలతా పారాడతా ఉండాది నాకు .
అడవి మల్లి పూలు కోసుకొని అంటి నార సీల్చు కోని చేత్తో పూలు గట్టడం రాక కాలి బొటన ఏలికి దారం ఏసుకోని కట్టుకొనే వాళ్లం . నేనూ , పుల్లూరోళ్ల నీల, నడుపబ్బోళ్ల కాంత, కర్నమోళ్ల యామలత, మా పెద నాయిన కూతురు ఆనందా. కాటమ రాయుని బండ మింద కూసోని కథలు సెప్పుకున్ని దినాలు గెవనానికొచ్చి దిగులు సుట్టు ముట్టింది . మళ్లీ ఆ దినాలు రావని .
ముళ్ల గోరింట పూలను కూడా వదిలి పెట్టే వాళ్లం కాదు. ఎప్పుడెప్పుడు పూలు కట్టు కుంటా ఏమేం మాట్లాడుకున్నామో అన్నీ గుర్తొస్తా ఉండాయి.
కాటమ రాయుని బండను కూడా సీల్చి చెండాడినారు ఇటిక బట్టీలోళ్లు. పూజలు సేస్తా ఉన్ని బండని కూడా ఒదిలి పెట్ట కుండా దాన్ని కూడా లేపి పక్కకు దోసేసుండారు.
దొంగ నా కొడుకులు యాడినించో ఒచ్చి ఊర్ని నామరూపాలు ల్యాకుండా జేసి నేలా నెట్రా సర్వ నాసినిం సేసేసి నారు.
ఇటికి పెళ్లలను కాల్చే వాళ్లే మా మాన్లన్నీ కొట్టి తోపంతా కాలీ సేసి నారని సుబ్బరం, ఎంకోబు సెప్ప కొచ్చినారు. మా బాయికవతల వాళ్ల నేల లుండాయి. వస్తా పోతా గెవనించినట్టుండారు.
'సూసి నోళ్లు ముందే మాకొక మాట సెప్పొద్దా ' కొంచిం నిష్టూరంగానే అంట్ని .
' మేమే దండించినామమ్మా . వాళ్లు ఇరువారం రవుడీ ముండా గుంపు . వాళ్ల నోటికి బొయ్యి జయించనవతాదా ' పెద్ద పెద్దోళ్లుండారు వాళ్లెనక అన్న్యాడు సుబ్బరం .
మన సొత్తు మనం ఎప్పుటికప్పుడు ఒక కన్నేసి పెట్టి అనవరించు కోవాల గాని ఇప్పుడు యాకారి ఏం లాబం అనుకోని నోరు మూసుకున్నాము.
బాయి సుట్టు పక్కల ఉండే వాళ్లు బూముల్ని అమ్మ నియరు. ఏరే వాళ్లను కొననియరు. వాళ్లూ కొనుక్కోరు. ఎట్టి కొచ్చిందని అన్నీ వాళ్ల యదాన ఏసుకుంటా ఉండారు గదా! దండక్కు వస్తా ఉంటే ఇంకెందుకు దుడ్లు బోసి కొనుక్కుంటారు? శానా తెలివి మీరినారు జనం.
' టెంకాయ తోపులోకి పొయ్యి పొదామా ? ' అడిగినాను మా సెల్లిని .
' ఆడ ఏముందని పోతారమ్మా . సూస్తే తట్టుకోలేరు మీరు ' అన్న్యాడు సుబ్బరం.
' రేప్పొద్దున్ని వస్తాం పదకా' అని మా సెల్లెలు సెప్తే సరే అని ఇంటి కొచ్చేసినాము .
మర్స నాడు మాసంద్రం నించి సుట్టా లొచ్చినారు. ఇల్లు కదల్ను కాలా .
నాకేమో బాయి దెగ్గిరికి బొయ్యి మొత్తం నేలా నెట్రా , సేనూ సెట్టూ సుట్టి సూసి రావాలని ఉండాది . ఏదో ఒక గెతి పట్టించక పోతే ఉండేది కూడా ఊడ్సుకొనేట్లుండారు .
అ మర్సనాడు తెల్లర్తో లెయ్యంగానే నేను మా సెల్లి బయలు దేరినాము. మా తమ్ముని కొడుగ్గూడా వస్తే ఒగ సారి అంతా వాడికి సూపెట్టినట్ల ఉంటాదని వాన్ని లేపితే అందురూ పోదామని పిలకాయిల్లందుర్నీ లేవ గొట్టినాడు వాడు.
అందురూ కదిలే సరికి పొద్దెక్కింది. ' ఇంగ ఒకే సారి నాష్టా తిని దోరండి ' అనింది మాయక్క . తొమ్మిది అవతా ఉండంగా బయలు దేరినాము.
కర్న మోళ్ల మర్రి మాను కాడికి బొయినాము.ఆ మానును ఆనుకోని సెరువు కట్ట మొదలవతాది. కుడి పక్క సెర్లోంచి పోతే బాయికాడికి పొతాము. మర్రి మాను కాడ ఎడం పక్క బండి బాటలో బోతే టెంకాయి తోపు మళ్లోకి బోతాము.
రెంటికీ మద్దెన ఉంటాది పిడకలు దట్టే బండ. దాని మింద రాగులు, పెసులు , అలసందలు ....ఎండ బోసి ఒడుపుకునే వాళ్లు మా యమ్మోళ్లు. మేమూ బండ మింద కూసోని సెరుకులు దినుకుంటా సిన్నా సితక సాయం సేసే వోళ్లం. అది గుర్తొచ్చి కండ్లలో నీళ్లు నిల బడినాయి. మాయమ్మ ఇప్పుడు లేదు గదా!
కడిగిన ముత్తిం మాదిరిగా నిగ నిగ లాడతా ఉండే ఆ బండ ఇప్పుడు సెత్తా సెదారంతో శానా రోతగా ఉండాది.
బండి బాటలో బోతా ఉన్నాము . దానికి యడం పక్క కట్టే గాలవ ఒంపు దిరిగి పూర్తిగా దచ్చినం వైపు మరులుకోని పాంచెర్వులో కలస్తాది.
ఆడ మొదులయ్యింది మాకు మళ్లీ కడుపు మంట. ఎప్పుడూ నీళ్లు పారతా ఉండేది కట్టే గాలవ . ఎండా కాలం మద్ద్యాన్న మైతే సాలు ఇంట్లో వాళ్లు అరస్తా ఉన్న్యా పట్టించు కోకుండా ఆ నీళ్లలో దిగి ఈత కొట్టే టోళ్లం. అదిప్పుడు పూర్తిగా ఎండి పోయి ఉండాది. బూముల్ని మింగే కొరివి దెయ్యాలు దాన్నీ ఒదిలి పెట్లా . సన్నంగా పిల్ల కాలవ మాదిరిగా సిక్కి పొయ్యుండాదది.
ఒగప్పుడు కట్టే గాలవ మిట్ట మింద నేల తంగేడు సెట్లు పచ్చంగా ఇరగ గాసి నేల తల్లి మొగానికి పసుబ్బూసు కొనిందా అన్నట్లుండేది .
ఏటెంబడి కానగ సెట్లు, బాగి మాన్లు తలలిర బోసుకోని నీరెండలో తడార బెట్టుకున్న్యట్లుండేవి.
ఆడాడా ఎంపిలి సెట్లు సిన్న సిన్న పూల పావడాలు కట్టు కోని బొద్దుగా ఉండే ముద్దు పాపలు అప్పాలు దిరిగినట్లు గుండ్రంగా ఉండేవి .
ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా లేవు. కంకర కుప్పలు , వాటి మిసిన్లు సుట్టూ ఉండే బయళ్లే కాకుండా మనుసులు కూడా బూడిది బూసు కున్నట్టు యాడ సూసినా దూళీ దుమ్మూ .
రాజబంట్లు ఇప్పిన గొడుగుల్ని బట్టుకోని నిలబడి ఉండారా అనేట్లుండే మా ఊరి మణేగాడొళ్ల సేను గెట్నుండే ఈత సెట్లు ఒకటంటే ఒకటి దుర్బినీ ఏసుకొని ఎతికినా కనబళ్లా .
వాళ్ల మడి పక్కనుండేదే మా టెంకాయ తోపు సేను గుడ్డం .
ఎప్పుడో మా తాతల కాలంలో అది టెంకాయ తోపే. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక టెంగాయ సెట్ట్ను గూడా ఆడ కండ్ల జూళ్లా. ఐతేనేం , నీటి వసతి లేకపోయినా అది రాజనాలు పండే బూమి. . దానికి ఎడంపక్క నుండి కట్టే గాలవ వొంపు దిరిగి మళ్లీ తూర్పుకు దారి దీస్తాది.
మిట్ట నొదిలేసి పల్లంలో ఉండే పదైదు గుంట్ల కయ్యలో బైరొడ్లు సల్లేవోడు మానాయన. వానా కాలంలో ఎప్పుడూ ఆ కయ్యల్లో నీళ్లు నిలబడి ఉండేది.
మణే గాడోళ్ల మామిడి తోపులోంచి మా గుడ్డంలో అడుగు పెట్టంగానే ఆన్నించి మా బాయికాడికి బొయ్యే కాలి దోవలో ఎర్పడిన మూరెడు ఎడల్పు, సిటికినేల్లో సగం లోతుండే పల్లంలో కూడా నీళ్లు పారతా ఉండేవి. వాటిలో స్యాప్పిల్లలు గిలగిలలాడతా తోకాడించు కుంటా తిరగతా ఉంటే గెంటల తరబడి వాటిని సూస్తా ఆట్లాడు కొనే వాళ్లం.
అదంతా ఇప్పుడు కంకర మిసినోళ్లు దోలిన పనికిరాని చెత్త , రాళ్ల కుప్పలతో లారీల కొద్దీ సందు లేకుండా నిండి పోయింది. దాన్ని జూసిన మా కడుపులు బగ్గుమని కాలి పూడ్సింది.
ఎవుర్నడిగేది? వాళ్లకో సంగ ముండాదని , వాళ్లతో పెట్టు కుంటే బతికి బట్ట గట్టేది కష్టమని సెప్ప కొచ్చినారు ఆడుండినోళ్లు.
ఆ కంకర మిసన్లు ఆడ పెట్టడం వల్ల బూముల రేట్లు మితి మీరి పెరిగినాయి. కానీ మనం అమ్మాలంటే సగానికంటే తక్కవకిస్తే తీసు కుంటారంటా. అదీ వాళ్లు దయ దలిస్తేనే. ఎట్లాగు ఆ బూమిని వాళ్లే గదా వాడుకుంటా ఉండారు. ఆ దీమా వాళ్లది.
ఒకప్పుడు మా నాయిన తరం వాళ్లు ఆ ఊరి పెద్ద మనుసులుగా ఉన్నెప్పుడు ఊరంతా ఒకే తాటి మింద నడ్సేది. ఇప్పుడు పిలకాయిలు సదువుకోని మూల కొకరయి పొయినారు. దండించే దాత ల్యా. మద్దించే మామా ల్యా.
సదువు సాములు లేకుండా ఊర్లోనే ఉండి పొయినోళ్లు కూడా ఊరి కట్టుబాట్లు కట్ట దెంచు కోని పోవడం వల్ల శానా మంది ఎక్కన్నించో వొచ్చిన ఈ బలమంతుల మోసేతి కింద నీళ్లు దాగతా బతకతా ఉండారు.
ఒకప్పుడు పచ్చంగా ఉన్ని బీడు బూములు ఎండు దుమ్ముతో ఇరిగిన ఇటికి పెల్లలతో, చెత్త సెదారంతో రోతగా ఉండాది.
మా బాయికాడ తడి నేలలు మొదులైన సోటినించి దాని కానుకొని ఒగ ఐదునూర్లడుగుల ఎడల్పుతో నాలుగు పర్లాంగుల దాకా సదరంగా పెద్ద బండ పండుకున్న్యట్లుగా ఉంటాది.
దాని మింద దూర దూరంగా ఆడాడా బండ లేని సోట మంట్లో పెరిగిన కలింగి సెట్లు, పులెలగ పండ్ల పొదలు , రేంగి కంపలు , సీతా పండ్ల మాన్లు ఉండేవి. బాయి కాడికి బొయినప్పుడు ఎంత మంది కోసుకున్నా తరగ కుండా అవి తినడానికి పుంజిగా పలారాలు బెట్టి మర్యాద సేసేవి .అవన్నీ యాడ బొయినాయి ?
బాయి సుట్టూ బాదం మాను, జామ సెట్లు , బాయి గెడ్డ మింద గుల్ల మామిడి సెట్టు ఏమై పొయినట్లు ?
గుల్ల మామిడి పండ్లను ఒడి నిండా ఏసుకోని పప్పరమెంట్లు సప్పరించి నట్లు నోట్లో ఏసు కోని సప్పరించి గింజిని ఊంచేసే వోళ్లం. అంత సిన్నవవి. సెప్పలేనంత రుసితో తియ్యంగా ఉండేవి.
మా బాయి కీనేరు బాయి. ఆర్నెళ్లు కపిలి దోలి మడికి నీళ్లు పారిస్తే ఆర్నెళ్లు ఏకంగా బాయిలో నుంచే మళ్లోకి కాలవ తొవ్వి పారించే వాళ్లు .
ఇప్పుడా సెట్లూ లేవు. బాయి గెడ్డా లేదు. బాయిలో నీళ్లూ లేవు.
ఆ బాయి మద్దిలో ఒక బోరు , దానికో మిసినూ . అదీ ఎండిపోయి దిక్కు ల్యాకుండా ఒంటి కొమ్ము సొంటి పిక్క మాదిరిగా పాడు బడిన బాయి గుంతలో నిలబడి ఉండాది.
సరే దాన్ని సూసి అమ్మా నాయిన్లతో గూడా అన్నీ మాయమై పొయినాయి గదా అనుకుంటా మామిడి తోపు గెడ్డ నెక్కినాము. ఎక్కంగానే పనసపండ్లంత కాసే గెద్దా మామిడి మానుండే తావన దాన్నెవురు ఎదానేసు కున్న్యారో అది కనిపించల్యా.
యాడ సూసినా ఎండిపోయి కంపలు మిగిలిన పిశాచి పూల సెట్లు. మామిడి మానుకానుకోనుండే ఎలక్కాయి మానూ ల్యా. అవే కావు , యాబైకి పైగా రకానికో సెట్టు లెక్కన ఉండిన మామిడి మాన్లు అన్నీ ఎండి పొయినాయంటా .
అత్తి మాను గుడ్డం లోకి అడుగు బెట్న్యాము . మాను మొదుట్నించే కాసే అత్తి కాయల్ని మాయమ్మ ఇత్తనాలేర్పడక ముందే కోసి రొట్లో ఏసి దంచి తాలింపు జేసి కడుపులో పుండ్లు రాకుండా ఉంటాదని బలమంతంగా తినిపించేది. అదిప్పుడు ఎండి పోయి బారెడు మొదులు మాత్రమే మిగిలుండాది.
దాని పక్క నుండే రొండు ఇప్ప మాన్లు మాత్రం ఈకిలో మని ఊపిరితో ఉండాయి .
మాన్లన్నీ వానల్లేక బండ వడకు ఎండి పొయినాయన్రి. కాకులు దూరని కారడివి మాదిరిగా ఉండే మాయిడి తోపు చిన్న ముండ్ల సెట్లతో బిసో మనుండాది .
తోపు మద్దిలో మనిషి కంటే ఎత్తుండే పాము పుట్ట మాత్రం యదాప్రకారం ఉండాది. పుట్ట కవతల బండ రాళ్ల మద్య ఎర్రటి పూలతో ఉండే మోదగ మాన్లు కూడా లేవు. ఆన్నించే బండ మింద సేన్లోకి దోవ . పోబుద్ది గాలా !
అట్నుంచటే కొల్లోడొంకలో దూరి ఇంటి దోవ పట్ట్న్యాము. ఎండిపోయిన వొంకను జూస్తా ఉంటే కడుపులో కెలికి నట్లయింది.
సహజంగా ఉండే ఒనరుల్ని వస్తువుల తాయారీకని ముడి సరుకుగా వాడుకొని సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్న్యాడు గదా మనిసి.
ఒక పక్క దుడ్లు బలిసిన సావుకార్లు ఇంగా సంపదను పెంచుకోవాలనే దురాశతో ఇట్లా యాపారాలు బెట్టి సెట్టూ సేమను నాశనం జేస్తే నన్నే నాశనం జేస్తారా అని అది కన్నెర్ర జేసినట్లుండాది.
కొల్లోడొంక గెట్లో పెద్ద పెద్ద సిగర మాన్లు , కానగ సెట్లు ఉండేవి. వాటి నీడలో వొంక నీళ్లు సల్లంగా పారేవి. ఒక చోట పెద్దగా తాబేలు బొప్ప మాదిరిగా ఒంగి వున్ని బండ కింద సల్లటి నీళ్లల్లో మిల మిల లాడతా నడమాడే సిన్న సేప్పిల్లల్ని పంచలు పర్సి పట్టు కొని ఆడే కూర గాంచు కోని తినిన దినాలు గుర్తొచ్చింది. గుండి కాయిని ముండ్ల కంపతో గుచ్చినట్లనిపించింది.
తడి లేని ఆ వంకను సూస్తా ఉంటే నీళ్లలో ఉన్ని సేప్పిల్లల్ని గెట్టు మిందికేస్తే ఎట్లా కొట్టు కుంటాయో అట్లా మనసు గిల గిలా కొట్టుకునింది.
ఎండిన సెరువుని , సెట్టూ సేమా లేని సెరువు కట్టను , నీళ్లు లేని వంకల్ని, గెడ్డి మొలకలు గూడా లేని వాటి గెట్లను , రాళ్లూ రప్పల్తో నిండి ఎండిన ఒకప్పటి కీనేరు బావుల్ని , పైర్లు లేని పంట బూముల్ని , ని
Comments
Post a Comment