పరిశోధనలో పదనిసలు - 10
క్షేత్ర పర్యటనలో భాగంగా కొంత మంది రచయితలను కలవాలని ముగ్గరం పెట్టే బేడా సర్దుకొని చెన్న పట్నం బయలు దేరాం. వెళ్లే ముందు ఒకసారి మా ఊరికి వెళ్లాను . విశాఖపట్నం వెళ్లి నప్పుడు లేని సందడి మెడ్రాస్ వెళ్తున్నా ననగానే అలుముకుంది. మా అవ్వ ' మా పాప పట్నం పోతా ఉంది ' అనగానే నేనేదో అమెరికాకు వెళ్తున్నట్లు అందరూ ఇంటికి వచ్చి పరామర్శించడమే. మా అమ్మమ్మ వాళ్లు కూడా మా ఊరులోనే ఉంటారు. ఆమే నేను చెన్న పట్నం తీసుకు పోవడానికని తినుబండారాలు కూడా చాలానే తయారు చేసి ఇచ్చింది.
మెడ్రాస్ లో ఉండడానికి ఇబ్బంది లేదు. శిరీషా వాళ్ల రెండో అక్క రజనక్క ఉంది. వాళ్ల ఇంట్లో దిగాం . రెండు పోర్షన్ల ఇల్లది. ఒక పోర్షనులో రజనక్కా వాళ్లుంటే మరో పోర్షన్లో పిల్లలిద్దరితో శిరీషా వాళ్ల వదిన ఉండేది . వాళ్ల అన్న అమెరికా వెళ్లాడు. వీసా కోసం ఎదురు చూస్తూ రజనక్క తోడుంటుందని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుందట. అందువల్ల రెండు ఇండ్లూ మాకు అండా దండా. భోజనం కూడా ఒక రోజిక్కడ ఒకరోజక్కడ అన్నట్లుండేది.
ఇద్దరూ టీచర్లు . నేనిది నువ్వది అన్నట్లు ముందు రోజు మాట్లాడుకొని వంట చేసే వాళ్లు. రెండు రోజులు మ్యూజియం , జూ( మా వరిగపల్లె ప్రజల దృష్టిలో చచ్చిన కాలేజి, బతికిన కాలేజి ) అంటూ సరదాగా తిరిగాక అసలు పనిలో పడ్డాం .
ఒక రోజు మదరాసు విశ్వ విద్యాలయాన్ని చూచి నాలుగు గంటల నుంచి దగ్గరే ఉన్న బీచ్ లో గడిపేశాం. మరో రోజు క్వీన్ మేరీస్ కాలేజీకి వెళ్లాం. మా చిన్నాన్న గారి క్లాస్ మేట్ అక్కడ తెలుగు శాఖాధ్యక్షురాలయిన డా. జి. లలిత గారిని కలిశాం. ఆమె బాలసాహిత్యం గురించి మంచి వ్యాసం రాసింది. అది ముందే చదివున్నాను . ఆమె ద్వారా ఇంకా చాలా విషయాలు తెలిశాయి . ముఖ్యంగా బాల్య దశ ఎంతవరకు అనే విషయం గురించి చర్చించుకున్నాం .
ఆ కాలేజీకి ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రభుత్వ కళాశాల. మదరాసులో మొదటి స్త్రీల కళాశాల.
ఇండియాలోనే మూడవ స్త్రీల కళా శాల . దక్షిణ భారత దేశంలో రెండవది. ఆ కాలేజీలో తెలుగు పుస్తకాలు బాగానే ఉన్నాయి. నన్ను తనదగ్గరే ఉండి పొమ్మంది. తిరగడానికి తోడు అవసరమని తప్పించుకున్నాను.
ఒక రోజు శిరీష కోసం రామలక్ష్మి గారిని కలవడానికి వెళ్లాం. ఆమె ఆరుద్ర గారి సతీమణి అని తెలుసు కదా! మేము వెళ్లినప్పుడు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మా అదృష్టం అనుకున్నాం. ముందు చెప్పి వెళ్లడానికి ఆ రోజుల్లో ఫోన్లు లేవు . లాటరీ వేసి వెళ్లడమే. రామలక్ష్మి గారు తను రాసిన నవలలు ఐదారు ఇచ్చి కొంత సేపు మాట్లాడి ఏదో మహిళా కార్య క్రమం ఉందని , తను లేకుంటే ఏ పనీ సవ్యంగా సాగదని హడావుడిగా వెళ్లి పోయారు. ఆమె ఎప్పుడూ బ్యుజీ అని ఆరుద్రగారు జోక్ వేశారు. ఆయన మాత్రం చాలా సేపు మాట్లాడారు. మా చిన్నాన్న గారి గురించి అడిగారు. వాళ్ల లైబ్రరీ చూపించారు .
సినిమాలకు కథలు, సంభాషణలు , పాటలు రాయడం గురించి చెప్పారు. అప్పటికే సమగ్రాంద్ర సాహిత్యం పేరుతో తెలుగు సాహిత్య చరిత్రను 12 సంపుటాలు రాశారు. చాలా కష్టపడినారని అంటే గడ్డం మధ్య పళ్లు తళుక్కున మెరిసేలా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి ఆయనతో సంభాషణ సరదాగా అనిపించింది.
బాలల పత్రికలలో నాగి రెడ్డి, చక్రపాణి గార్ల సంపాదకత్వం లో వెలువడే చందమామ గురించి వినని వారు, చూడని వారు, చదవని వారు ఉండరు. పిల్లల పత్రికే అయినా పెద్దవాళ్లు కూడా చదవడానికి ఎగబడే వాళ్లు. అది మద్రాస్ లోనే ప్రింట్ అయ్యేది. అందుకని చందమామ బిల్డింగ్స్ కు వెళ్లడానికి ఒక రోజు తయారయ్యాం.
అక్కడికి వెళ్లిన తర్వాత దాని గురించి చాలా విషయాలే తెలిశాయి. ఆ పత్రిక మొత్తం 13 భాషల్లో వెలువడుతుంది. తెలుగు చందమామ గురించి తెలుసు కోవడానికి వచ్చామని తెలిసి ఒక గదిలో కూర్చో బెట్టారు. కొంత సేపు గట్టిగా మాట్లాడుకోవడానికి కూడా భయపడి బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూస్తూ అడపా దడపా ఒకరి మొహాలొకరరు చూసుకొంటూ, సైగలు చేసుకొంటూ గడిపాం. ఒక అరగంట పైగా కాచుకున్న తర్వాత తెలుగు వాళ్ల పంచె కట్టుతో తెల్లటి జుబ్బా ధరించి ఓ వయసైన వ్యక్తి లోపలకి వచ్చి ప్రశ్నార్థకంగా చూశారు .
మమ్మల్ని మేము పరిచయం చేసుకున్న తర్వాత నా పరిశోధన గురించి చెప్పాను . బాల సాహిత్యానికి ఇన్నాళ్లకు గుర్తింపు వచ్చిందని సంతోషించారు. ఆయన పేరు బాలాంత్రపు నళినీ కాంతరావు . వాళ్ల సోదరుడు బాలంత్రపు రజనీకాంత రావు రాసిన ' జేజి మామయ్య పాటలు' గురించి చెప్పారు . అప్పటికే ఆ బుక్ మొత్తం కాపీ చేసుకొన్న విషయం చెప్పాను . అడ్రస్ ఇచ్చి ఉత్తరం రాస్తే బుక్ పంపిస్తారన్నారు. తర్వాత ఒక ఉత్తరం కాదు. బుక్ పంపించారు. మా మధ్య కొంత కాలం ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి.
చందమామ పత్రిక గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో వారి ద్వారా తెలిశాయి. 13 భాషల్లో వెలువడే ఆ పత్రిక దేనికదిగా రాదు. తెలుగు చందమామలో ఏయే కథలున్నాయో అవే కథలు ఆ నెల సంచికలో అన్ని భాషల్లోను వస్తాయి. అన్ని భాషల నుంచి అవి ఎన్నుకో బడతాయి. వాటిని అనువాదం చేయడానికి అన్ని భాషల్లోను నైపుణ్యం ఉన్న అనువాదకులు ఉన్నారు. బొమ్మలతో సహా భాష వేరైనా పత్రిక రూపు రేఖలు ఒక్కటే . అవి చూపించారు కూడా. తెలుగు పత్రిక ఈయన పేరుతో రూపొందుతుంది. ఇంతలో ఏదో అడగడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఈయన తెలుగు చూస్తే ఆయన హిందీ వెర్షన్ చూస్తారట . తన గదికి వెళ్లిన తర్వాత ' గుడియా ' పేరుతో ఆ నెలలో వచ్చిన చందమామ పత్రికను పంపించారు.
రజనీకాంత రావు రచయితే కాదు . సంగీత దర్శకులు . స్వరకర్త . జేజి మామయ్య పేరుతో ఆకాశవాణిలో పిల్లలతో పాటలు పాడించే వారు . లలిత సంగీతానికి ఆద్యులు . క్షేత్రయ్య పదాలను, అన్నమయ్య కీర్తనలను ఆంగ్లంలోకి అనువదించారు .
ఆ మరునాడే ఇద్దరు ముఖ్యమైన వాళ్లను కలిశాము. వాళ్లే చందూరు, ఆయన సతీమణి మాలతీ చందూరు. తనకు స్నేహితుడంటూ మా చిన్నాన్న ఇచ్చిన ఉత్తరాన్ని ఆయన చేతిలో పెట్టాను. మేము వెళ్లేసరికి ఇద్దరూ వాళ్ల ఇంట్లోనే ఆఫీసు గదిలో పనిలో తలమునకలుగా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి కొన్ని గంటలు చాలా సౌమ్యంగా మాట్లాడారు. బాల సాహిత్య రచయితల గురించి చెప్పారు. అప్పటికే ఆంధ్ర ప్రభలో ప్రమదావనం శీర్షిక ద్వారా మహిళల సమస్యలకు సమాధానాలు ఇచ్చేవారు మాలతి. అవన్నీ చర్చకు వచ్చాయి . ఆ అనుభవాలను ఎన్నో చెప్పుకొచ్చారు. ఆమె ఇచ్చిన నవలలు తీసుకొని ఇంటి ముఖం పట్టాము.
మా ముగ్గురికీ పువ్వులంటే చాలా ఇష్టం . శిరీషకు, నాకు పెద్ద జడలుండేవి. ఎలిజా బిర్రుగా జడల్లుకొని ఒద్దికంగా, చూడ ముచ్చటగా పువ్వులు పెట్టుకొనేది. శిరీషకు సెంటు జాజిపూలిష్టం. ఎలిజాకు మల్లి పూలు కనకాంబరాలు నచ్చేవి. నాకు మల్లి పూలు, కనకాంబరాలు, చేమంతులు, మరువం, మొగిలిరేకుల చీలికలు, క్కడక్కడా నాటు గులాబీలు, వట్టి వేర్లు వగైరాలు కలిపి కట్టిన మద్రాసు కదంబమంటే చాలా చాలా ఇష్టం. అన్ని పూలవాసనలు కలిసిపోయి ఘుమ ఘుమ లాడేవి. మద్రాస్ లో ఉన్నంత కాలం మా తలలు పూల తేరుల్లాగా ఉండేవంటే నమ్మండి.
ఒక రోజు మూర్ మార్కెట్ కెళ్లాము . అక్కడ దొరకని వస్తువంటూ లేదు . ఏవో పిచ్చివి దండలూ, రిబ్బన్లూ, గాజులూ, పూసల కమ్మలూవగైరాలు కొనుక్కున్నాం. 18 రూపాయిలు పెట్టి ముగ్గురం ౩ చీరలు కొనిక్కున్నాం. తెల్ల వాయిల్ చీర పైన పైంట్ చేసింది. నా కా చీర ఎంతిష్టమో ! పాత బడి పోయిందని 1984 లో మాపాప మనోజ్ఞకు చెక్క తొట్టి ఉయ్యాలకు సరిపడా మెత్తగా ఉంటుందని మా అక్క బొంత కుట్టేసింది. ( ఆ ఉయ్యాల మా ఆయన ఊగినది. )ఆ చీర్స్తో ఫోటో కూడా ఉంది .
ఎక్కడికి వెళ్లాలో, ఎన్నో నంబరు బస్సు ఎక్కాలో ముందే ఇంట్లో వాళ్లతో మాట్లాడి నోట్ చేసుకున్నా అడ్రసులు వెతికి పట్టుకోవడం వల విసిరి చేపలు పట్టినట్లుండేది. బస్ దిగినాక నడక తప్పేది కాదు. వచ్చీ రాని తమిళం లో ఎవరు కనిపిస్తే వాళ్లను అడిగే దాన్ని. మా ముగ్గురిలో కొంత తమిళం వచ్చిన దాన్ని నేనే మరి ! వాళ్ల ' నేరా పోంగూ' అనే సమాధానం నవ్వు తెప్పించేది. అలాగే కన్నెమెరా లైబ్రరీ సందర్సించాము. తమిల్నాడులో టవును బస్సుల్లో ఆడవాళ్లు నిల్చో నుంటే మగ వాళ్లు లేచి సీటు ఇచ్చే వాళ్లు.
ముఖ్యంగా ఎగ్మోర్ లొని ఆర్కీవ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే . చారిత్రక అంశాలను అన్వేషించే పరిశోధకులకు అది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి . ఆసియా లొనే అతి పెద్ద ఆర్కీవ్స్ అది. ప్రాచీన చరిత్ర గురించి , దేశాల గురించి, వ్యక్తుల గురించి ఏది కావాలన్నా అందు బాటులో ఉంటుందక్కడ.1905 , 1906 కు సంబంధించిన The Indian Antiquary పత్రికలు నాకు అక్కడే దొరికాయి. అందులో మొట్ట మొదటి జానపద బాలగేయాలు M. N. వెంకట స్వామి సేకరించి ప్రచురించినవి ఉన్నాయి.
ఎగ్మూర్ లోని కన్నెమెరా లైబ్రరీ చాలా ప్రసిద్ధి చెందింది. 1896 లో ప్రభుత్వం స్థాపించిన ఆ పబ్లిక్ లైబ్రరీలో పాత పుస్తకాలు , వార్తా పత్రికలు అన్నీ దొరుకుతాయి. అప్పట్లో రచయితలు వాళ్లు ప్రచురించిన గ్రంథాలను ఒక కాపీ తప్పకుండా ఆ లైబ్రరీకి పంపే వాళ్లు .
ఒక రోజు ఎన్నూర్ వెళ్లాము. సముద్రం నీళ్లు ( Back water ) ఏటి గుండా ప్రవహిస్తూ ఎన్నూర్ను సిటీ నుండి వేరు చేస్తూ ఉంటుంది. . ఎక్కడ చూసినా ఉప్పు తయారీ మళ్లు మా కళ్ల బడింది. అదొక పారిశ్రామిక వాడ. యాభై ఏండ్లకు ముందు మాట. ఇప్పుడెలా ఉంటుందో ఊహకు కూడా అందదు.
అది ఒక విధంగా మా వినోద యాత్ర అని చెప్పాలి . తోట బంగ్లా చూశాము. తోటంతా తెగతిరిగాం. బోట్ షికారు చేశాం. ఆ బంగ్లా లో సినిమా షూటింగ్ లు ఎక్కవ. మేము వెళ్లొచ్చిన కొన్నాళ్లకు బాపు డైరెక్షన్ లో గోరంతదీపం రిలీజయింది. ఆౌ సినిమా చాలా వరకు ఆ బంగ్లాలోనే తీశారు. అది చూసి అందరితో ఆ జ్ఞాపకాలను కలబోసుకున్నాం. మా జూనియరు, శిరీషా వాళ్ల వదినకు చెల్లెలు సీతా వాళ్లింట్లో మాకు భోజనం. తను వాళ్ల అక్క వాళ్లింటికి వచ్చినప్పుడు తన బలవంతం మీదే ఎన్నూర్ వెళ్లడానికి తీర్మానమయింది. ఆ రోజు పొద్దు పోయే దాకా తెగతిరిగి ఇల్లు చేరాం.
మహాసముద్రం దేవకి
12 - 10 - 2022
Comments
Post a Comment