వరిగపల్లె ముచ్చట్లు : 16
ఆనంద
ఆనంద ఎవురో కాదు. మా యమ్మకు పెద్దక్క కూతురు. ఇద్దురన్నలు ఒగక్క తర్వాత పుట్టి అందురి సేతుల్లో అపురూపంగా పెరిగిన బిడ్డి.
మాంగరుపు రంగైనా దాని ముక్కూ మొగం సక్కంగా ఉంటాది. నా ఈడే దానిది గూడా . శానా తెలివయిన పిల్లని పేరు .
దాని తెలివి బతక నేర్చిన తెలివనీ, అది పొయిలో ఏస్తే పొంతలో దూరొచ్చే రకమని అంటారు మాయమ్మ మా పెద్దమ్మ లాంటోళ్లు శానా మంది.
అట్లాంటి సురుకయిన తెలివి తేటలు నాకు లేదే అని నా ఏడుపు. దాని ముందు కొన్ని ఇసయాల్లో సిగ్గు పడి పోతా ఉంటాను నేను.
మా ఊరికి కను చూపు మేరలో ఉండే కుక్కల పల్లి వాళ్లది. అయినా వాళ్ల ఇల్లుండేది మా ఊరికి కూతేటు దూరంలో . వాళ్లు ఊర్లో ఇల్లొదిలి పెట్టి బాయికాడే ఇల్లు కట్టుకోనుండారు.
ఆ బిడ్డి ఎక్కువుగా కుక్కల పల్లి పిలకాయిల తోనే తిరిగేది. ఆట్లాడుకునేది కూడా వాళ్లతోనే.ఇస్కూల్లో కూడా ఎవురి దోవ వాళ్లదే. ఇద్దురూ కల్సినామంటే అయివోర్లు తిడ్తారు మమ్మల్ని . సిదుగు పన్లు సేస్తామని .
కానీ సందు దొరికితే అది మా యింటికి వచ్చేదో నేను వాళ్లింటికో పొయ్యేదో సేసే వాళ్లం. ఇద్దురూ సేరినప్పుడు సెయ్యని తులవ పన్లు లేవు . దానితో సేరి నేను సెడిపోతా ఉండానని ఎప్పుడూ తిడ్తా ఉంటాది మాయమ్మ .
కానీ దాంతో తిరగాలంటే నాకెందుకో శానా ఇష్టం. రొండూర్లలో ఉండే అందురితోనూ పెద్దా సిన్నా అని ల్యాకుండా అది మాట్లాడ్తా ఉంటే ఇన బుద్దవతాది నాకు. నా కట్లా దైర్నంగా అందురితో మాట్లాడేది ఒస్తే ఎంత బాగుంటాదా అనిపిస్తా ఉంటాది .
దానంత తిండి పోతు ఇంగొకరుండరు. ఎప్పుడూ ఏదో ఒకటి నమల్తా ఉంటాది. పక్క నుండే నాకూ అంతో ఇంతో గిల్లి ఇస్తాది. అదిస్తాదని కాదు నేను దాని ఎంట తిరిగేది. దాని దైర్నం తెగింపు సూడ ముచ్చటేసి. నేనూ కొంచిమన్నా అట్లా మాట్లాడేది నేర్సుకుందామని.
దానికి ఇంట్లోని సిరు తిండ్లు తిని మొగం మొత్తిందనుకో! సెట్లలో ఉండే కాయిల మిందో, తోట్లో ఉండే సెరుకుల మిందో పడతాది .
వాళ్ల బాయికాడ కిచ్చిలి మాన్లో గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయిలు . అవి తిందామని ముందే కాయితం లో ఉప్పూ కారం పొట్లం గట్టు కోని పోతామా.
సెట్టెక్కాలని సూస్తాదది. ' ఒద్దు మే కోసుకోనొచ్చి కింద కుచ్చోని తిందాం ' అంటాను నేను. ఊహూ ఇనదు. నున్నంగా జారే జామ సెట్టైనా అలాగ్గా ఎక్కి దిగతాదది. నాకేమో మాన్లెక్కాలంటే మాంతమైన బయం.
సెట్టెక్కినాక ఒకటో రెండో కాయిల్ని కోసి కిందున్ని నాకు ఇసిరేస్తాది . అది ఆడే సెట్టు మిందే కోతి మాదిరిగా కూసుంటాది. కాయిల్ని ఒల్చి చీలికల్ని ఉప్పూ కారంలో అద్దు కోని అస్సూ ఉస్సూ అని తిని అప్పుడు సెట్టు దిగి ఒస్తాది.
'అదేమనంటే నాకట్ల తింటేనే తిన్నెట్లుంటాది' అంటాది.
దాన్ని సూసి ఊరికే ఉండే పానాన్ని ఉపద్ర బెట్టుకున్న్యానొక సారి నేను. అది అట్లా సెట్టెక్కి తింటా ఉంటే నాకూ మెర మెరా అనిపించి అదర్తా బెదర్తా మెల్లింగా సెట్టెక్కి నాను.
'ఏం కాదు ఎక్కు ' అని దైర్నం సెప్పిందది. సెట్టైతే ఎక్కేసినాను కానీ వొణుకు పట్టు కునింది నాకు. ఇంగ కాయిల్ని ఒల్చుకోని తినేదేడ?
అది వాటంగా ఉండే మూడు సన్న కొమ్మలు కలిసిన సోట తిష్టేసింది. నన్నేమో లావుగా పీటమాదిరుండాది ఈ కొమ్మ అని ఒంటి కొమ్మ మింద కూసోమనింది. రొండు సేతుల్తో పై కొమ్మను గెట్టింగా పట్టు కోని బాగానే కూసున్న్యాను . కాని కాయిని ఒల్చుకోని తినాలంటే రొండు సేతులూ కావాల్నా? ఇంగ సేతు లేవి?
దిగి పోతానని నేను ఏడస్తా ఉండా. అది పట్టించు కొంటేనా. దాని పని దానిది. నిదానంగా రొండు కాయిల్ని పస పసా మెక్కింది. ఒక సీలికను ఉప్పూ కారంలో అద్ది నేను ఒద్దు మొర్రో అని ఒగ పక్క ఏడస్తా ఉంటే నా నొట్లో కుక్కింది.
ఆణ్నించి కిందికి దూకి నన్ను ' మెల్లింగా దిగు బయం లేదు నేనుండా ' అని సెయ్యందించింది . కొమ్మను పట్టుకున్ని సేతుల్ని వొదలడానికే నాకు శానా బయంగా ఉండాది.
అది మళ్లీ దన దనా సెట్టెక్కొచ్చింది . ఇట్ల దిగు అని దిగి సూపించింది. నా సేత కాలా. ఇందాకా అది కూసోనున్ని కాడి కొచ్చి మూడు కొమ్మల మద్దిలో కూసో మనింది. కొమ్మ మింది నించి సెయ్యి తియ్యా లంటేనే యాడ పడిపోతానో అని బెదురుగా ఉండాది. పైగా సెట్లో ముండ్లొకటి. ఇంగా జాస్తిగా కాళ్లూ సేతులు ఒణకడం మొదులయింది.
అది నన్నే సూస్తా ఉండాది .దాని సూపు సూస్తా ఉంటే ఎందుకో బయమనిపించింది. అట్లా ఇట్లా సూసి ఉన్నెట్టుండి కొమ్మను పట్టుకోనున్ని నా సేతిని ఒక దాన్ని పెరికేసింది. ఉలిక్కి పడిన నేను ఇంగో సెయ్యిని కూడా నాకు తెలీకుండానే ఇడ్సిపెట్టేసినట్లుండా . పట్టు దప్పి కింద పడి పొయినాను. అక్కడక్కడా ముండ్లు గీరుకొని మంట.
సావు దప్పి కన్ను లొట్ట బొయినట్లయింది నా పని. సెయ్యిరిగి పూత్తూరు కట్టుతో మూన్నెల్లు నేను పడిన బాద పగోళ్లకు కూడా ఒద్దని పించింది. .
'ఇంగోసారి దాంతో సేరి తిరిగేది సూడల్ల, కాళ్లు రొండూ ఇరగ్గొట్టి కట్లు గట్టి కొట్టిడిలో పండ బెడ్తా' అని తిట్టింది మాయమ్మ.
ముందే మా యమ్మకు వక్క కొరికేంత సేపు కూడా తీరికుండదా. ఇంగ నాకు అన్నీ దెగ్గిరుండి సెయ్యాల్సొచ్చే పాటికి నిలుకూ నిబందం ల్యాకుండా ఐపొయింది.
మాయమ్మేదో కోపంతో అంటాది గాని ఒగూర్లో ఉండే పిన్నమ్మ పెద్దమ్మ బిడ్లు కలవ కుండా ఉండనవతాదా?
నేను కుడి సేతికి పుత్తూరు కట్టు గట్టు కోని ఇస్కూలుకు గూడా ఎగ నామం బెట్టి ఇంట్లో కూసో నుండా. దినామూ మా పెద్దమ్మోళ్లొచ్చి సూసి పోతానే ఉండారు. అది మాత్రం బయపడిందేమో శాన్నాళ్లు ఈ పక్క తొంగి సూళ్లా.
ఒగనాడు నంగి నంగిగా వాళ్లమ్మ కొంగు బట్టు కోని ఒచ్చింది . అది ముందు సెప్పకుండా ఉన్నెట్టుండి నా సెయ్యి పెరికి కింద పడి పొయ్యేట్లు సేసి నందుకు నాకు కోపంగా ఉండాది.
దాన్ని సూసి కూడా నేను మాట్లాడ కుండా మూతి ముడ్సుకున్న్యా. మా యమ్ముండాదే వాళ్లక్క ఏమను కుంటుందనన్నా లేకుండా తిట్టిన తిట్టు తిట్ట కండా తిట్టింది దాన్ని.
'ఎంత మూతి మింద కారూంచినా సిగ్గా శరమా దానికి . మళ్లీ వస్తా ఉండాది సూడు ' అనింది మర్స నాడు మాయమ్మ బయటి నించి ఇంట్లోకొస్తా
'ఎవురుమా ' అన్న్యా .
' అదే నీ అప్ప జెల్లి' అనింది
నాకు ఎవురా అనేది అది ఎదురు పడే దాకా అర్థం కాలా . ఈ సారి వస్తా వస్తా సంకలో వామన గుంటల పీట బట్టుకోనొచ్చింది.
మా యమ్మ ఏడ తిడ్తాదో అని వొచ్చీ రాంగానే 'పిన్నమ్మా ఈ బిడ్డికి సెయ్యి నొప్పిగా ఉంటాదని , ఆట్లాడ్తా ఉంటే నొప్పి మర్సి పోతాదని మాయమ్మ పంపించింది ' అనింది.
నాకూ ఈ సారి కోపం ఏడ బొయ్యిందో. దాని మాటల్ని ఇని పండుకోనుండిన దాన్ని లేసి కూసున్న్యా.
ఎప్పుడూ నొప్పి నొప్పి అని ఏడస్తా ఉండే నేను ఎడమ సేత్తో సింత పిచ్చిల్ని గుంతలో ఎయ్యడానికి శత్ర సెమగా ఉన్న్యా ఆటాడతా ఉంటే కుశాలుగానే ఉండాది .
నేనట్లా సతాయించ కుండా ఉండేసరికి మాయమ్మకు గూడా కొంచిం తెరిపిచ్చినట్లుండాది. ఆబిడ్డి ఇంటికి బొయ్యే టప్పుడు ' రేపూ రా పాపా ' అని సెప్పింది.
సెయ్యి బాగయింది. గెడ్డి దినే బుద్ద్యాడికి బోతాది. ముందు కంటే తిరుగుళ్లు ఎక్కువైనాయి. సెరుకులు దిన్న్యా సెరుకు దోటలో కూసోనే . పచ్చి మావిడి కాయిలు కోసుకున్న్యా ఉప్పూ పచ్చి మిరక్కాయిలు దీసక పోయి బాయి కాడే. ఏ కాయ అయినా బండ మిందే కచ్చా పచ్చా నలగ్గొట్టి తినేదే. పచ్చింత కాయిలయినా, జామ కాయిలయినా , కలింకాయలైనా, రేంకాయిలయినా .
సదివేది ఇద్దురుం ఒగే క్లాసే . అయితే ఇస్కూల్లో ఉన్న్యప్పుడు , ఇంట్రవెల్లులో నేనూ, నీలావతి, అంసవేణి ఒగ జెట్టుగా తిరిగే వాళ్లం . ఆ బిడ్డి వాళ్లూరి సెంద్రాతో , బాగ్గింతో ఎక్కువగా ఉంటాది. మొగ పిలకాయిలితో కూడా కలిసి బొంగరాలూ, గోలీ కాయిలు ఆడతాదది .
మా ఇస్కూల్లో ఇద్దురయ్యోర్లుండే వోళ్లు. పెద్దయివోరికి పిలక ఉండేది. కొంచం పెద్ద పిలకే .
అయివోరు అయిద్దాక ఎక్కాలు సదుంకోని రమ్మని జెప్పి మూడు దినాలయింది. ఒక దినం ఉండెట్టుండి అందుర్నీ సెప్పమన్న్యాడు. ఒప్ప జెప్ప నోళ్లను ఎండలో నిలబెట్టి ఒచ్చేదాకా సదవ మన్న్యాడు. అందురి కంటే శానా సేపే సదివిందిందది. రాలా. అదింకా తప్పులు సెప్తానే ఉండాది.
'నీ బుర్రలో తెలివికి బదులు ఉత్త బంక మొన్నుండాది పాపా పెద్ద రెడ్డి కూతుర్ననే తిమురు జాస్తి నీకు . తగ్గిస్తా ' అని అందురి ముందరా గుడ్లురిమి మరీ తిట్టినాడు అయివోరు దాన్ని .
మా ఇస్కూల్లు ఒకే మూడంకనాల జోబిడి. . అయిదో క్లాసు దాకా దాంట్లోనే . కాసర బీసరగా ఉంటాదెప్పుడూ.
అయివోర్లు ఏదైనా సదుంకోని రమ్మంటే బయటికి బోవాల్సిందే. బయట సెట్ల కింద కూసోని సదుం కోవల్ల. ఇంగ అయి వోరు పాటం సెప్పేటప్పుడు అందురూ బెంచీ సుట్టూ నిలబడాల.
ఒక దినం అయివోరు మిత్ర లాబం పాటం సెప్తా ఉండాడు. అన్ని కలాసుల కంటే మాదే పెద్దది. ఎనిమిది మందుండాము మేము.
సుట్టూ సేరి పాటం ఇంటా ఉండాము. ఆనంద అయివోరెనక సేరింది. కత శానా బాగుండాదా. మేమంతా కతలో నిండా మునిగి పొయినాము. అయివోరు గూడా గెవనించుకోల్యా.
ఎవురుకీ తెలియకుండా ఎప్పుడు కట్టిందో అయివోరి పిలక్కి పురికోసు కట్టి దాని కొనను కుర్సీకి కట్టేసింది. అప్పుడు సూసినట్లుండాడు దాని పక్కనే ఉన్ని పురుసొత్తం గాడు . వాడికి నవ్వు పట్ను గానట్టుండాది. కిసుక్కుని నవ్వినాడు.
' బడవా ఎవడురా నవ్వింది. అని ఇట్లా అట్లా మా కల్ల జూసినాడు. 'పుర్సొత్తం సార్ ' అన్న్యాడు సెంద్రం గాడు.
' ఈ పాటం లో నవ్వేదేముండాదిరా' ఇట్రా ముందుకు అని పిల్సినాడు. బెత్తం దీసుకోని వాన్ని సెయి సాప మన్న్యాడు. బెత్తాన్ని పైకి ఎత్తంగానే వాడు ఏటు బడకుండా తప్పించుకోను ఎన్నిక్కి జరిగినాడు.
వాడి సెయ్యి అందలేదని అయివోరు కోపంతో ముందు కొంగినాడు. అంతే ' అబ్బ ' అంటా పెద్దగా అర్సి కుర్సీలో కూల బడి పోయినాడు. అప్పుడు తెలిసిందందరికీ , ఆ బిడ్డి ఏం సేసిందో. సిన్నయివోరొచ్చి ఇప్పేదాకా అయివోరు పైకి లెయిలేదు.
ఆపైన అయివోరు దాని ఈపు పైన ఇమానం మోత మోగించినాడులే . వాళ్లింట్లో వాళ్లకు కూడా చెప్పినాడు. ఆ బిడ్డికి దెబ్బలు బాగానే పడినాయి. ఊరూ నాడంతా సెప్పుకోని నవ్వుకోడమే.
మా యానంద సేసే తులవ పన్లు సెప్పాలంటే ఇంగా శానా ఉండాయి. ఏది జెప్పేది? ఏది ఒదిలి పెట్టేది?
ఆ బిడ్డి మా యింటి కొచ్చినప్పుడు, నేను వాళ్లింటికి పొయినప్పుడే మా సావాసం . మిగిలినపుడు ఎవురి దోవ వాళ్లదే.
మా ఇస్కూలు నుంచి పెద్దయివోర్ని పల్నేరు దెగ్గిరుండే రాగిమాను పెంటకు మార్సేసినాక మాకు కొత్తంగా ఒగ అయ్యోరమ్మొచ్చింది. ఆయమ్మ ఒంటిగా ఉంటాదని మా సిన్న పెద్దోమ్మోళ్ల తాల్వారంలో ఉండే కొట్టిడిలో ఉండమన్న్యారు ఊర్లో వాళ్లు .
అయివొరమ్మ ఇంట్లో ఉంటే పిలకాయల సదుము సాములు కూడా బాగుంటాదని, కాదూ కూడదన కుండా ఒప్పుకునింది మా సిన్న పెద్దమ్మ . అ యమ్మకు మా కంటే రొండేండ్లు పెద్ద దైన నాలుగో తరగతి సదివే మా సుశీలక్క, ఒగటి సదివే మోహనుడు ఉండారులే.
అడపా దడపా మేమూ మా పెద్దమ్మోలింటికి పోతా వస్తా ఉంటామా ! టీచిరమ్మంటే మాకూ కొంచిం బెరుకు తగ్గింది. ఎందుకంటే ఆ యమ్మ మా పెద్దమ్మోలింట్లో సొంత మనిసి మాదిరిగా కలిసి పొయ్యింది.
ఆ యమ్మంటే నాకూ శానా విష్టం. కొంచిం బొద్దుగా తెల్లంగా ఇంగా సూద్దామా అన్నెట్లుంటాది మనిసి . పెద్ద పెద్ద కండ్లు. ముక్కుపైన మెరస్తా మూడు రాళ్ల ముక్కుపుల్ల . సినిమా వోళ్లకు మాదిరిగా నొక్కులెంటికిలు . అరి సెయ్యెడల్పుండే జడ.
ఎప్పుడూ పుల్వాయిలు సీరలు కట్టుకుంటాది. మా యమ్మోళ్లు కట్టుకొనే రిబ్బనంచు సీరల్ని సూసిన కండ్లకి ఆ సీరలు సెప్పలేనంత నాన్నిగా కనిపిస్తాయి . సరేలే ఆ యమ్మ సంగతట్లుండనీ.
ఒక దినం వాళ్ల తరగతిలో ఉండే పాండు గాన్ని మా మోహనుడు బలప మడిగినాడంటా. వాడియ లేదు. వీడు బలమంతంగా వాని సేతిలోని బలపాన్ని పెరుక్కుంటా ఉంటే వాడు గింజుకుంటా వీన్ని గిల్లి నాడంటా. అంతే వీడు ఊరికే ఉంటాడా. అయ్యోరమ్మ గూడా వీళ్లింట్లోనే ఉండాదని వీడికి పెగ్గి జాస్తి. కోప్మొచ్చి వాని సేతిని గెట్టింగా కొరికొదిలి పెట్న్యాడు.
ఎంత వీళ్లింట్లోనే ఉన్న్యా అయ్యోరమ్మకు అట్ల జేస్తే కోపం రాకుండా ఉంటాదా? పాండు గాడు గెట్టింగా ఏడస్తా ఇస్కూల్నంతా ఒగటి సేసేసి నాడు. సెట్టు కింద పాటాలు సెప్తా ఉన్ని సిన్నయివోరు గూడా పరిగెత్తు కోనొచ్చినాడు.
అందురు సూస్తా వుంటే పిలకాయిల్ని అడిగి ఇసయం తెలుసుకున్ని అయ్యోరమ్మ మోహన్ గాన్ని సెయి జాపమని బెత్తంతో సురుక్కు మనేట్లు రొండేట్లేసింది .
అంతే యాణ్నించొచ్చిందో మా యానంద. పూనకం ఒచ్చినట్లు ఆయోరమ్మ సేతిలో ఉండే బెత్తాన్ని పెరుక్కొనింది. అందురూ బిత్తర పోయి సూస్తా ఉండాము. అయ్యోరమ్మకు బెత్తాన్ని సూపిస్తా ' మా పిన్నమ్మోలింట్లో ఉంటూ దొబ్బి తినుకుంటా పసి పిలగాడని కూడా లేకుండా యబ్బోన్నే కొడ్తావా?' అని అందిన సోటంతా బెత్తంతో వాంచి పారేసింది.
' ఎవురు సేసిన పున్నిమో కంటికి దగల్యా ' అన్న్యారందురూ. అట్ల ఇస్కూల్ని తేరూ తిరనాలు సేసి పెట్టిందా బిడ్డి.
అది నవ్వుకొనే ఇసయం కాక పోయినా , అయ్యోరమ్మంటే శాన మంచిదనే పేరున్నా ఆనంద సేసే పెడాత్రపు పనుల్ని , తెలియని తనాన్ని కొన్నేండ్ల దాకా సెప్పుకోని నవ్వుకున్న్యారు మా ఊర్లో . ఆ బిడ్డికీ అప్పచ్చులు శానానే పణ్న్యాయిలే.
ఒకసారి శని వారాల పండగప్పుడు మేమందురూ మా సిన్న పెద్దమ్మోలింటికి పొయినాము . మేమంతా మూడో శనివారమే గోయిందాల పండగ సేసేసి నాము.అప్పుడెందుకో కుదరలేదని అయిదో శనివారం ఒక్కపొద్దుండాది మా సిన్న పెద్దమ్మ. అందుకే అందురూ పండక్కి వాళ్లింటికి బొయినాము. మా యమ్మ , మా పెద్ద పెద్దమ్మ గూడా ఒచ్చినారు.
ఇంగా ఒక్కపొద్దిడ్సి గోయిందాలు పెట్టే దానికి శానా సేపే పట్టేట్లుండాది. మా యమ్మ , సుశీలక్క రోటి కాడ వడలకు పప్పు రుబ్బతా ఉండారు. మా పెద్దమ్మోళ్లిద్దురూ పొయికాడ తలమునకలుగా ఉండారు.
'కుప్పమ్మవ్వోలింటికి పొయ్యొద్దాము. ఈ లోపల వడలు కాల్చినాక తలిగేస్తారు. ' అని పిల్చుకోని బోయింది నన్ను మా యానందా.
వాళ్లింటికి మూడిండ్లవతల ఒగతే ఉంటాది కుప్పమ్మవ్వ. వాళ్ల తమ్ముడు పెండ్లాం బిడ్లితో పక్కింట్లో ఉంటాడు.
కుప్పమ్మవ్వ సెడి పుట్నిల్లు సేరిన మనిసి. వాళ్లతో కలిసుంటే ఏం బాగుంటాదని కడగా గుడ్సిల్లు కట్టు కోని ఉంటాది. రెండెనుముల్ని మేపు కోని పాలు బోసు కోని బతకతా ఉండాది పాపం. ఇనే వాళ్లుండాలాయమ్మకు . కమ్మంగా కతలు సెప్తాది.
కుప్పమ్మవ్వ కూడా ఒక్కపొద్దుండాదా. పండగంటే కొంచిం నంచి ముంటాదా పని. ఇంగ కతలేడ సెప్పేది.
అప్పిటికే అవ్వ నట్టింట్లో గోడకు ఎర మన్ను బూసి పోలు బోసి నామాలు దీర్సుండాది.ముందర పూజ సామన్లతో బాటు మూడాకుల్లో తలిగలు ఏసుండాది. ఒగ సిన్న ఇడాకులో సలిబిండి దీపం ఎలగతా ఉండాది.
కుట్టిన మోదగాకుల్లో తెల్లంగా అన్నం, దాని పైన మునక్కాయిల సాంబారు, కందగెడ్డ తాళింపు, వడలు, పాయసం , పుదీనా ఊరిబిండి ఒడ్డించుండాది .
'తీరా కాయి గొడ్దామని సూస్తే కర్పూరం లేదు పాపా. అంగిడికి బొయ్యి నిమసంలో వొస్తా . దేవున్ని నిల్పి మొక్క కుండా తలుపులేసుకొని పోరాదు. ఎట్లో దేవుడు పంపించి నట్లొచ్చినారు మీరు. కుక్కలు రాకుండా సూసు కోండి సిన పాపా' అని అనందాతో సెప్పి కర్పూరం కోసం అంగిడికి బొయ్యిందవ్వ.
కుప్పమ్మవ్వ అట్ల కను మరుగయ్యిందో లేదో ఒక తళిగినీడ్సు కోని సక్కా ముక్కాలేసుకోని కూసోని తినడం మొదులు బెట్టింది ఆనంద. నాకూ ఇంగోకాకీడ్సి 'అవ్వకింకొటడుండాదిలే తిను' అనింది.
నాకు దెల్సు. దేవుని మొక్కేదాకా ఏదీ ఎంగిలి సెయ గూడదని. వడలు కాలస్తా ఉన్న్యా ఒగటియిమా అంటే ఇయదు మాయమ్మ.
'దేవునికి బెట్టే దాకా ఎంగిలి సెయి గూడదు మే , ఆ యవ్వొస్తే సావ గొడ్తాది. తినొద్దు ' అని నేను ఎంత సెప్పినా ఇనల్యా ఆ బిడ్డి. సుబ్బరంగా ఆకులో ఉనిందంత ఊడ్సుకోని తినేసింది. సాలందానికి ఇంగో కాకులో ఉండే వడలు గూడా తినింది.
అవ్వొచ్చి సూసి లబో దిబో అని మొత్తుకునింది. మా పెద్దమ్మ పెదనాయిన
దెగ్గిరి కొచ్చి ఇట్లా సేసింది మీ బిడ్డి అని సెప్పింది. దోవలో కనిపించి నోళ్ల కంతా కత సెప్పినట్లు తన గోడును ఎల్ల గక్కింది.
' పసి బిడ్డి . తెలీక తప్పు సేసిందని ఆ దేమునికి గూడా తెలుసు. సలిబిండి దీపం ఎలిగించి కాయి గొట్టి మొక్కోపో ' అనింది సత్తాసేరోళ్ల నడుపక్క.
ఆ యవ్వ ఎవురెవురితో ఏమేమి సెప్తాదా అని ఆ యవ్వ తోక బట్టు కోనే ఉన్ని ఈ బిడ్డి ఏమాత్రం జంకు లేకుండా ' కుప్పమ్మవ్వా సలి బిండి కూడా తిని ఎంగిలి సేస్తినే . దేవునికి బెట్టిన అంటి పండు గూడా తినేస్తి. ' అనింది.
'పసి పిలకాయిలు దేవునితో సమానం కిష్ణమ్మా ఆ బిడ్డినట్ల నెత్తి మింద మొట్టొద్దు ' అని నువ్వు మొన్న మాయమ్మ నన్ను కొడ్తా ఉంటే సెప్పలా. అని అవ్వను ఎక్కిరించింది ఆనంద .
' దేవుడను కోని నాకే కాయి గొట్టి మొక్కో' అని ఆ బిడ్డి అంటా ఉంటే ఆడుండే వాళ్లకు నవ్వాలో యాడ్వాలో తెలియలేదు.
శానా దినాలు ఈదిలో , సేంద బాయిల కాడ దీన్ని కతలుగా సెప్పుకొని నవ్వు కున్న్యారు ఊరంతా.
'అదట్ల బోని. అప్పుడు పసి బిడ్డి తనంతో ఏమేమో సేసింది. ఇప్పుడు ఈడేరిన బిడ్డి గదా! ఇంగా మంచీ సెడ్డా తెలుసుకోకుంటే ఎట్లా. ' అని మా పెద్దమ్మ యాదన.
మా నాయినోలమ్మకు ఒగ సెల్లెలుండాది. ఆ రంగమ్మవ్వకు ఒగితే కూతురు. ముగ్గురు బిడ్లిని కని సచ్చి పూడ్సిందాయమ్మ.
వాళ్ల పెద నాయిన సిన్నాయినోళ్లే వాళ్లను సాకి సంతరించి పెద్ద బిడ్డికి పెండ్లి గూడా సేసినారు. వాళ్లు మా నాయినోళ్లకు దెగ్గిరి సుట్టాలా. రొండో బిడ్డికి మా నాయిన ముందు నిలబడి మా పెద్ద పెద్దమ్మ కొడుక్కిచ్చి, అదే ఆనందా వాళ్ల పెద్దన్న కిచ్చి పెండ్లి జరిపించినాడు.
మూడో వాడు కొడుకు. ఆ మామకు మాయక్క నియ్యమని అడిగినారు వాళ్ల పెదనాయినోళ్లొచ్చి. మా నాయిన మా యక్క సదుము కుంటా ఉండాదని ఇయ్యననేసి నాడు.
అందురూ ఉండారింకా . ఆ మామను నేను సేసుకుంటా పెండ్లి అనేసింది మాయానంద. అంతా ఆట మాదిరిగా జరిగి పొయ్యింది. వాళ్లూ మా నాయినియలేదని రోసంతో ఆ బిడ్ని సేసుకుంటా మని పెండ్లి పనులు మొదులు బెట్నారు.
'ఉండే వాళ్లంతా ఉండారు. ఇప్పుడు నీకప్పుడే పెండ్లి కావాల్సొచ్చిందా' అని అడిగినోళ్లకు ఆ బిడ్డి ఏమి సెప్పిందో తెల్సా.
' పెండ్లంటే శానా బాగుంటాది. ఇంటికి సున్నం బూస్తారు. ఇంటి ముందు పందిలేస్తారు. ఇల్లు కల కల లాడతా ఉంటాది. సుట్టాలొస్తారు. పలారాలు సేస్తారు. శానా సీరలు ఎత్తిస్తారు. కొత్త కమ్మలూ, సైనాలు కొనిస్తారు. సేతి నిండుకూ అడక్కుండానే గాజులు తొడిగిస్తారు. పూల జడేస్తారు. పెండ్లి కూతురని నన్ను ఎవురూ కొట్టరు. తిట్టరు. '
ఈ ఎర
Comments
Post a Comment