5 . రాదా బాయి
మా వూరి రాంబాయమ్మ కూతురు రాదాబాయి . వోళ్ల ఇల్లు మా ఇస్కూలుకు ఎడమ పక్క గోడకానుకోనుండేది.
ఒకంకనమిల్లు . పక్కన ఒండొకోను మిగిలినోళ్లు పండుకోను ఒక బోంద కసువుతో కప్పడమున్ని సుట్టిల్లు. ఇంటిముందర తాటాకు కొట్టం. దాంట్లో రొండు బెంచీలు.?
ఆ బెంచీల మింద ఎప్పుడూ ఇద్దురో, ముగ్గురో మొగోళ్లు కొలువు దీరి వుండే టోల్లు.
సాయంత్ర మైతే సాలు , బెంచీలు సాలక ఇంటి ముందు గొంతుక్కూసోని బీడీలు కాల్చు కుంటా మాట్లాడుకుంటా వుంటారు మొగోల్లు శానా మంది. మల్లెప్పుడో కొన్నాళ్లకు రొండు సలవ బండలు వెలిసినాయి ఇంటి ముందర, రోడ్ పక్క .
అది రాంబాయమ్మ సారాయంగడి. ఆ యంగట్లో వక్కలు, తమలపాకులు, దుగ్గు, పొవ్వాకు మట్టలు , బీడీ కట్టలు కూడా అమ్మకానికుంటాయి
సారాయి తాగే వోళ్లకు నంజుడుకు నంజర కూరుంటాది. , పొకోడాలు, , బజ్జీలు కూడా యేసిస్తా వుంటాది రాంబాయమ్మ. . అప్పుటికికప్పుడు అడిగినోల్లికి అడిగినట్లే ఏడిగా.
రాంబాయమ్మ మొగుడు ఎంకోబ రావు పచ్చవాతమొచ్చి మంచంలో పడ్డంతో మొత్తం బాద్యతా రాంబాయమ్మ మిందే పడింది పాపం. ఆ యన్న బాగా వొయిసు మల్లినోడులే .
ఎంకోబరావు ముందు పెండ్లాం సచ్చి పూడ్సినాక రాంబాయిని సేసుకున్న్యాడు. మొదటామికి అప్పిటికి నాలుగేండ్ల కొడుకుండాడు. పేరు సిద్దోజి రావు. ఇప్పుడు పెండ్లికెదిగినాడు . తల్లికన్నా , పెంచిన పింతల్లంటే సిద్దోజీకి మాంతమైన ఇష్టం.
వానికి సదువంట లేదు. రాంబాయమ్మ ముద్దు మురిపాల వల్లనే వాడి సదువు సట్ట బండ లయిందంటారు అక్కన పక్కనున్నోళ్లు. అందుకని అదెప్పుడో సంకనాకి పొయ్యింది.
తండ్రి మూల బణ్న్యాక ఇంగిది అయ్యేది గాదులే అని అప్పుడెప్పుడో మునాసకొద్దీ నేర్సుకున్ని డ్రైవింగుతో కామాక్షమ్మోళ్ల లారీకి పోతా వుండాడు.
ఒగోసారి పోతే రొండు మూడు దినాలు రాడు. దూరాబారమైతే ఇంగా ఎక్కువే పడతాది. లారీ దిగితే రొండు దినాలు ఇంట్లోనే వుంటాడు. అప్పుడు రాంబాయమ్మ కొడుక్కి తలంటి పోసి కోరింది సేసి పెడితే తిని రెయ్యీ పొగులు అనుకోకుండా నులక మంచంలో పండుకోని నిద్ర బోతా వుంటాడు.
ఇంగ కూతురు రాదా బాయంటారా. పుట్న్యప్పటి నించీ అంగిట్లో ఆట్లాడు కుంటా , పాడుకుంటా పెరిగిన బిడ్డి కదా! అది వొయిసుకొచ్చినా ఎగ్గూ సిగ్గూ ల్యాకుండా తాగుబోతుల మద్య తిరగాడతా వోళ్లకు కావలసింది సప్లయి సేస్తా వుంటాది.
దాని కిద్దురు తమ్ముల్లుండారు. ఇస్కూలుకు బొయ్యి సదుంకుంటా.
హరిజన వాడ నుంచి తాగడానికొచ్చే వోల్లెక్కువ . ఒగదినం కొత్తంగా ఒకడు పాత కస్టమర్ రంగనితో కలిసి అంగిడి కొచ్చినాడు. బలిసిన కండలతో సూడ సొక్కంగా బలే బాగుండాడు.
వాణ్ని సూసిన రాదా బాయికి మనసులో చనం పాటు ఏందోగా అనిపించింది.
ఆ ఊరి హరిజన వాడ ఆండ బిడ్డి పూబతి పెద్ద కొడుకని, పేరు పొన్ను రంగడని పిల్సుకోనొచ్చినోడు రాంబాయికి సెప్పినాడు.
' రోడ్ రోలర్ తోలతాడు. ఇక్కడ రోడ్డేస్తా వుండారు కదా ! ' అన్న్యాడు
' పూబతిని సిత్తూరుకు దెగ్గిర్లో వున్ని తమిల్నాడైన గుడియాత్తం దెగ్గిర ఇచ్చినారుగదా! ఇక్కడిప్పుడు రోడ్డు పని జరగతా వుండాది. అందుకీడుండాడు వీడు ' సెప్పినాడు రంగడు.
పొన్ను రంగడు అప్పట్నించి అక్కడికి దినామూ రాబట్న్యాడు. ఐతే తాగే వాడు కాదు. రాదా బాయి కోసం వొస్తా వుండాడని వాళ్ల కెవురికీ తెలీదు.
వాడు రాంగానే రాద మనసు కూడా బంతి పువ్వు మాదిరిగా విచ్చుకొనేది. రెట్టింపు ఉసారుతో లోపలికి బయిటికీ తిరిగేది. రావడం ఆలీసమైతే ఎప్పుడొస్తాడా అని ఎదురు సూపులు సూసేది. రాంగానే నెమిలి మాదిరిగా పురిప్పి ఆడాలని పించేది.
ఇక్కడే రాద రూపు రేకల గురించి సెప్పి తీరాల .గుండ్రటి మొగం . మంచి రంగు. సాయి పసుపు కొమ్ము అరగ దీసి మొగానికి పూసుకుంటాదేమో. పచ్చని పసుపు రంగుతో ఎలిగి పోతా వుంటాది.
అంత పొట్టీ, పొడుగూ కాని మనిసి. జడ బారెడు లేదు కానీ ఈడ్సీడ్సి బిర్రుగా ఏసుకోడం వల్ల మూరెడుకు కొంచిం తక్కవ పొడుగుతో నాలుగేళ్ల ఎడల్పుతో ఉంటాది. . కొంచిం ఒంకిరి జుట్టు. మనిసి పొట్టీ కాదు, అట్లని పొడుగూ కాదు. వక్కాకెట్లా అలవాటయిందో ఎప్పుడూ నోరు ఎర్రంగా పండి సక్కని పలువరసతో సుడ్డానికి సుందరంగా ఉంటాది.
వాళ్లమ్మ లోపల బజ్జీ లేస్తా వుంది. పొన్ను రంగం బజ్జీలు తింటా ' శానా బాగుండాయి ' అని మెల్లింగా మాటలు కలిపినాడు ఒగనాడు రాదతో . బాదమాకులో ఇంగో నాలుగు బజ్జీలు తెచ్చిచ్చింది.
మా వూరి కాడ రోడ్ పని ఐపోయి కొన్ని మైల్ల దూరం ఎల్లి పోయినారు ఆ పని చేస్తా వున్నోల్లు. ఐనా రొండు రోజులుకూ మూడు రోజులకూ వొచ్చి పోతా వుండాడు పొన్ను రంగం .
ఒగ దినం పిడుగు పన్నెట్లుగా, మొగిలి పువ్వు అప్పుడే ఇచ్చుకోని గుప్పుమన్నట్ల ఒక వార్త ఊరూ నాడంతా అలుముకొనింది.
' పొన్ను రంగడు రాదాబాయి మెళ్లో మొగిలి దేవలంలో దాని బొట్నేలు దొక్కి బొట్టు కట్టేసి నాడంటా. ఇప్పుడు వొరిగి పల్లిలో పూబతి వాళ్లమ్మోలింట్లోనే వొచ్చి ఉండారంటా ' అని.
' ఎంత దైర్నం లేక పోతే వాడు ఈ వూరి బిడ్ని దొంగ పెండ్లి సేసుకోనొచ్చింది గాక ఈ ఊర్లోనే దెచ్చి కాపరం పెడ్తాడు' అని కొందురు పండ్లు నూరినారు.
' వాళ్లూరికన్నా పిల్సక పోక వొచ్చి ఈ డే ఉండాడంటే వోడికి శానా కొవ్వుండాల ' అని రక రకాలుగా మాట్లాడు కుంటా ఉండారు.
పాపం రాంబాయికి తల తీసేసి నట్లయిపోయింది. ఆయమ్మ ఊర్లో వాళ్ల మొగం సూడలేక అంగిడి మూసేసుకోని యాడస్తా పండుకొనింది.
తాగడానికి ఒచ్చినోళ్లు న్యాలిక తీట తీరకుండానే తిరుగు మొగం పడ్తా వుండారు.
పొయిలో పిల్లి లెయ్యక రొండు దినాలై పోయా. పంక్కింటోళ్లు, అక్కింటోళ్లు ముసిలాయన్ని , పిలకాయిల్ని పిల్సి ఏలకింత తిండో తీర్తమో ఇచ్చి వొళ్లను అనవరిస్తా వుండారు. రాంబాయమ్మ మాత్రం నొట్లో నీళ్లు గూడా బోసుకోకుండా నేల కంటక పొయ్యింది.
మా వూర్లో అమ్మలక్కలు శానా మంది అదే పనిగా బొయ్యి రాదను సూసేసొచ్చి వూరికే బోకుండా లచ్చుంబాయి కడుపులో మంటల్ని రగిల్చి పోతా వుండారు.
' వాల్ల సూపులూ మాటలూ ఎప్పుడంత గాడంగా పెనేసుకున్నాయో ఆ బగమంతునికే తెలియాల' అని ఒకరు
' ఒకర్నొకరు ఇడ్సుండలేమనిపించి ఇంతపని సేసుకున్న్యారంటా ' అని ఒకరు
' సూడ్డానికి పొయినోళ్లకు సాపేసి కూసోమని ఆ ఇంటి కోడలు మాదిరిగా మర్యాద సేసింద' ని ఒకరు
'అమ్మోళ్లేమవుతారనే సింత దానికి ఏమాత్రమూ లేదూ అనీ
' మాయమ్మ మమ్మల్ని మాఇంటికి ఎప్పుడు పిల్సక పోతాదంటా' అని అడిగిందని
వూర్లో వాళ్లు సెప్పుకొనే మాటలు ఆ సెవిలో ఈ సెవిలో బడి రాంబాయమ్మ సెవుల్దాకా ఒచ్చి
ఆయమ్మను ఇంగింత కుంగ దీస్తా ఉండాయి.
మూడో దినం పొద్దన్నే లారీ ఒచ్చి ఇంటిముందాగింది. బంగారుపాలెం లో లారీ నిలబెట్టి టీ తాగాతా వుంటే ఈ ఇసయం ఎవురో సెప్పినారంటా . అంతే ఆగమేగాల మింద ఒచ్చేసి నాడు పెద్ద కొడుకు .
కొడుకును సూసి లేసి కూసుని కన్నీరు మున్నీరయింది రాంబాయమ్మ.
' ఇప్పుడేమయింది మా . ఇష్టపన్న్యోన్ని పెండ్లి సేసుకునింది. అంతే గదా. ఎవురైనా , ఎప్పుడైనా పెండ్లి సేసు కోవాల్సిందే గదా! పోనీలే వొదిలేయి. దాని బతుకు దాంది. మన బతుకు మంది ' అని ఓదార్స బట్న్యాడు.
కొడుకును కండ్ల జూసి నాక లేసి కూసొనే ఓపికన్నా ఒచ్చింది రాంబాయమ్మకు. వాడు సదువులో మొద్దే గావచ్చు. యవ్వారాల్ని సక్కదిద్దడంలో మొనగాడని వాళ్లమ్మ నమ్మకం.
వాడు మాత్రం వూర్లో ఎవుర్నీ పట్టించు కోల్యా. సెల్లినీ దాని మొగుణ్నీ ఇరపాచ్చమ్మ గుడి కాడికి రమ్మని సెప్పి పంపించినాడు.
ఏం మంత్ర మేసినాడో ఏం సెప్పినాడో అన్న ఎనక తలొంచుకొని అది ఇంటి కొచ్చేసింది.
దాన్ని సూడంగానే సివంగి మాదిరి లేచి జుట్టుబట్టి ఈడ్చి సావ గొట్టింది వాళ్లమ్మ.
' అమాయకురాలు . వాడి మాయ మాటలు నమ్మి తప్పు సేసింది. నేను సూసుకుంటా వొదిలేయిమా ' అని ఆమి సేతుల్లోనించి రాదను ఇడిపించినాడు .
అదే ఇంట్లోనే వున్న్యా ఆ తర్వాత వాల్లమ్మ రాదను కన్నెత్తి సూళ్లా , మాట్లాడలా .
వారం లోగానే ' నా స్నేహితుడు. మిల్ట్రీలో వుండాడు . రాదను సేసుకోడానికొచ్చినాడు మా' అని అమ్మకు సెప్పినాడు కొడుకు తనతో కూడా ఒచ్చినోన్ని సూపించి.
' నాకు సెప్పొద్దు. ఏం సేస్తావో నీ ఇస్టం. అది మాత్రం ఇంగ మనింట్లో అడుగు పెట్టేదొద్దు.
పెండ్లే సేస్తావో పెటాకులే సేస్తావో ఇంద ఇవుండాయి నాదెగ్గిర అని సెవుల్లో కమ్మలు, సేతి ఏలికున్ని ఉంగరం దీసి కొడుకు సేతిలో పెట్టింది.
పెండ్లి సేసి పంపించొచ్చినాడు సిద్దోజి. రాంబాయికి తలమిందినుంచి పెద్ద బారాన్ని దింపుకున్న్యట్లుండాది. ఊర్లో వోళ్లు కూడా రాదను వాళ్లన్న ఏరే ఎవురికో ఇచ్చి పెండ్లి సేసి నాడని నమ్మి నారు. రాంబాయమ్మ కూడా కొన్నాళ్లకు మామూలు మనిసయి పొయ్యింది.
పాపం కొడుకు దిగులుతోనే పూబతి సచ్చి పొయ్యిందని దాని కొడుకు దేశాలు బట్టి యాడికో పూడ్సినాడని వొరిగిపల్లిలో సెప్పుకున్న్యారు.
సమత్సరం గడ్సి పొయా . రాంబాయి కొడుక్కి పెండ్లయి పెద్ద కోడాలు ఇంటికొచ్చింది. ఇంట్లో కోడలు నడమాడతా వుంటే రాద కండ్లలో మెదలతా వుండాదామికి.
ఏండ్లు గడిసే కొద్దీ రాంబాయికి కొంగు బట్టుకొని తిరిగే సిన్నారి రాద గుర్తొచ్చి సింత బోతా వుంది.
ఎంత తెలివి తక్కువది కాకపోతే ఒకనితో బొయ్యి పెండ్లి సేసుకొని, అన్న బొయి పిలవంగానే గొర్రెనక గొర్రె పిల్ల మాదిరిగా వొచ్చి ఇంగొకని కిచ్చి సెయ్యంగానే వానెంట బొయ్యింది. ఎక్కడుండాదో , ఎట్లుండాదో అనే అలోచనలతో దిగులు పడి పోతా వుంది రాంబాయమ్మ.
ఉండలేక ఒకసారి కొడుకునడిగింది. 'ఏమోమా . నాకు తెల్దు. . నువ్వు మల్లీ అది ఈపక్క రాకూడదంటివా, అందుకని అట్నుంచట్లే పంపించేసినాను. మిలిట్రి యాడో దూరాబారం కదా! సమత్సరం తర్వాత కూతురు పుట్టిందని ఒక జాబొచ్చింది. ఆ విషయం కూడా నీతో సెప్పడానికి బయమయింది. మల్లీ ఇంత వరకూ జాబూల్యా జవాబూ ల్యా' అన్న్యాడు.
రాంబాయికి కూతురు బతికిందో లేదో అనే అనుమానం గూడా ఒచ్చింది. 'కోపమో తాపమో అని ఒక మాటంటాము. ఆ కోపమట్లే వుండి పోతాదా. ఒక సారన్నా ఒచ్చి కన్నోళ్లను సూసి పోవాలని వుండదా ' అని కలవర పడి పోయింది.
అట్లా అనుకున్న్యాక పద్దినాలు కూడా కాకనే ఎంకోబరావు కన్ను మూసినాడు. కొడుకును పిల్సి సెప్పింది. రాద యాడుండాదో కనుక్కోని ఇసయం సెప్పమని . ' తెలీదు మా అన్న్యాడు.
' అబ్బా కూతురికి ఒకరంటే ఒకరికి ప్యానం రా . పాపం యాడుండాదో ఏమో ! ' అని ఏడ్సింది.
కూతురి మింది సింతతో రాంబాయమ్మ సగమైపోయింది. మూసిలోడు సచ్చి ఏడాది తిరక్కుండానే రొండో కొడుకు పెండ్లి సేసినారు.
' అది బాగునింటే పెండ్లిండ్లలో ఆండ బిడ్డి పెత్తనం సెలాయించు కుంటా తిరుగులాడేది ' అని లోలోపలే కుమిలి పోయింది. అక్కన పక్క నోళ్లకు సెప్పుకొని ఏడ్సుకొనింది.
రాను రాను రాంబాయమ్మకి కూతుర్ని సూడాలన్న కోరిక మితిమీరి పోయింది. ఎవ్రు కనిపిస్తే వాళ్ల దెగ్గిర సెప్పుకొని ఏడ్సేది.
' పసి బిడ్డి తెలియక తప్పు సేస్తే మన్నించి కడుపులో పెట్టుకొనేది ఒదిలిపెట్టి కసాయిదాని మాదిరి సేసినావ' ని సుట్టు పక్కలోల్లు కూడా అన్న్యారు.
' కట్టు కున్నోడికి అది ముందు సేసిన నిర్వాకం తెలుసు. కొత్త మోజులో ఏమీ అనక పొయినా మళ్లి దాన్ని మాటలతో చిత్ర హింసలు పెట్టి సంపేసుంటాడు. లేక పోతే ఒగసారన్నా ఒచ్చి పోదా ' అని ఊహించుకోని కుమిలి కుమిలి ఏడ్సుకొనేది.
' బతికుంటే ఒకసారన్నా రాకుండా వుంటాదా. కనీసం యాడుండారు అనే పోవిడన్నా తెలీకుండా ఉంటాదా ' అని పరి పరి విదాలుగా ఆలోసిస్తా వుంది ఆమె మనసు.
మనో యాతన ఎక్కువై పోయింది. కొడుకుదెగ్గిర మాటి మాటికీ కూతురు పెస్తాపన తెస్తాది. '
' ఎవుర్నో ఒకన్ని దాని కిష్టమయి సేసుకునిందిలే అనుకోనుంటే ఈ పొద్దు నా కూతురు నా కండ్ల ముందరుండేది' అని కొడుకుతోనే కాకుండా ఇరుగు పొరుగోళ్లతో కూడా అనబట్టింది.
కొన్నాళ్లకు సిన్న కొడుక్కు పెండ్లి సెయ్యాలనే పెస్తాపన తెచ్చింది పెద్ద కొడుకు దెగ్గిర.
' ఏం సేస్తం లేమా' అన్న్యాడు వాడు.
' ఎందుకురా అట్లండా వుండావూ ? '
' వాడు సేసుకోవాలను కున్ని బిడ్ని నువ్వు
ఒప్పుకోవులే మా'
'ఎందుకని '
' కులం తక్కవని '
' ఏ కులమేమి? '
' నీకు పనికిరాని కులం'
' రాదమ్మ ఇసయంలో నేను బుర్దలో కాలేసి బిడ్ని పోగొట్టు కున్న్యాను. ఇప్పుడు బుద్దొచ్చింది లేరబ్బా , సచ్చిన పామునింకా సావ గొట్ట కుండా వాడికి పెండ్లి సేసే పని సూడు. వాడికిష్టమైన దాన్నే తెచ్చి కట్టు ' ఇట్లా సాగేది వాల్ల మద్దిన మాటలు
తల్లిలో ఇట్లాంటి మార్పు కొసమే కదా ఇన్నాళ్లు ఎదురుసూసింది అనుకోని ఒక ఫొటో తెచ్చి అమ్మ సేతిలో బెట్న్యాడు.
కండ్లు సికిలించుకోని తిప్పించి మల్లించి సూసింది. 'సిదిమి దీపం బెట్టుకున్నేట్లుగా వుంది బిడ్డి' అనుకునింది. అమ్మ మొహంలో ఆనందమే కనిపించింది కొడుక్కి.
' బిడ్ని. సూన్ను ఎప్పుడు పోదామ్మా' అడిగినాడు.
' నేనెందుకు. ఇంగ సూసేదేమి లేదు. మీరు బొయ్యి పోకు వర్తు ఇలావరిగా మాట్లాడుకోని రాండి. కార్తిక మాసంగదా! మంచి మూర్తా లుండాయి ' అని తొందర సేసింది.
' వాళ్లు బాగా ఉండే వాళ్లు మా . వాళ్ల దాటికి మనం తట్టుకోలేము. వాళ్లే సేసిస్తారంటా పెండ్లి . ఈ నెల 22 న ' అని చెప్పినాడు .
పెండ్లి కొడుకును సేసి రచ్చ బండ దెగ్గిరుండే ఇనాయక సామి గుళ్లో కాయా కర్పూరం ఇచ్చి అందరు ఇంటి మొగం బట్టినారు. బోజనాలైనాక పెండ్లి కూతురోళ్లూరికి బయలుదేరి పోవాల.
రాంబాయి ఇంటింటికీ బొయ్యి పెండ్లికి బయలుదేరమని పిలిచింది. కొడుకు ఏకంగా రొండు బస్సులు మాట్లడినాడని సెప్పింది.
రొండు బస్సులూ పుల్లయినాయి. ఇంగా కొందురుంటే కడబ్బస్సెక్కి రమ్మని సార్జీలకు దుడ్లిచ్చినాడు కొడుకు. బస్సులు పోరు మావిల్ల దారిబట్న్యాయి. ఆ వూరి గుల్లో దించినారు అందురిని.
పెండ్లి కూతురోల్లు మేల తాలాలతో వస్తా వుండారు . పెండ్లి కూతురు పక్కగా వస్తావున్న్యామిని సూసి రాంబాయి దెగ్గిరికి ఉరికెత్తినారు కొందురు. అందురికీ అంతు పట్టనంత ఆచ్చర్యంగా ఉండాది.
' పెండ్లికూతురు తల్లి ఎవురనుకుంటా వుండావు. మన రాదాబాయే' అని పొన్నెక్క అందురి కంటే ముందు పరిగెత్తు కోని బోయి సెప్పింది.
అన్నీ సెవులకు ఇనిపిస్తానే వున్న్యా ఒల్లు జలదరిస్తా వుంటే ఉలక్కుండా పలక్కుండా మాను మాదిరిగా వుండి పోయింది రాంబాయమ్మ.
పీటేసి పెండ్లి కొడుకుని కూసో బెట్టి సాంగ్యం జరిపిస్తా వుంటే కూతురొచ్చి వాళ్లమ్మను వాటేసుకునింది. ఇద్దురి కండ్లలో కట్టే గాలవలో నీళ్లు పారినట్ల పారతా వుండాయి కన్నీళ్లు.
కొంచేపిటికి కోలుకొన్న్యారు.
రాద కట్టుకోనున్ని సీర, పెట్టుకోనున్ని సొమ్ములూ సూసి అందురూ అర్సోది పొయినారు. వాళ్ల మొగాళ్లో ఆనందం తాండవ మాడతా వుండాది.
.
పెండ్లి కూతురి తండ్రి తావులో వున్ని పొన్నురంగాన్ని సూసి వులిక్కి పడింది రాంబాయమ్మ. మల్లీ కూతుర్ని ఏవగించు కొనింది. కులం తక్కువోడితో వుందని కాదు.
ఆమె మొక్కట్లను గెవనిస్తా, ఆమెనే సూస్తా వున్ని పెద్ద కొడుకు ' అమా ' అని పక్కకు పిల్సినాడు.
' అది సూడురా నువ్వు ఏరే వాడితో పెండ్లి సేసి పంపిస్తే మళ్లీ వీన్నే తగులుకొనింది. ' అనింది. దిగాలుగా .
' లేదు మా . నేను వీడితోనే పెండ్లి సేసి పంపించింది. అదంతా మేమాడిన నాటకం . నువ్వు దాని గురించి నా దెగ్గిర దిగులు పడతా వుంటే సెప్పేయాలని శానా సార్లనుకున్న్యాను. ఊహూ.. సరైన టైంలో సెప్పాలనుకున్న్యా .
ఈ పదైదేండ్లలో మనూర్లో కూడా మార్పొచ్చింది. లేక పోతే ఇప్పుడూ సెప్పే వాన్ని కానేమో. నువ్వు ఊర్లో వాల్లేమనుకుంటారో అని గాదా ఆలోసిస్తావు. కూతుర్ను దూరం సేసుకుంటావని ఇన్నాళ్లు దాంచి పెట్టినా' అన్న్యాడు.
' రేయ్ , మీ నాయిన సచ్చిపొయినప్పుడు అదే పనిగా గుర్తు సేస్తి గదరా. అపుడన్నా సెప్పక పోతివి . ఈ మద్ది కాలంలో ఎందుకో దాని మింద కలవరం ఎక్కువై పూడ్సింది. '
' అప్పుడు వాళ్లీ దేసంలో లేరుమా దుబాయిలో వుండ్రి. అందుకని రాలేదు. ఈడి కొచ్చి రెండేండ్లయింది. ఈడే ఇల్లు గట్టు కున్రి . దుడ్లు శానా సంపాదించి నారులే ' అన్న్యాడు.
' బిడ్లెంత మందో!' ఎప్పుడో అడగాల్సిన ప్రెశ్న.
ఒగతే కూతురు అంటుండ గానే
రాంబాయమ్మకు అచ్చింత లెయ్యడానికి పిలుపొచ్చింది.
' ముండమోపిని నేనెందుకులే ' అని మొరాయించింది. రొండో కొడుకు ఏకంగా
ఆ యమ్మనెత్తుకోని బొయ్యి పందిట్లో దించినాడు. అందురూ కిల కిలా నవ్వేసినారు.
అచ్చింత లెయ్యి అత్తమ్మా' అని అల్లుడు ఆప్యాయంగా సెప్పినాడు.
సిన్న కొడుకుని, మనవరాల్ని మనసారా దీవిస్తున్న రాంబాయమ్మ మొగంలో కోటి కాంతులు . దాన్ని సూసిన కొడుకు మొగంలో తొణకని బాయిలోని నీళ్లు మాదిరిగా ప్రెశాంతత.
- మహాసముద్రం దేవకి
9-11-2918
Comments
Post a Comment