2 . దొరసానవ్వ
మా యమ్మ తర్వాత ముందుగా మా దొరసానవ్వ గురించి తెలుసుకోవాల ఎవురైనా . ఆ పేరు మామూలుగా ఐతే ఎవురికీ పెట్టరు. మాయవ్వకు వాళ్ల నాయినోళ్లు ఆ పేరు ఎందుకు బెట్న్యారో గాని పేరుకు తగ్గట్టు దొరసాని మాదిరిగానే బతుకు ఎల్లమార్సింది .
వాళ్లు ముగ్గురక్క సెల్లెండ్లైతే మాయవ్వ నడిపిది . పెద్దామిని సిత్తూరు నుంచి ఏలూరుకు బొయ్యే దోవలో వుండే కొత్తపల్లిలో ఇచ్చినారు . అదొక జమిందారీ కుటుంబరం. సిన్నామిని
గుర్రాలమిట్టలో ఇచ్చినారు . ఇదొక జమిందారీ సంస్థానం.
మాయవ్వకు భూమీ పుట్ర వాళ్లకున్నెంత లేదు . కానీ తిండికి లోటు లేదు. కష్టపన్నెంతా ఉండాది.
పెద్దామికి ఇద్దురు కూతుర్లు నలుగురు కొడుకులయితే సిన్నామికి ముగ్గురు కూతుర్లు ఆరుమంది కొడుకులు . సంతులోనూ సంపన్నులే వాళ్లు . పాపం మాయవ్వకే సంతులేదు . ఐనా ఏనాడూ సింతపోలేదామె.
దొరసానవ్వ గురించి సెప్తా వాళ్ల రామాయణ మంతా ఎందుకు అనుకుంటా ఉండారా ? తెలుసులే నాకు. కానీ సెప్పల్ల . సెప్తేనే మా యవ్వ బతుకు సిత్రం మీకు మింగుడు పడేది.
మాయవ్వ మానాయిన్ని దత్తు దీసుకునింది. ఇంతకూ మా నాయన ఎవురనుకుంటా వుండారు . మాయవ్వకు సొయానా పెద్దన్న సిన్న కొడుకు.
మా నాయనోళ్లమ్మ పేరు తెలీదు. మాసంద్రవ్వ అంటాము మేము. మా దొరసానవ్వకు ఆ యమ్మ ఆండబిడ్డి .
ఆ ఇంటి బిడ్ని ఈ ఇంట్లో ఈ ఇంటి బిడ్ని ఆ ఇంట్లో ఇచ్చుకొని తెచ్చుకున్న్యారు . అప్పుడు ఇంకా పుట్టీ పుట్టంగానే పెండ్లి నిర్ణయాలు జరిగి పోయేయంట .
ఇంగా వొయసుకు రాకనే మేనరికాలు వాళ్ల హక్కు అన్నట్లు పెండ్లిండ్లు చేసేసినారంట.
కుండమార్పు పెండ్లిండ్లు కూడైనా వస్తాయి , కుమ్మయినా అవుతాయి అని కదా సామిత. మేనరికాల్ని వొదులుకోలేక మాయవ్వోళ్ల పెండ్లిండ్లు సేసేసినారు కానీ 'కూడిరాలేదని తెలిసిపోలా?అందుకే ఆ యవ్వకు బిడ్డీ పాపా కలగలేదు ' అని సెప్పుకొనేటోళ్లంట ఊర్లో .
' ఉత్త ఎర్రియామాలాలు . లేకపోతే కుండమార్పుకు, బిడ్లు పుట్టక పోవడానికి ఏమన్నా సమ్మంద ముండాదా? ' అని మా నాయిన వాళ్లని ఎగతాలి చేస్తా కొట్లాడే వాడంటలే పెద్దోడయినాక .
రగత సంబందం ఉన్నోళ్లతో ఇప్పుడైతే అట్లా చేస్తే అవిటి పిలకాయిలు పుడతారని శానా మంది సెయ్యడం లేదు కానీ మా యమ్మ తప్ప అందురూ ఆ ఇంటి మేన కోడండ్లే.
అందుకేనేమో మా సిన్న పెదనాయినికో మూంగి బిడ్డి, మా మేనత్తకో మూంగి పిలగాడూ పుట్న్యారు. ఐతే మాంతమైన తెలివి తేటలుండేవి వాళ్లకి. పది పన్నెడేండ్లు బతికి మూర్చ రోగంతో ఇద్దురూ సచ్చిపొయినారు.
'అయినా కొత్తపల్లోళ్లకు, గుర్రాలమిట్టోళ్లకు ఎన్ని జరిగినా బుద్దిరాదులే . ఇప్పుడూ లోకం గొడ్డు బోయినట్లు ఈడోళ్లనాడ, ఆడోళ్లనీడా ఇచ్చి తీసుకుంటా ఉండారు ' అని తిట్టేటోడు మానాయిన. అది కొంచం మా యవ్వకు కూడా తలకెక్కిందిలే .
మాసంద్రం మా నాయన పుట్నూరా ! గోళ్లోల్లంటే ఆ వూర్లో శానా పేరూ పెతిష్ట వున్నోళ్లు . మా తాతోళ్లు ఇద్దురన్నదమ్ముళ్లయితే మా పెత్తాతకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు. అందుర్లోకి మా నాయినే సిన్నోడు.అప్పటికింకా మా సింతాతకు బిడ్లు పుట్లా . మా నాయన వాళ్లమ్మ కడుపులో పడంగానే మా మా పెత్తాత సచ్చిపూడ్సినాడంటా.
తండ్రిని మింగేసి పుడతా వుండాడని ఇంకా పుట్టక ముందు నుంచే మా నాయిన్ని అందురూ సీదరించుకుంటా వుంటే మా దొరసానవ్వకెందుకో మనసులో కలుక్కు మనేదంట.
'మీకొద్దకుంటే పుట్ని బిడ్ని నేను దత్తు తీసుకుంటా వొదినా 'అని మా దొరసానవ్వ మానాయనొళ్లమ్మతో సెప్పిందంట.
ఎంతయినా తల్లి కడుపు కదా ! ఆయమ్మ ఆమాటను ఎవురి సెవుల్లోనూ పడకుండా జాగర్త పడిందంటలే శాన్నాళ్లు. బిడ్ని వొదులుకొనేది ఇష్టం లేక .
మానాయన బూమ్మీద పడినాడు . మాయవ్వ గుంతకాడ గుంత నక్క మాదిరిగా ఎప్పుడెప్పుడు బిడ్ని తెచ్చుకుందామా అని కాసుకోనుండాది పాపం .
మా సింతాతను అడిగి సూసింది. మాతాత మా నాయినమ్మకు సెప్పినాడు. ' పాలు మర్సి పొయినాక ఇస్తాలే' అని మా మాసంద్రవ్వ అప్పటికి సెప్పి తప్పించుకొనింది.
మా నాయిన ఐదో సమత్సరం ఇస్కూల్లో సేరినాక కూడా ఇంటరెల్లో వొచ్చి మాయవ్వ దెగ్గిర పాలు దాగి పొయ్యే వాడంట. ఇప్పుడర్తమవతా వుంది నాకు. బిడ్నియ్యడం ఇష్టం లేక మాయవ్వ అన్నేండ్లు పాలిచ్చుంటాదని.
మా సింతాతంటే వూర్లో వాళ్లకే కాదు, ఇంట్లో వాళ్లకూ బయమే . అట్లని మా తాతని ఏడన్నా దుర్మార్గుడనుకొనేరు. మా తాత నిక్కచ్చి తనానికి , నిజాయితీకి , మంచితనానికి బయపడే వాళ్లంతా.
మా తాత సెప్పీ సెప్పంగానే ఆదరా బాదరాగా మూడో తరగతిలో కూసోనున్ని మానాయన్ని ఏసుకోనున్ని సెడ్డి సొక్కాయితోనే పిల్సుకోని పూడ్సిందంట మాయవ్వ .
' వాని గుడ్డా గుసురన్నా ఇస్తానుండు' అని మాసంద్రవ్వ యనక బడి అరస్తా ఉందంట . మళ్లీ యాడ మనసు మార్సుకుంటాదోనని 'నేను కొత్తవి కుట్టించి పెట్నానులే' అని మా దొరసానవ్వ ఒంటెద్దు బండ్లో మానాయిన్ని కూసో బెట్టుకొని వొరిగి పల్లికి వచ్చేసిందంట . కొడుకును పంపించేది ఇష్టం లేక ముందే గుడ్డలు సర్ది పెట్లేదని కూడా కోపం.
మేనత్తంటే మానాయనికి శానా ఇష్టం. ఆ యమ్మను ఆకాశమంత ఉన్నత మయింది అనుకుంటాడు మా నాయన. పాలు దాగే వొయసులో మా నాయన వాళ్లమ్మతో వొరిగిపల్లికి వొచ్చినప్పుడే ఏది ఇష్టమో అడిగి అప్పచ్చులు చేసి పెట్టేదంట. ఇంగ ఇష్టం లేకుండా ఎట్లుంటాది.
మానాయన్ని మాసంద్రం పోకుండా, ఏడవకుండా ఉండాలని అపురూపంగా ముద్దు జేసి పెంచుకొనిందిలే మాయవ్వ.
మా ఇంట్లో ఒక పెద్ద ఇనపగెంటి ఉండేది . అది మానాయినికి దినామూ అప్పచ్చులు కాల్చి పెట్టడానికి వాడేదంట మా యవ్వ.
' అంతన్నా సుయ్యని నూనెలో యెయ్యందే ఉత్త అన్నం బెట్టి ఎరగను ' అని మా నాయని మిందున్న పేమంతా మొకంలో తాండవమాడతా వుంటే మా యవ్వ ఎప్పుడూ మురిపెంగా సెప్తా వుండేది. . అది అబద్దం కాదు .
మా నాయిన మింద ఈగి కూడ వాలనిచ్చేది కాదు. మాయమ్మ పాలుమారి ఎప్పుడైనా సాయంత్రం తినడానికి ఏమీ సెయ్యలేదనుకో ! ఆ గెంటి కత ఎత్తేది మాయవ్వ
మా మాసంద్రవ్వ సిన్న కొడుకైన మా నాయిన్ని ఇడ్సిపెట్టి వుండలేక మాఇంట్లో ఒక నెలుంటే మాసంద్రంలో ఒక నెల వుండేది. కానీ మా నాయిన మాత్రం పెంచినవ్వనే అమ్మ అనుకొనే వాడు. ఆమెనే 'అమా 'అని నోరారా పిల్సే వాడు.
మేము పుట్టి బుద్దెరిగినప్పుట్నుంచి మా ఇంట్లో ముగ్గురవ్వలుండే వాళ్లు. దొరసానవ్వ, మాసంద్రవ్వ, నంగంగవ్వ. రంగమ్మవ్వను మా సిన్నతమ్ముడు నంగంగవ్వ అనేవోడు. అందుకని ఇంట్లో మేమందురూ ఆమాదిరిగానే పిలిసేటోళ్లం . మా యమ్మ మాత్రం ముగ్గుర్నీ 'అమా' అనే పిల్సేది.
మాసంద్రవ్వ , నంగంగవ్వ అక్కాసెల్లెండ్లు . ఇద్దరూ మా ఇంట్లో పుట్టి పెరిగినొళ్లు. అంటే మా దొరసానవ్వకు ఆండ బిడ్లు . మా తాతలు ముగ్గురూ సచ్చిపొయినారు. మా నంగంగవ్వ కూడా మా ఇంట్లో నెలల తరబడి ఉండేది. మొగుళ్లు సచ్చినారని వాళ్లిద్దరూ తెల్ల సీరలుకట్టుకుంటే మాయవ్వ మాత్రం రంగు సీరలే కట్టుకునేది.
మా సుబ్బా రెడ్డి తాత సచ్చిపొయినప్పుడు పుట్టింటోళ్లు సీర తేవాల్నా . మాసంద్రం మా దొరసానవ్వకు పుట్నిల్లా . అది మానాయనకూ పుట్నిల్లే కదా! మానాయిన మా సింతాతకు ముందే సెప్పినాడంటా. తెల్లసీర తేవొద్దని. మాతాతక్కూడా మూడనమ్మకాలు లేవులే .
వొరిగి పల్లి వర్దారెడ్డి సిన్నకూతుర్ని తెచ్చి మా నాయినికి కట్టబెట్టి పనీ పాటా తెలియని పసిబిడ్డయిన మాయమ్మకు అన్ని పనులూ నేర్పించినానని గర్వంగా సెప్పుకొనేది మాయవ్వ.
నేను నాలుగేండ్ల బిడ్డిగా వున్నెప్పుడు మాతాత సచ్చిపొయినాడు. అప్పుటికి మా పెద్దబ్బొడు పుట్టుండాడంట. అప్పుట్నుంచి మాయవ్వ మా నాయినికి దైర్నం సెప్పుకుంటా కాలం జేసింది.
మాతాత సచ్చిపోయిన సమత్సరానికి మా సిన్నబ్బోడు రవి పుట్నాడు. మా తాతే పుట్నాడని వాన్ని ఊర్లో అందురూ మా తాత పేరుతో సుబ్బా రెడ్డీ అని పిలిచేటోళ్లు .
మాతాతకు మాయవ్వంటే సెప్పలేనంత ఇష్టం. కష్ట కాలంలో కరువొచ్చి పంటలు పండక శానా ఇబ్బందుల్లో వుంటే గుట్టు మట్టుగా తన నగలిచ్చి కుదవ బెట్టించిందంట. పుట్నింటోళ్లు బాగా వున్నోళ్లయినా ఏనాడూ సెయి జాపి ఇది కావాల అని అడిగింది కాదు.
వొరిగిపల్లి మాసంద్రానికి సిత్తూరికి మద్దిలో వుంటాది. దినాము ఇట్నుంచటు, అట్నుంచిటు వచ్చే వాళ్లు పొయ్యే వాళ్లు తప్పకుండా ఒక పూటన్నా చెయి కడగందే పొయ్యే వాళ్లు కారా . సమత్సరానికి పది కట్టల ( 1 కట్టంటే 100 ఆకులు) ఇస్తరాకులు సాలకొచ్చెవంటే తెలిసిపోలా? ఎంతమంది సుట్టాలొచ్చెటోళ్లో .
అప్పుటికీ మానాయన బాయికాన్నుంచి పచ్చి బాదమాకులు తెచ్చి ఏస్తే మాయవ్వ ఏమారకుండా దినాము రొండో మూడో ఇస్తరాకులు కుట్టి పెట్టేది . పైగా ఇంకిద్దురవ్వోళ్లు కూడా ఈడే ఎక్కువ దినాలుండే వాళ్లా. వాళ్లు అందురూ అకుల్లోనే తినేటొళ్లు . సుట్టాలకు ఆకుల్లోనే పెట్టే వోళ్లు.
ఒకసారి ఎగవింటి రాజిరెడ్డికి మాతాత 6 రూపాయిలు అప్పు పడినాడు. వాళ్ల కేదో అవసరమొచ్చి దుడ్లడగతా వుండారు. మా తాత బెల్లం మండీలో తోలుండాడు. కానీ వాళ్లింకా దుడ్లియకుండా రేపు మాపు అంటా ఉంటే మా యవ్వ ఊరుకోలా .
సంక్రాంతి పండక్కని 7 రూపాయిలు పెట్టి జోలార్ పేటోని దెగ్గిర ఎత్తుకున్ని సీరను అర్దరూపాయి తక్కవకి పాలిమోళ్ల గురవక్క కిచ్చి అప్పు కట్టి మాతాత పరువు నిలబెట్టిందంట.
వర్షాలు లేక కరువొచ్చి వూరంతా అల్లాడి ఆకులు మేస్తా వుంటే గవుర్మెంటొళ్లు గంజి కేంద్రాలు పెట్టి ఎవురూ అకిలితో సావకుండా కాపాడతా ఉండారంట.
అట్లాంటప్పుడు మా ఇంట్లో ఒక బొట్ట నిండా వొడ్లుంటే దాన్ని ఉడకబెట్టి మిసంకేసుకోనిచ్చి బద్రపర్సినాక మాయవ్వ తొటోన్ని పిలిచి తుడుము ఏపించిందంట.
తోటోడు తుడుము కొట్టి ఇట్లా చెప్పినాడంట . ' ఇందు మూలంగా వొరిగి పల్లి పెజలకు తెలీజెప్పేదేమంటే వూర్లో ఉండే పాలు తాగే పసి పిలకాయలకు, ఆరేడేండ్ల పిలకాయలకు, గర్బంతో ఉన్ని ఆండోళ్లకు మన ఊరి దొరసానమ్మ రేత్రి పూట అన్నం పెట్తాది . అకలి గొన్న పసిపిలకాయిలు , బిడ్లిని కన బోయే తల్లులు సాయంత్రం సేన్లోలింటి నుంచి అన్నం తెచ్చుకోవలసిందింగా ప్రార్తన ' అని. అది ఇని అందురూ ముక్కుమింద ఏలేసుకున్న్యారంట.
అంతే ఐతే సిత్రమేముంది? ఆ ఇంటి పెద్దొళ్లు అంటే మాయవ్వోళ్లు, నాయిన అమ్మ అన్ని తిండి గింజిలు ఇంట్లో ఉన్న్యా దాన్ని ఊర్లో పిలకాయిల కుండాలని సర్కారు గెంజి తాగి కరువు కాలాన్ని దాటినారంట .
అంతేనా ఎగూరొళ్లు, గాండ్ల కొత్తూరోళ్లు కూడా అడపా దడపా గిన్నిలెత్తుకోనొచ్చి రసమన్నం పెట్టుకోని బొయ్యి పిలకాయిలకు తినిపించే వోళ్లంటా. ఈ విషయం మాతో వాళ్లే కనిపించినప్పుడంతా గుర్తు చేసుకొనే వాళ్లు .
అట్లాంటిది కాబట్టే మాయవ్వ ఈదిలోకొస్తే దిన్నిల పైన కూసున్ని మొగోళ్లు దిగి నిలబడేటోళ్లు
మా తాత సచ్చిపోయినాక ఒడుపుగా సంసారాన్ని నడిపింది మాయవ్వ . ఉన్నెంతలో ఊర్లో వాళ్లను అవసరం కొద్దీ ఆదుకొనింది. మాయమ్మను కూతురే అనుకొనింది. పిలకాయిలు మా ఐదుమందినీ ఎప్పుడే కానీ కసిరిందిల్యా , కొట్టింది ల్యా .
మాయమ్మ మమ్మల్నేమన్నా అంటే మాయవ్వ ఓర్సుకొనేది కాదు. అట్లా అని మాయమ్మనూ అడ్డుకొనేది కాదు. సేతి కట్టెను టకా టకా శబ్దం సేస్తా ఈన్నించాడికి ఆన్నించీడికి తిరగతా వుంటే 'మీ యవ్వకు పొడ్సుకోనొచ్చేసింది ఇంగేమంటాను , నా కంటి ముందుండుండొద్దండి , పోండి ' అని మమ్మల్ని కసిరేది మాయమ్మ.
ఆండ పిలకాయిలకు సదువొద్దని మొత్తుకొనే మాయవ్వ నన్ను మాత్రం మళ్లీ సదువు మానిపించొద్దని మానాయిని దెగ్గిర మాట తీసుకునింది. దానికొక పెద్ద కారణమే వుండాది.
మాయవ్వకు సిన్న సెల్లి గుర్రలమిట్టామికి ఆరు మంది కొడుకులుండారా . వాళ్లెవురూ పెద్దగా సదువుకో లేదు . మా పెద్ద పెద్దమ్మ తన ఇద్దురి కూతుర్లను అన్న దమ్ములకే ఇచ్చి సేసింది. ఇంకిద్దురు కొడుకులికి మాయక్కనూ, నన్నూ పేర్లు పెట్టుకున్న్యారు. అట్లాంటిది మమ్మల్ని మానాయిన సదివిస్తా వుంటే వాళ్లకు ఎట్లుంటాది? వాళ్లకిష్టం లేదు.
సరే మాయక్కను ఎనిమిదితో ఆపేసినారు. నేనప్పుడు ఆరు సదివి ఏడులో కొచ్చినాను. నాతో అంతొరకు సదువుకున్నోళ్లంతా నిల్సి పూడ్సి నారు. నేనొగతే ఆ వూర్లో సిత్తూరిస్కూలుకు బోతా వుండేది. నాకు ఆండ పిలకాయిలెవురూ తోడు లేరని మా నాయినే సైకిల్లో ఎక్కించుకోని తిప్పేవోడు . దాని గురించి గుర్రాలమిట్టోళ్లు మా నాయిన్ని ఎగతాలి సేసి మాట్లాడినారనంట.
' ఆండపిలకాయిల్ని తగుదునమ్మా అని సైకిల్లో ఎక్కించుకోని తిప్పతా వుంటే .. మండతాది' అని ఎక్కిరించినాడంటా మా పెద్ద మామ. మానాయిన్ని అనేసరికి మా యవ్వకు ఏడలేని కోపమొచ్చేసింది. మూతి నల్లంగా జేసుకోని అప్పటికప్పుడు బయలుదేరి సెల్లింటి నుండి వొచ్చేసిన మాయవ్వ సచ్చేదాకా మళ్లీ ఆ వూర్లో అడుగే పెట్లేదు.
మా నాయన్ని పెంచిన తల్లే కావచ్చు మాయవ్వకు కోపం రాకుండా వుంటాదా? మా నాయిన్ని కనినమ్మయితే ఓర్సుకొనేదేమో గాని మాయవ్వ మా నాయిన్ని అట్ల తీసేసి మాట్లాడితే ఓర్సుకోలేక పోయింది.
దాంతో నా నెత్తిన పాలు బోసినట్లయింది . వాళ్ల పైన కోపంతోనే నన్ను ఎంతొరకు సదువు కొంటే అంతొరకు సదివించమని మా నాయనితో సెప్పింది మాయవ్వ.
అట్లాంటి మాయవ్వ ఎద్దు కుమ్మడం వల్ల కనతలో దెబ్బతగిలి సావు బతుకుల మద్య వుండి నన్ను రొండు మూడు సార్లు కలవరిస్తే అప్పటికప్పుడు తిరప్తిలో ఉన్ని మాకు సెప్పి పంపించినారు.
మా సిన్నాయిన, నేను తిరుపతి నుంచి బయలు దేరినాము . మా సిన్నాయన కూడా మానాయినితో బాటే ఐస్కూలు దాక వాళ్ల మేనత్తయిన మాయవ్వ దెగ్గిరే వుండి పెరిగినాడు. ఆడే వుండి సదువుకున్న్యాడు .
మేమిద్దురూ వచ్చే పాటికే మాయవ్వ సచ్చిపూడ్సింది. . నన్ను కలవరిస్తా వుంటే మా యక్క నా పేరు సెప్పి ' వొచ్చేసినానవ్వా' అని తొలిసి తీర్తం పోసినాక పానాలొదిలిందంటా .
మాయమ్మయితే అత్త గాని అత్త సచ్చిపొయిందని ఏడ్సీ ఏడ్సీ సగమై పొయింది. ఏ తల్లో కన్న బిడ్లిని అంత బాగా సూసుకొనింది మాయవ్వ. ఇప్పుడూ నా కళ్లలో నీళ్లు.
మహాసముద్రం దేవకి
11-9-2018
Comments
Post a Comment