వరిగపల్లె ముచ్చట్లు -17
పద్మావతి
మా వూర్లోనే కాదు. ఏ ఊర్లో అయినా ఒకో గడపకు ఒక్కో చరిత్రుంటాది. ఒక్కో ఇంటి గురించి ఒక్కో పురాణం ఇనిపిస్తాది. ఒక్కో మనిసి బతుకు ఒక్కో కత సెపుతాది .
తర తరాలుగా ఈడే పుట్టి ఈడే పెరిగి ఈ ఊర్లోనే బతికి బట్ట గట్టి నోళ్లంతా మా ఊర్లో పడమటీదిలో ఉంటారు. ఆ ఈది సక్కంగా ఉంటాది. ఇండ్లు ఈపక్క ఆ పక్క సోలుపుగా ఉంటాయి. అన్నీ శానా వరకు సుట్టు బవంతిండ్లే.
ఈది గడప్మెట్లకు రొండు పక్కలా కూసోని మొగోళ్లు ముచ్చట్లు సెప్పుకోను, పిలకాయిలు కతలూ కాకర కాయిలూ సెప్పుకొని ఉషారుగా నవ్వు కోను , నువ్వా నేనా అనుకుంటా పొడుపు కత లేసుకోని సవాలిసురు కోను , ముక్కింగా ఆండ పిలకాయిలు గవ్వలు, అచ్చన రాళ్లు, వామన గుంతలు ఆడుకోనూ ఈ దిన్నిలు బాగా పనికొస్తాయి.
అయితే ఆండోళ్లు ముచ్చట్లు పెట్టు కొనేది మాత్రం గడప్మెట్ల మిందే . ఈదిలో తేరూతిరనాళ్లు , ఊరేగింపులు , కుంచిలు దోలినప్పుడు మాత్రం ఆండోళ్లు ఆ దిన్నెలెక్కతారు.
అన్నిండ్లూ ఉత్తర దచ్చిన మొగాలే. ఇంచు మించు అన్ని ఇండ్ల లోను పెంకుటిల్లు, పూరిల్లు కలిసి ఉంటాయి. కొందరికి వాటితో పాటు మిద్దిల్లు కూడా ఉంటాదిలే .
ఎగుదాల మిద్దిల్లుంటే దిగుదాల పెంకుటిల్లు. వొండు కోను బోంద గెడ్డితో కప్పిన గుండ్రటి గుడ్సిల్లు. మద్దిలో వాకిలి. ఇంటి ముందు పక్కో , ఎనక పక్కో , పక్కగానో కొంచిం వాకిలిడ్సి పెట్టి ఎద్దులకు , ఎనుములకు తాటాకు కొట్టాలు . ఉండేవాళ్ల ఎద్దులిండ్లకు కూడా మంటి గోడలు , బోంద గెడ్డి కప్పడాలు.
ఆణ్నించి దిగబడి తూర్పుకొచ్చినామనుకో! ఆడంతా ఆస్తి పాస్తుల్లేకుండా కాయకష్టం మింద బతుకు ఎల్ల మార్సే వాళ్లిండ్లున్నాయి.
కూలీ నాలీ సేసే వాళ్లు. వృత్తి పనులు సేసే టోళ్లు. బాడిగి బండ్లు తోలేటోళ్లు. బండ మింద పని సేసే వోళ్లు . కంకర గొట్టే వోళ్లు . కట్టడాల దగ్గర ఇటికిలు మోసే వోళ్లు. ఇల్లిల్లూ తిరిగి పండ్లూ కూరగాయిలు , బీడీ సిగరెట్లు , తినుబండారాలూ అమ్ముకొనే వోళ్లు . ఉన్నోళ్లిండ్ల కాడ పేండ సెత్త తోసి పోసి , ఇసిరి, దంచి పిల్లా పాపల్ని సాక్కొనే వోళ్లు ఉండారాడ.
వీళ్ల వన్నీ పూరి గుడిసిలు . ఈ ఇండ్ల సందుల్లో వాటినానుకో నుండే నల్ల గెట్లో తమిళ నాడు నించి , శ్రీలంక నించి వలస ఒచ్చి ఈడే స్థిర పడి నోళ్లూ ఉండారు మా ఊర్లో .
వాళ్లకు సేతైన పన్లు సేసుకొని ఎట్లో ఒగట్ల బతుకుల్ని ఎల్లమారస్తా ఉండారు.
ఆణ్నించి తెచ్చుకున్న దుడ్లతో కొంచిమో నంచిమో భూమి పుట్రా కొనుక్కోని మంటిలో పొర్లాడ్తా అల్లాడి ఆకులు మేస్తా బిడ్డీ పాపను సాకుంటా ఉన్నోళ్లు ఉండారు.
నేరుగా కత సెప్తే పొయ్యేదానికి ఇంత రామాయణం అవసరమా అని మీరనుకోవొచ్చు. మా వూరి సొరూపం యాడో ఒగ సోట సెప్పాల గదా!
మా ఊర్లోకి షణ్ముగం కుటుంబం తిరువణ్ణామలై నుంచి వొచ్చింది .ఒడ్డి గుడ్సిలి కాడ పాపి గాని తావు కొనుక్కోని మూడంకణాలు బోంద గెడ్డితో ఇల్లు గట్టుకున్న్యాడు షణ్ముగం. బంగేడు మిట్టలో ఏనుగుంట పల్లి అన్నసామి అమ్మతా ఉంటే కపిల బాయితో బాటు రొండెకరాలు బూమి గూడా తీసుకున్న్యాడు .
పెండ్లాము , ఇద్దురు మొగపిలకాయిలు, ఇద్దురు ఆండ బిడ్లు ఉండారా పెద్ద మనిసికి. సేతి కందొచ్చిన పెద్ద పిలగాడు, పెండ్లాము తెల్లర్తో లేసీ లెయ్యంగానే కపిల దోలే కాడెద్దుల్ని పట్టు కోని తట్టా బుట్టీ సంకలో ఏసుకొని , ఉండే రొండావుల్ని దూడల్ని ఈడ్సుకోని బాయి కాడికి పూడ్సినారంటే మళ్లీ పొద్దు మునిగి నాకే ఊర్లో అడుగు బెట్టేది.
రొండోది కూతురు. పట్టు మని ఎనిమిదేండ్లు కూడా ఉండాయో లేదో ఆ బిడ్డికి . ఆ వయసుకే అది సట్టీ కుండా బట్టుకోని ఇంటి మొత్తాన్ని అణవరిస్తా ఉండాది. మూడో వాడు మురగేసుడు ఇంటికీ సేనుకూ మద్దిలో తిరగతా సద్దీ, సంగటీ వాళ్లమ్మోళ్లకు తీసక పోతా సిన్న సితకా పనులు సేస్తా ఉంటాడు. సిన్న బిడ్డి పక్కనే ఉన్ని ఇస్కూలుకు పోతా ఉండాది. వాళ్లూ వీళ్లూ సెప్ప బట్టి ఆ బిడ్ని ఇస్కూల్లో ఎయ్యడం.
షణ్ముగం పెండ్లాము వల్లి కొంచిం ఎడ్డా మడ్డిగా ఉంటాది. తలకు సమురు బెట్టు కోదు. తల దువ్వుకోదు. అందుకే తల సీకి కంప మాదిరిగా ఉంటాది.
నాల్నాళ్ల కన్నా నీళ్లు బోసుకుంటాదో లేదో! శానా అసింకంగా ఉంటాది. కట్టిన సీరను ఎన్నాళ్లకు మారస్తాదో ! మాంగడ బట్టి పొయ్యుంటాయి గుడ్డలు. ఉత్త సెవ్వులు . ఒకప్పుడు కమ్మలుండేవి అనడాకి సెవ్వు తంబిలుకు పెద్ద పెద్ద దుంకలు యాలాడతా. రొండు ముక్కు పుల్లలు మాత్రం ముక్కుకు మించి ఉంటాయి.
ఆయమ్మకు జీవితం మింద అంత రోత ఎందుకు పుట్టిందో ! సీరుగా ఉందామనే మునాస ఎందుకు సచ్చి పోయిందో ! ఆ దేవునికే ఎరుక.
ఎవురితోను మాట్లాడదు. ఆ మొగం మింద పరుసుకున్ని దిగులు తప్ప ఇంగోటి కనిపించదు. బిడ్లిని పస్తు బెట్ట కుండా సాక్కుంటే సాలు అని కష్ట పడతా ఉంటాది.
పిలకాయిలూ అంతంత మాత్రమే. దుమ్ము గొట్టు కుంటా. ఇంటికాడుండే బిడ్డి మాత్రం కొంచిం సీరుగా తల దువ్వుకోని జడేసుకోని నెత్తిన తిలకం బొట్టు బెట్టుకోనుంటాది.
షణ్ముగానికి బండీ ఎద్దులుండాయి . దినానికోసారి బండ మిందికి బోయి బాడిక్కి బండల్ని ఎక్కించుకోని ఏడ సేర్సాలో ఆడ సేర్సి ఒచ్చినాడంటే అప్పట్నించి బండి నొగ మింద కూసోని పనీ పాట లేని ఇద్దురి ముగ్గురితో సేరుకొని అరట్లు కొడతా ఉంటాడు. సాయింత్రం కాకూడదు . ఫూటుగా తాగి ఈదిలో ఈరంగం సేస్తా ఉంటాడు.
మా ఊర్లో సేరి మూన్నెళ్లయ్యుంటాయి. షణ్మొగం పెండ్లాం ఆ తీరుగా ఉండటానికి కారణం తెలిసినట్లయ్యింది అందురికీ.
రెక రెకాని సన్నంగా పొడుగ్గా ఉన్ని ఒగామిని తెచ్చి కాలీగా ఉన్ని పిల్లోడోళ్ల గుడ్సింట్లో బెట్టినాడు షణ్ముగం . నలబై ఏండ్లుంటాయి ఆమె వయసు. పేరు పద్మావతి.
ఆయమ్మ షణ్ముగం ఇంటికి పోదు. పిలకాయిలు గూడా ఈ యమ్మింటికి రారు. షణ్ముగానికి ఉంపుడు గత్తె అని వొచ్చిన మర్సనాడే ఊరంతా తెల్సి పొయ్యింది.
షన్ముగం మాత్రం తిండీ నిద్ర పద్మ ఇంట్లోనే .
పెండ్లాంతో మాట్లాడంగా ఎవురూ సూళ్లేదు గానీ ఈ యమ్మను ఎంట బెట్టుకోని అడపా దడపా జాతర్లకు, సినిమాలకు, సంతలకు పోతా ఉంటాడు.
ఇంట్లో పిలకాయిలకు రూపాయి దుడ్లిదల్చతాడో లేదో గాని ఆ యమ్మ మాత్రం మంచి మంచి లైలాన్ సీర్లు కట్టు కుంటాది. ఎప్పుడు యడబడ కుండా తల్లో పూలతో సీరూ సింగారంగా ఉంటాది .
'అన్ని పూలు పెట్టు కుంటాది . పాపం పసి బిడ్డికి కూడా రొండు బంతులు ఇయ్యాలని తెలీదా? కన్న తండ్రికన్నా ఆండ బిడ్డి ఇంట్లో ఉండాది అని వగా తెగా ఉండక్కర్లా ' అనుకుంటారు సూసి నోళ్లు.
పద్మావతుండే గుడ్సిల్లు మా ఇస్కూలుకు వాయువ్య దిక్కులో ఈది కవతల పెద్ద సింత మాను కింద ఉంటాది. ఆ సింత మాను నీడలోనే బండొదిలి పెట్టి ఆడే ఎద్దుల్ని కట్టేసి మేత ఏస్తాడు. ఎప్పుడూ ఆ యెద్దుల్ని పట్టి మేపిన పాపాన పోలేదు. అన్ని గొడ్లకూ వామిలో వున్ని ఎండు గెడ్డితో పాటు పచ్చి గెడ్డి కొసుకోనొచ్చో సెక్కుడు బారతో దోక్కో నొచ్చో ఏస్తాది వొల్లి.
ఆ ఇంటికి ఎదురుగానే రొండిండ్లవతల షణ్ముగం వాళ్ల ఇల్లు .
షణ్ముగం తాగు బోతే గాని పెండ్లాన్ని ఎప్పుడూ కొట్టంగా, తిట్టంగా ఎవురూ సూళ్లేదు .
పద్మావతి వొచ్చినాక కొన్నాళ్లు రంపూ రచ్చా లేకుండా బాగానే ఉండినాడు. ఆ పైన రోజు కొక రగడ . రేత్రని ల్యా పగలని ల్యా . అయితే అదంతా పద్మతోనే.
పట్ట పగలే బండి పని అయి పొయినాక తాగొచ్చే వోడు. ఏదో ఒక ఇసయం మింద మాటా మాటా పెరిగేది. ఆ సాకుతో గొడవ పెట్టు కొనే వాడు. దాని మింద ఎంత ప్రేమ జూపే వోడో అంతగా సావ గొట్టి సెవులు మూసే వాడు. ప్రేమొచ్చినా పట్టలేము తాగొచ్చినా పట్టలేము అన్న్యట్లుండే వాడు.
ఇంట్లో మెల్లింగా గొడవ మొదులు బెట్టిన కొంచేపటికే పెద్ద పెద్దగా అర్సే వాడు. అరుపులినిపించంగానే సుట్టూ ఇండ్లలో ఉండే జనాలు తిర్నాలు సూడ్డానికి సిద్ద పడేటోళ్లు . మా అయ్యోర్లు గూడా మమ్మల్ని సదుముకోండని సెప్పి మొండి గోడ కాడ సేరి తొంగి తొంగి సూసేటోళ్లంటే అర్తం సేసు కోండి.
కొట్లాట పెద్దది కాంగానే షణ్ముగంతో దెబ్బలు తప్పించు కోను ఈదిలోకి పరిగెత్తుకో నొస్తాది పద్మ . ఒకోసారి జుట్టు బట్టు కోని తనే లాక్కోనొచ్చే వాడు. సుట్టూ జనాలు సూస్తా ఉండారనైనా లేకుండా బక్క పీసు లాంటి పద్మను వంగ బెట్టి పిడి గుద్దులు గుద్దతా ఉంటే సూసే వాళ్లకు ఆ దెబ్బలు దిని ఇంగా ఇది ఎట్లా బతిగుండాదా అనిపించేది.
ఆయమ్మ ఆ దెబ్బల్ని తట్టు కోలేక అరవంలో ' 'అయ్యో కడవలే ఎప్పిడిరాబ్బా , అడి ఎన్నోడ తాంగ ముడియిలే . కొండూడిరకరానే ' అని గెట్టింగా అరస్తా ఏడ్సేది పాపం.
షణ్ముగం పెండ్లానికి అన్నాయం సేసినానే అనే గెవనం తోనే దీన్ని వాడుకున్నా కూడా వాడికి దీని మింద కోపం అనుకొనేటోళ్లు. అప్పుడు మాత్రం జాలితో దీన్ని సిన్న సూపు సూసే వొళ్లంతా అయ్యో పాపం అనుకొనేటొళ్లు .
ఎవురన్నా సూస్తా ఉన్నా, ఆయమ్మ గెట్టింగా ఏడ్సినా షణ్ముగానికి శివమెత్తతాది. అప్పుడింగా జాస్తి కొట్టేది.
ఒకసారి ఏకంగా రోకలి బండ దీసుకొని కొడతా ఉంటే ఆ యమ్మ ఈదిలోకి పరిగెత్తు కోనొచ్చింది . ఎంట బడి జుట్టు బట్టుకోని ఒంగదీసి రోకలి బండతో అందిన చొటల్లా కుమ్మి కుమ్మి కొడ్తా ఉండాడు. నొప్పి తట్టుకోలేక ఆయమ్మ కేకలు బెడ్తా ఉండాది.
' మూసుడాదే పద్మా మూసుడాదే 'అంటా అదేదో తన హక్కన్నట్లు సావ గొట్టి ఒదిలి పెట్టి నాడు.
ఆ దెబ్బలకు ఒళ్లు వాసి పోయి జరం కూడా ఒచ్చింది. ఆ మూడు దినాలు షణ్ముగం ఆ యమ్మకు సేసిన సేవ గురించి పిల్లోని పెండ్లాం సెప్తా ఉంటే ఊరూ నాడంతా అర్సోది పొయ్యింది. కొట్టేదేల? మళ్లీ బాధ పడేదేల? అనుకున్యారంతా.
ఎప్పుడు సూసినా ఆ యమ్మ ఒంటి మింద తగిలిన దెబ్బలకు ఎక్కడో ఒక సోట వొడ్లు పసుపు నూరి పట్టు ఏసుకోని కనిపించేది.
' అన్ని దెబ్బలు తింటా కూడా పడి ఉందంటే ఆ యమ్మకు అతడి సాంగత్తెంలో ఏమి సొంతోసముందో ఎవురి కెరుక ' అని ఏదాంతం మాట్లాదింది పూల్లూరొళ్ల ఆదెమ్మ పెద్దమ్మ.
అంత కొడతాడా మళ్లీ మర్నాడే సింగారించుకొని బండ్లో కూసొని షన్ముగమెంట సిత్తూరికి పోతా ఉంటే సూసినోళ్లు ' ఔరా ! 'అని ముక్కు మింద ఏలేసు కొనే టోళ్లు
రోకలి బండతో దెబ్బలు దిని పడకేసి నప్పుడు షణ్ముగం కూడా తిండీ నీళ్లూ లేకుండా ఆయమ్మకు సేవలు జేస్తా గడిపి నాడంటా .
ఆ కొట్టడం సూసిన ఆయన పెద్ద బిడ్డి కూడా తండ్రి ఇంట్లో అడుగు పెట్టంగానే జంకూ గొంకూ ల్యాకుండా 'దుర్మార్గ పోడా పిన్నమ్మను బట్టు కోని అట్లే సావాగొడ్తా ఉండు. యా పొద్దో ఆయమ్మ సస్తాది. నిన్ను పోలీసులు పట్టు కోని బొయ్యి జైల్లో పెడతారు ' అని తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టిందంటా.
ఆ బిడ్డి ' మా యమ్మే అదురుష్ట వంతురాలు. ఒక తిట్టు తినింది ల్యా. ఎప్పుడూ ఒక దెబ్బ తిన్ల్యా . మా పిన్నమ్మోళ్లు బాగా ఉన్న్యోళ్లు . ఏమి సేటు గాలమో ఈ డొచ్చి పడరాని పాట్లు పడతా ఉండాది . ' అని వాళ్లతో వీళ్లతో సెప్పు కోని కండ్లలో నీళ్లు గూడా పెట్టు కునిందంటా.
ఆ ఇసయం పద్మాకు తెలిసి మురిసి పోయింది . 'నా పెద్ద బిడ్డి నా గురించిదా శానా బాద పడిందంటా . ఎవురు సేసు కున్ని పాపం పున్నిం వాళ్లే అనుబోగించి తీరాల గదా! ఇంట్లో కాలు దీసి ఈదిలో పెట్న్యాను . మళ్లీ ఈ అడుగెత్తుకొని పొయ్యి ఇంట్లో పెట్నవతాదా ? ఆ ముట్టుపాత శానా మంచోడే గాని తాగినాడంటే ఆ నా బట్టకు ఒళ్లు తెలీదు . కానీ, ఇట్ల ఎన్నాళ్లు సాగతాదో ! నా మంచి తనమే మా ఇంటాయిన్ని మారస్తాది ' అని సెప్పుకొనింది.
అది ఇంటాయన అనిందని ' పేద్ద, వాడు దాని బొట్నేలు దొక్కి బొట్టు గట్నట్లే మాట్లాడ్తాది ' అని ఇన్నెత సేపూ ఇని ఎనక ఎగతాలిగా మాట్లాడుకున్నోళ్లూ ఉండారు .
పెద్ద బిడ్డి పద్మావతి తరపున మాట్లాడిందని తెలిసినాక పద్మకు ఏడ లేని ప్రేమ పుట్టకొచ్చింది , ఆ ఇంటి పిలకాయిల పైన.
ఇంట్లో నంజర కూరా మంచీ సెడ్డ సేసు కున్న్యప్పుడు పిల్లోని పెండ్లాం తోనో ఇస్కూలుకు బొయ్యే సిన్న బిడ్డిని పిలిచో ఇచ్చి పంపిస్తే తిప్పి పంపించ కుండా తిన్న్యారని తెలిసి శానా సంతోస పడి పొయ్యింది పద్మావతి . వాళ్లు సొంత మనిసి మాదిరిగా జమ కట్టినారనే నమ్మకంతో మురిసి పోయింది.
'పాపం అక్క ఒట్టి మంటి మనిసి. మంచీ సెడ్డా అనే అలోచన ఉండేదైతే తనని ఎప్పుడో తన్ని తరిమేసే ప్రయత్నం సేసేది. గొడ్డు చాకిరీ తప్ప ఇంగొక పాపం తెలియనిఎర్రి యామాలం ' అనుకునింది వల్లి గురించి పద్మ.
షన్ముగం పెద్ద బిడ్డి ఈడేరిందని వాళ్లమ్మ కూడా ఇంట్లో లేదని పిల్లోని పెండ్లాం ఉన్నెట్లుండి వర్తమానం మోసుకోనొచ్చిందొక నాడు. షణ్ముగం గూడా లేడు. ఉన్న్యా మొగోడేమి జేస్తాడులే అనుకొనింది.
' ఏమైతే అయింది. నేను పోతాను. నన్ను ఎవురు తలగొట్టి మొలేస్తారో సూస్తాను ' అంటా ఆ యింటికి పరుగు బెట్టింది.
దిక్కు దెలియక అయోమయంగా కూసోనున్ని బిడ్డికి నేనుండానని దైర్నం సెప్పింది. నీళ్లు గాంచి తల మింద పోసి తన నైలాన్ సీర దెచ్చి కట్ట బెట్టింది. తనింట్లో తీపి సేసి తెచ్చి తిన బెట్టింది.
మూడో నాడు బియ్యం నాన బోసి దంచి పిట్టు జేసి తవ్వెడు నూగుల నూనె తీసుకోని బొయ్యి బెల్లమూ , నూనే కలిపి తినిపించింది '
'ఆ యింటికి నేనూ ఒగ యజమానురాలిగా, ఆ బిడ్డికి పిన తల్లిగా వాళ్లమ్మకు సవితిగా అన్ని బాద్యతలూ ఇంగ నావే . నేనే సూసుకుంటా ఈ పిలకాయిల మంచీ సెడ్డా ' అని గెట్టింగానే అనుకొనింది.
బిడ్డి సమర్తాడిందని విషయం తెలిసి వొల్లి సేను కాణ్నించి ఉరుకులు పరుగుల మింద ఒచ్చిందా అప్పుడే టెంకాయ మట్టలతో దిన్ని మింద గుడ్సి ఏర్పాటయ్యుండాది.
ఎవురి పని అని ఆరా దీస్తే పిన్నమ్మ అని సెప్పింది ఆ బిడ్డి. తనింట్లో పద్మ పొయికాడ పనిలో ఉండేది సూసీ , సూడనట్లుగా ఉండి పోయింది వల్లి.
అన్నీ తానై సేస్తా ఉన్ని పద్మను వల్లి కూడా పల్లెత్తి మాట అన్లేదు .
'అందురికీ తెలిసిన బాగోతామే. మూసి పెట్టి కాపురం సేసే దేమీ లేదు. సెయిదాటి పొయింది. దాని కర్మ కొద్దీ వొచ్చి అది ఏం వారు కొనింది. వాడితో పడరాని పాట్లు పడతా ఉండాది. ఏమన్నా అనినా ఏం లాబం ? మొగుడు ఇనే రకం కాడు. ఎట్ల జరగాల్సింది అట్ల జరుగుతుంది ' అని ఏదాంత దోరణిలో ఆలోచిచడం మొదులు పెట్టింది వల్లి.
షణ్ముగానికి విషయం తెలిసి పల్లెత్తి మాట్లాడ లేదు. పద్మనే అడపా దడపా వొల్లిని పలక రించడం మొదులు బెట్టినాక అంతా సవ్యంగానే ఉండాది. పిలకాయిలు గూడా పిన్ని శానా మంచిది అనే నిర్ణయానికొచ్చినారు.
వాళ్ల ఆదరణ పద్మకు ఏను గెక్కినంత సంతోషాన్నిచ్చింది. తప్పు చేశానన్న న్యూనత షణ్ముగాన్ని రాక్షసుని చేసిందేమో కాని ఇప్పుడు కాస్త మనశ్శాంతి దొరికి తాగుడు తగ్గించినాడు. పద్మను కుళ్ల బొడవం కూడా తగ్గించినాడు.
పద్మ కట్టుకున్ని మొగున్నొదిలి పెట్టి షణ్ముగానితో ఒచ్చేసినాక తన పుట్నింటితో ఉన్ని బందం పూర్తిగా తెగిపొయింది పద్మకు . కానీ దాని అసలు మొగుడు దాన్ని పెట్టిన ఇబ్బందులు కతలు కతలుగా ఇన్న్యాక వాళ్ల కోపం ఎలిగే కర్పూరం మాదిరిగా కరిగి పోతా వొచ్చింది.
సెల్లెలి పెండ్లి అని అన్న కొడుకు పత్రిక ఇచ్చి పిలిచినాక కొత్తంగా రాక పోకలు మొదలయినాయి.
అప్పుడే అన్న కోడుక్కి పెద్ద బిడ్నిచ్చి చేస్తే బాగుంటాదనే ఆలోచన ఒచ్చింది పద్మకు . విషయాన్ని మొగునికి సెప్పింది. అక్క సెవిలోనూ ఏసింది . నేలానెట్ర బాగా ఉండినోళ్లు. ఆ బిడ్డి అదురుష్టమే అదురుష్ట మనుకున్న్యాడు తండ్రయి నోడు.
అది ఇని వల్లి కూడా సంతోస పడింది. బూమీ పుట్రా బాగా ఉన్న కుటుంబరం లోకి కూతురు కోడలుగా పోతే అంత కన్నా ఏం కావాలి ?
పిల్ల కనుముక్కు తీరు బాగుండాది అనుకున్న్యారు వాళ్లు సూసి . 'సిన్నప్పటి నుండి పని పాటల్లో బాగా నలిగిన పిల్ల. ' అని పద్మ సెప్పింది .
ముహూర్తాలు పెట్టు కున్న్యారు. కన్యాదానం సేసేటప్పుడు వల్లిని వొద్దని పద్మను పక్కన కూసో బెట్టు కోవడం వల్లి మనసుకు కొంచిం కష్ట మనిపించినా తనకున్న ఉంగరం రొండు జతల కమ్మలు కాలి సైనాలూ , పట్టు సీరలూ గట్రా కూతురికి ఇవ్వడం సూసి వల్లి మనసు పద్మ పట్ల కృతజ్ఞత తో నిండి పోయింది.
కూతురు పెండ్లయి ఎల్లిపోవడంతో పద్మకు కుండా సట్టి అంట గట్టి ఇంట్లోనే కలిసుందామని
సెప్పి తను యదాప్రకారం సేనుకు బోవడం మొదులు బెట్టింది వల్లి .
రొండేండ్లు గడిసింది. కొడుక్కు కూడా పెండ్లి సేసి కోడల్ని ఇంటికి దెచ్చు కున్న్యారు. సంసారం ఒక గాటిన పడింది. అన్నకు సెప్పి అతని కొడుకుతో పాటుగా సిన్న పిల్లోడికి కూరగాయిల మండిలో పనిప్పించింది పద్మ.
సంసారం ఒక గాటిన పడి సంతోషంగా ఉన్నామనుకున్న్యారంతా. కానీ అనుకోకుండా తగిలిన ఎదురు దెబ్బకు తట్టు కోలేక పొయినారు.
ఒకప్పుడు తాగి తనను మించిన వాళ్లు లేరని ఈదిలో ఈరంగం సేసిన షణ్ముగం సచ్చిన పాము మాదిరిగా పచ్చ వాతంతో మంచాన పడినాడు.
పద్మే ఆ యింటికి మొగ దిక్కయి నిలబడింది. . షన్ముగం తోలిన బండెక్కి కూసోని ఎద్దుల పగ్గాల్ని సేతుల్లో పట్టు కున్ని పద్మను సూసి ఏం సెయ్య బోతుందో అని ఎనకెనక నవ్వు కున్న్యారు సూసినోళ్లు .
ఏం సేసింది ? బండిని బంగేడి మిట్ట బండ మిందికి పోనిచ్చింది. అక్కడున్న వాళ్లు అర్సోది పొయ్యెట్లుగా బండల్ని ఎక్కించినాక బండిని కట్టు కొని అన్ని బండ్లతో పాటు తన బండినీ సిత్తూరు దారి పట్టించింది . మొగోళ్ల కంటే మొగలాయి అనిపించుకునింది .
అప్పట్నుంచే పద్మను సూసి మా ఊర్లో ఆండ పిలకాయిలికి సైకిళ్లు కొనియ్యడం మొదులయింది. రాను రాను మొగపిలకాయిల ఎనక కూసొనే ఆండొళ్లు ఎవరికి వాళ్లు స్కూటర్లు నడుపుకొని తిరగాడే పద్ధతికి అలవాటు పన్న్యారు.
యాబై ఏండ్లకు ముందు మేము సైకిలు దొక్కుంటా సిత్తురుకు బొయ్యి సదువుకున్న్యా మంటే దానికి కారణం ఆ పద్మావతే.
అవన్నీ ఇప్పుడు మామూలయి పోయింది. కానీ ఇప్పటికీ ఎద్దుల బండిని తోలే వాళ్లు మాత్రం నూటికో కోటికో ఒకరుంటే ఉండచ్చేమో ! ఆండోళ్లు బండి దోలడం నేను సూసింది మాత్రం ముందూ అదే. సివరా అదే.
సచ్చి మంటి మరుగై పోయినా సల్లని పూట తల్సుకోవల్ల ఆ తల్లిని .
మహాసముద్రం దేవకి
12 - 5 - 2019
Comments
Post a Comment