మాయమ్మ కమలమ్మ
తల్లీ దండ్రీ గురువూ దైవం అన్న్యారు గదా! అందుకే ముందుగా మా యమ్మ గురించి సెప్తా వుండా .
అప్పుడు నేను మా వూరి ఎలిమెంట్రీ ఇస్కూల్లో సదువుతా వుండా. మా యవ్వోలింట్లో నుండే నేను, మాయక్క ఇస్కూలుకు పోతా వస్తా వుండాము.
మళ్లి కొంచం పెద్దయినాక తెలిసిందిలే. మాది పెద్ద సేద్యం కదా! మాయమ్మకు అర కాసు పని లేదు, అర ఘడి తీరుబాటు లేదు అనేట్లుంటాది.
సేద్యం పని సేసేదుండదుగానీ సేద్యగాళ్లకు, కూలోళ్లకు సద్దీ సంగటీ సేసి తీసుకోని పోవాల్నా. మా తమ్ముళ్లిద్దరినీ అనవరించాల్నా. కూరాకు నారాకు తెచ్చుకోని ఇంట్లో వాళ్లకు ఏరేగా , బయటోళ్లకు ఏరేగా తిండీ తీర్తం సేసిపెట్టాల్నా!
పద్దన్నే ఏగానంత వాకిట్లో చెత్తోయాల . కళ్లాపి సల్లి ముగ్గులు పోయాల. గిన్నే సెంబులు తోముకొవాల. సేందబాయిలో నీళ్లు సేంది బానలు, తొట్లు , కుడిత్తొట్లు నింపాల. . సెత్త గిత్తా తోసుకోవాల. పనేముంది అనుకుంటామా ? మాంతమైన పని పాపం మాయమ్మకు.
కోళ్లు , గుడ్లు, వాటిని పొదగ బెట్టడం , పుంజుల్ని ఎవురూ ఎదానేసుకొని పొకుండా సూడ్డం, కుక్క , ఆవులు, దూడలు , పాలు పిండడం , మాసిన గుడ్డల్ని ఎయ్యడం, సలవ గుడ్డల్ని లెక్క సూసు కోవడం, అప్పుడప్పుడూ మాయవ్వకు తల నొక్కడం, కాళ్లు ఒత్తడం , మాయబ్బొడోళ్లకు అన్నం తినిపించడం ఒకటా రెండా సెప్పుకుంటా బోతే మాయమ్మ సేసే పనులు కోటాను కోట్లు దాటతాయేమో.
అంతేనా పుట్టెడు బిడ్ల తల్లులు మాదిరిగా సింత సెట్లు కాస్తాయి .వాటిల్లో రాలిన కాయల్ని రాలినట్లే కాపలా గాసి ఏరకొచ్చి ఇంట్లో ఎయ్యాల .
విస విసా గాలి తొలితే సాలు పరిగిలేరుకొనే మనుసులు సెట్ల సుట్టే తారాడతా రాలిన కాయిని రాలినట్లే వాళ్ల ఎదానేసుకుంటారు .
ఒక సోటయితే ఇంట్లో పని సేసుకుంటా సూసుకోవచ్చు. ఇంటికాడుండే రొండు సింత సెట్లను మాయమ్మ మాటి మాటికీ పలకరించుకొనే అక్కసెల్లెండ్ల మాదిరిగా సూసుకుంటాది.
మదుర గోడ మింది నుంచి అప్పుడప్పుడూ తొంగి సూసి సిన్నవ్వోళ్ల రాజమ్మక్క , సిలగుండ్ల పల్లి లచ్చుమక్క వాళ్లను తిడ్తా వుంటాది మాయమ్మ . అయినా మాయమ్మ కళ్లు గప్పి ఏరకపొతానే వుంటారు వాళ్లు.
మడికోసి తెస్తే వొడ్లెండబోసి కాకులూ , గువ్వలూ, కోళ్లూ తినకుండా సూసుకోవాల. పాపం మాయవ్వ ఎద్దుల కొట్టం కాడ నీడలో గోనె పట్ట పరుసుకోని, వక్కాకు రోలు దెగ్గిర బెట్టుకోని , కట్టికి మసిగుడ్డ కట్టుకోని, వచ్చే పొయ్యే వాళ్లను మాట్లాడించుకుంటా ఆ పని సేస్తాది అఅప్పుడప్పుడూ.
కానీ మాయవ్వ. పుట్నూరు మాసంద్రం బోతే ఒకో సారి శాన్నాళ్లుండి పొతాది . అప్పుడు మాయమ్మే కదా అన్నీ సూసుకోవాల ..
ఈ లోపల ఇంట్లో వుప్పిడి బీము ఐపోతాది. ఇంత బతుకూ బతికి బొట్ల నిండా ఒడ్లు బెట్టుకోని రాత్రుళ్లు పచ్చిబీమ్మెతుకులు తినాల్సొచ్చిందని మదన పడిపోతాది మాయమ్మ.
సేద్ది గాళ్లకు తీరికుండేది సూసుకోని సెరుకు పాలు కాసే పెనుములో ఏడెనిమిది మూట్ల ఒడ్లు బోసి ఉడక బెడ్తాది. ఎండబోసి ఎండిన దాన్ని మళ్లీ పెద్దింట్లో ఆరబోసి నెరిపతాది.
నీడలో వాసన రాకుండా బాగా ఆరినాక ఆ ఒడ్లతో బాటు ఒక ఐదు మూట్ల పచ్చొడ్లు కూడా బండ్లో ఏసుకొని మాయమ్మ కూడా ఆ మూటల మింద కూసొని గిరింపేట దాకా బొయ్యి మిసను కేసుకోనొస్తాది.
ఒక పనికి ముగ్గురు పంచేటు అన్నట్లు మూటల్ని ఎత్తి వడ్ల గింజిల్ని మిసన్లో బొయ్యడానికి, బియ్యాన్ని, తవుడును సంచుళ్లో పట్టడానికి మా యమ్మతో కూడా ఇద్దురు జీతగాళ్లు బొవాల్సిందే.
ఆ బియ్యాన్ని ఒంటి రెక్కల్తో జల్లిడిబట్టి అంస పాలను , నీళ్లనూ ఏరు సేసినట్లుగా బియ్యం కడగా, నూకలు కడగా ఏర్పర్సి బానల్లో బోస్తాది. ఆ పని సాలదని తవుడును కూడా జల్లించి దాన్లోని పూ నూకల్ని కోళ్లకని దొంతి కుండల మింది దుత్తల్లో పోసి పెడతాది.
కోళ్లంటే గుర్తొచ్చింది. రాత్రి పిల్లల కోళ్లను గంప కింద మిగిలిన వాటిని కోడిగూట్లోకి తోలి మూసి పెట్టి పొగులు పిల్లుల బారినుంచి , పీతిరి గెద్దల బారి నుంచి వాటిని కంటికి రెప్పలా కాపాడ బట్టే కదా సుట్టాలొచ్చినా పక్కాలొచ్చినా దిగుల్లేకుండా అట్లు ఎయ్యడానికి గుడ్లు, కోసుకోని తినడానికి కోళ్లు పుంజిగా వుండేది.
శెనిగి నూనె ఐపొతా వుందనంగా రొండు మూట్ల శెనిక్కాయిలు వాకిట్లో బండ మింద బొస్తే మా సేద్ది గాళ్లు రొండు దుడ్డు కట్లెత్తుకోని ఈ పక్కకొకరు ఆ పక్కొకరూ కూసోని దనా దనా కాయిల మింద ఏట్లెస్తా వుంటే పక్కకు బొయిన కాయిల్ని ఎగదొస్తా వుంటాది మాయమ్మ .
కొట్టిన కాయిల్ని సెరిగి గింజిల్లో మిగిలిపొయిన గుల్లల్ని , రాళ్లనూ ఏరి గాండ్ల శెట్టి ఎప్పుడు దెమ్మంటాడో మమ్మల్నెవురినయినా పొయ్యి అడిగి రమ్మంటాది.
మేము ఎగురుకుంటా వొడ్డిగుడ్సిలికాడుండే గాండ్ల సెట్టిని అడిగేసొస్తామా , ఆ శెనిగ్గింజల్ని దీసుక పోయి పోకు పోకుండా దెగ్గిరుండి గానిగాడించుకోని నూని, గానిగిబిండిని బద్రంగా ఇల్లు జేరస్తాది .
మా ఎరమన్ను సేను సుట్టూ వుండే నల్ల గెట్లో మాకు నలభై మూడు సింతమాన్లుండాయి. ఆడ ఏమారితే సాలు రాళ్లతో కొట్టుకొని సగం కాయిలు వాళ్ల పరానేసుకుంటారు ఊర్లో వాళ్లు.
గాలికి శానా సింతకాయిలు రాలిపోతా వుండాయని మా యమ్మ మా నాయినికి సెప్తాదా . అప్పుడు మా సేద్యగాడు బాలడో , పొన్ను రంగడో ఒక దినం సింతకాయిల్ని రాలస్తారు.
దాన్ని ఏరి ఇంటికి దెచ్చినాక ఎండబోస్తాది . బొబ్బడ కొట్టి , ఈన్లు దీసి కట్టి కాయిని మళ్లీ ఒకదినం ఎండ కేస్తాది. మద్యానం దాకా అది ఎండినాక దాన్ని నీడలో ఆరబొస్తాది.
ఏకంగా ఎండలో ఉండే కట్టి పండును కొట్టిందనుకో అది ఎండకుఉడికి పొయ్యుంటాది. ! కొడతా ఉంటే సుత్తికి కర్సు కుంటాది. ఆరినాక ఒక్కోటే దీసుకోని సుత్తితో కొట్టి , సింత పిచ్చిల్ని ఇడదీసి సింత పండును ఒకదినం ఎండ బెట్టి ఈత సాప కేస్తాది. అప్పుడు మానాయినికి సెప్తే దాన్ని సీరూ సింగారంగా అదిమి పెట్టి కుట్టి పక్కన పెడతాడాయన .
ఒక్కో పెద్దీత సాపను సుట్ట సుట్టి సింతపండును కూరి కూరీ నూరీశల పండును కుట్టి పెడతారా! ఒక్కో ఈత సాపలోని సింత పండును పన్నెండు రూపాయిల లెక్కన అమ్మినానని మాయమ్మతో మానాయనొచ్చి సెప్పి నప్పుడు సూడాల మా యమ్మను .
పడిన కష్టాన్నంతా మరిసిపోయి సిలక నవ్వు నవ్వతా ఒక నాలుగు రూపాయిలు పెట్టి మాకు సిల్కు పావడాలు కుట్టించమని అడుక్కుంటాది మాయమ్మ .
అంతే పనయిపొయిందనుకుంటారా , వూహూ ! ఇప్ప సెట్లమ్మలు సెట్ల నిండా కాపుతో ' రా కమలమ్మా రా రా' అని పిలస్తాయి.
అదేం ఎట్టికి పుట్ట్నాయా ? దానికీ సెత్ర సెమ పడాల్సిందే .
అదయిపోగానే కానక్కాయిలు సెనిక్కాయిలు , సెరుగ్గానిగ , అది సాలదని పుట్టే పిలకాయిలు, పెరిగే పిలకాయిలు , వాళ్ల ముడ్డీ మూతీ కడిగేది, సదువులూ, సట్టబండలు, ఇస్కూలుకు క్యారీరు కట్టడం., వొచ్చే సుట్టాలు , పొయ్యే సుట్టాలు అబ్బబ్బబ్బబ్బా ....సెనం తీరికుంటాదా మా యమ్మకు . సెప్పండి.
' నేలా నెట్ర వుందని మానాయిన మురిసి పోయి మీ నాయినికి నన్ను కట్టబెట్నాడు కానీ సుకమా, సంతోసమా పీతి కష్టం తప్ప ' అని మాయమ్మ అప్పుడప్పుడు మమ్మల్ని బట్టుకోని యాతన పడ్తాది తెలుసా .
అట్లని మా నాయినంటే మాయమ్మకు ఇష్టంలేదనుకొనేరు సామి . మా నాయినంటే పానమిచ్చేంత ఇష్టం. ఆయన మంచితనమంటే ఊపిరి . ఊర్లో మానాయినికి అందూరూ చూపించే మర్యాదను సూసి పులకించి పోతాది. ఆయన పెండ్లాంగా అందురూ మాయమ్మకు ఇచ్చే గవురవాన్ని తలుసుకొని ముర్సి పోతావుంటాది.
ఎన్ని జల్మల పున్నిం సేసుకుంటేనో మీనాయినట్లాంటోడు దొరికేది పాపా అని అంటా మా దెగ్గిర ముసి ముసి నవ్వులు నవ్వతాది .
సేద్దిం సేసే ఇంట్లో బణ్న్యాక పనులు సేయక తప్పతాదా. ఆ కూతురి కష్టాన్ని కొంచిమన్నా తగ్గించాలనే మాయవ్వ నన్ను , మాయక్కను వాళ్లింట్లో బెట్టుకొని సాకి సంతరిస్తా వుండేది.
మహాసముద్రం దేవకి
5-9-2018
Comments
Post a Comment