పరిశోధనలో పదనిసలు - 4

 పరిశోధనలో పదనిసలు -4


ఒకే సారి చీరాల, బాపట్ల  , వేట పాలెం వెళ్లాలని అనుకున్నాం. మా చిన్నాన్న గారనే కాదు. శాఖాధ్యక్షులుగా జి.  ఎన్. రెడ్డి గారి సహాయం విద్యార్థులందరికీ ఉండేది.  నా పట్ల బాధ్యత కూడా తోడవడంతో మా ముగ్గరి పని కాస్తా సులభమయ్యేది. అంటే ఎక్కడ దిగాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ ఉండాలి వైగారాల్లో.

        చీరాల్లో దిగంగానె మా చిన్నాన్న గారి స్టూడెంట్ గారింటికి వెళ్లాలి. అమె సమయానికి ఊర్లో లేక పోవడంతో మా చిన్నాన్న గారు చెప్పరేమో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాలు జగదీశ్వర రావు గారు స్టేషనుకు వచ్చి వాళ్ల యింటికి తీసుకెళ్లారు. మాకు ఇబ్బందిగా ఉన్నా తప్ప లేదు. ఒక రోజు వాళ్ల కాలేజికి తీసుకెళ్లారు. అక్కడ మా యూనివర్సిటీ అమ్మాయి అనూరాధ లెక్చరర్గా తటస్థపడింది. యస్వీ లో మేము ఎం. ఏ . చేసే రోజుల్లో హోం సైన్స్ చేసింది. ఆమెకు ప్రిన్సిపాల్ గారి భార్యకు దూరపు  చుట్టరికముంది. రెండు రోజులు మాకు ఆమ్మాయే గైడుగా వ్యవహరించిందనుకోండి. వాళ్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ ఎందుకో మాకే మొహమాటంగా ఉందేది. ప్రిన్సిపాలు గారిల్లు కదా!

మూడవ రోజు ఉరుకులు పరుగులతో వచ్చిన మా చిన్నాన్న గారి శిష్యురాలు వాళ్లు ఉండనీ అంటున్నా వినక వాళ్లింటికి తీసుకెళ్లి పోయింది. పొయ్యి గట్టు మీద ఉన్న వాళ్లం ఏకంగా పొయ్యిలోనే పడ్డట్లయింది.

        వాళ్లు బ్రాహ్మణులు. అది మా పాలిట శాపమయింది. మమ్మల్ని వసారాలొనే కూర్చోబెట్టి అక్కడే భోజనాలు కూడా పెట్టారు. అక్కడి నుండే వేటపాలెం వెళ్లాము. మళ్లీ చిరాలలో వాళ్లింటికి వెళ్లదలుచు కోలేదు.

బాపట్ల జిల్లా వేటపాలెంలో 1918 లో స్థాపించబడిన పెద్ద గ్రంథాలాయం ఉంది. దాని పేరు సారస్వత నికేతనం.  1976 లో  అనుకుంటా  మేము వెళ్లింది . అప్పటికే  అక్కడ లక్ష  గ్రంథాలకు పైగా ఉండేవి.

ఆ గ్రంథాలయం లైబ్రేరియన్ మమ్మల్ని ఆ ఊరి కరణం గారింటికి తీసుకెళ్లారు. వాళ్లు అప్పుడే కొత్తగా ఒకపెద్ద బంగ్లా కొన్నారు. అది మేము ఉన్నన్ని రోజులు ఉండడానికి ఇచ్చేశారు. వెంటనే చీరాలకు వెళ్లి లగ్గేజ్ తీసుకొని వేటపాలెం వచ్చేశాము.

సారస్వత నికేతనం ఒక విధంగా మా పాలిట వరమయింది. మా పరిశోధనకు కావలసిన ముడిసరుకు చాలా భాగం అక్కడే దొరికింది. ఎంతగా అంటే రాత్రిం బవళ్లు రాసుకున్నా ఇంకా మిగిలేంతగా. ఒక పది రోజులునాం అక్కడ.  అవి ఎత్తి రాసుకొని ( అప్పట్లో జిరాక్స్ తీసుకొనే అవకాశం లేదు) నా చిటికెన వేలు కింది పక్క చర్మం మొత్తం ఊడొచ్చింది. గ్రుహలక్ష్మి , జనవినోదిని, వివేకవర్ధిని, భారతి, The indian Antiguery లాంటి  పాత పత్రికలన్ని  మాకు  అక్కడ   దొరికాయి.

లైబ్రరీ  నుంచి బుక్స్ గదికి ఇచ్చే వాళ్లు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మాకు ఉండడానికి ఇల్లిచ్చిన కరణం గారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్లిళ్లయినాయి. సంక్రాతి పండుగొచ్చింది. మమ్మల్ని భోజనానికి పిలిచారు.  మొదట అక్కడే చూశాము . వాళ్లు ఒక పెద్ద హార్లిక్స్ బాటిల్ పసుపు మా పాదాలకు రాసి తాంబులాలు ఇస్తుంటే చాలా సిగ్గుపడి పోయాము. కానీ అప్పటి నుంచి ఆ ఇంటి కోడళ్లు మాకు చలా దగ్గరయ్యారు.

వాళ్లు బాగా ఉన్న వాళ్లే కాని ఇద్దరు కోడండ్లు బట్టలు ఉతుక్కోవడాని బంగ్లా లోని చేద బావి దగ్గరికి వచ్చే వాళ్లు . మేము గదిలో రాసుకొంటుంటే గడప పట్టుకొని చూస్తూ నిలబడే వాళ్లు. వాళ్లకు మగ పిల్లలు లేరు. పెద్దామెకు ఒకరు చిన్నామెకు ఇద్దరూ కూతుళ్లుండే వారు. చాలా చిన్న పిల్లలు .

ఒక రోజు మా సంభాషణ చదువు సందెలు మీద సాగుతోంది. ' ఇది సదుకున్న్యాక మీకు నర్సుద్యోగాలొస్తాయా ? ' పెద్ద కోడలడిగింది. ' ఏమి ఉద్యోగాలు చేస్తామో ఇంకా తెలియదు ' అన్నాన్నేను. మా శిరీష ఊరికే ఉండకుండా. మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి. మీలా ఇంటి చాకిరీ, బట్టలుతకడం తప్పిపోతుంది ' అని ఉచిత సలహా పడేసింది .

'ఊహూ! మేం చదివించము '  అంది వెంటనే చిన్న కోడలు . ముందే ఈ విషయం గురించి తోడి కోడండ్లిద్దరూ మట్లాడుకున్నట్లున్నారు.

' ఏం ఎందుకని? అడిగాము నేను శిరీషా ఇద్దతం ఒకేసారి. పుస్తకాల పైనుంచి  మా ముగ్గురి తలలు ఒకే సారి పైకి లేచి వాళ్లను చూశాయి.

' సదువుకున్ని ఆండ పిలకాయిలంతా సెడిపోతారంటా' తడుముకోకుండా పెద్ద కోడలు సమాధనం చెప్తే ఎత్తిన తలలు ఎక్కడ పెట్టుకోవాలో దిక్కు తెలియక అలాగే ఉండి పొయాము .

(మిగతా తర్వాత )

                       మహా సముద్రం దేవకి
                             19- 9- 2022 

Comments