గత స్మృతులు - కవిత

 కవిత


నేను

గత కాలపు స్మృతులలో జీవం నిలుపుకొంటున్న అల్పజీవిని నేను

బాల్యాన్ని ప్రమిదగా చేసుకొని
యవ్వనాన్ని  వత్తిగా పేని
వర్తమానమనే నూనె పోసి
భవిష్యత్తు అనే
ఆశా దీపాన్ని వెలిగించుకొని
ఆ వెలుగులో సేద తీరుతున్న ప్రాణిని నేను

అక్షరాల ఆయుధాలను కాలంపై సంధించి కాలం గడుపుతున్న గృహిణిని  నేను

అనుభవాలను సాలె గూడులా అల్లుకొని రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్న పిరికి దాన్ని నేను

మనుగడకు మాతృత్వపు మమకారాన్ని ఆసరాగా చేసుకున్న ఆశా జీవిని నేను

గతం పునాదులపై గోడలు నిర్మించుకొని కాలం వెళ్లదీస్తున్న గమ్యం తెలీని బాటసారిని నేను

అనుకోకుండా వచ్చి అందించే స్నేహ హస్తం కోసం ఎదురుచూపులు చూస్తూ
ఇంటి గుమ్మంలో కూచొని పొద్దు పుచ్చుతున్న  మహిళనునేను

పిల్లల రాక కోసం పరితపిస్తూ ఎదురుతెన్నులు చూస్తూ నిరంతరం
వాళ్లందిస్తున్న ప్రేమాను రాగాలతో బతికి బట్ట కడుతున్న దాన్ని నేను

పెనవేసుకున్న బంధాలను గట్టిగా పట్టుకొని
ఇంకా పైపైకి ఎగబాకాలనుకొంటున్న సగటు మహిళను నేను

మహాసముద్రం దేవకి

Comments