ఆప్త వాక్యం

  

మానవ  సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండాటానికి  సహృదయత, సంస్కారం , స్నేహశీలం, నిస్వార్థం  - ఈ నాలుగూ మూలస్తంభాలు. ఇందులో ఏ ఒక్కటి కొరవడినా ఆ సంబంధం తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లే . ఎవరితోనూ పొరపొచ్చాలు లేకుండా ఉన్న వారి జీవితం ఆనందమయం కావడానికి , బంధాలు నిలబడడానికి ప్రేమానురాగాలు కారణాలుగా ఉంటాయి. 


ఎదుటి వాళ్ల పొయిమండితే తన పొయిలో నీళ్లు పొసుకొనే వాళ్లకు ఏ బంధమూ నిలబడదు. స్వార్థం ఉన్న వాళ్ల మధ్య వాళ్లు ఒక తల్లి బిడ్డలే ఐనా ఆ బంధం పుటుక్కు మని తెగిపోక తప్పదు. అత్తా కోడండ్లు, తోబుట్టువులు, తల్లీ పిల్లలు, బంధువులు, స్నేహితులు  , పరిచయస్తులు , ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా మెలగుతూ ప్రేమాను రాగాలను పంచే వాళ్లకు సముద్రమంత సంతోషం అందుబాటులో ఉంటుంది. మానసికమైన రుగ్మతలు ఆకాశమంత ఎత్తులో ఉంటూ దరి చేరడానికి భయపడతాయి. ఆనందానికి హద్దు లుండవు. సంతోష వార్త వింటే మనసు ఉల్లాసంతో ఊగి పోతుంది .బాధను భరించ లేం, అది శారీరకం కావచ్చు. మానసికం కావచ్చు . అవి ఆయా సమయాల్లోనే ఎక్కువ ప్రభావాన్ని చూపు తాయ్. కానీ స్నేహం ? ఎప్పటికీ మరువరానిది. మరపు రానిది . అలాంటి స్నేహ బంధంతో,  సహృదయ వాతావరణంలో ముందుకు సాగుతున్న సముహం 'మనలో మనం' 


అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ . స్వయం సంపాద్యం కాబట్టి.ఉత్తుత్తి ఉపదేశాలు కాకుండా ఆచరించి చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది . ఏపనైనా ఇష్టంతో చేస్తే విజయం సిద్ధిస్తుంది. ఎదుటి వారిలో చెడును చూడకుండా మంచినే చూడాలి . అప్పుడు మనసుకు దొరికే ప్రశాంతత ఎంతో విలువైనదవుతుంది. 


మన కోసం ఆలోచించే వాళ్లు దొరకడమే అసలైన అదృష్టం . ఇల్లు బాధ్యత గల తండ్రి వల్ల బాగు పడుతుంది. కాని మనం బాగు పడాలంటే బుద్ధి శాలిత్వం  , సంస్కార వంత మైన స్నేహ బంధం మనల్ని వెన్నంటి ఉండాలి . దానిని మనలో మనం సమూహం సంపూర్ణంగా సమకూరుస్తున్నది.  ఈ సమూహంలో భాగస్వాములై అన్నిటిని రాయడం , వినిపించడం, చదవడం లేదా వినడం , స్పందించడం సభ్యులకు దినవారీ కార్యక్రమాల్లో భాగమై పొయింది. 


ఎందులో నైనా గెలవక పోవడం ఓటమి కానే కాదు. అనుకున్న దేని నైనా సాధించక పోవడం, అసలు ప్రయత్నమే చెయ్యక పోవడం  అసలైన ఓటమి. అలాంటి ఓటమి బాట పట్టిన ఎందరి లోనో ఉత్సాహాన్ని నింపి గెలుపు వైపు అడుగులేయించిన సమూహమిది. ప్రతి ఒక్కరూ ఎవరూ ఎవరికీ తీసి పోని విధంగా ఏ అంశం గురించయినా సమగ్రమైన సమాచారాన్ని సునాయాసంగా అందించ గలుతున్నారంటే దాని వెనక అడ్మిన్ల ప్రోత్సాహం ఎంత ఉందో చెప్ప లేం. 


నేను సభ్యురాలిగా ఉన్న వాట్సాప్ సమూహాలు  లెక్క లేనన్ని ఉన్నాయి . వాటన్నిటి లోను తలమానికమైన సమూహం ' మనలో మనం' నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా సభ్యులందరూ కలిసికట్టుగా ఉంటూ మనసులోని మాటల్ని , ఊసుల్ని కలబోసుకూంటూ  అందరూ చట్టా  పట్టా లేసుకొని సరదా కబుర్లు చెప్పుకుంటూ  నడుస్తున్న భావన  కలుగుతుంది . అడ్మిన్ లందరూ అభ్యుదయ వాదులు , ఆలోచనా పరులు కావడం వల్ల సమాజంలోని  అన్ని కోణాల్ని దర్శించి విలువలకు పట్టం కట్టి ఒక ప్రణాళిక ప్రకారం సమూహాన్ని నడుపుతున్నారు. దీని కోసం వాళ్లు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఊహించలేము. 


ఎవరో ఒకరిని నిచ్చెన మెట్లు ఎక్కించి ఉసిగొల్పి వాళ్లలో ఉన్న ప్రతిభా పండిత్యాలను వెలికి తీయకుంటే మనలో మనం  సముహ అడ్మిన్లకు ముఖ్యంగా నిర్మలమ్మకు  ఆ రోజు కంటి నిండా కునుకుండదు. అందుకే అందరికి చేసే కొద్దీ చేతి నిండా పని. 


ఈ సమూహంలో ఉన్న సభ్యులందరూ కేవలం ఉబుసుబోక కన్నట్లు  కాకుండా ప్రతి రోజు నిర్ధేశించిన ఏ అంశంలో అయినా ఎంతో ఉత్సాహంతో పాలు పంచుకోవడం  పరస్పరం అభినందించుకో దగ్గ విశేషం. 


చిత్ర కవితల విషయంలో సమూహంలో ఇంచు మించు అందరూ ఆరితేరినారనడంలో అతిశయోక్తి లేదు. మల్లేశ్వర రావుగారు,శీలా సుభధ్రా దేవి గారు, శశికళ ,... మరికొంత మంది క్షణాల మీద కవితలల్లడంలో నిష్ణాతులన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన వాళ్లు తడబడే బుడి బుడి తొలి అడుగు లంటూనే ఏకంగా పరిగెత్తేశారు.వామ్మో ! చేయి తిరిగిన కవయిత్రుల లాగా చక్కని అంశాలను ఎన్నుకొని చక చకా రాసి పోస్ట్ చేశారు. 


ఒకే బొమ్మ , ఆ బొమ్మను చూసే దృష్టి కోణంలో వైవిధ్యం. ఏకత్వంలో భిన్నత్వం . భిన్నత్వంలో ఏకత్వం . ఇందులోని చిత్ర కవితలన్నీ అలా రూపు దిద్దుకున్నవే. ఉదాహరణకు: ఈ సంకలనం లోని మొదటి చిత్రం సూర్యుడు. ఈ చిత్రం గురించి సభ్యులు రాసిన కవితల్లో మూడు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. వాటిని పరిశీలిస్తే ఉదాత్తమైన భావ సంపదలోని వైవిధ్యాన్ని స్పష్టంగా  చూడగలం. ప్రాణికోటికి జీవాధారమైన సూర్యుణ్ణి రకరకాలుగా భావించి కవితలల్లారు వారు. 


శీలా పల్లవి  సూర్యుని ఉద్దేశించి  ' నేనూ నీలాంటి దానినే . నువ్వుచీకట్లను చీల్చుకుంటూ పై పైకి ఎగ బాకితే నేను నిరాశా నిస్పృహలను చీల్చుకుంటూ ఎదుగుతున్నాను ' అన్నారు. ఉష  ' నీ రాక మాకు వరప్రసాదం నీవు లేక మా బ్రతుకు నిస్సారం ' అంటారు.బిజిలీ గారు ' నీ కడుపులోని బడబాలనమే జగత్తుకంతా జీవామృతం. నీవే మండకుంటే మాకు నీళ్లూ తిండి హుళక్కి ' అన్నారు. ఇలా సంకలనం లోని ప్రతి చిత్ర కవిత చాలా మంది చేతుల్లో ఎన్నో రూపాలను సంతరించుకున్నాయి. 


జాషువా గురించి రాస్తూ వెంకటలక్ష్మి కవిత్వమనే కత్తితో కులవివక్షపై పోరాటం సల్పిన కారణ జన్ముడుగా భావించడం ఎంత బాగుంది. బాల కార్మిక వ్యవస్థను నిరసిస్తూ సునీత, 'పుష్ప వికాసం' కవితలో నీ వయసు ప్రాంగణంలో బాల్య కేరింతల జాడ లేదని వాపోతుంది. రోహిణి బండ లెత్తే బాల కార్మికులను చూచి బండ రాయి గుండె బాదుకున్నదనడం ఎంత అర్థవంతం. అదే చిత్రానికి రాసిన ' అక్షర శరం 'కవితలో ప్రగతి  నాలుగు రూకల కంటే ముందు నాలుగక్షరాలు నేర్చుకొమ్మని ప్రబోధిస్తుంది . 


నిలువ నీడ లేక నీటి పంపులో కాపురం పెట్టిన  ఇల్లాలు కన్న ఆడ బిడ్డను బడికి ముస్తాబు చేస్తుంటే అభినందించని వాళ్లుంటారా? అమ్మా నీకు వందనమంటూ జ్యోత్స్న' నీ పూనిక ఆడ పిల్ల చదువుకు పునాది కావాలి ' అంటారు. . 'డబ్బు మాత్రమే ఉంటే అది కూడా లేమి తనమే. గుండె నిండా దమ్మున్న వారికి అదే సంపద ' అన్న మల్లేశ్వర రావు గారి మాట ఎంత మంది పేదవారికి ఊరట నిస్తుంది. 


అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ' ఆడా మగా తేడాలొద్దు - అన్నా చెల్లీ ఒకటే జట్టు ' అంటారు వసుంధర . అపురూపమైన అన్నా చెల్లెళ్ల బంధం ఎంత గట్టిదో మంచి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడానికి అది ఎలా తోడ్పడుతుందో ఎంతో అద్భుతంగా చెప్పారు మల్లేశ్వర రావు గారు. 


భార్యా భర్తల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అచేతనంగా పడి ఉన్న భార్యను   చూస్తూ ' మొదటి సారి నీవు ఇలా అచేతనంగా ఉంటే భయమేస్తుంది'  అని భాగస్వామి చేత చెప్పిస్తుంది సుజాత. ఇదే చిత్రానికి శశికళ రాసిన  ' లే మిత్రమా' కవిత హృదయవిదారకం . ' నీ చేతిని వదలను , నీవు నన్ను వదలకు' అని భాగస్వామిని అభ్యర్థించిన తీరు కళ్ల నీళ్లు తెప్పిస్తుంది. ఎన్నో విష వలయాలను , జీవితంలోని మలుపుల్ని సునాయాంగా దాటిన దంపతుల్లో ఉన్నట్టుండి ఒకరు నిస్తేజంగా , నిస్సహాయంగా కనిపిస్తే  మరొకరి మనసు ఎలా విల విల లాడిపోతూ కన్నీరు కారుస్తుందో కళ్లకు కట్టించారు శశికళ. 


బొంగరాన్ని గ్రహాల గమనానికి ఉపమానం అన్న స్వర్ణలతగారి ఊహ  ఎంత అద్భుతం. పల్నాటి వీర  చరిత్రకు ముడి పెట్టి పౌరుషానికి ప్రతీకవు నీవు అని ప్రశంసించడం ఎంత బాగుంది. 


నల్ల బోతుల నాగమణి 'సూర్యుని పునరాగమనంలో నిర్యాణ నిర్మాణమేదో  దాగున్నట్లుంది, జీవన పార మార్థికతను ప్రబోధిస్తున్నట్లుంది ' అనడంలో ఎంత తాత్వికత దాగి ఉంది. 


శీలా సుభధ్రా దేవి గారు నింగీ నేల, నీలాకాశం లోని మబ్బులు, సూర్యుడు, తారా చంద్రులు , భూమిపై కొలనులో కలువలు , తామర పూలు మొదలైన ప్రాచీన కవి సమయాలను ప్రస్తావిస్తూ , ఆధునిక కవిసమయాలతో బేరీజు వేస్తూ జీవన విలువలు ఛిద్రమవుతున్న పరిస్థితుల్లో ప్రేమ అంగడి వస్తువై పోయిందని  వాపోతారు. అక్షరాన్ని  ప్రేమించే కవులే జీవితాన్ని నేర్పాల్సిందని ప్రబోధిస్తారు. 


' మానవ విషాదం ' కవితలో రాచపాలెం చంద్ర శేఖర రెడ్డి గారు దైన్యంగా బతుకు భారాన్ని మోస్తూ వసి వాడిన పసి పిల్లని చూసి ' అసమానత అనంత వికృతమై వెక్కిరించింది ' అని ఆవేదనను వ్యక్తం చేశారు. బాల భారతి గారు నిన్ను నువ్వు సంబాళించుకోవాలి అని ధైర్యం చెప్ప్తారు. 


ప్రతి ఒక్కరూ కలలు కనడం సహజం. కరువు నేలలో వేసిన వేరు శనగ పంట పచ్చని చెట్ల పట్టు చీర కట్టుకుందని కల గంటుంది అంటుంది దీవెన. 


రంగా వజ్ఝల నిర్మల చదువు సంధ్యలకు దూరమైన పసితనాన్ని ' దారి తప్పిన బాల్యం వీధి వీధి తిరుగుతుందని ' బాధ పడతారు. 


పరువు ప్రతిష్టల పేరుతో ప్రాణాలు తీసే పాషాణులు కూడా  మళ్లీ ఉదయించమని భరోసా ఇచ్చే సూర్యుని చూసి మానవత్వాన్ని సంతరించుకుంటారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేస్తారు నిర్మలారాణి. అదే సూర్యుణ్ణి ' సమానత్వాన్ని చాటి చెప్పే మేటి బంతి 'అంటారు ఘంటసాల నిర్మల . ఈ నిర్మల ద్వయం ఒకే విధమైన ఆకాంక్షలను వ్యక్తం చేశారు. 


'నీకెవరిచ్చారీ అధికారం 'అని ప్రశ్నిస్తూ , అసమ సమాజపు  ద్వంద్వ పాలనా వైఖరిని ఎండగడుతూ మహిళల తరఫున నిలబడి ' మా ఎదుగూ బొదుగులకు పగ్గాలేసి కుదేసి కాలరాసే అధికారం ఎవరిచ్చార'ని  నిలదీస్తుంది రమాదేవి. 


సమాజంలో వివక్షను ఎదుర్కొంటూ సమానత్వం కోసం నిత్య సమరం చేస్తూ, ఆశ విశ్వాసాలను ఆలంబనం చేసుకొని చిరంతనంగా ఎదిగిన విధానాన్ని ' నిత్య సమరం 'కవితలో వ్యక్తం చేశారు ఘంటసాల నిర్మల గారు. 


' చెట్లు శ్రమ జీవుల సేద తీర్చడానికి విప్పి పట్టిన గొడుగులు'  అంటారు ఆచార్య శ్రీనివాస రెడ్డి, మానవాళికి ఎన్నో రకాలుగా మేలు చేసే చెట్లను ' నీ నిశ్వాసయే మా శ్వాస ' అంటారు జానపాటి జ్యోతిర్మయి. 


ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తక మంతా పునరుక్తమవుతుంది. భావావేశం పెల్లుబికినప్పుడు కవితా విత్తనం మొలకెత్తుతుందని,  ఒక దృశ్యం గుండె గొంతుక లోకి చొరబడి పోతుందని అది ఓ కవితై మొలకెత్తడానికి కొట్టుకు లాడుతుందని అంటారు మల్లేశ్వర రావుగారు. అలాంటి భావావేశం ప్రతి ఒక్కరి లోను ఉందని తమ కవితల ద్వారా నిరూపించారు.  అందరూ కవితా వంటలో ఆరి తేరడానికి సిద్ధ పడ్డారు. ఏ వంటయితే బాగుంటుందో , ఎలా వండితే రుచిగా ఉంటుందో తెలుసుకొని వండారు. ప్రశంసలు అందుకున్నారు. సలహాలివ్వమని అడిగారు. ఎంత ఉప్పూ కారం వెయ్యాలో వాళ్లకు బాగానే తెలుసని పించింది . ఇలా చేస్తే  ఇంకా రుచిగా ఉంటుందని,  ఇలా గార్నిష్ కూడా చేస్తే ఇంకా బాగుంటుందని తమ అనుభవాన్నంతా రంగరించి సూచన లిచ్చారు అనుభవజ్ఞులు. కొంత మంది ఈ సందర్భంగా వేరే వాళ్ల కవితల్ని కూడా ఉటంకించడం సమూహానికి సార్థకతను సంతరించి పెట్టిందనాలి. 


సభ్యుల మనసు పొరల్లో ఎక్కడో ఒక మూల నక్కి ఉన్న శక్తి సామర్థ్యాలను అంచలంచలుగా వెలికి తీసి వాళ్లను మహోన్నత శిఖరాలకు  చేర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం అవుతుండడం అన్నిటి కంటే ఆనందాన్నిచ్చే అంశం. సామాజిక సమస్యల పట్ల చర్చలు,  స్పందనలు తెలియని ఎన్నో విషయాలను కళ్ల ముందుంచుతున్నాయి. 


మన సమూహం గురించి ఎన్నో చెప్పాలని ఉంది. కానీ చర్విత చర్వణ మవుతుంది. సభ్యులందరిది ఏకాభిప్రాయమే. విజ్ఞాన వినోద మానసిక వికాసాలకు ఎంత గానో తోడ్పడుతున్న ఈ సమూహం ఇంకా కొత్త కొత్త అంశాలతో మును ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ, తమ సమయాన్నంతా ఫుల్ టైం ఉద్యోగం లాగా  సమూహం కోసం వెచ్చిస్తున్న అడ్మిన్ లను అభినందిస్తున్నాను. సభ్యులందరికి శుభాకాంక్షలు. 


- మహాసముద్రం దేవకి

Comments