పరిశోధనలో పదనిసలు - 9
ఆంధ్రాలో మేము సందర్శించిన నగారాల్లో జిల్లా గ్రంధాలయాలు ,ఉండే కాలేజి లైబ్రరీలు చాలావరకు గాలించేశాము. నా నెచ్చెలులు, సహపరిశోధకులు శిరీష, ఎలిజబెత్ లు , మేము ఎవరి పనిమీద వెళ్లినా , ఎవరి పని కోసం వెళ్లినా కలిసే వెళ్లే వాళ్లం. శీరీష టాపిక్ పదిమంది ప్రసిద్ధ 'రచయిత్రుల నవలలు - పరిశీలన ' . ఎలీజాది 'తెలుగు చారిత్రక నవలలు- పరిశీలన ' హైదరాబాదుకు ముగ్గురమ్మలం కలిసి వెళ్లాం ఒకసారి. వాళ్లకది మొదటి సారి. నాకు రెండవసారి. అందు వల్ల వాళ్లకు మార్గదర్శినిని నేనే అనుకోండి. నాతో పాటు వాళ్లనూ రామరాజు గారింటికే తీసుకెళ్లాను. ఆ ఇంట్లో నా ఆటలు సొంత ఇంట్లో లాగే సాగేది. నేను ఆడింది ఆట. పాడిందే పాట. వాళ్లకు పుట్ట లేదు కాని ఏనాటి అనుబంధమో సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసే వాళ్లు .
అదే కాదు! వాళ్ల ఇల్లు ఒక ధర్మ సత్రం. పెద్ద సంస్థానం. ఎప్పుడూ ఇంటి నిండా జనాలు . అప్పటికే పెద్దమ్మాయి లీలక్కకు పెళ్లయింది. మిగిలిన నలుగురు కూతుళ్లు , ఒక కొడుకు, పెద్దమ్మాయి పిల్లలిద్దరు ఉన్నారు. వాళ్లతో పాటు మేము ముగ్గురం. మిద్దె పైన ఒక గది ఉంటే అందులో మమ్మల్ని ఉండమన్నారు. ఇక రోజూ వచ్చీ పోయే అతిథులు ,వాళ్ల పిల్లలస్నేహితులు , ప్రతి దినం అదనంగా కనీసం ఓ ఏడెనిమిది మందయినా ఎంగిలి పడే వారు. ఉదయం వంట చేసేటప్పుడే ఎక్కువ వండే వాళ్లు. ఆ దంపతుల ఆత్మీయాను రాగాలు అలాంటివి.
మేము ముగ్గురం , రెండో కూతురు రుక్కు , మూడో కూతురు బుజ్జి ( శకుంతల ) ఉదయాన్నే అంతా వంటింట్లో చేరే వాళ్లం . ఎవరికేది బాగా వస్తే అది వండే వాళ్లం. ఏకంగా 11 గంటలకే భోజనం. టిఫిను లేదు. ఆ లోపల అకలేస్తే చిరు తిండ్లే శరణ్యం. వంట అయి ఉంటుంది కాబట్టి మేము పదింటికే భోంచేసి బయట పడితే మళ్లీ నాలుగింటికి వచ్చి వంటింట్లో చేరి ఉపాహారం చేసే వాళ్లం.
ఒక స్కూలు టీచరు హైమక్క, ఆమె మా కంటే నాలుగేండ్లు పెద్ద. అయినా అప్పటికే పెళ్లయి భర్త చని పోయి ఒంటరిగా చిక్కడ పల్లెలో వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరగా ఒక గది అద్దెకు తీసుకొని ఉండేది. ఏడు గంటల కంతా తను గదికి తాళం వేసుకొని పడుకోవడానికి వీళ్ల ఇంటికే వచ్చేది.
ఉస్మానియాలో రామరాజు గారి గైడెన్స్ లో కుసుమ కుమారి దాక్షిణ్యాత్య కవయిత్రుల ( ముద్దు పళని, రంగాజమ్మ ...' ) రచనల మీద పరిశోధన చేసేది. మేము వెళ్తే తనూ వచ్చి అప్పుడప్పుడూ మాతో ఉండి పొయేది. రామరాజు గారి అక్క కూతురు భారతక్క కూడా ఎక్కువ రోజులు ఇక్కడే ఉండేది. ఆమెకు కూడా భర్త లేడు . వీళ్లందరూ నాకు రాసి పెట్టడంలో సాయం చేసేవాళ్లు.
రుక్కుకు గైడ్ సి. నారాయణ రెడ్డి గారు. భారతంలో ఉపమాలంకారాల పైన తను వర్క్ చేసింది. ఫీల్డు వర్క్ అంత అవసరం లేని టాపిక్స్ వాళ్లందరివి . కానీ నాది అలా కాదు . పైగా బాల సాహిత్యంలో మొట్ట మొదటి పరిశోధన నాదే ఆ సాహిత్య పరిణామమంతా చెప్పాలన్నారు.
వేలాదిగా ఉన్న బాల గేయాల్ని సేకరించాలి. వాటి విభజన సరే సరి ! దాన్ని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ పనుల కోసం నేను చాలా తిప్పలు పడ్డాను. ఉదాహరణకు : మొదటి గేయం ఎవరు రాశారు ? అది ఎందులో ప్రచురితం. తరువాతి రచయిత ఎవరు? ఇలా రచనల వివరాలు సేకరించాలంటే చాలా కష్ట పడ్డాననే చెప్పాలి .
అలాగే మొదటి పిల్లల పత్రిక ఏది? అది ఎప్పుడు మొదలయింది? తర్వాత ఏయే పత్రికలు వచ్చాయి , ఎంత వరకు నిలబడినాయి . పత్రికలు ఏయే పత్రిక ఎప్పుడు మొదలయిందో చెప్పాలంటే ప్రారంభ సంచికలు దొరికేవి కావు. తల పట్టుకోవాల్సి వచ్చేది. కానీ తప్పకుండా పరిణామ చరిత్రకు ఆ వివరాలు ఉండాలనే వారు. అలాంటప్పుడు సంపుటి, సంచికలను బట్టి అంచనా వేసే దాన్ని . నాకీ ఉపాయం చెప్పింది అనకాపల్లె లోని కవుల ఆంజనేయ శర్మ గారు.
బాల సాహిత్య రచనకు, రచయితలకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు , కొన్ని ప్రత్యేక సంస్థలు అవార్డులు ఇచ్చాయి. వాటి వివరాలు సేకరించడానికి కూడా చాల కష్ట పడ్డాను.
బాల సాహిత్యంలో రచనాలయాలు ఎప్పుడు మొదలయినాయి? బాలల సంస్థలు ఎవేవి ఉన్నాయి? అవి బాల సాహిత్యాభివృద్దికి ఎలా తొడ్పడ్డాయి? బాలానంద సంఘాల స్థాపన, బాలల చలన చిత్రాల నిర్మాణం , వాటి వివరాలు , దూరదర్శన్ కార్య క్రమాల వివరాలు మొదలు బాలల అకడెమీ స్థాపన వరకు వివరాలను సేకరించడానికి చాలా శ్రమ పడ్డాననే చెప్పాలి. నా తర్వాత బాల సాహిత్య పరిశోధన బాగా పుంజుకొంది. ఎస్వీ లోనే ఐదారు మంది చేశారు. కథలు, నవలలు, నాటికలు మొదలైన వాటి మీద పరిశోధనలు కొనసాగాయి. వాటికి నేను చెప్పిన పై వివరాలు బాగా తోడ్పడినట్లు వాళ్లే థీసీస్ల ముందు మాటలో చెప్పుకున్నారు. ఉత్తరాలూ రాశారు.
రామరాజు గారింట్లో అందరం మేడ మీది గదిలో చేరే వాళ్లం. ఇంత మందిలో ఎక్కువ మెటీరియల్ సేకరించాల్సిన టాపిక్ నాదే కదా ! నానా తిప్పలూ పడి ఆ వివరాలంతా సేకరించిన తర్వాత 1978 లో బాలల అకడెమీ ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. అందులో బాల సాహిత్యానికి సంబంధించి రచయితలు రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. విద్యార్థి దశలోనే నేను రాసిన వ్యాసం కూడా అందులో ప్రచురితమైంది. ఆ సావనీర్ నేను రాసిన పరిణామ చరిత్రను కరెక్టా కాదా తేల్చుకోవడానికి బాగా తోడ్పడింది.
మేడ మీద గదిలో చేరి అందరం కబుర్లు చెప్పుకొంటూనే నాకు బాల గేయాల సేకరణలో తోడ్పడే వాళ్లు. నేను సేకరించిన పది వేల బాల గేయాల్లో వీళ్లందరి చేతి రాతలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే ఇంత కథ చెప్పడం. ఇంత మంది గురించిన ప్రస్తావన తేవడం.
హైదెరాబాదుకు ముగ్గురం చాలా సార్లే వెళ్లాం. ఎంతో మంది రచయితలను కలిశాం. ఎన్నో విషయాలను చర్చించాం. సికింద్రాబాదులో మాచిన్నాన్న రూమ్మేట్ ( అమెరికాలో ) అడపా రామక్రిష్ణా రావును కలిశాము. బాల సాహితీ మాల ( రచనల వివరాలు) అనే అతి ముఖ్యమైన గ్రంథాన్ని నాకు వారే ఇచ్చారు.
నారాయణ భట్టు , రుద్రమ దేవి లాంటి రచనలెన్నో చేసి చారిత్రక నవలా రచయితగా ప్రసిద్ధి పొందిన నోరి నరసింహ శాస్త్రి గారిని ఎలిజా కోసం కలవాలను కున్నాం. ఉస్మానియా వరకు నాన్నగారు కారులో దిగ బెట్టారు. అక్కడి నుంచి బస్సులో వెళ్లి, తార్నాకాలో దిగి సందులు గొందులు తిరిగీ కొన్ని గంటలు వెచ్చించి ఇల్లు పట్టుకొని హమ్మయ్య అనుకున్మాం. కానీ మా శ్రమ వృధా ఐపోయింది. ఎలిజా మొహం చూడాలి. ఎందుకంటే మేము వెళ్లే సరికి ఆయన మాట కూడా పడిపోయి మంచంలో ఉన్నారు. ఆయన జీవిత వివరాలేవో కుటుంబ సభ్యులు కొన్ని చెప్పగా రాసుకొని నిరాశగానే వెనుదిరిగాం. మేము వెళ్లొచ్చిన వారం లోపలే ఆయన కాలం చేశాడని వార్తల్లో విని చాలా బాధ పడ్డాం.
శిరీష పరిశోధన కోసం ఎన్నుకున్న రచయిత్రులు ముగ్గురు ముఖ్యమైన వాళ్లు హైదరాబాదులో ఉన్నారు. వాళ్లను తప్పక కలిసి రమ్మన్నారు గైడ్. ఆ విషయం మాట్లాడుకొంటుంటే యద్దనపూడి సులోచనా రాణి దగ్గరికి హైమక్క తీసుకెళ్తా నంది. వాళ్లిద్దరు కాజా అనే గ్రామంలో అంటే ఒకే ఊరిలో పుట్టి పెరిగిన వాళ్లు. చిన్నప్పుడు చూసిందే అట. రుక్కు కూడా మాతోపాటు వస్తానంది.
యద్దన పూడి హైమక్కను బాగానే గుర్తు పట్టింది. నవలా రాణి కదా! మేము కొంచం టెన్షన్ ఫీలయ్యాం. కానీ ఆమె ఎలాంటి భేషజాలు లేకుండా చాలా ప్రేమగా, ఉన్నతంగా వ్యవహరించింది. హైమక్క, ఆమె ఒక ఐదు నిముషాలు చిన్న నాటి జ్ఞాపకాలేవో కలబోసుకున్నారు. హైమక్క వచ్చినందుకు కాబోలు! భోంచేసేదాకావదల లేదు. ఐదు మందిమాయే ! మేము, ముఖ్యంగా హైమక్క మొహమాటంతో చితికి పోయాం. వంటామె ఉంది. అందుకే నేను చేసేదేముందంటూ ఆమె బలవంతం చేసింది. ఇబ్బంది పెడుతున్నామనిపించినా తినక తప్పింది కాదు. ఆ రోజంతా అక్కడే ఉన్నాం .
ఆ తర్వాత ఒక రోజు ముప్పాళ రంగనాయకమ్మను , మరో రోజు వాసిరెడ్డి సీతాదేవి గారిని కలిశాము. చాలా సేపే మాట్లాడాము. వాసి రెడ్డి గారు ఒంటరిగానే ఉంటారు. వంట మనిషి ఆమెకు తోడు. చర్చించిన విషయాలేవీ గుర్తు రావడం లేదు. ముప్పాల రంగనాయకమ్మ గారితో మార్క్సిజం గురించి, స్త్ర్రీల సమస్యల గురించి శిరీష ఎక్కువ సేపు మాట్లాడిన గుర్తుంది. మల్లాది సుబ్బమ్మ, ఆచంట శారదా దేవి , కె. రామలక్ష్మి , అబ్బూరి ఛాయాదేవి మొదలయిన వాళ్లను కలవమని శిరీషకు సూచించింది ఆమే అన్నట్లు గుర్తు.
యద్దనపూడిని కలవడం తిరుపతి హాస్టల్లో సంచలనాన్ని రేపింది. అందరూ అడగడమే. అంత ఫేమస్ ఆమె.
శిరీష దగ్గర చాలా నవలలు ఉండేవి. హాస్టల్లో వాటిని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. అన్ని శాఖల వాళ్లు నవలలను తెగ చదివే వాళ్లు. బయట రాక్ లో పెడితే ఎవరు పడితే వాళ్లు తీసుకొనే వాళ్లు. అది హాస్టలంతా సంచారం చేస్తూ, చేతులు మారుతూ మళ్లీ శిరీషను చేరడానికి చాలా రోజులు పట్టేది. అందుకని ఒక పెట్టెలో దాచుకొని తాళం వేసుకోవడం మొదలు పెట్టింది. అయినా ఇవ్వక, గుర్తు పెట్టుని తీసుకోక తప్పేది కాదు. ఏది బాగుందో శిరీష నే అడిగి మరీ తీసుకొనే వాళ్లు.
నా పుస్తకాల సేకరణ ఎక్కువే. అన్నీ పద్ధతిగా రాక్ లో సర్దుకొనే దాన్ని. మనీ ప్లాంటు రూమంత నవ నవ లాడుతూ ఉండేది. మా రూమ్మేట్ జువాలజీ స్కాలర్ విజయ కుమారి. తను పగలంతా ల్యాబ్లోనే ఉండేది. హాస్టల్ డే కి ఇచ్చే బెష్టు రూం ప్రైజులు మూడేండ్లు వరసగా నన్నే వరించాయి. మా రూము ఒక చిన్న లైబ్రరీని తలపిస్తుందని మా వార్డన్ మిస్. పి. ఆర్ . రెడ్డి . ( హోం సైన్స్ హెడ్) సెలెక్షన్ కోసం వచ్చిన వాళ్లతో అన్నారు. అన్నట్లు పరిశోధన చేసేటప్పుడు చివర మూడేండ్లు హాస్టల్లో ఉన్నాను నేను. ఆ అనుభవం గొప్పది. మరచిపోలేనిది.
మహాసముద్రం దేవకి
10 - 10 - 2022
Comments
Post a Comment