గాథా సప్తశతి - 4
ఆ రోజుల్లో అత్తా కోడండ్ల మధ్య సన్నిహిత సంబంధాలుండేవి . కోడలు ఎలాంటి అరమరికలు లేకుండా తన మనసులోని బాధల్ని అత్తకు చెప్పుకొని ఓదార్పు పొందేది. భావాల్ని పంచుకొనేది. ఉదాహరణకు కొన్ని :
' మావి చివురు సూచె , మద్యంబు మూర్కొనె
మలయ మారుతంపు చలువ కోర్చె
ఇంతయయ్యు బనులు యెక్కువై నను వీడి
యేగె నత్త యెవరి కెవరు వలయు '
'నీ కొడుకొకు నేను అక్కర లేదులే! ' అని నిష్ఠూరంగా అంటొంది కోడలు. అతనికి ఇంకెవరితోనో సంబంధం అని ఫిర్యాదు .
భర్తకు తన పట్ల ఉన్న ప్రేమానురాగాల్ని కూడా అత్తతో చెప్పు కొని మురిసి పోతోంది మరో కోడలు .
' అత్త ! దాన మాడుచు నుండ నా
నీటుకాడు వచ్చి యేటి దిగువ
పసపు చేదు నీరు పట్టి ద్రావుచును నా
హృదయ మెల్ల గ్రోలు రీతి దోచె '
భార్య యేటి నీటిలో జలకాలాడుతున్నది. భర్త దిగువకు పారుతున్న ఆ పసుపు చేదు నీటిని దోసిళ్లతో తీసుకొని తాగుతున్నాడు. భార్య పట్ల అతనికున్న ఇష్టాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు భర్త. అది చూసిన భార్యకు తన హృదయాన్నే గ్రోలుతున్నట్లనిపించడం లో ఆశ్చర్యం లేదు. కాని ఆ విషయాన్ని అత్తతో చెప్పడం విశేషం. అత్తా కోడండ్ల మధ్య వున్న అన్యోన్యమైన అనురాగానికి ఇంత కంటే మంచి విషయం ఏముంటుంది ?
అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వి నందుకు బాధ పడడమే కాదు సిగ్గుతో తలదించు కుంటారు . అలాంటి స్థితిని ఈ కింది పద్యం చెప్తుంది. ఐతే ఆ గడుసు మహిళ ఏం చేసిందో సన్నిహితురాలైన అత్తతో చెప్పుకొని నవ్వుతోంది కోడలు చూడండి.
పగలు అహంతో నలుగురి ముందు పౌరుషాలు పలికిన వాడు రాత్రి ఆమె కాళ్ల మీద పడి దీనంగా వేడుకొంటున్నాడు. పగలు తనను చూసి నవ్విన వాళ్లు ఇప్పటి తన సౌభాగ్యాన్ని చూసి అసూయ పడాలి అన్నట్లు ఆమె దీపాన్ని పెద్దది చేసింది. రెండూ నవ్వుకు కారణాలే . కాని దాన్ని కోడలు ' నాకు భలే నవ్వొచ్చిందత్తా' అని అత్తతో చెప్పుకోవడం అందమైన దృశ్యం .
' అట్లు వాడు దానియడుగులపై బడి
యుండ , నదియు వెలుగుచున్న దివ్వె
ఇంక కొంత వత్తి నెగద్రోయ , జెడ నవ్వు
వచ్చె నత్త నాకు వారి జూచి '
అత్తా కోడండ్ల మధ్య ఇలాటి సన్ని హితమైన సహృదయ వాతావరణం చూడ ముచ్చటగా ఉంటుంది .
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment