పరిశోధనలో పదనిసలు -5
వేట పాలెం లోని సారస్వత నికేతన్ కు వెళ్లాము కదా! అక్కడ అందరితో పంచుకోవాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి.
మాకు ఉండడానికి ఇల్లు చూసి పెట్టడమే కాక గ్రంథాలయ సిబ్బంది భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. మేము ఉన్న చోటికి రెండవ వీధిలో మెస్స్. అక్కడ విస్తళ్లలో వడ్డిస్తారు. ఆ ఏరియాలో వరి బాగా పండుతుందని తెలుసు. కానీ మరీ అంతంత అన్నం తినడం అక్కడే చూశాము.
విస్తటి నిండ అన్నం . మేము మొదట వడ్డించిన అన్నం లో సగం కూడా తినలేక పోయే వాళ్లం. కాని అక్కడి వాళ్లు మళ్లీ మారు వడ్డించుకొంటుంటే గుడ్లప్పగించి చూసే వాళ్లం. పొద్దున్నే టిఫిన్ వేరే చోట. పగలు ఫరవాళ్లేదు కాని రాత్రిళ్లు మేమున్న పక్కింట్లో తాగుబోతుల సందడి ఎక్కువ . అందుకని పొద్దు కుంకినాక బయట అడుగు పెట్టడానికి భయపడే వాళ్లం. మా ఇబ్బందిని అర్థం చేసుకున్న మెస్ ఓనరు సత్త్యన్నారాయణ క్యారియరు రూంకే పంపించే ఏర్పాటు చేశాడు. అది మా పాలిట వరమయింది.
ముగ్గురికి ముచ్చటగా మూడు భోజనాలు పంపించ మన్నామా.? ఆరు గిన్నెల పెద్ద క్యారియరులో కూరలు పెట్టి , చట్నీ, అప్పడాలు, అన్నం , ఆవకాయ సెపెరేట్గా పంపేవారు. పన్నెండు గంటలకు హోటల్లో పని చేసే అబ్బాయితో వేడి వేడి అన్నం నెయ్యితో సహా వచ్చేసేది .
మేము మధ్యాన్నం తిని, రాత్రి తిని , ఉదయం టిఫిన్ కు కూడా వెళ్లడం మానేసి చద్దన్నం తిన్నా ఇంకా చాలా మిగిలి పోయేది. పప్పు , కూరలు అన్నీ చాలా రుచిగా ఉండేవి. ( ఆ వాసనలు ఇంకా నన్నొదిలి పెట్టడం లేదండోయ్) అందువల్ల మూడు పూటలా తిన్నా విసుగుండేది కాదు. ఒక విధంగా మాకు లాభసాటిగా ఉండేది.
క్యారియరు రూం కే వచ్చినా కొంత మార్పు ఉంటుందని, భోజనం బాగుందని చెప్పి వస్తామని ఒక రోజు సాయంకాలం నాలుగు గంటలకు హోటల్ కు వెళ్లాము. హోటల్ నిండా జనాలు. ఏమయిందా అని అంత దూరం వచ్చాం కదా వెనక్కి వెళ్లడం ఎందుకుని తటపటాయిస్తూనే లోపలికి వెళ్లాం.
సత్యనారాయణ చేతుల నిండా బ్లేడుతో రక్కిన గీతలు. విషయమేమంటే మూడు గంటల తర్వాత ఓ ఐదుమంది రౌడీలు హోటల్ కు వచ్చి భోజనం అడిగారట. హోటల్ కట్టేశామంటే ఉన్నదేదో పెట్టమని బలవంతం చేసి బిల్లు ఎగ్గొట్టి వెళ్లి పోతుంటే ' మేము కూడా తినకుండా మీకు పెట్టాము . మర్యాదగా డబ్బులిచ్చి పోండి ' అని అడ్డుతగిలాడట సత్యన్నారాయణ. ' ఇవ్వం . ఏం చేస్తాక్షూ అని వాళ్లు మీది మీదికి వచ్చారట. వాళ్లల్లో ఒకడు సందులో సడేమియా అని బ్లేడుతో రక్కేశాడట . చావు తప్పి కన్ను లొట్ట పోయినందుకు సంతోషించి రౌడీలతో ఎందుకొచ్చిన గొడవ అనుకొని ఊరుకున్నా మన్నారు.
పది రోజులు అన్నం పెట్టడం కాదు. డబ్బులొద్దని గొడవ. చివరికి ఎలాగో ఒప్పించి డబ్బు చేతిలో పెట్టాం. ' నాకు తోడ పుట్టిన వాళ్లు లేరు.మీరే నా తోబుట్టువులు ' అంటూ అప్పటి కప్పుడు లోపలి నుంచి వాళ్ల అమ్మను, భార్యనూ పిలిపించి తాంబూలమిప్పించి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. బరు వెక్కిన గుండెలతో వెనుదిరిగాము. ఆ తర్వాత దాదాపు రెండేండ్లు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. తర్వాత క్రమంగా తగ్గి పోయాయి. ఆ అన్న కాని అన్న ఇప్పుడు
ఉన్నాడో లేడో కాని మనసులో ఎక్కడో ఒక మూల నక్కి అప్పుడప్పుడూ తొంగి చూసి పోతుంటాడు. ఇలా జ్ఞాపకాల్లో.
మేమున్న బూత్ బంగ్లా కాను కొని ఒక ఇల్లు ఉండేది. అందులో ఎక్కువగా అమ్మాయిలు ఉండే వారు. సాయంకాల మైతే తాగుబోతుల తాండవం, కుక్కల అరుపులతో భయం భయంగా గడిచేది. తర్వాత తెలిసింది అది బ్రోతల్ హౌసని . అందుకే కాబోలు ఓనర్లు ఆ ఇంట్లోకి రాలేదని తర్వాతెప్పుడో తిరుపతిలో గుర్తు చేసుకుంటూ మాటల మధ్యసుకున్నాం.
ఆ ట్రిప్ మొత్తం సాహసాలతోనే గడిచింది అంటే అతిశయోక్తి కాదు. ఒక రోజు మధ్యలో శారద లేఖల ద్వారా ప్రసిద్ధి పొందిన రచయిత్రి కనుపర్తి వరలక్షమ్మను కలిసి బాపట్ల సముద్రం ఒడ్డున పొద్దు మునిగే దాకా ఉండి పొయాం. వేట పాలెం తిరిగి వెళ్లి పోవాలి. ఇంతలో పెద్ద ప్రళయం ముంచుకొచ్చింది. హోరుమని గాలి వాన మొదలయింది. ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. ఎంత సేపయినా బస్సు రాలేదు. ఆ బీచి ఒడ్డున చిన్న పల్లెటూరు గుర్తుంది. టీ కొట్టులో నిలబడి బస్సుకోసం బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తున్నాం. అక్కడ ఏదో కాలేజి , హాస్టల్ కూడా ఉన్నట్లు గుర్తు. చిమ్మ చీకటి. కరెంటు పోయింది.
ఇంతలో ఒకబ్బాయి వచ్చి ఎలిజబెత్ ను పలకరించాడు. గుడ్డి దీపం వెలుగులో అది వెంటనే పోల్చుకోలేక పోయింది. ఇంకా భయపడి పోయాం. తర్వాత ఆ అబ్బాయే ' మీ వదిన తమ్ముణ్ణండి ' అని గుర్తు చేశాడు. అప్పుడు పోల్చుకుంది. మాకు ఉన్న పళంగా కొండంత ధైర్యమొచ్చింది .వెంటనే బస్సు కూడా రావడంతో కథ సుఖాంత మయింది.
ఆతర్వాత ఇళ్లలో ఈ విషయం చెప్పి అక్షింతలు వేయించుకున్నాం. చంద్రశిరీష వాళ్లక్క చంద్ర కిరణ్ పాల కొల్లులో లెక్చరర్. . తను తిరుపతికి వచ్చినప్పుడు ' రాబోయే కాన్సిక్వెన్సస్ గురించి ఆలోచించేది లేదా' అని రూమ్మేట్స్ ముందర పెట్టిన చివాట్లు ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటున్నాయి .
ఇంకా ఉంది.
మహాసముద్రం దేవకి
19- 9- 2022
Comments
Post a Comment