సిన్నెయ్య ఒంటెద్దు బండి =మాండలిక కథ

 వరిగ పల్లె ముచ్చట్లు - 21


సిన్నెయ్య ఒంటెద్దు బండి

         మా వూర్లో ఇంతో అంతో నేలా నెట్రా ఉండి పెద్ద సేద్యాలు సేసి  దుడ్లు మిగిలి మిట్న బడిన ఇండ్లలో వాళ్లకు బండీ ఎద్దులుండాయి.

        బూమీ పుట్రా లేక బండ మింద నుంచి బాడిక్కి కంకర, కట్రాళ్లు , బండలు దోలడానికి బండీ ఎద్దుల్ని పట్టుకోని దాని మిందే జీవనం సాగించే కుటుంబరాలు కొన్ని ఉండాయి. ఈ బండ్లను ఏవీ ఊరికీ సిత్తూరికీ మనుసుల్ని తిప్పడానికి కట్టరు. కానీ ఇట్ల బొయ్యేటప్పుడో, ఆణ్నించి ఒచ్చేటప్పుడో కాలీ బండ్లను సూస్తె ఎవురైనా ఎక్కతారు . దుడ్లు తీసుకోరు.

        ఏ తేరూ తిరణాళ్లకో , పెండ్లీ పెరంటాలకో పది మంది పయన మైనప్పుడు రొండెద్దల బండ్లను కడతారు. పెండ్లిండ్లకు , మరివేళ్లకు , తేరూ తిరనాళ్లకు అవసరాన్ని బట్టి ఊర్లో ఉండే బండ్లన్నీ  బయలు దేరతాయి . అట్లాంటప్పుడు  కూడా బండ్లు కట్టి నోళ్లు ఏమీ ఆశించరు .

        కానీ సంతకో, పేటకో పని మింద ఎలబారి నోళ్లలో నడవ లేనోళ్లుంటారు కదా! జరమో గిరమో వచ్చిందనుకో ! దర్మాస్పత్రికి బోవాల్నా? పాల్దాగే బిడ్నయితే  బుజం మింద పండేసుకోని నడ్సి మూడు మైళ్లు గాకుంటే ఇంగంత దూరం గూడా బోవచ్చు. పెద్దోళ్ల కయితే? అదే పనిగా రొండెద్దుల బండ్లు కట్టాల్సిందే, లేనోళ్లు బండ్లున్నోళ్ల కాళ్లా ఏళ్లా పడాల్సిందే .

        అట్లాంటప్పుడు మా ఊర్లో వోళ్లకు ఆపద్బాందోడి మాదిరిగా సిన్నెయ్య ఒంటెద్దు బండిని కొనక్కొచ్చి నాడు. అదేం కొత్త బండి కాదు . కొత్త బండిని కొనే స్తోమత సిన్నెయ్యకు లేదని అందురికీ తెలుసు. పాతదయినా కొనాలని తీసుకునింది కాదు. ఊర్లో వోళ్లకు అవసరానికి పనికొస్తాదనీ కాదు.

          సిన్నెయ్యకు మా సెడ్డ అలవాటొకటుండాది. పద్దన్నే బయలుకు బొయ్యి శంకర్రెడ్డి బాయికాడ మిసనాడతా ఉంటే గెనేన ఉన్ని పండ్లు దొమే ఆకుతో పండ్లు తీటుకోని నేరుగా అంగిడి రామక్కింటి కొచ్చి టీ తాగితే గాని దినం మొదులు కాదు. సిల్లర దుడ్లు సేతిలో ఆడిందనుకో నాష్టా కూడా కానిస్తాడు. ఇంట్లో సద్ది గిట్టదు. పస్తన్నా ఉంటాడు.

        రామక్క  సీసాయి గలాసులో ఏడిగా ఇచ్చిన టీని ఊదుకొని ఊదుకోని తాగాతా ఉండాడు. ఇద్దురు ముగ్గురు కూసోనుండారాడ. పద్దన్నే పనీ పాటా లేదేమో ! లోకాబి రామాయణం మాట్లాడుకుంటా ఉండారు.

        ఒంటెద్దు బండొచ్చి అంగిడి ముందు ఆగింది. బండి తోలకొచ్చిన మనిసి ఊరికి కొత్త. అంగిట్లో కొచ్చి టీ అడిగినాడు.

        నారాన్సామోల నర్సిమ్మన్న ఊరుకోడు కదా ! 'యా ఊరన్నా మనది 'అడిగినాడు.

        ' పడమట బంగారు పాలెం దెగ్గిర రాగిమాను పెంట '

        ' ఇట్లెంత దూరం '

       ' యాందమూరి దాక '

        ' ఏం పనో! ' ఎత్తిరాజులు గాడు అడిగినాడు.

        ' సంతలో బండీ ఎద్దును అమ్మకానికి పెడదామని '

       సిన్నెయ్య ఎంటనే బండి పక్క సూసినాడు.

      గూడు బండి పాతదైనా బాగానే ఉండాది. మామూలుగా ఇట్లాంటి బండిని దుడ్లున్నోళ్లు ఊరి పయానాల కుంటాదని కొనుక్కుంటారు.

        రాగిమాను పెంట నుంచి బంగారు పాళ్యానికి బండి నడపతా ఉంట్ని. ఉండెట్టుండి ఒగ కష్ట మొచ్చి పడింది. దీన్నమ్మితే తప్ప ఆ కష్టం తీరేట్టు లేదు ' దిగాలుగా అన్న్యాడు

        ' ఏపాటి సేస్తా దంటావ్'

        'బండీ ఎద్దును కలిపి పదేడు నూర్ల కిస్తా '

         సిన్నెయ్య ఎద్దు పక్క సూసినాడు . ముసిలి గొగ్గి.  మేత లేక బర్రెముకలు తేలింది.   

        నర్సిమ్మన్న శానా సవక అని మొనుసులో అనుకోని ' ఏం కష్ట మొచ్చిందన్నా' అని అడిగినాడు.

        మా బాశాలికి పానం బాగలేదన్నా. పట్నం దిస్క పొయ్యి సూపెట్టమన్యారు ' అనినాడు.

        ' నిజిమేలే , పట్నం వైద్యమంటే మాటలా . దుడ్లతో పని ' తనలో తనే గొనుక్కున్నాడు అయిలన్న.

      'అంత దుడ్లు సెయ్యదే ' నర్సిమ్మన్న అన్న్యాడు.

        ' అవసరం కొద్దీ అమ్మతా ఉండానన్నా. . కూడూ నీళ్లూ పెట్టి మమ్మల్ని కాపాడతా ఉండేదిదే . రెండేలకు తక్కవ బడదు. ఏమంటే ఇప్పుటికిప్పుడు అంత దుడ్లు బోసి కొనే మారాజులు దొరకరని తక్కవకు తెగేసి జెప్పినా. మరీ మితిమించి సెప్తే ఎవురూ తీసుకో లేదనుకో మొదులుకే మోసం వస్తాదనీ ...'

        ' ఇంగో మాట సెప్పు ' ఐలన్న అన్న్యాడు.

         ' సెప్పే దేముంది. నాది ఒకే మాటే. రొండో మాట లేదు. '

        ' నువ్ సెప్పేది బాగుందన్నో . బేరం సారం మాట్లాడ కుండ సెప్పిన దుడ్లను ఆకూ వక్కలో బెట్టిచ్చేస్తాడా ఏ మొగొడైనా? ' అన్న్యాడు సిన్నెయ్య.

        ' ఊ , కానీ ఇంగో మాట సెప్పు . '

        ఇంగ సెప్పెదేమీ లేదన్నట్లుగా టీ తాగిన గలాసు బెంచీ పైన బెట్టి లేసి నిలబడినాడు .

        'ఉండన్నా. అంత తొందరైతే ఎట్ల ? ' అంత వరకూ మూసిన ముత్తెం పాసిన పగడం మాదిరిగా కూసోనున్ని ఎత్తిరాజులు నోరిప్పినాడు .

        ఉండేమి సెయ్యాల. ఒచ్చిన పని షురువు జేసుకొని ఇల్లు జేరాల్నా ఒద్దా. మా బాశాలి దెగ్గిర ఏరే మనిసిని పెట్టొస్తి. వాళ్లూ కడుపాత్రం కోసం కూలీ నాలీ సేసుకోని బతికేటోళ్లు ' అని మౌనంగా నిలబడినాడు . ఆయిన్ని ఎగా దిగా సూసినాడు నర్సిమ్మన్న. ఎక్కడో ఉండాదాయన మనసు.

        ' ఊ కానీ సిన్నెయ్యా. తీసుకొనే మునాసుందా నీకు. ముందు అది సెప్పు '

        బండి ఎద్దూ రొండూ అంటే అయ్యే పని గాదు. బండి మాత్రం ఇస్తాడేమో అడగండి '

        ' మల్లీ ఎద్దునమ్మను నేను యాందమూరి  సంతకు బోవాళ్నా? నాకూ అదయ్యే పని గాదులే ' కదల బొయినాడు.

        ' ఎత్తి రాజులూ, అవ్వోలబ్బోడు ఒంటెద్దుతో పార్కలాడతా ఉండాడు . ఉండాడేమో సూడుపో'
అన్న్య్యాడు నర్సిమ్మన్న .

        ' సెప్పయ్యా . బండయితే ఎంత కిస్తావు , ఎద్దుకెంత కావాలంటావు ? ' నర్సిమ్మన్న.

        ' బండి పద్నాలుగు నూర్లు ఎద్దు ఐదు నూర్లు. '

        ' లెక్క దెల్సే మాట్లాడ్తా ఉండావా నువ్వు ? '

         ' సదుంకోక బోయినా లెకా పక్కా బాగానే తెల్సు '

        ' పదేడు నూర్లంటివి, బేరమాడతా ఉంటే ఇంగో ఇన్నూరు పెంచేస్తావా? '

       ' బేరమాడతా ఉండారనే '

         ' బండీ ఎద్దల్ని ఒగరే తీసుకోండి పదేడు నూర్లకు మీ సేతుల్లో బెట్టి పోతా '

     ' ఒగర్దీసు కుంటారో ఇద్దురు దీసుకుంటారో అమ్మే వోడివి నీ కెందుకయ్యా? '

       ' నా ఎద్దు రాములోరు. దానికి ఈ బండికీ సంబందమేర్పడి ఏండ్లూ పూండ్లూ దాటింది. దాన్ని ఇడదీస్తా ఉంటేను.'

        సిన్నెయ్య మెల్లింగా లేసి సందు పక్క జారుకుంటా ఉంటే ' ఉండు సినెయ్యా నీకోసం బేరమాడతా ఉంటే... ' నర్సిమ్మన్న అన్న్యాడు.

        ' బేరం మొదులుకే మోసమొచ్చేట్లుండాదే . సంతలో దలార్లు కమీసన్ల కోసం ఎంతంటే అంతకు అడిగి నరాల్దెంపేస్తారు ' అనుకున్న్యాడు బండాయన .

        సిన్నెయ్య అవ్వోలబ్బోడికి ఎదురు బొయ్యి బండీ ఎద్దుల్ని ఒగరికే మాట్లాడేట్లు ఏర్పాటు జేసు కొని వాళ్లతో పాటు ఏమీ తెలీనట్లే ఒచ్చి కూసున్న్యాడు.

        పదైదు నూర్లకు తీర్మానమయింది. ఇద్దురూ బొయ్యి ఊరంతా తడుముకోనొచ్చి దుడ్లు బండాయన సేతిలో బోసినారు.

      ఈ లోపల ఆడున్నోళ్లు నాష్టా కూడా కానిచ్చి నారు. దుడ్లను బద్రంగా బొడ్లో దోపుకోని బండికి దండం బెట్టుకోని ఎద్దును ఒళ్లంతా తడిమి ముద్దు బెట్టుకోని బంగారుపాలెం బస్సుకోసం రోడ్డు దాటి ఆ పక్కకు బొయినాడు బండాయన .

        ' నీ బాశాలికి బాగయితుంది. బద్రంగా బొయిరాన్నా ' అని దీవెనలిచ్చి పంపించినాడు నర్సిమ్మన్న .

        అసలు కత ఇప్పుడు మొదులయింది. బండెంత ఎద్దెంత అని .

        అన్ని తర్జన బర్జన లయినాక మూన్నుట్యాబైకి ఎద్దును అవ్వోలబ్బోడుకిచ్చి మిగాది సిన్నెయ్యకు అంటగట్న్యారు ఆడున్ని పెద్ద మనుసులు .

        అప్పుట్నించి సిత్తూరుకు  బయలు దేరేవోళ్లు రాత్రి ముందే సిన్నెయ్యకు సెప్పి పెడ్తారు . అప్పుటికప్పుడు వొచ్చి బండెక్కే వోళ్లు ఉండారు. సిన్న పిలకాయిల్కి అర్దనా, పెద్దోళ్లకు అనా లెక్కన బండి సిత్తూరికీ , ఒరిగి పల్లికీ మద్దెన నడిపే సిన్నెయ్య పెట్టిన పెట్టు బడిని ఏనాటికి సంపాదించాల.

         ఐతే బండెప్పుడూ పుట్టిడి బిడ్లి తల్లి మాదిరిగా నిండుగా ఉంటాది. ఒగో సారి దినానికి రొండు మూడు ట్రిప్పులు దిరగతాది బండి .

        బండ్లో కతలూ కాలక్షేపాలకు కొదవ లేదు. మా ఊర్లో ఏమూల ఏమి జరిగినా సిన్నెయ్య  బండెక్కే మనుసుల వల్ల ఆ ఇసయం ఊరంతా అల్లుకుంటాది.అట్లా వార్తల్ని సేరేసే పత్రిక పని, రేడియో పని కూడా సేస్తాది మా ఊరి సిన్నెయ్య బండి .

        ఎద్దుకు దానా ఇంట్లో ఆండోళ్లు పచ్చి కసువని, సెరుకాకని తంపుగా సమకూర్సి పెడాతారు  కాబట్టి  బండికి కందెన తప్ప గెడ్డీ గాదం కర్సు కూడా లేదు.

        పెండ్లాం కమ్మల్నమ్మి బండికి సేసిన అప్పు దీర్సిన సిన్నెయ్య దినానికొక రూపాయి కమ్మల కోసం ఉండీలో ఏస్తా ఉండాడు. ఊర్లకు బోవాల్సొచ్చినప్పుడు ఎరివిలి కమ్మలు బెట్టుకొనే గాచ్చారం  ఇంగా ఎన్నాళ్లని సిన్నెయ్య పెండ్లాం అడపా దడపా ఓపిక దెచ్చుకొని మొగుని దెగ్గిర ముక్కు సీందతానే ఉండాది .

        సేతిలో ఎప్పుడూ లేదనకుండా సిల్లర దుడ్లు నడమాడతా ఉన్న్యందుకు సిన్నెయ్య కుశాలు మాత్రం సెప్ప నలివి కాదు.

                                   మహాసముద్రం దేవకి
                                        12- 8- 2019



        

Comments