పదాల పూలు
పరితపిస్తున్నాయిఅంత అందంగా తమను
మంచి మాలగా మలచ గలిగిన
మహాకవి మరి పుట్టబోడని
కవి వంశాంకురాలు
కన్నీరు కారుస్తున్నాయి
తమను సహించి ఉత్సహించి
ప్రోత్సహించే నాధుడు కరువయ్యాడని
అతడు నిజంగా
అసదృశుడైన వీరుడు
అతడు నిటారుగా నిలబడడమే కాదు
జాతినంతటినీ
హిమాలయాలంత
సమున్నతంగా శిరసెత్తుకొని తిరగమన్నాడు
వంగే వాడికి
వంగి సలాములు చేసే గులాముల సంఖ్య కొనసాగితే
తప్పదు దేశానికి అధోగతి అని ఆక్రందించాడు
గ్రామాలు నిరంతరం సాగించే
జీవనోగ్ర సంగ్రామాన్నీ
నగరాలు మత్తుగా మస్తుగా
అనునిత్యం ఆస్వాదించే మహేంద్ర వైభవాన్నీ
బేరీజు వేసిన ఏకైక బేహారి అతడు
ప్రతిధ్వనించింది అతని కవితా కలధ్వని
ఖండ ఖండాంతరాల కవతల
అతడు ప్రాక్పశ్చిమ కవితా మర్యాదల వారధి
అతడు సత్కవితా నీరధి
అతని వాక్యం మెదడుకు మేత
అతని కావ్యం గుండెకు కోత
స్వర్ణ హంస ఎగిరి పోయింది
తెగిపోయింది భూగోళపు భూరి రక్త నాళం
సౌందర్యాక్షర సైన్యాధ్యక్షుడు స్వర్గస్థుడైనాడు
జనాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకు పోతున్న
నావను నది దోచుకు పోయింది
తెలుగు కవిత్వపు అందం అంతరించింది
చందం చతికిల పడింది
కవి అన్న వాడు
కాదు రక్త మాంసాకృతి
అతడు అక్షరాకృతి
అందుకే అతడు కన్ను మూయడు
తన అక్షరాలలో మేల్కొనే ఉంటాడు
అతనికి నివాళి
అతని కవితా నేతృత్వానికి
నేత్ర జలధారల నివాళి
ఆచార్య పి. ఎల్. శ్రీనివాస రెడ్డి
Comments
Post a Comment