వరిగ పల్లి ముచ్చట్లు: 20
మా మాసంద్రంలో నేను
మా సిన్నప్పుడు ఉమ్మడి కుటుంబరాలు కట్టుబాట్ల మద్దిన ఎంత ఒద్దికిగా కలిసి మెలిసి బతికేవో తెలుసు కోవాలంటే మాసంద్రం లో మా నాయినోలింటి గురించి సెప్పాల.
పరిచ్చలయిపోయినాయి . ఎండాకాలం లీవు లిచ్చేసినారు. యాడన్నా ఊరికి పోదామా అని మెర మెరా నుండాది. కానీ మాయమ్మ రాకుండా మమ్మల్ని నమ్మి యాడికే గాని పంపించదు .
మా పక్కనే ఉండే పెద్దమ్మోల్ల ఊరికి పొయ్యొద్దామని ఉండాది. ఆప్పచ్చులు గిప్పచ్చులు కాల్చి పెడ్తారు. బాగా తినొచ్చని మనసులో మునాశ. అది పుట్ట పెరిగినట్ల పెరిగి పోతా ఉండాది.
ఈలోపల మా మాసంద్రవ్వ ఒచ్చింది. మానాయిన్ని కని ఒరిగిపల్లిలోఉన్ని వాళ్ల ఆండబిడ్డి మా దొరసానవ్వకు దత్తు కిచ్చిందే ఆ యవ్వ.
నెలకోపారన్నా వొచ్చి కొడుకుని సూసుకోందే ఉండలేందు ఆయవ్వ. వస్తే ఒకోసారి నెల దినాలు గూడా ఉంటాది. ఈ సారి మాత్రం మాకు లీవులయిపోతాయని , బార్తం తిరనాలుండాదని
నాలుగు దినాలుండి, రేపు బయలుదేరదామని సెప్పింది.
మాయమ్మను కూడా రమ్మనింది. మా యమ్మకు ఎప్పుడూ పురసత్తుండదు. ఎట్లొస్తాది. అందుకని నన్ను మాయక్కను పొమ్మనింది.
మా పెద్దబ్బోన్ని పంపించచ్చు కదా! ఊహూ ! వాడు యాడా మట్టసంగా ఉండడని తులవ పన్లు సేస్తాడని పంపించదు. ఇంగ మా సిన్నబ్బోడుండాడే వాడు రేత్రి పూట పడకలో ఒంటికి బోస్తాడని మా పెద్దమ్మోళ్లు అసింకించు కుంటారని వాన్ని అసలే పంపించదు.
మా దొరసానవ్వను రమ్మంటే మా యమ్మ సద్దీ సంగటీ బాయికాడికెత్తు కోని పోతే ఇంటికాడుండాలని రాననింది. దొరసానవ్వ రాకుంటే నేనూ బోనని ఏడ్సినాను.
నేనన్నా మాటికీ మా పెద్దమ్మోళ్లూరికి బోతానా ! మా యక్క యాడికీ కదలదు. ఆ సంగతి తెలిసీ మాయక్కను గూడా పొమ్మని ఎందుకు సెప్పిందో మా యమ్మ .
సివరికి నేనొగతే మా మాసంద్రవ్వతో పోవాల్సొచ్చింది. ' నేను కూడా పోను మా ' అని మా యవ్వ సూడకుండా మాయమ్మ దెగ్గిర గోంజారతానే ఉండాను. మాటికీ సతాయించే పాటికి మాయమ్మకు కోపం నసాలానికి అంటినట్లుంది.
'ఊరికే సెల్లాటం సెయ్యెద్దు పాపా. పోకుంటే ఈణ్నే సావు. నా కేం నష్టం . పోతే మీ పెదనాయినోళ్లు కొత్త పావడా కుట్టిస్తారు.' అని ఒక పక్క యాష్ట పోతానే ఇంగో పక్క ఊరించింది.
మాయవ్వను పంపించ మని మళ్లీ మళ్లీ బంగ పోతా ఉండా మాయమ్మను. మా నాయన ఇని నట్లుండాడు.
' బాయికాడ నువ్వొచ్చి పింగటించే పన్లేమీ లేవు గానీ శాన్నాళయింది అమ్మ యాడికే గానీ కదలక. పొయిరానీ లే ' అని మా దొరసానవ్వను గూడా పొమ్మని నాడు మా నాయిన
ఒంటెద్దు బండ్లో కూసోని మాసంద్రానికి బోతా ఉంటే మా దొరసానవ్వ కూడా వస్తా ఉన్న్యందు కేమో శానా కుశాలగా ఉండాది. బండ్లో మాయవ్వోళ్లిద్దురు మాటల్లో బడినారు.
నేను ఎనకాల కాళ్లు కింది కిడ్సు కోని కూసోని పడి పోకుండా అడ్డంగా బెట్టిన కడ్డీ మింద తల బెట్టుకోని కూనిరాగాలు తీసుకుంటా లల్లాయి పాటలు పాడుకుంటా ఉండా.
మిట్టూరు దాటి నాక రోడ్లోనే ఉండే బార్తం గుడి దాటి ఇరవై బారలు పోతే ఎడంపక్క బండి బాటొస్తాది. ఆ దోవలో ముందొచ్చేది బేరి పల్లి . అద్దాటి రొండు పర్లాంగులు పోతే దోవ కుడి ఎడమలకు రొండుగా చీలతాది. కుడి పక్క తిరిగి ఇంకొంచిం దూరం బోతే వస్తాది మా మాసంద్రం.
మిట్టురొచ్చింది. ఇంగ బార్తం గుడొస్తాది సూడు ' అనింది మాయవ్వ . బార్తం గుడిని సూడాలని నేనూ కాసుకో నుండా.
గుడి ముందు ఇట్ల పది బారలు అట్ల పది బారలు రాతి మిద్ది మండపం ఉండాది. కానీ తొమ్మిదూర్ల జనం కలిసి ఆడ బార్తం తిర్నాలు జరిపిస్తారు . వాళ్లే కాకుండా యాడేడ నుంచో వస్తారు జనం .
ముందే ఎండా కాలమై పోయా. మళ్లీ వాన్లొస్తే కదా సేద్దిం పనులు మొదులయ్యేది. అందుకే కతలు కాకరకాయిలు రెయ్యాటలు ఇప్పుడు బెట్టేది . పల్లి కూటాలకు బొయ్యి సదుంకొనే పిలకాయికి గూడా ఇప్పుడే కదా లీవులు .
పెద్దోళ్లేమి మనింటి బంక మొన్నులా. ఎప్పుడు ఏది జెయ్యాలో వాళ్లకు బాగా తెలుసు.
సరే ! మేము సూస్తానే ఉండాము. బార్తం గుడి రానే వొచ్చిందా . మాసి పొయిన గుడి గోడలకు ఎరమొన్ను పట్లు సున్నం పట్లు కొత్తంగా పూసి కొత్త పెండ్లి కూతుర్ని సింగారించి కూసో బెట్టినట్ల సేసి పెట్టినారు.
కత ఇనే జనం కూసోను నీడ కావాల .అందుకని రాతి మిద్ది సుట్టూ సలవ పందిళ్లు ఏసినారు. గుడికి దరమకర్త కదా! వాళ్ల సిన్నన్న అదే మా సింతాత.
' మా యన్నే సూడు ఇదంతా సేపించింది ' అని మా దొరసానవ్వ నాతో సెప్పింది. ఆ మాటంటా ఉన్న్యప్పుడు మా యవ్వ పక్క తిరిగి సూస్తినా . దివిటీ మాదిరిగా ఎలిగి పోతా ఉండాది మొగం.
లీవుల్లో వొచ్చినందుకు మేలయింది . బార్తం కూడా సూడొచ్చు అనుకున్న్యాను.
మాసంద్రం లో మా నాయిన పుట్నిల్లు శానా పెద్దది. మా సింతాత సిన్నవ్వ, మా నాయినితో పుట్టిన ఇద్దురు పెదనాయినొళ్లు , ఇద్దురు పెద్దమ్మోళ్లు , వాళ్ల పిలకాయిలు తొమ్మిది మంది , ఇంగా పెండ్లిండ్లు కాని మా సింతాత కొడుకులు ఇద్దురు సిన్నాయినోళ్లు ఉంటారు. మా పెద్ద సిన్నాయిన పట్నంలో సదుంకుంటా ఉండాడు.
మాసంద్రానికి బోవాలంటే మా యమ్మోళ్ల అక్కోలూరికి బొయినంత కుశాలుండదు. ఈడ మా సింతాతంటే ఇంట్లో అందురికీ డర్రు. బాయి కాడికి ఎప్పుడు పూడస్తాడా అని కాసుకో నుంటా రందురూ.
అట్ల బోతాడో లేదో అప్పుడు ఇంట్లో అందురి నోర్లూ కొంచిం గెట్టింగా మాట్లాడు కుంటాయి. గలాం బులాం అని ఉంటాది ఇల్లు. అందురికీ ఊపిరి బాగా ఆడతాది. పిలకాయిలు మిద్ది మింది కెక్కి సుట్టూ ఉండే ఊర్ని సూస్తా ఈదిలో ఆట్లాడు కుంటా ఉండే పిలకాయిల్ని సూస్తా మురిసి పోతారు.
మా తాత లేనప్పుడే మా యక్కోళ్లు ఆ పక్కీదిలో ఉండే మిసను గుట్టే ఆంజన్న దెగ్గిరికి బోయి పావడాలు , రయికిలు ఎట్ల గుట్టాలో సెప్పి ఉరుకులు పరుగులు మిందొచ్చి గప్చిప్గా ఇంట్లో కూసుంటారు.
మా తాత ఇంటి కొస్తా ఆ ఈదిలో మలుపు దిరిగినాడంటే సాలు. ఊర్లో సూసినొళ్లు ఎవురో ఒగరొచ్చి ఆ వర్తమానాన్ని ఇంట్లో వాళ్ల సెవుల్లో ఏసి పోతారు. అంతే యాడోళ్లక్కడ తాతొస్తా ఉండాడంటా, తాతొస్తా ఉండాడంటా అని గుస గుస లాడతా ఎవురి పనుల్లో వాళ్లు బుద్దిగా మునిగి పోతారు.
అంత వరకూ ఇల్లు పీకి పందిరేస్తా ఉన్ని మా పెద్ద పెదనాయిన కొడుకు ప్రసాదు గాడు , సిన్న పెదనాయిన కొడుకు ప్రబు గాడు పుస్తకాలు పలక బెట్టుకోని తలదించుకోని బుద్దిగా రాసుకుంటా కూసుంటారు .
మా సిన్న పెదనాయిన కూతురు మూంగి పిల్ల. పేరు సిట్టి . మీసాలు మెలి దిప్పి వస్తా ఉండాడని సైగ జేసి చెప్తారా ! వంటపాత్రల బొమ్మలు ముందరేసుకోని ఈది నడవలో ఉండే అరుగెక్కి ఆట్లాడు కుంటా కూసుంటాది.
మా సిన్న పెద నాయిన మూడో కూతురు ఇశాలక్క కుట్లల్లుకుంటానో , పూసల దండ కుట్టు కుంటానో తాల్వారంలో ఒక మూల కూసుంటాది.
మా లీలక్క, విమలక్కా వాళ్లిద్దురూ పెద్దోళ్లు కదా . ఇద్దురు పెదనాయిన్లకూ ముందు బుట్టిన బిడ్లు . ఇంత మందికి వొండి వొడ్డించే పని వాళ్లదే . వాళ్లెప్పుడూ మద్యానం కొంచేపు తప్ప పొయి కాడ తల మునకలగా ఉంటారు.
ఇల్లు శానా పెద్దది. మద్దిలో పేద్ద వాకిలి. సుట్టూ స్తంబాలు . నాలుగు పక్కలా తాల్వారాలు నడవ దాటంగానే పొడుక్కూ అడ్డంగా ఉండే తాల్వారంలో ఈ పక్క ఆ పక్క రెండు రెండు అంకణాల ఎడల్పుతో పండుకొనే ఇండ్లు . దాని కానుకోని లోపల పక్క మొగోళ్లు కూసోని సేద్దిం పన్ల గురించి మాట్లాడుకొనే దిన్నిలు. దానికానుకోని మిద్ది కింద ఎడం పక్క ఒక మూల సేంద బాయి . దానికడ్డంగా గోడ దాని పక్కన పొడుగ్గా నడవ. నడవలో ఒక మూల పిండి రుబ్బుకొనే రోలు . బియ్యం ఏర్పర్సుకొనేది, సెరిగేది , ఇసిరేది , దంచేది అన్నీ ఆడే .
సేంద బాయికి ఎదురుగా ఉండే తాల్వారంలో ఒక పక్క మా సిన్న పెదనాయిన పొండుకొనే మంచం. ఇంగో పక్క మా సిన్న పెద్దమ్మ పెట్టీ, సామాన్లు పెట్టు కొనే రూము . ఆ తాల్వారంలో నించి గూడా బయటికి దోవుండాది. ఆ పక్కే ఎద్దుల కొట్టాలు వాటికి నీళ్లు దాపే గానిగి బిండి తొట్లు ఉండాయి.
అప్పుడే అయిపోలేదు. వాకిట్లో నుంచి మిద్ది మిందికి ఊత్తరం పక్క మెట్లుంటాయి. పడమర పక్క ఉండే తాల్వారంలో దచ్చినం పక్క సిన్న కొట్టిడుంది. మా యక్కోళ్లు ఆడ జేరి ఆడుండే జనర్లలో నించి ఈదిలోకి సూస్తా ఉంటారు మా తాత ఇంట్లో లేనప్పుడు .
ఆ తాల్వారం మద్దిలో ఇంగా ఎనకుండే ఇంట్లోకి బొయ్యే దోవ . ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద రూములు .
ఉత్తరం పక్కుండే రూములోకి తాల్వారం లో నుంచే దోవ. దాంట్లోనే దొంతి కుండలుంటాయి. ఉతికిన గుడ్డ లేసుకొనే పెట్టి లుంటాయి.ఒక పక్కంతా దండిం మింద గుడ్డలు .
దచ్చినం పక్కుండే ఇంట్లోకి మద్ది సందులో నుంచి దోవ. ఆ ఇంట్లో ఊరిగాయల జాడీలు , ఉప్పులూ, పప్పులూ ఉండే డబ్బాలు , మిరప్పొడి, రాగి పిండి పెట్టుకొనే అరలూ , ఇస్తరాకుల పొత్తర్లు , ఎర గెడ్లు, కూర గాయిలు, సింత పొండు నానా బీనా ఉంటాయి.
సందు దాటితే వంటకు సుట్టిల్లు ఒగ పక్క , తానాల గది ఇంగో పక్క. రెంటి మద్దెనా కాలీ తావు. రేత్రి పూట ఆడే అందురూ కూసోని అన్నాలు దినేది. అంతకు ముందు తలుపుగానీ, పైన కప్పడం గానీ లేని నీళ్లు బోసుకొనే పెల్లి , మంటి తొట్లూ ఉండేవి. మా పట్నం సిన్నాయిన యాడ సూసి నాడో స్నానాలాడేందుకొక ఇల్లే కట్టి పించినాడు.
ఆ ఇంట్లో పెద్ద పెద్ద గార తొట్లుండాయి రొండు. సేంద బాయిలోనించి సేంద కొచ్చిన నీళ్లను బయటినుంచి పోస్తే తొట్లలో పడతాయి. ఏణ్నిళ్లు కాంచు కొనే అండాను పొయ్యి మింద లోపలే పూడిపించి నారు. మంటేసేది మాత్రం బయట .
నీళ్లు బోసుకొనే ఇంట్లోకి బొయ్యే దొవకు పడమట పక్క ఒక మూల తలుపుంటాది. ఆ తలుపు దీసుకొని లోపలికి బొయ్యి తలుపేసుకోని పోసు కుంటారు నీళ్లు. పొయినేడాది వొచ్చినప్పుడు లేదులే ఇది.
దోవకు తూర్పుగా పెద్ద నడవ. ఆడ తవుడు మూటలు, గానిగి బిండి సంచులూ వానొచ్చినప్పుడు పొయిలోకి కట్టిలు, కోళ్ల గూడూ, పచ్చి కసువు , సెరుకాకు మోసులూ , గంపా గట్రా తట్టా బుట్టీ అన్నీ ఉంటాయి .
పెద్దింటికీ కొత్తంగా గట్టిన దీనికీ మద్దిలో సందు లోంచి బయటికి పోవడానికి తలుపుంటాది. ఆణ్నించే అవసరాలకు ఆండోళ్లు బయటికి బోవడానికి సౌకర్యం.
ఇంటి సుట్టూ పూల సెట్లు నాటుకోను తావుండాది. ఇంటి ముందు పక్క మిద్ది పైకి అల్లించిన రాదామాదవుల తీగలు పొద మాదిరిగా. దాన్నిండా గుత్తులు గుత్తులుగా ఎప్పుడు జూసినా పూలే పూలు.
ఇంటి సుట్టూ మంటి గోడ. ఈది పక్క ఇంటికీ గోడకూ మద్దిలో ఉండే సందులో నాటు రోజా పూల సెట్టు పెద్ద మాను మాదిరిగా. ఆ పూలు ఎంత గుమ గుమ లాడేవో! ఆ వాసన ఇప్పుడేదీ ?
ఆ సందులోనే మల్లి సెట్ల పందిళ్లు , కనకాంబరాల సెట్లు , ఎర్ర కనకాంబరాలు , చేమంచి పూల సెట్లు, బంతి పూల సెట్లు ఒంటి రెక్క ఎర్ర మందారాలు , లోలాకుల పూల సెట్లు , డిసెంబారాల పొదలు, దాసాని సెట్లు , మొరుము, మాచి పత్రి ఒగటా రొండా సెప్పడానికి.
ఉత్తరం పక్క కాలీ తావెక్కువ. నిమ్మ సెట్టు , జామ సెట్టు, కరేంపాకు సెట్టు, మునగ మాను, కమలా పండ్ల సెట్టు, ఉసిరి కాయిల మాను, అంటి సెట్ల పొద, ఆక్కూర మళ్లు , బచ్చలాకు పందిలి , ఇంగా తిని పారేస్తే మొల్చిన టమేట కాయిల సెట్లు మిరప సెట్లు వంకాయి సెట్లూ శానా నాన్నింగా ఉంటాది ఆడ.
ఇంటి సుట్టు మంటి గోడ. సూసేంత దూరం. అందుకే గోళ్లోళ్లని పేరు. మానాయిన వొరిగి పల్లికి వచ్చేసి నాడా. మాసంద్రం కోదండ రెడ్డి అంటారు. అందుకే మా పేర్లకు ముందు గోళ్ల అని కాకుండా మాసంద్రం అనే రాయించినాడు మా నాయిన ఇస్కూల్లో .
ఇదంతా మా పట్నం సిన్నాయన నేర్పులు . ఇంత మందికీ ఇంట్లో తాగనూ, కడగనూ, పోసు కోనూ ఎన్ని నీళ్లు పడతాయో సెట్లకు అంత కన్నా జాస్తి గానే పడతాయి.
స్నానాలాడే నీళ్లూ , సట్టి కుండా కడిగే నీళ్లూ పోకు బోకుండా సెట్లకు బొయ్యెట్లుగా కాలవలు దీసి పారిస్తారు.
ఒకరు బాయిలో నీళ్లు సేంది బిందిల్ని నింపతా ఉంటే ఇద్దురు బిందిల్ని మార్సు కోని పెల్లోకి , సెట్లకు పోస్తారు. మా పెద్ద పెద్దమ్మ కూతురు సరళక్క , సిన్న పెద్దమ్మ కూతుర్లు శామలక్క , ఇశాలక్క సేస్తారా పని
మా పెద్దమ్మోళ్లిద్దురూ బాయి కాడికి పోనూ రానూ, కూలోళ్లతో పని జేపించనూ , మిరప తోటలో నుంచి కూరకు వంకాయిలు, బెండ, బీర , కాకర, ముల్లింగెడ్లు, కూరాకు నారాకూ , సింత సిగురు , కనా కసమాలం ఇంట్లోకి తెచ్చిచ్చే పని వాళ్లది.
మాయిడి కాయల కాలంలో ఊరిగాయ బెట్నూ , ఎర గెడ్ల కాలంలో కూరొడియాలు బెట్నూ
మిరప్పండ్లు మిద్ది మింద ఎండ బోసి ఎత్తనూ, ఒడ్లుడక బెట్టి ఎండబోసి నెరపడం , ఓ యబ్బో లెక్క లేనన్ని పన్లు వాళ్లకు .
ఇంగా మాయవ్వోళ్లు గురించి సెప్పొద్దా. మా మాసంద్రవ్వకు మా నాయినోళ్లు ముగ్గురే కాకుండా మా బాగ్గిమత్తమ్ముండాది. ఆయమ్మను మా దొరసానవ్వకు అక్కయిన మా కొత్తపల్లవ్వ పెద్ద కొడుక్కిచ్చి నారు. ఆయవ్వ కూతురే మా సిన్న పెద్దమ్మ.
మాసంద్రవ్వ మనిసి బారీ. రంగూ రూపూ కూడా బాగుంటాది. కల్మష మెరుగని మనిసంటారు. అందురూ ఇష్టమాయమ్మకి. దత్తుకిచ్చినందుకేమో మా నాయనంటే శానా ఇష్టం
ఇంగ మా సిన్నవ్వకు మా సిన్నాయినోళ్లిద్దురు. మా యత్తమ్మోళ్లిద్దురు. మా పెద్దత్తమ్మను మత్త్యంలో తమ్మునికే ఇచ్చుకొనింది. సిన్న కూతుర్ని ఆండ బిడ్డి కొడుక్కి అదే మా బాగిమత్తమ్మ రొండో మరిదికిచ్చింది.
మా పట్నం సిన్నాయిన పెండ్లి సేసుకుంటే మా సిన్న సిన్నాయినికి మత్తెమత్తమ్మ కూతుర్ని కట్టాలని కాసుకోనుండారు. పట్నం సిన్నాయిన పెండ్లి సేసు కోకనే రొండేళ్లు అమెరికాకు పూడ్సినాడు.
మాసంద్రంలో మా సిన్నవ్వదే పెత్తనం. మాతాతకు తగ్గ పెండ్లాం అని సెప్తారు. ఇంటికయి మిగిలిన మిరక్కాయిలు పెసులు , అలసందలు , కందులు , సింత పండు ఇట్లాంటివి అమ్మి రేక సేసి పెట్టి ఊర్లోకి జోలార్ పేటోడు , గుడియాత్తమోడు గుడ్డలమ్మకానికి ఒచ్చినప్పుడు ఇంట్లోకి తెమ్మని పిలకాయిలకు గుడ్డా గుసురూ ఎత్తిస్తాది.
తన బిడ్లు మన బిడ్లు అనే వంచన లేదు మా సిన్నవ్వకు. ఆమే కాదు ఆ ఇంట్లో అందురూ అందుర్నీ సమానంగా సూస్తారు.
మాసంద్రం శానా బాగుంటాది గాని ఆ ఇంట్లో మూంగి పాప సిట్టి నా కంటే సిన్నది. మిగాతా అక్కోళ్లంతా శానా పెద్దోళ్లు . ఆట్లాడు కోను ఎవురూ ఉండరు. ఈదిలోకి పోగూడదు. మాతాతుంటే మిద్ది కూడా ఎక్కరు. అందుకే ఆడుండాలంటే ముండ్ల మిందున్న్యట్లుంటాది నాకు .
మాసంద్రం లో ఉండంగా ఒగ దినం ఈదిలో ఉలింజి పండ్లు అమ్మకానికొచ్చింది. ఇంట్లో ఎవురూ ఉలకలా పలకలా. మా తమ్ముడోళ్లు కూడా కావాలన లేదు.
ఈ పాటికి మా ఊర్లో ఐతే మేము టెంకాయి చిప్పలు దీసు కోని మాయమ్మను ఒడ్లియ్యమని సతాయించే వాళ్లం. తలా సగం చిప్పకు ఒడ్లు ముంచిస్తే పండ్లామె ఆ ఒడ్లు జోలెలో పోసు కోని చిప్ప నిండికీ పండ్లిస్తాది. తిని ఇల్లంతా గింజిలెయ్యొద్దండని మా యమ్మ తిడ్తాదని ఎద్దుల కొట్టంలో ఉండే యాతం పైన కుచ్చోని తినేసొస్తాము మేము .
కలింకాయిలు , అల్లి పండ్లు, ఈత కాయిలు, బల్చ పండ్లు, తాటి ముంజలు, గేంగులు, ఏదొచ్చినా తీసుకోని తినాల్సిందే.
ఒక వేళ మాయమ్మ ఇయ్య లేదనుకో మాయవ్వ ' బొట్ట నిండా ఉండాయి ఒడ్లు, నాలుగు పిడికిళ్లకే నీ గంటు పోతాదా ' అని తిడ్తాది మాయమ్మను.
'సెల్లం సేసి పిలకాయిలు ఆడినట్లంతా ఆడిస్తా ఉండావు మా 'అంటాది మాయమ్మ .
ఈడ మాత్రం ఇన్నట్టుండాది మాయవ్వ . నాకు కోప మొచ్చేసింది . మాయవ్వను ' ఉలింజి పండ్లవ్వా ' అని గిల్లినాను
' యా పండ్లూ లేదు నోరు మూసుకో ' అని కసిరింది .
నేను రాగం దీస్తా ఉంటే అర్దనా ఇచ్చి
' ఎవురికీ దెలియకుండా ఆడే తినేసి రా' అని సెప్పింది.
నేను ఈదిలోకి బొయ్యి పండ్లు దీసుకుంటా ఉంటే బొంగరాలాడతా ఉన్ని మా ప్రబుగాడు సూసి ఇంట్లో అంటించినాడు.
ఈదిలో కొచ్చే కనా కసమాలం తీసుకోని తిన కూడదని మా సిన్న పెద్దమ్మ అందురి ముందూ సెప్పింది.
' ఎవురూ లేనప్పుడు అవా , ఊరికి పొదారి రా' అని ఏడ్సినాను.
' ఆడ సూడుపో మీ యక్కోళ్లు పోలీలకు పూర్ణం రుబ్బతా ఉండారు. తినకుండా పోదామంటావా? అని అడిగింది.
' నాకు పోలీలొద్దు సుగుంట్లు కావాల ' అని రాగం దీసినాను .
'నువు బుద్దిగా ఉండు. అవి గూడా రేపో ఎల్లుండో సేస్తారు ' అనింది. అంతే మాయబ్బోడోళ్లను కతలు సెప్తాను రండని పిల్చు కోని ఈది దిన్ని మిందికి పొయినాను.
ఒగ దినం రాత్రి ఎన్నెట్లో వాకిట్లో కూసోని మా పెద్దమ్మోళ్లు అక్కోళ్లు అన్నాలు దింటా ఉండారు. మొగోళ్లు, మేం పిలకాయిలు దిని శానా సేపయింది.
మా పెద్ద పెద్దమ్మ గెంటి, సిన్న ఊరిగాయిజాడీ సేతి కిచ్చి 'లోపల పెద్ద జాడీలో ఊరిగాయుంటాది దీంట్లో కొంచం ఏసు కోని రాబో' అనింది. ఆ ఇంట్లో కైతే పొయినాను గానీ కరెంటు లైట్ ఎయ్యాలంటే బయ మయింది. మా ఊర్లో కరెంటు దీపాలు లేవు. తలుప్పక్కనుండాది స్విచ్ అని అర్సి సెప్పింది మా లీలక్క. అయినా నేను స్విచ్ ఎట్లా ఎయ్యాలో తెలీ కుండా నిలబడి పొయినాను. నాకు తల కొట్టేసినట్లు సిగ్గుగా ఉండాది.
అప్పుడే అని పించింది ఈ ఊరేమీ బాగ లేదు, మా ఊరే బాగుంటాదని .
రాత్రి మిద్ది పైన మా యవ్వ పక్కన పండుకున్న్యప్పుడు మా యమ్మ దెగ్గిరికి పోవాలని ఎక్కెక్కి ఏడ్సినాను.
తెల్లర్తో మా ఊరి సంగతి ఎట్ల మర్సి పొయినానో నాకు గుర్తు లేదు. సద్దెన్నం కాకుండా ఏడిగా ఇడ్లీలు, సెట్నీ తిన్న్యాక మాసంద్రమే మేలని పించింది.
పది గెంట్లప్పుడు ఈదిలో దాసరామె కొయ్య పటానికి రిబ్బన్లు, మొలతాళ్లు, సాందు బుడ్డీలు, కాటికి డబ్బీలు, జడ కుచ్చులు, సవరాలు , ఎర్ర కంటద్దాలు, ఊపర బుడ్డలు , గిలకలు, కేట్రబాళ్లు , బొంగరాలు , గిర గిరలు , జాటీ కొయ్యలు , ఎద్దు కొమ్ములకు కట్టే రంగు రంగుల కుచ్చులు ఇంగా ఏందేందో అమ్ముకుంటా ఒచ్చింది.
ఈదిలోకి పరిగెత్తి ' మా ఇంటికి రామ్మా' అని పిల్చుకోనొచ్చినాను.
మా సిన్నవ్వ నాకు మా సిట్టికి జడకుచ్చులు , మా యబ్బోడోళ్లకు గిర గిరలు, బొంగరాలు తీసిచ్చింది కానీ ఎందుకో మా దొరసానవ్వ ఎవురూ సూడనప్పుడు నన్ను పక్క కీడ్సు కోని పొయ్యి ఒకేటేసి ' ఊరికి పోదాం పదా ' అని తిట్టింది.
' లీలక్క మద్యానం మల్లి మొగ్గలు కోసినాక సవరమూ, జడ కుచ్చులూ పెట్టి పూల జడేస్తాదంటా నేను రాను నువ్ బో' ' అన్న్యాను
' నిన్ను సూస్తా వుంటే నవ్వాలో ఏడ్వాలో తెలీడం లేదు పాపా' అని ఆ సమాచారాన్ని ఇంట్లో అందురితో సెప్పి నవ్వించింది.
ఇంగో దినం అందురూ తిని తాల్వారంలో సేరి నారు. నేను ఆడుండే కంబాన్ని బట్టు కొని అప్పాలు దిరగతా ఉండా . ' నాయినా లోపల ఆకుల కట్టుంటాది త్యాపో ' అనింది మా సిన్నవ్వ. వక్కాకు రోలు ముందర బెట్టు కోని.
పరిగెత్తి సామాండ్లింటి లోకి బొయినాను. ఎదురుగా దిన్ని మింద ఇస్తరాకుల కట్ట ఉంటే తెచ్చి మాయవ్వ ముందర బెట్టినాను.
అందురూ పగల బడి నవ్వినారు. ఎందుకు నవ్వతా ఉండారో నాకు దెల్ల్యా.
'ఈ యాకుల్ని దంచి ఏసుకో మంటావా ' అని అడిగింది అవ్వ.
'
Comments
Post a Comment