గాథా సప్తశతి - 5
గాథా సప్తశతి లో దాంపత్య జీవితంలోని ఆత్మీయతానురాగాల్ని , అనుమానాల్ని, పొరపొచ్చాలను, కష్ట నిష్టూరాలను , ఆవేదనలను, పొల అలకలను ఇంకా ఎన్నింటినో చూడగలం.
నాకంటే గొప్పది లేదని ఆ భార్యకు గర్వం. అందుకే భర్త ఇతరులతో సావాసం చేస్తే తప్ప శృంగార పరంగా తనలోని విశిష్టత ఏమిటో అతనికి తెలిసిరాదని నిష్టూరంగా ఇలా అనుకొంటున్నది.
'మా వానికితర వనితల
సావాసము గలుగునట్లు సవరింపవె , యో
దేవ! యెపుడు నొక యంగన
నే వలచిన మంచి చెడ్డ లెరుగరు పురుషుల్'
ఇది గర్వంతో భార్య అంటున్న తాత్కాలికమైన మాటలు .
. గుట్టుగా కాపురాన్ని నెట్టు కొస్తున్న ఆ భార్యకు ఇంటి గౌరవాన్ని నిల బెట్టడం పట్ల మనసుంది. భర్త పైన అమితమైన ప్రేమానురాగాలున్నాయి. పేదతనం వల్ల తన భర్త చేతగాని తనం ఎక్కడ బయట పడుతుందో, అతనిని ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని ఆమె బాధ. అందుకని చుట్టరికంతో తన ఇంటికి వచ్చిన సంపన్నుల పైన అలక చూపి వాళ్లను వెళ్లిపోయ్యేట్లు చేస్తున్నదా భార్య. ఇంటి మర్యాదను కాపాడడం పట్ల , భర్త పట్ల భార్యకున్న గౌరవానికి ఈ గాథ పరాకాష్ఠ .
' ఇంటి పెద్దతనము నెచ్చుగా మన్నించు
పేద మగని పరువు పేరు నిలుప
వైభవంబుతోడ వచ్చెడు తన చుట్ట
ములకు గూడ గృహిణి యలుక చూపు'
భార్యా భర్త లన్నాక పట్టు విడుపులుండాలని ఒక తల్లి లేదా చెలికత్తె ఆ సతికి ఉపదేశం చెయ్యడాన్ని ఈ కింది పద్యంలో చూడొచ్చు. తప్పు చేసినప్పుడు భర్త భార్య కాళ్ల మీద పడడానికి కూడా సంకోచించడు అనే విషయం కూడా దీని వల్ల స్పష్టం .
' చెడుగు పిల్ల! కాళ్ల పడినాడు నీ పతి
నింకనైన లేవనెత్త వేమి
వలపు లెంత గట్టివారి నిల్చిన వయ్యు
నిదియె వినుము వానికెల్ల మేర '
కాళ్లకు మొక్కిన తర్వాత కూడా అలుక మాని క్షమించ కుంటే అతనికి నీ మీదున్న వలపు తగ్గి పోతుంది అని హెచ్చరిక.
ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వాళ్లది. కానీ భార్య ఉన్నట్టుండి చని పోయింది. ఆమె లేని ఆ ఇల్లు కళ తప్పింది. అలాంటి ఇంటికి వెళ్ల లేక పొలంలో పని లేకున్నా అక్కడే పడి ఉంటున్నాడట
ఆ భర్త.
' ప్రీతి పాత్ర మైన పెండ్లాము సచ్చిన
ఇంటి పాడు జూసి ఏడ్వ లేక
చనడు పొలము విడిచి పని లేక యన్నను
పామరుండు చూడు పల్లె కాపు '
Comments
Post a Comment