పరిశోధనలో పదనిసలు. - 6

 పరిశోధనలో పదనిసలు- 6



వేట పాలెం ట్రిప్పులో గర్వంగా చెప్పుకొనే అంశం ఒకటుంది. ఏముంటుంది అనుకుంటున్నారా? చెప్తున్నా ! వేట పాలెం లో ఉంటూనే రెండు సార్లు రచయిత్రి  కనుపర్తి వరలక్షమ్మను కలుద్దామని బాపట్లకు వెళ్లాము.

జగ మెరిగిన బ్రహ్మణుడికి జెందె మేల? అన్నట్లు ఆమె పేరు చెప్పంగానే  రిక్షా అతను ఏకంగా ఆమె ఇంటి ముందు ఆపాడు రిక్షా. వెళ్లంగానే ఆ ఇంటి వసారాలో ఒక పండు ముసలామె కనిపించింది. పెంకుటిల్లది.

' వరలక్ష్మమ్మ గారున్నారా అవ్వా ? ' అని అడిగాము. 'నేనేనమ్మా ' అనడంతో అవాక్కయ్యాము. వరలక్షమ్మ గారి గురించి ముందే పేరు మాత్రం విని ఉన్నాము,  కానీ ఇంత పెద్దామె అని మేము ఊహించ లేదు. రచయిత్రి కదా! ఆమెతో ఎలా మాట్లాడాలి అని ఒక పక్క వణుకు.

మా ఊహల్ని తారుమారు చేస్తూ ఆప్యాయంగా దగ్గర కూర్చో బెట్టుకొని సాహిత్యం గురించి బోలెడు కబుర్లు చెప్పింది. మా బెరుకు హుష్ కాకి. మాకు తెలియకుండానే మాయమైపోయింది.

ఆమె గురించి తెలియని వాళ్ల కోసం ఇప్పుడు నేను రెండు మాటలన్నా చెప్పకుంటే ఎలా?

వంద సంవత్సరాలకు ముందున్న చావలి బంగారమ్మ, భండారు అచ్చమాంబ, దుర్గాబాయ్ దేశుముఖ్, టంగుటూరి సూర్యకుమారి , మన వరలక్షమ్మ మొదలయిన  వాళ్లంతా ఒక తరం రచయిత్రులు.

మహిళా సంక్షేమం వైపు దృష్టి సారించిన అభ్యుదయ భావాలున్న వ్యక్తి కనుపర్తి వరలక్షమ్మ. ఎవరు ఎన్ని రచనలు చేసినా ఏదో ఒక రచన వాళ్లను ఆకాశంలో నిలిపి కలకాలం గుర్తుండి పోయేలా చేస్తుంది కదా! అలా ఆ మహనీయురాలి పేరు వినగానే గుర్తొచ్చేది ' శారద లేఖలు '

కొన్ని ఏండ్ల పాటు ' గృహలక్ష్మి ' మాస పత్రికలో శారద లేఖలు శీర్షిక ద్వారా ప్రసిద్ధి పొందిందామె.  ఆధునిక భావాలున్న శారద పాత్రను సృష్టించి స్త్రీల అభ్యున్నతికోసం, వాళ్లలో చైతన్యాన్ని తీసుకురావడానికి లేఖా సాహిత్యాన్ని ఎన్నుకుంది. అది తర్వాత గ్రంథంగా వెలువడింది. ఆమె గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత కూడా .

ఆంగ్లం నుంచి అనువాదం చేసిన సౌదామిని కథ ఆమె మొదటి రచన.  ఆతర్వాత పద్య రచనలు, ద్విపదలు, దండకాలు, నాటికలు, గేయాలు, పిల్లల పాటలు చాలా రాశారామె.

బాలసాహిత్యంలో పరిశోధన చేస్తున్నానని తెలిసి పిల్లల  సాహిత్యాన్ని మొట్ట మొదట పరిచయం చేస్తున్నందుకు ,  విశ్వ విద్యాలయ స్థాయిలో నిలబెట్టినందుకు చాలా సంతోషించారు, సహకరించారు కూడా. బాల గేయ మంజరి అని ఆమె రాసిన అముద్రిత గ్రంథాన్ని కూడా నా చేతిలో పెట్టారు. ఆమె రాసిన వసుమతి నవలలో చిన్న వయసులో పెళ్లయిన వసుమతి తాను పడ్డ ఇబ్బందుల్ని తల్లితో చెప్పుకున్నట్లు చిత్రిస్తూ ఆ విధంగా బాల్య వివాహాలను నిరసించారు.

పైకి సాదా సీదాగా కనిపించినా ఆమె రచనలు చదివితే ఎంత ఉన్నతమైన భావ సంపద గల వ్యక్తో తెలుస్తుంది. ఆమె రచనలన్ని ఇచ్చారు నాకు. నేను ఎస్. కె. లో పని చేస్తుండగా దాదాపు 40 యేండ్ల  క్రితం సెంట్రల్ యూనివర్సిటీ నుండి  నన్ను కలవడానికి పద్మ అనే అమ్మాయి వచ్చింది. స్త్రీవాద సాహిత్యంలో పరిశోధన చేసేది. ఇప్పుడు ఎక్కడుందో శారద లేఖలు వగైరాలు చదివిస్తానని తీసుకెళ్లి ఎన్ని ఉత్తరాలు రాసినా తిరిగి ఇవ్వలేదు. ఏరుదాటినాక తెప్ప తగలేసే రకాలు ఉంటారు కదా!

సరే ! అసలు విషయానికొస్తాం. వరలక్షమ్మ గారు గాంధీని కలిశారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొని ఖద్దరు ధరించడం మొదలు పెట్టారు. సామాజిక విలువలు తెలిసిన వ్యక్తి ఆమె. సంఘ సేవా తత్పరురాలు. వీరేశలింగాన్ని అనుసరిస్తూ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మద్రాసు, విజయవాడ ఆకాశ వాణి కార్య క్రమాల్లో మొదట పాల్గొన్న రచయిత్రి ఆమె. 

ధర్మ సంరక్షణ ఆమె ధ్యేయం . నీతి ఆమె మతం , స్త్రీ సంక్షేమమే ఆమె లక్ష్యం. వాటి కోసమే కలం పట్టానన్నారు. బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణీ మండలిని స్థాపించారు.

పనిలో పనిగా కనుపర్తి వరలక్షమ్మను మీకు పరిచయం చేసే భాగ్యాన్ని ఇలా దక్కించుకున్నాను. రెండు రోజులు ఆమె స్వయంగా వడ్డిస్తే భోంచేసే భాగ్యం కూడా మాకు దక్కింది. నాకు బాగా నచ్చిన గుమ్మడి కాయ వడియాలు మొదటి సారిగా వాళ్లింట్లోనే తిన్నాను నేను. అబ్బ! ఆమె పెట్టిన పులిహోరను మరచిపోగలనా? వంట మాత్రం ఆమె చెయ్యలేదండోయ్ !  ఆ రెండు రోజులూ మాతోనే గడిపారు. కోడలో ఎవరో చేశారు వంట. పరిచయం చేసింది కాని మతిలేని బుర్ర కొంతమందిని మరిచిపోయి గాలికొదిలేసింది.

స్త్రీలకు చీరలపై మోజెక్కువ అంటారు. ( అప్పట్లో చీరలే. డ్రస్సులు వాడుకలో లేవు. డిగ్రీ చదివే వయసులో కూడా చీరలు, అడపా దడపా పావడా పైట వేసుకొనే వాళ్లమంటే ఈ తరం పిల్లలు నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ' హా శ్చర్య పొతారేమో ! ఎందుకంటే మన కట్టు బొట్టు తీరు ఎప్పుడో మంట కలిసి పోయింది కదా! ) ఎవరికుందో లేదో కానీ మాకుంది. అందులో మా క్షేత్ర పర్యటన అంత బాగా ఫలవంతమయింది. నాదగ్గర ఈనాడు పదివేల బాల గేయాలు ఉన్నాయంటే వేట పాలెంలోని లైబ్రరీ చలువ + పరిశోధన పట్ల మా నిజాయితీలే కారణం.

ఆ సంతోషంలో చీరాలలో చీరలు చౌక అని సెకండ్ బాంబే అంటారని విని తిరిగి వచ్చేసే ముందు రోజు చీరాలకు వెళ్లాము. నూరు రూపాయలు పెట్టి ఒక పూల పూల జార్జిట్ చీర మా అక్కకోసం కొన్నాను. దాని మన్నిక వన్నెచిన్నెలు చూసి మా గైడు డా. నిర్మలా రాణితో సహా అందరూ తెగ మెచ్చుకున్నారు. మిగిలిన వాళ్లకు కొన్న వేవీ గుర్తు లేదు.

జీడి మామిడి తోట లెక్కువ అక్కడ. కొనుక్కోని పోతే ఇంట్లో వాళ్లు సంతోష పడతారని, అగ్గవగా దొరుకుతుందని ఒక చిన్న పల్లె టూరుకు వెళ్లి వీధి వీధీ తిరిగాము. మన రాయలసీమలో ఇళ్ల ముంగిళ్లలో వేరుశనగ కాయలు ఎండబోసినట్లు ప్రతి ఇంటి ముంగిట్లో జీడి పప్పు ఎండ బెట్టుకొని కూర్చున్నారు. ఎన్ని ఇండ్లు తిరిగినా చౌక బేరం తగల లేదు కాని ' నాణ్య మైన ముంత మామిడి పప్పు తెచ్చింది మా చినపాప ' అని మ ఊర్లో అందరికీ చెప్పుకొని మా అమ్మ మురిసిపోయింది.

                  మహాసముద్రం దేవకి
                       24- 9- 2022

Comments