గాథా సప్తశతి - 6

 గాథా సప్తశతి  - 6


గాథా  సప్తశతిలో స్వేచ్ఛా శృంగారం  ఏరులై పారుతుంది. ప్రేయసీ ప్రియులు పంట పొలాల దాపున సంకేత స్థలాల్లో కలుసుకొని తమ ముచ్చట్లను తీర్చుకొనే వాళ్లు. ఈ పద్యాలు చూడండి : 


       తన భర్త పర స్త్రీ లోలుడు . ఊరి సమీపంలో ఉన్న పద్మ వనం దగ్గర ప్రియురాలిని కలుసుకుంటాడని అతని భార్యకు తెలుసు. అత్త మామలు కొడుకు గురించి చెప్పినా నమ్మరు. ఒక రోజు ప్రేయసీ ప్రియులు అక్కడ ఉండడాన్ని చూసింది ఆ కోడలు . ఇదే మంచి అదననుకొంది.  మాటల సందర్భంలో చెప్తున్నట్లుగా అత్తతో - 


       ' మన ఊరి కొక్క సొమ్మై 

         కనుపండువు సేయుచున్న కమలవనము,కో 

         సిన నువ్వు జేను వడుపున 

         కనిపించెడు నిపుడు మంచు కారున నత్తా '


         అంటూ తన భర్త  పర స్త్రీని కలుసు కొన్న దృశ్యాన్ని నేర్పుగా అత్త కంట బడేట్లు చేస్తుంది . 


           ఒక స్తీ రహస్య సంకేత స్థలంగా ఉన్న పండబారిన వరి చేనును చూసి ఇక దాన్ని కొసేస్తారు కదా అని దిగులు పడుతుంటే ఆమెను స్నేహితురాలు ఇలా ఊరడిస్తుంది. 


       ' పండి తెల్లబారు వరి తోటలను జూచి

         యేల మొగము వంచి యేడ్చెదమ్మ 

         చూడు జనప సేను సొగసెక్కెనరిదళం 

         బలదుకొన్న యాట వెలది వోలె ' 


వరితోట పోతే ఏమవుతుంది జనప చేను పెరిగి వస్తోందని చెప్పడం . 

        

         నువ్వులు, వరి , జనప తెలుగు నేలపై ఆరోజుల్లో పండే పంటలు . 


          

Comments