పరిశోధనలో పదనిసలు -19

 పరిశోధనలో పదనిసలు -19


నవ్వులాట పాటలు

పిల్లలు వాళ్లలో వాళ్లు నవ్వుతూ, ఇతరుల్ని నవ్విస్తూ, కవ్విస్తూ, పరిహసిస్తూ పాడే పాటలు నవ్వులాట పాటలు లేదా వెక్కిరింపు పాటలు.  తమలో తామే కాక పెద్ద వాళ్లను కూడా ఎగతాళి చేసి ఏడిపించాలన్న కుతూహలం పిల్లలకెక్కువ . జానపద సాహిత్యంలో పిల్లలకు సంబంధించిన హాస్య రసం ఇందులో ఉంటుంది. వీటిని 1. సరి పిల్లల్ని ఎగతాళి చేసేవి. 2. పెద్ద వాళ్లను ఎగతాళి చేసేవి అని రెండు రకాలుగా విభజించ వచ్చు.

పిల్లల్ని పరిహసించే పాటyలు

పిల్లలందరూ ఒక చోట చేరినప్పుడు సమయం కోసం కాచుకొని ఎగతాళి చేసి ఏడిపించడమంటే కొందరికి సరదా . అలాంటి సమయాల్లో అందరూ కలిసి ఉల్లాసంగా నవ్వుకుంటారు. అలా ఎగతాళి చేస్తూ పాడే పాటలు కొన్ని అనుశ్రుతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరు మాత్రమే ఉంటే ఈ హాస్యానికి చోటు లేదు.

కొంత మంది కలిసి ఆడుకుంటున్నప్పుడో, మాట్లాడుకుంటున్నప్పుడో కొంత మంది కొందరి ఎగతాళికి అందరి ఆనందానికి పాత్రులవుతూ ఉంటారు. అలాంటి ఎగతాళి పాటల్ని కొన్ని చూద్దాం .

నలుగురైదుగురు కలిసి ఉన్నప్పుడు ఏమరిపాటుగా ఉన్నవారి తలమీద వారికి తెలియకుండా చిన్న కాగితం ముక్కో, ఏదైనా చెత్తో పెట్టి ఎవరైనా చూస్తుంటే చెప్పకండని హెచ్చరిస్తూ చేతులు తడుతూ ఇలా పాడతారు.

' ఓ అబ్బాయి నెత్తి మింద గోరింక
చెప్పకు చెప్పకు చెడి పోతావు
చెబితే నీ ముక్కు తెగ్గోస్తా
దూలం మీంచి దూకిస్తా
పందిరి మీంచీ పాకిస్తా
కంచెడు అన్నం తినిపిస్తా
కడివెడు నీళ్లు తాగిస్తా ' ( బాల భాష )

' తల మింద చెత్తుంది చెప్పొద్దు చిన పాపా '
అని కూడా హెచ్చరిస్తూ పాడతారు.

ఇలా పాడడం మొదలు పెట్టగానే ఎవరికి వాళ్లు తమ తలల మీద ఏమో ఉందని తడిమి చూసుకుంటారు. చెత్త ఎవరి తల మీదుందో వాళ్ల చుట్టూ చేరి మరీ మరీ ఏడిపించి అలసట కలిగే దాకా నవ్వు కుంటారు

ఏడుస్తున్న  తమ్మున్ని నవ్వించడానికి అక్కో అన్నో పాడే పాట.

' తమ్ముడు తమ్ముడు తాయిత్తు 
తమ్ముడి పెళ్లాం మురికిత్తు
మురికిత్తు తీస్క పొయ్ మూల్లో పెడితే
నక్కెత్తుకు పాయెరా నారాయణా ' The Indian Antiquary 1906 . page No: 152 .  )

పిల్లలు ఎవరైనా ఎమైనా అంటే మా అమ్మకు చెప్తా అంటుంటారు . అలాంటి వాళ్లను మరింత ఉడికిస్తూ

' చెప్పుకో చెప్పుకో - చెవులెక్క దీసుకో
మామిడాకిస్తాను మందెట్టుకో ' ( పాత పాటలు ) అని ఏడిపించి చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తారు .

పిల్లలు ఆడుకొంటుంటే ఆ ఆటల తాకిడికి పాత బట్టలైతే చిరిగి పోతాయి. దాన్ని కూడా వదలరు పిల్లలు

' సీమ మిరప కాయ చిర్రో చిర్రో
పాత గుడ్డ చిరిగితే పుర్రో పుర్రో
దాని మొగుడు దాన్ని కొడితె మొర్రో మొర్రో '
( పాత పాటలు . పుట: 24 ) అని పక పకా నవ్వుతారు .

గొప్పలు చెప్పు కొంటూ డంబాలు పలికే వాళ్లను

' చిమడకే చిమడకే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు
ఉడకకే ఉడకకే ఓ ఉల్లి పాయ
నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు ' అని ఏడిపిస్తారు.

ఆటలకు పిలిస్తే రాకుంటే

' కుచ్చుంటె లెయ్య లేడు
కుమ్మరి చట్టి మొయ్యలేడు '
అని పాడి ఉక్రోషంతో వాళ్లు కొట్టడానికొస్తే దూరంగా పరిగెత్తి
'నన్ను కొట్నొస్తాడే నాకు నవ్వొస్తాదే ' అని ఉడికిస్తారు.

ఇష్టం లేని పిల్లల పట్ల అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ 

' బుర్రు పిట్ట బుర్రు పుట్ట తుర్రు మన్నది
పడమటింటి కాపురము చెయ్య నన్నది
అత్త తెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లి పూలు ముడువ నన్నది
మొగుని చేత మొట్టిక్కాయ్ తింటానన్నది ' అని
పాడతారు.

ఈ పాటలన్నీ స్వరూపంలో చాలా చిన్నవిగా ఉంటాయి. వ్యంగ్య పూరితంగా కనిపిస్తాయి. ఏడ్చే వాళ్లను మరింత ఏడిపించి నవ్వడం,  నవ్వించడం వీటి ప్రధానోద్ధేశం.





పెద్దల్ని పరిహసించే పాటలు

ఇవి పిల్లల్ని పరిహసించే పాటల కంటే ఎక్కువగా  ఉన్నాయి . వరసైన వదినలు, బావలు, అత్త మామలు , ముసలి వాళ్లు , అమాయకులు, పిచ్చి వాళ్లు, గురువులు ఇలా అందరూ పిల్లల ఎగాతాళికి పాత్రులే . అలాంటి వాళ్లను అదను దొరికితే చాలు ఎగతాళి చేసి ఏడిపించి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు పిల్లలు .వదినను చూసి మరదళ్లు పాడే పాటలు :

' వదిన గారూ మీరు వాసి గల వారు
వండ బోయిన చోట కుండ నాకేరు '

వదిన వదిన వాసింత -పెన్నెండ్లేండ్ల కడుపంట
పత్తి గింజంత కొడుకంట -పండుకొనే ఉంటాడంట
తిరపతి రాయడు పేరంట- తిరిగి చూస్తే లేడంట'
( నవ్వులు పువ్వులు)

వదినల పిసినారి తనాన్ని ఎత్తి చూపుతూ కాస్త పెద్ద పిల్లలు పాడే పాట.

' వైశాఖ మాసాన వారింట పెళ్లి
వల్లభుడు అన్నయ్య పెళ్లి చేయించె
మిళ్లి తడియ కుండ బొట్టు పడకుండ
నేర్పుగా పెద్దొదినె నేతు లొడ్డించె
అంతకన్న నేర్పరి చిన్నన్న ఒదినె
ఆకాశాన మిళ్లి ఆడించి పోయె ' ( పాత పాటలు . పుట :27 ) పాడతారు . (మిళ్లి అంటే చెంచా, స్పూను లేదా చిన్న గరిటె )

బావగారిని చూస్తే నలుగురిలో నవ్వుల పాలు చేసి నాలుగు చెరువుల నీళ్లు తాగించడం పిల్లలకు సరదా.

' బావా బావా పన్నీరు - బావను పట్టుకు తన్నేరు
వీదీ వీదీ తిప్పేరు - వీసెడు గందం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు -చప్పిడి గుద్దులు గుద్దేరు '
( బాల భాష) ఈ పాటకు పాఠాంతరాలు చాలా ఉన్నాయి.

తాంబూలం వేసుకున్న బావ గారిని చూసి గడుగ్గాయిలు పాడే పాట చూడండి :

' పదేళ్ల నాటిదే పాత దూలమ్ము
పడి పోయె మా బావ పల్వరస మీద
పళ్లన్ని పిప్పాయె నోరెర్రనాయె
వీధిలో బావకు విన సిగ్గులాయె
రచ్చలో బావకు రా సిగ్గులాయె
సభలోను బావకు తలవంపు లాయె ' ( నవ్వులు పువ్వులు

పండక్కి ఇంటి కొచ్చిన కొత్తల్లున్ని

' కోరు కొండనుండి కొత్తల్లుడొచ్చె
గీసి గీసి వండెను గిద్దెడు బియ్యమ్ము
తిన లేక తిన్నాడు తీపులు మారాడు
లేవ లేక లేచాడు నేల పట్టుకొని '


' అత్తగారింటికి కొత్తల్లుడొస్తేను కొత్త సున్నము తెచ్చి మెత్తరమ్మ
కొత్త సున్నము తోటి కోపంబు వస్తేను నల్లేరు దెప్పించి నలపరమ్మ ......
అబ్బబ్బ అత్త వారింటికి వచ్చి సుఖ మేంటి
వచ్చిన దారినె కాశికి పోతే మేల్ మేల్ '
( నవ్వులు పువ్వులు )

అత్త మామల్ని పరిహసిస్తూ -

' కొండ మింద మా మామ ఇల్లు కట్టాడు
  కోరి కొడుకుల కంది మా అత్త
  కొడుకులు కొండ మింది కోతుల్ని పోలు
  కూతుళ్లు గుడి వాడ కుక్కల్ని పోలు
  అల్లుళ్లు నెల్లూరి రాజుల్ని పోలు.
  కోడళ్లు గోల్కొండ చిలకల్ని పోలు '

అత్త కొడుకుల్ని , కూతుళ్లను కోతులతో కుక్కలతో పోల్చి తమను అంటే ఆ ఇంటి అల్లుళ్లను , కోడండ్లను గొప్పగా చెప్పు కోవడం ఈ పాటలో కనిపిస్తుంది.

ఇంటి కొచ్చిన మేన మామను ఎగతాళ్లి చేసే పాట:

'అమ్మ తమ్ముడొచ్చాడు - అమ్మ కేమి తెచ్చాడు
చిప్ప నిండ కందులు తిప్పుకొంటు వచ్చాడు
నోటిలో బెల్లం ముక్క నాన బెట్టు కొచ్చాడు '
మొత్తానికి  ఏమీ తేలేదని చెప్పడమన్న మాట

తాత గారిని చూసి

' చింత చెట్టు తొర్ర లోన చిలక ఉన్నది
చిలక ముక్కు చూచి తాత చిర్రు మన్నాడు
చిలక ముక్కు తాత ముక్కు పోలికున్నది
తాతకు దాన్ని చూస్తె కోపం తాళ కున్నది...  '

'తాతగారింటనే తూతూల పెళ్లి
బూరి ముక్కడిగితే బుగ్గ పొడిచేరు
గారి ముక్కడిగితే కసిరి కొట్టేరు
అరిసి ముక్కడిగితే అదిమి తన్నేరు '

పంతుల్ని చూసి
' పంతులు పంతులు పావు సేరు మెంతులు
పిలక బట్టి లాగితే పీకులాటలు '

రెడ్లను చూసి
' రెడ్డీ బుడ్డీ సారాయి బుడ్డీ
ఇంట్లో గడ్డీ ఈదిలో ఒడ్డీ '

కోమట్లను చూసి
' కోమటి కొమటి కొత్త బెల్లం కొంటావా తింటావ
కొంటే డబ్బు కర్చు తింటే కడుపు నొప్పి ' అని ఏడిపిస్తారు . ఇవన్నీ కేవలం నవ్వు కోవడం కోసం పాడుకొనేవే .

మహసముద్రం దేవకి 

Comments