పరిశోధనలో పదనిసలు

 ప్రవేశిక


తెలుగు భాషా సాహిత్యాలను అధ్యనం చెయ్యడం అవి పుట్టినప్పటి నుండి జరుగుతూనే ఉంది . భాష ఎప్పుడు పుట్టింది ? ఎలా పరిణమించింది ?
ఆ భాషలో  సాహిత్యం ఎప్పుడు పుట్టింది ? ఎప్పుడు ఏయే ప్రక్రియలొచ్చాయి ? వాటి సృష్టి కర్త లెవరు ? ఆ రచనల్లో ఎలాంటి విశేషాలున్నాయి ? ఆసక్తిదాయకంగా విశ్లేషించిన పండితులు చాలా మందే ఉన్నారు. ప్రాచీన సాహిత్యం లో భాగాలయిన భారత, భాగవత రామాయణాలను, అష్టాదశ మహా పురాణాలను , శైవ , వైష్ణవ సాహిత్యాలను వాళ్ల వాళ్ల అభిరుచులకు అనుగుణంగా చదివి వివరించి రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి . ఒక విధంగా ఈనాటి పరిశోధనలకు అవే రహదారులు .

కాలక్రమేణా ప్రాచీన ప్రక్రియల స్థానంలో ఆధునిక ప్రక్రియలయిన నవల, నాటిక, కథానిక , వ్యాసం, విమర్శ, మొదలయినవి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో దేశియ భాషల్లో ప్రవేశించాయి .

గ్రంథ రచనలపై వెలువడుతున్న విమర్శ గ్రంథాల స్థానంలో పరిశోధన విద్యలో ( ఎం. ఫిల్ , పిహెచ్. డి ) ప్రముఖ భాగమై కూర్చుంది. క్రమంగా ఒక అంశాన్ని , దాన్ని కూలంకషంగా అన్ని ఆకరాలతో పరిశీలించడం విశ్వ విద్యాలయాల్లో ఆనవాయితీగా మారింది. దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న విధ్యార్థులు ప్రవృత్తితో పాటు పరిశోధనను వృత్తికి ఆలంబనగా చేసుకోవడం క్రమంగా కొనసాగుతున్నది.

Reasearch అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో వాడుతున్న పదం పరిశోధన . Search అంటే శోధన . శోధించడం అంటేనే అన్వేషించడం . గుప్తంగా ఉన్న విషయాలను వెలికి తీయడమే శోధన. Re' 'పరి ' అనే ఉపసర్గలు కలపడం లో ఒక అర్థం ఉంది . శోధన అంటే పరిశీలించడం. పరిశోధన అంటే బాగా శాస్త్రీయంగా, లోతుగా , నిర్దిష్టంగా, సత్యాన్వేషణా తత్పరతతో అన్వేషించి అసలు విషయాన్ని నిగ్గుదేల్చడమే ' పరి శోధన '

పరిశోధన ఒక పద్ధతిలో సాగుతుంది. పరిశోధనాంశాన్ని  ఎన్నుకున్నది మొదలు అందులోని గుణ గణాలను ఆవిష్కరించే దాకా ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది .

విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు గురువులు బోధించిన పరిశోధనా పద్ధతులను పాటిస్తూ సత్యాన్వేషణలో ఎదురయిన అనుభవాలను జోడించి ఒక విషయం గురించి సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది.

పరిశోధన మొత్తం ఒక పద్ధతిలో సాగుతుంది. పరిశోధనాంశాన్ని ఎన్నుకున్నది మొదలు అందులోని విశేషాలను ఆవిష్కరించే వరకు సాహిత్య పరిశోధకులు విషయ సేకరణ చాలా చెయ్యాల్సి ఉంటుంది . ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోరాదు. ఏమూల ఏది దొరుకుతుందో రంధ్రాన్వేషణ చెయ్యాల్సి ఉంటుంది.

పరిశోధనకు కావలసిన సామగ్రి సేకరణ చిత్త శుద్ధితో చేయాలి . ఏ ఒక్క ఆధారాన్ని వదలరాదు .  సామగ్రిని సమగ్రంగా సేకరించుకొని కాని పరిశోధన చెయ్యలేము. ప్రధాన, అప్రధాన సామగ్రిని సేకరించుకొని ఆ తర్వాత అవసరమైన వాటిని వాడుకోవలసి ఉంటుంది . వాటికి పాద సూచికలు తప్పని సరి . కాబట్టి విషయ సేకరణ సమయం లోనే ఆ వివరాలను పొందు పరచు కోవాలి. లేకుంటే వృధా శ్రమ అయిపోతుంది. జానపద సాహిత్యం లాంటి అంశాలకు క్షేత్ర పర్యటన అనివార్యం.

ముడి సరుకు సేకరణ చాలా ఆకరాల నుంచి సేకరించాల్సి ఉంటుంది. పుస్తక పఠనం ప్రధానం. దాని కోసం ఎన్నో గ్రంథాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. గ్రంధాలు, పత్రికలు, అముద్రిత గ్రంథాలు, తాళ పత్ర గ్రంథాలు , అవసరం కొద్దీ వాడుకోవలసి ఉంటుంది.

సాహిత్య పరిశోధకులు అనుభవజ్ఞులయిన వ్యక్తులను కలిసి వాళ్ల సూచనల ప్రకారం గ్రంథాలను పరిశీలించడమే గాక మరి కొంత మంది వ్యక్తులను కూడా కలవాల్సి ఉంటుంది. మధ్యలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి .

సేకరించిన సామగ్రి నుంచి సారాంశాన్ని తయారు చేసుకోవడం అనివార్యం . అప్పటికి గాని ఆలోచన ఒక కొలిక్కి రాదు.

      అనుభవంబును బట్టియే అవని యందు
      జనులకును తెల్వి యబ్బుట సహజ గుణము
      కాలు గాలి శ్రమంపడు గండు పిల్లి
      నిప్పు వద్దకు పోవునే ఎప్పుడయిన

అన్నాడు వీరేశలింగం పంతులు . ( నీతి కథా మంజరి 43 వ కథ ) . అనుభవముతో క్రమంగా మన పనిలో పరిణతి లభిస్తుంది. మనం తీసుకొనే నిర్ణయాలు పగడ్బంధీగా ఉండాలి . కేవలం ఊహలు పనికిరావు. ఏది చెప్పినా దాన్ని ఆధారాలతో నిరూపించ గలగాలి . అలాగే సిద్ధాంతీకరించడంలో వ్యక్తిగత ప్రలోభాలుండరాదు .

ఈ గ్రంధం నేను పరిశోధనా పద్ధతులను వివరించడానికి రాయలేదు . నా పరిశోధన ఎలా సాగిందో , ఎంత మందిని కలిశామో , ఎన్ని పుస్తకాలు చదివామో , ఎదురయిన అనుభవాలను నలుగురికీ తెలిసేలా చెప్పాలని రాశాను . చివర నా సిద్ధాంత వ్యాస స్వరూపాన్ని చాలా క్లుప్తంగా వివరించాను. పరిశోధనలో ఎన్ని ఆటుపోట్లుంటాయో , వాటిని ఎలా అధిగమించాలో చెప్పడానికి రాశాను . ఆదరిస్తారని ఆశిస్తాను .


దేవకి 

Comments