వరిగ పల్లె ముచ్చట్లు-౩
కర్నమోళ్ల కస్తూరి
కస్తూరి గుర్తుకు రాంగానే గుమ గుమ లాడే నికార్సయిన కస్తూరి పసుపు కొమ్ము నా కళ్లముందు నిలబడతాది. అంత మంచి మనిసి కస్తూరి.
ఐదో తరగతి దాకా మాయక్క తో కలిసి సదుంకొనింది. పాపం ఐదు పాసవంగానే మానాయిన మా యక్కను సిత్తూరులో కొంచిం మావూరికి దెగ్గిరిగా వుండే కన్ననిస్కూల్లో సేర్సేసినాడు .
' ఆండబిడ్డికి సదువెందుకురా కోదండా ' అని మాయవ్వ నెత్తీ నోరు కొట్టుకున్నా మా నాయిన ఇనలేదు .
' సదుంకోను ఆడ మొగా తేడా ఉండదు మా. ' అని అదే పతా పొయ్యి ఇస్కూల్లో సేర్సి మాయక్కను కలాసులో కూసో బెట్టి ఒచ్చినాడు.
మాయక్క టిపిన్ బాక్సు పట్టుకోని , బుక్కుల సంచి తగిలించుకోని , రొండు జడలేసుకోని , కాళ్లకు లబ్బరు సెప్పులేసుకోని ఇస్కూలుకు పోతా ఉంటే -- పాపం కస్తూరి పులుకు పులుకు మని కండ్లార్సుకుంటా మాయక్కతో కూడా రోడ్లో కొచ్చి కనిపించేదాకా సూస్తా ఉండేది.
ఒక దినం మా యక్క కనుమరుగయినాక గబుక్కున వాళ్లింటికి పరిగెత్తుకోని బొయ్యి వాకిట్లో బడి దొర్లతా ఏడుపు మొదులు బెట్టింది .
' ఉండెట్లుండి ఏమైందిమే నీకు' అని వాళ్లక్కోలిద్దురు ఎంతడిగినా సెప్పలేదు. వాళ్ల కౌసల్యక్క పరిగెత్తిపోయి మదుర గోడ కాడ నిల్సుకోని ఆ పక్క నుండే కెంపక్కతో సవాల్లిసరతా వున్ని వాళ్లమ్మను ' అమా ఈ బిడ్ని సూస్తువు రా' అని పిల్సుకోనొచ్చింది.
ఊహూ కస్తూరి నోరు తెరిస్తేనా! ఆ బిడ్డి ఏడ్సి సాదించుకొనే రకం . ఉలకలా, పలకలా. వాళ్లమ్మకు కోపమొచ్చి ఇట్ల పొర్లించి అట్ల పొర్లించి ఇసుగొచ్చి రెండేట్లేసింది . అప్పుడిప్పింది నోరు కస్తూరి.
' నేను సిత్తూరిస్కూలుకు పొయ్యి తీరల్ల ' అని లేచి కూచునింది . ' వొద్దని ముందే సెప్పినాము కదా! మల్లీ ఈ ఆగడం దేనికే గాడ్ది ముండా' అని గుడ్లురిమింది వాళ్లమ్మ రాజమ్మ .
' పో ఆ నల్లావును , ఎడ దూడను పట్టక పోయి కసిం కాడ గుడ్డంలో కసువు బాగుంది మేముకోని రాబో ' అని పైకి లేపి ఈడ్సి ఎద్దుల కొట్టం పక్కకు తోసింది
ఊ ఊ. అని రాగం దీసుకుంటా బొయ్యి ఎద్దుల కొట్టంలో ఏసిన తవుడు మూటల మింద పండుకొని ఎప్పుడో నిద్రలోకి జారుకొనింది కస్తూరి.
బాయి కాన్నుంచి సెరుకాకు మోపు దెచ్చి కొట్టంలో ఏస్తా ఆబిడ్ని సూసింది వాళ్ల రొండో అక్క రమణి.
' ఏంది మే ఈడ పండుకోనుండావు. ఆ తలకాయ సూడు' అని లేపి తలకు , ఒళ్లంతా అంటుకోనున్ని తవుడు ఇదిల గొట్టి ఇంట్లోకి ఈడ్సుకోని బొయ్యింది.
సిత్తూరిస్కూలుకు బోవాలని కస్తూరి ఎన్నో దినాలు ఎంత ఏడ్సి మొత్తుకున్నా దాని పప్పులుడక లేదు.
కస్తూరికి పొద్దన్న లేస్తానే పనీ పాటా ఏమీ వుండదు. మొన్నటొరకూ ఇస్కూలుకు బొయిన బిడ్డి కదా! అయినా వాళ్లమ్మ , ఇద్దురక్కలు, ఒక వొదిన వుండారు. ఇంగ దీనికేం పనుంటాది? ఇది లేసే పాటికే పాసి పనులన్నీ వాళ్లు సేసేసుంటారు.
లేస్తానే పిడక బూడిదో, బొగ్గో , ముగ్గుపిండో నోట్లో ఏసుకోని పండ్లు తీటుకుంటా వొచ్చి మా సేందబాయికాడ నోరు పుక్కలించి ఊంచేసి మాయక్క దెగ్గిరికొస్తాది. మాయక్క ఇస్కూలుకు రెడీ అవతా ఉంటే ఎనకెనకే తిరగతా సూస్తా వుంటాది .
మాయమ్మ మాయక్కకు క్యారీరు కట్ను సంగటి పలకపైన అన్నమారబోసి పులుసన్నమో, నిమ్మకాయన్నమో , కూరో, పెరుగో ఏసి కలపతా ఉంటే ఆడ బొయ్యి కూసుంటాది.
' ఉప్పుందా సూడు, పులుపు సరిపొయ్యిందా ' అని మా యమ్మ అన్నం పిడస కట్టిస్తే రుసులు సూస్తాది.
టిపిను బాక్సులో అన్నం పెట్టినాక దాన్నెత్తుకోని మాయక్క దెగ్గిరికొచ్చి మాయక్క ఇస్కూలుకు బొయ్యేదాకా అడే సుట్టుకులాడతా మెల్లింగా దిగులు మొగమేసుకోని ఇంటికి బోతాది.
సద్ది తాగి వాళ్ల బాయికాడి నుంచి మిరప తోటలో వంకాయిలో , బీర కాయిలో సెరుకు దోట కాలవల్లో ఉండే గోంగాకో , సెనిగి సేన్లో గురుగాకో తెచ్చిచ్చి పాలు పిండే రెండావుల్ని బాయికాడికి పట్టుకోని బొయ్యి మేముకోనొస్తాది .
మాయక్క ఇస్కూల్నించి రాంగానే మళ్లీ మాయక్క సుట్టూనే . ఇద్దురూ జట్టు. ఎన్నెల గాసేటప్పుడైతే రాత్రి ఒంటిగంట దాకా ఆటలేనా, పాటలేనా ? అప్పుడప్పుడూ వాళ్లిద్దురే తనీగా కూసోని గంటలు గంటలు మాట్లాడుకుంటా వుంటారు. ఆ బందాన్ని ఎవురూ ఇడదీయలేరు.
మాయక్క ఎనిమిదిలోకొచ్చింది. ఇద్దురూ పావడాలు కట్టుకొని దాని మింద దావినీలు ఏసుకొని వొయసొచ్చిందని ఒగలు బోతా వుండారు. మా సెట్లలో మల్లి పూలు,? వాళ్ల బాయికాడి మైసూరు మల్లి పూలు, మా పెల్లో కాసే కనకాంబరాలు కోసుకొని ఇద్దురూ మాట్లాడుకుంటా కదంబం కట్టుకుంటారు.
తలా ఒక బంతి తల్లో బెట్టుకొని మర్సనాటికని పూలు వాడి పోకుండా నీళ్లు సిలకరించి గిన్ని కింద బోర్లించి పెట్టుకుంటారు. పూలు లేకుండా వాళ్ల జడలు ఎప్పుడైనా కనిపిస్తేనా . వాళ్లిద్దురూ ఎన్ని పూలు పెట్టుకుంటారో సమానంగా నాకూ ఇచ్చితీరాల్సిందేలే.
ఒకసారి ఊరు ఊరంతా సిత్తూరికి బయలుదేరతా ఉండాము సినిమా కని . వీళ్లిద్దురి ఆలోచన ఏరేగా వుంది. మాయక్క మాయమ్మను ఎట్లా ఒప్పించిందో, కస్తూరి వాళ్లమ్మకు ఏమి సెప్పి ఏమార్సిందో గాని ఇద్దురూ టింగురంగా అని తయారయ్యి ఒక గంట ముందుగానే సిత్తూరుకు సెక్కేసినారు.
ప్రతాప్ టాకీస్ లో లవకుశ ఆడతా ఉండాది. అది జూడాలనే అందురూ బయలుదేరింది. దానికానుకొనే ఉండాది పోటోలు దీసే స్టుడియో.
ఆడబొయ్యి తెల్లంగా పవుడరు పూసుకున్న్యారు. రొండు జడలేసుకోని, ఒక జడలో మల్లిపూలు కనకాంబరాల పూలు బెట్టుకోని . ఒకో జడను ముందరేసుకొని , సేతుల్లో ఇస్టైలుగా బుక్కులు పట్టుకున్న్యారు. ఇద్దురూ కలిసి ఫోటో దిగి మేము పొయ్యేపాటికి నంగనాచులు మాదిరిగా ఏమీ తెలియనట్లు సినిమా టాకీసు దగ్గర ఉండారు
ఐదోదినము పొటోలొచ్చినాయి . ఇద్దురూ సదువుకున్నమ్మాయిలు సినిమాలో సాయిత్రి, క్రిష్ణ కుమారి , ఇంగొకామి ఈవీ సరోజో ఎవురో, వాళ్ల మాదిరిగా నిలబడి అచ్చు సినిమా వోళ్ల మాదిరిగా వుండారు.
అది సూసి నేనూ పొటో దిగాలని ఏడిస్తిని. రొండు మూడు దినాలయినా ఒదిలి పెట్టలా నేను. గుర్తొచ్చినప్పుడంతా ఇంట్లో రాగాలు తీస్తానే ఉండా . నా పోరు తట్టుకోలేక మాయమ్మ నాతో మా తముళ్లతో ఫోటో దిగిందిలే.
రొండేండ్లు గడిసి పొయినాయి. కస్తూరోళ్ల అక్కలిద్దురికీ ఒగే రోజు పెండ్లిండ్లు సేసినారు. ఒకక్క కాపురానికి పొయ్యింది. ఇంగొకక్క మొగుడు మిలిట్రీలో వుండాడు . అందుకని ఆయమ్మ అత్తింటికి బోకుండా పుట్నింట్లోనే వుండాది.
కస్తూరీ ఎదిగి నాలుగేండ్లయింది. పెండ్లికి రెడీగా ఉండాది. కస్తూరి వాళ్ల పక్కింటి పిలగోడు సీరాములు రెడ్డి, కస్తూరి ఒగర్నొకరు ఇష్టపడతా ఉండారని మా యక్కకు తెలుసు. అయినా ఎక్కడా మూసిడవల్యా. ఇంట్లోవాళ్లకి కూడా ఇద్దురి మద్దిన ఏదో జరగతా ఉండాదని తెలిసిపోతా ఉండాది.
రెండిండ్లకు మద్దినుండే మొండిగోడ మింద దాటి ఆయబ్బోడొచ్చి కస్తూరి తోలకొచ్చిన గొడ్లను గాటికి కట్టడం, వాళ్లు సూసుకొనే సూపులు అనుమానంగానే ఉండాయి. కస్తూరోళ్ల మూడో అక్క గర్భంతో వుండాది. సుట్టాలు, పక్కాలు పలారాలు కాల్చుకోనొచ్చి సూసిపోతా ఉండారు.
ఒకదినం పలారాల్ని కాయితంలో పొట్లం గట్టుకోని కొంగుకింద దాంచుకోని బయటికి బోతా వున్ని కస్తూరిని సూసింది వాళ్లక్క. ఎక్కడికి పోతాదా అని గెవనిస్తా ఉండాది.
ఆ బిడ్డి ఏకంగా గోడ దాటి సీరాములోల్ల గొడ్ల కొట్టం లోకి పోయి ఆడుండే కుక్కి మంచంలో పెట్టి దానిమింద ఆడుండే బొంత కప్పి ఇట్లా అట్లా సూస్తా గోడ దాటి వస్తా మూడుసార్లు దగ్గింది. వాడు బయిటికొచ్చినాడు. ఏదో సైగ జేసి లోపలి కొచ్చేసింది.
ఇట్లాంటివి నాలుగైదు రాజమ్మ సెవుల్లో బణ్న్యాక మాయక్కను పిల్సి అడిగినారు. 'ఇద్దురూ సందు దొరికితే సాలు గుస గుసలాడుకుంటా గంటల తరబడి ఊసులాడుకుంటా ఉంటారు కదా నీకు తెలిసే వుంటాది సెప్పు ' అని . మాయక్క సెప్తేనా!
ఆ బిడ్డి సెయ్యి దాటిపోక ముందే పెండ్లి సేసెయ్యలని కొడుకులుతో మాట్లాడిందిరాజమ్మ. ఆ ఇంట్లో ఆయమ్మదే పెత్తనం. రాజమ్మ రొండో ఆండబిడ్డికి ఆస్తి పాస్తులు బాగా ఉండాయి. . ఒక్కడే కొడుకు. కాని మనిషి ఒక అయిదు మంది మనుసులు కలిస్తే ఎంత లావుంటాడో అట్లుండాడు.
ఆ బిడ్డి సచ్చి పోతానని ఏడ్చింది, ఒద్దు మొర్రో అని మొత్తుకొనింది. ఎవురూ అయ్యో అనలా. పెండ్లయిపోయింది. పెండ్లి కూతురు మొగంలో మాత్రం కళా కాంతులు లేవు . కస్తూరి ల్యాకుండా మాయక్కకు సెయ్యిరిగినట్లుండాది.
అత్తగారింటికి మూడు నిద్దర్లకు పొయ్యొచ్చినాక మూడో నెళ్లో ఉగాది సాంగ్యం ఇచ్చి పంపించాలని ఈడే పెట్టుకున్న్యారు. సందు దొరికితే కస్తూరి , మా జోతక్క ఏదో ఒక మూల సేరి ఎడ్సుకోవడమే పనిగా ఉండారు. మాయక్క తొమ్మిదిలోకి రాంగానే ఇస్కూలు మానిపించినారులే.
నేను అప్పుడే తిరప్తి కాలేజీలో కొత్తగా సేరుండా. నాకు జరమొచ్చి పద్దినాలు పడకేసినాను. నన్ను సూసుకోను మాయక్క తిరప్తికొచ్చింది. మా పిన్నమ్మ కూడా ఉద్యోగం సేస్తాది. బాగ లేని బిడ్డి దెగ్గిర ఎవురూ లేకుంటే ఎట్లా అని మాయక్కను పిలిపించినాడు మా సిన్నాయన. నాకు బాగయినాక మేమిద్దురూ నాలుగు దినాలు లీవులుంటే మా ఊరికాడి కొచ్చి బస్సు దిగినాము .
రోడ్లో కస్తూరోళ్ల అక్కోళ్లుండారు. వాళ్ల పెద్దక్కను బస్సెక్కించాలని . ఉన్నెట్టుండి మమ్మల్ని సూడంగానే ఆడంతా ఆలగోడు బాలగోడయిపోయింది.
' జోతీ కస్తూరి ఎంత పని సేసిందో సూడు తల్లీ ' అని మాయక్కను కట్టుకోని ఏడ్సినారు. ' వాళ్లు. మాయక్కకు అర్తం కాల్యా. 'కస్తూరి సీరాములుతో ఉడాయించినట్లుంది. ' అనుకొనిందంట మా యక్క . ఆ తర్వాత ఒడ్సాకు తిని ప్రాణాలు తీసుకునిందని తెలిసి కుప్ప కూలి పోయింది మాయక్క.
' ఆ బిడ్డిని సంపింది మీరే. ఇప్పుడెందుకూ నంగేడుపులు . సదువుకుంటానంటే సదివించినారా ? ఇష్టపడినోన్ని సేసుకుంటానంటే ఇంటిరా? పోనీ పెండ్లొద్దంటే కూడా ఇనలేదు మీరెవురు.
' నన్ను ఏరే వాడి కిచ్చి సేసినా సరే మే , ఒక ఎనుం పడ్డకు నన్ను కట్టబెడతా ఉండారు. ఏం పాపం సేస్తిని . ఏ ఇసయంలోను నన్ను సంతోసంగా బతకనియ్యలేదు మా వాళ్లు ' అని ఎంత ఏడ్సేదొ నా దెగ్గిర. మీరసలు మనుసులే కారుకా. అని తిట్టింది మాయక్క. ఏడుపులు ఎక్కువయినాయే కాని ఎవురూ ఏమీ మాట్లాడలా.
' పోనీ మీరు సెప్పండి. మీరైతో అంట్లాంటోడిని సేసు కొనే వొళ్లా . వాడితో కలిసి బతికే వోళ్లా. బంగారట్లా కస్తూరిని ఆస్తి కోసం అట్లాటోడికిచ్చి సేస్తారా. ఆ బిడ్డి ఏమి తప్పు సేసిందని ' అని ఏడస్తానే అడగతా వుండాది మాయక్క.
పచ్చాత్తాపమేమో ఒక్కో మాటా మాయక్క అడగతా ఉంటే కుమిలి కుమిలీ ఏడస్తా ఉండారు. అరగెంటకు అందురి ఏడుపులూ తగ్గుముకం పట్నాయి.
మళ్లీ సావుకు సెప్పలేదని మాయక్క గొడవ పెట్టుకునింది. 'మీరు మనుసులు కాదని దీంట్లో తెలిసి పోలా ? ఎంత ఇష్టం అదంటే నాకు. దానికి నేనంటే ఎంత ప్రానం. అట్లాంటిది అది సచ్చి పోతే నాకు ఒక మాట సెప్పరా? ' అని మాయక్క ఏడుపెత్తుకొనింది. ఇంత జరిగేసరికి ఊర్లో జనం సగం మందిదాకా సేరి పొయినారక్కడ.
జోతి అడిగేది కూడా న్యాయమే కదా! ఆ బిడ్ని నిజింగానే వీళ్లయ్యే సంపుకున్రి అన్న్యారు శానా మంది. ' ఒక కులం గాక పోయా వీళ్లు మాత్రం ఏం సేస్తారూ ' అని దీర్గం దీసింది పక్కింటి కెంపక్క.
' కులాల్ని దీసుకోని తలకు పోసుకోండి' అంటా కండ్ల నీళ్లు పెట్టుకొనింది మా యమ్మ కూడా. అందురి కండ్లల్లొనూ నీళ్లు. '
' ఆ బిడ్డి తప్పేమన్నా ఉండాదా? అది యాడికన్నా పూడ్సినా సుకంగా బతికేది. సీరామునుకిచ్చి పెండ్లి సేసుంటే సిలకా గోరింకల మాదిరిగా కండ్లముందుండేటోళ్లు. ఇష్ట పడినోళ్లను ఇడదీసిరి . అందుకే మీరూ వొద్దని దూరంగా పూడ్సింది' ఎగవింటోళ్ల కమలక్కనింది.
వీళ్లంతా కస్తూరి పెండ్లిజేసుకొని రచ్చబండ దెగ్గిరుండే వినాయకుని గుడికి ఒచ్చినప్పుడు ఆ బిడ్డి సింగారాన్ని, పెండ్లి కొడుకు ఇకారాన్ని సూసి నొచ్చుకున్నోళ్లే.
అంతే ఆ తర్వాత మా ఊర్లో ఎవురికైనా ఇష్టం లేని పెండ్లీ, పేరంటాలు సేస్తే ఒట్టు. సచ్చి కస్తూరి సాదించిన విజయమది.
ఇప్పుడు మీకు నేనీ కత సెప్తా ఉండానా ? మాయక్క కూడా లేదిప్పుడు. ఇద్దురూ ఏడ కూసోని సుద్దులు మాట్లడుకుంటా ఉండారో ! వాళ్లిద్దురూ కలిసి తీసుకున్ని పోటో మాత్రం మా ఇంట్లో పదిలంగా ఉండాది.
-- మహాసముద్రం దేవకి
అనంతపురం
6- 11- 2018
Comments
Post a Comment