పరిశోదనలో పదనిసలు - 7
క్షేత్ర పర్యటనలో భాగంగా రాజమండ్రికి బయలుదేరాం. ఆ ఊరంటే నాకు ముందు నుంచీ తెలియని ఇష్టం. అంత వరకు వినడమే కానీ వెళ్ల లేదు. అనకాపల్లి వెళ్లినపుడు అర్ధ రాత్రి గోదావరిని చూసి పులకించి పోయానే కానీ అడుగు పెట్టింది ఇప్పుడే .
ఇప్పుడయితే రాజమండ్రి దగ్గర బొమ్మూరులో తెలుగు యూనివర్సిటీ ఉండడం వల్ల చాలా మంది పరిచయస్తులున్నారు . లెక్క లేనన్ని సార్లు వెళ్లాను కూడా. కానీ అప్పట్లో ఎవరూ తెలియరు. మా చిన్నాన్నగారు కూడా లైబ్రేరియనుకు ఉత్తరం రాసిచ్చి ఏకంగా లైబ్రరీకే పొమ్మన్నారు.
మా ముగ్గరిలో శిరీష కాస్త ధైర్యస్తురాలు. తిరుపతిలో అయితే టవునుకు వెళ్లాలంటే ముగ్గరం ఒకే రిక్షాలో వెళ్లే వాళ్లం. నేనూ, ఎలిజబెత్ సీట్లో కూర్చొని శిరీషను ఇద్దరి ఒడులు కలిపి మధ్యలో మా పైన కూర్చో బెట్టుకొనే వాళ్లం. లగ్గేజ్ ఉండడం వల్ల ఇప్పుడలా కుదర లేదు. శిరీష ఒక్కతే మా బ్యాగులు కూడా పెట్టుకొని ఒక రిక్షా లో కూర్చుంది. మసక చీకటి . ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. లైబ్రరీలో ఎవరుంటా రబ్బా అనుకొంటూనే వెళ్లాం.
గేటు ముందు రిక్షాలు ఆగంగానే పక్కనే కొట్టం లో నుండి వాచ్మాన్ పరిగెత్తుకోని వచ్చాడు. లగ్గేజి లొపలికి చేర్చడం లో సాయం చేశాడు. ముందు జాగ్రత్తగా కాల కృత్యాలు రైల్లోనే కానిచ్చాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని లగ్గేజ్ పెట్టుకొని ఎంత సేపని బయట కూర్చుంటాం. వాచ్ మ్యాన్ కు ఇద్దరు పిల్లలు. వాళ్లను బడికి పంపడానికి సిద్ధం చేస్తోంది అతని భార్య. వంట కూడా చేసి డబ్బాలు కట్టింది.
వంట చేసే ముందు మాకూ చేస్తానంది కానీ హోటల్లో తింటామని చెప్పడంతో సరే అనుకున్నారు. ' ఇంత పొద్దున్నే అమ్మాయిగార్లు నాస్టా చేస్తారు కానీ నువ్వు పెట్టే అన్నం ఎక్కడ తింటారే ' అని వాచ్మ్యాన్ భార్యను కసిరాడు.
ఇంతకూ మేము దేని కోసం రాజమండ్రి వెళ్లినట్లు? చెప్పనే లేదు. అక్కడ దాదాపు 140 యేండ్ల చరిత్ర కలిగిన గౌతమి గ్రంథాలయం ఉంది . దాని కథా కమామీషు తెలుసు కుందామా!
నాళం కృష్ణా రావు పేరు వినే ఉంటారు. ఆయన వాళ్ల సత్రంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి దానికి వీరేశలింగం పుస్తక భాండాగారం అని పేరు పెట్టాడు. ఇంకొక ఆయన( పేరు గుర్తు లేదు) ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. తర్వాత ఈ రెండిటిని కలిపేసి దానికి సర్వజన పుస్థక భాండాగారం అని పేరు పెట్టారు. అదే గౌతమీ గ్రంథాలయం. వావిలాల గోపాల క్రిష్ణయ్య, కొక్కొండ వెంకట రత్నం, చిలకమర్యి లక్ష్మీ నరసింహం
మొదలయిన వాళ్లు దాని అభివృద్ధికి సహకరించారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత దానికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. చాలా పెద్ద కాంపౌండే కాని చాల పాత భవనంలో ఉండేది. అది మేము వెళ్లొచ్చిన కొన్నాళ్లకు కూలిపోయిందని విన్నాము.
మేము లిబ్రేరియన్ ను కలిసినప్పుడు ఆ కాంపౌండు లోనే సెపెరేట్ గా ఒక గది ఉంటే అక్కడ ఉండ మన్నారు. గది ఇచ్చినందుకు సంతోషించి లగ్గేజ్ అక్కడ పెట్టి తాళం వేసుకొని లైబ్రరీకి వెళ్లాము. పోగానే మా చేతిలో ఒక చీపురు పెట్టారు. కుర్చీలు, బల్లలు మచ్చుకయినా లేవు.దొరికిన పుస్తకాలు పట్టుకొని ఎక్కడో మాకు నచ్చిన స్థలంలో కొంత భాగం కూర్చొని రాసుకోవడం కోసం చీపురుతో దుమ్ము ఊడ్చుకొని అక్కడ కూర్చొని రాసుకొనే వాళ్లం. అక్కడ కూడా నాకు బాల సాహిత్యానికి సంబంధించి మంచి వ్యాసాలు, పాత పత్రికల్లో గేయలూ, పుస్తకాలు బాగా దొరికాయి. వీరేశ లింగం పంతులు రాసిన రచనలు, నాళం కృష్ణారావు రచనలు దొరికాయి. , గిడుగు సీతాపతి నాలుగేండ్లు ' భారతి ' పత్రికకు సంపాదకులుగా ఉన్నారు . ( ఎప్పుడు అనేది అనంతపురంలో ఉంటే చూసి చెప్పేదాన్ని. ) అ ప్పుడు బాల సాహిత్య రచనలు విరివిగా చెయ్యండని భారతి పత్రికలో ' మనవి ' అని ఒక గేయం రాశాడాయన . బాల సాహిత్య పరిణామం చెప్పడానికి ఆ గేయం చాలా ఉపయోగ పడింది. అది నాకు అక్కడే దొరికొంది.
నేదునూరి గంగాధరం అనే సాహిత్య పిపాసకుడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పల్లెల్లో తిరిగి సేకరించిన మిన్నేరు, మున్నీరు, సెలయేరు అనే జానపద గేయ సంకలనాలు , వేటూరి ప్రభాకరశాస్త్రి ' బాల భాష ' గేయ సంకలనం , గిడుగు సీతాపతి ' బాలానందం ' చింతా దీక్షితులు రాసిన , లక్క పిడతలు ' నాకు అక్కడే దొరికాయి . చీపురుతో అరగంట కొకసారి ఊడ్చు కోవలసి వచ్చేది. అంత దుమ్ము రాలేది. తిరిగి చూసే సరికి దుమ్ము నిండి పోయేది. మేము కూడా దుమ్ముతో నిండి పోయే వాళ్లం.
సిబ్బంది సహకారంతో మధ్యాన్నం భోజనానికి పూట కూళ్లమ్మ ( మెస్ ) ఇంటికెళ్లాం. కింద బంతి చాపల మింద కూర్చొని అరిటాకుల్లో వడ్డించిన రుచికరమయిన కూరల్ని తింటుంటే మా దిమ్మ తిరిగి పోయేది . చల్లటి కుండలో తోడు పెట్టిన గడ్డ పెరుగు , ఆవకాయ మళ్లీ అలాంటి భోజనం నా జన్మలో తినలేదంటే నమ్మాలి మీరు.
తరువాత తెలుగు యూనివర్సిటీ వాళ్లు పిలిస్తే చాలా సార్లు వెళ్లానని చెప్పా కదా! అలా వెళ్లినప్పుడు గౌతమీ గ్రంథాలయం లో ఉపన్యాసం ఏర్పాటు చేశారు. చాలా సంతోషమయింది. కానీ మొదట చూసిన ఆనవాళ్లు అక్కడ గోరంత కూడా లేవు. పక్కా భవనం ఏర్పాటయింది. పుస్తకాలు కూడా వేలనుంచి లక్షకు పైగా పెరిగాయి.
సరే ఇక్కడ మేమున్న గది గురించి చెప్పాలి. లగ్గేజ్ అయితే పెట్టి ఉదయం సేఫ్ గా బీగమేసుకున్నాం కానీ రాత్రి పొద్దు పోయి భోంచేసి గదికెళ్లి వాచ్ మెన్ వాళ్లింటి నుంచి తెచ్చుకున్న పెద్ద ఈతాకు చాప పరుచుకొని తలుపుకు గొల్లెం పెడదామని చూస్తే గడి లేదు . చాలా భయ పడి పోయి నూనె దీపం వెలుగులో దిగాలుగా కూర్చుండి పోయాం. . చుట్టూ పరికించి చూస్తే ఆ చిన్న గదిలో ఒక మూల విసుర్రాయి ఆపద్బాంధవిలా దర్శనమిచ్చింది. అది అక్కడెందుకుందో! బహుశా ముందు ఎవరైనా కాపుర ముండి వద్దను కొని వదిలేసి వెళ్లి పోయారేమో! అతి కష్టం మీద ముగ్గురం కలిసి దాన్ని తలుపు కడ్డంగ చేర్చి పడుకున్నాం. భయంకరమైన కుక్కల అరుపుల మధ్య చాలా సేపటికి నిద్ర పోయాం. మధ్యలో టాయిలెట్ కు వెళ్లాల్సి వచ్చినా ఉగ్గ పట్టు కొని తెల్లారే దాకా బయట అడుగు పెట్టే ధైర్యం చెయ్య లేదు.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదంటారు. . బాపట్ల బీచి అనుభవం ఉన్నా మళ్లీ గోదావరి పడవ ప్రయాణానికి బయలు దేరాం. గొదావరి నదికి అవతల కొట్టాల ముందర పొయ్యిలు మండుతున్నాయ్.అవతలికి వెళ్లి వాళ్ల
కథా కమామీషు కాస్త తెలుసుకుందామని కోరిక. పడవ సరంగును అవతలి గట్టుకు చేర్చమన్నాం . అతనిని ఒప్పించి పడవ మేమే నడప సాగాం. నది మధ్యకు వెళ్లంగానే చీకట్లు మా వెంట బడ్డాయి. వెళి మళ్లీ తిరిగి రావడం కష్టం. రాత్రి పూట పడవ ప్రయాణం వద్దనుకున్నాం. . మా ఆశల్ని గోదాట్లోనే ముంచేసి వెను దిరిగాం. ఎన్ని సార్లు వెళ్లినా ఆ కోరిక మాత్రం అలాగే మిగిలి పోయింది. మర్నాడే మా ప్రయాణం.
చెప్పడం మరిచి పోయా. వచ్మ్యాన్ భార్యకు సినిమాల పిచ్చి. అడవి రాముడు, ఆలు మగలు సినిమాలు చూపించి మా రుణం కొంత తీర్చుకున్నాం. నన్నయ మొదలుకొని ఎంతో మంది సాహితీ మూర్తులు పుట్టి తెలుగు సాహిత్యాన్ని అందల మెక్కించిన రాజమండ్రి అంటే చెప్పలేనంత అభిమానం నాకు.
మహాసముద్రం దేవకి
26 - 9 - 2022
Comments
Post a Comment