పరిశోధనలో పదనిసలు - 1

 పరిశోధనలో పదనిసలు -1


రెండు గంటలు కావస్తోంది. ఉన్నట్టుండి మెలకువ  వచ్చింది.  ట్రైన్ లో కలకలం . ట్రైన్ కదలికల శబ్దం లో మార్పు . అందరూ దించిన షట్టర్స్  పైకి ఎత్తి చూసే ప్రయత్నం చేస్తున్నారు. మిడిల్ బెర్త్ లో ఉన్న నేను దిగ్గున కిందికి దూకాను. అప్పటికే ఎలిజా లేచి చూస్తొంది.పై బెర్త్ మీదున్న శిరీషాను లేపాను.  మొదటి సారి గోదావరి కళ్లబడగానే ఒళ్లు జలదరించింది. అందరూ కాయిన్స్ నదిలోకి విసురుతున్నారు. ఎందుకు? ఏమీ ? అని తెలియకున్నా నేనూ  చేతికొచ్చిన రూపాయి బిళ్లను నదిలోకి విసిరి భక్తితో కళ్లు మూసుకున్నాను .

అంత పెద్ద నదిని చూడడం అదే మొదటి సారి . కనుచూపు మేరా నీళ్లు. నది అంటే ఇంత పెద్దగా ఉంటుందా ? 25 అడుగుల వెడల్పున్న మా ఊరి కట్టే కాలవ వర్షాలప్పుడు మొరవ పోతుంటే ఒక చోట ఐదడుగుల ఎత్తునుంచి శబ్దం చేస్తూ పాల నురగలా కిందికి దూకే నీళ్లను చూడ్డానికి ఊరి జనమంతా పరిగెత్తే వాళ్లం .  దాన్ని చూసి  ఆనందంతో ఉప్పొంగి  పోయే వాళ్లం . ఈ నదిని మా ఊరి వాళ్లు చూస్తే ! 'అబ్బో' అనిపించింది.

నదిలో అక్కడక్కడ  అంత  రాత్రిలో చేపలు పట్టే పడవల్లో మిణుకు మిణుకు మంటూ బుడ్డీ దీపాలు . ఆకాశం లోని నక్షత్రాలు  నదిలో జలకాలాడుతున్నాయా అన్నట్లు .ఆపైన నాకు చాలా సేపు నిద్ర పడితే ఒట్టు.

నేను, నా  స్నేహితులు శిరీష , ఎలిజబెత్ స్టడీ టూర్ వెళ్తున్నాము. అనకాపల్లి స్టేషన్ లో రైలాగింది. ఓ డెబ్బయి ఏండ్లున్న వ్యక్తి మేము ముగ్గరం ట్రైన్ దిగంగానే మా దగ్గరికి వచ్చి
' ఏమండీ! మీరు తిరుపతి నుంచి వస్తున్నారా ? ' అని అడిగారు. 'అవును ' అన్నాము. మీకు
జి. ఎన్. రెడ్డి గారు తెలుసా ? ' వెంటనే ప్రశ్న. 'తెలుసు . మా ప్రొఫెసరు గారాయన. వీళ్ల చిన్నాయన'  నన్ను చూపిస్తూ అంది శిరీష .

అతని వెనకే ఉన్న వ్యక్తి మా చేతుల్లో ఉన్న సూట్ కేసులు మూడింటిని నెత్తిన పెట్టుకొని ముందుకు సాగాడు. అతని వెనక ఆయన. పంచకట్టు , నెత్తిన చిన్న పిలక . మేము వెనక నడుస్తూ కిసుక్కు కిసుక్కని అతనిని చూసి నవ్వుకోవడం గుర్తుంది. ఒకటి రెండు సార్లు ఆయన వెనక్కి తిరిగి చూసి నప్పుడు మాటలాపి  నడక పెంచాము. స్టేషన్ బయట ఆగిన జట్కాలో ఎక్కాము.

జట్కా బండి ఓ ఇంటి ముందు  ఆగింది . ఆ ఇంటిని చూడంగానే కళ్లు  గిర్రున తిరిగాయి. అంత పెద్ద మేడను అంతకు ముందు చూడ లేదు. అపార్ట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద బిల్డింగులు  వచ్చినా అలాంటి ఇంటిని మాత్రం మళ్లీ ఇంత వరకు చూడ లేదు. లోపలికి వెళ్లే కొద్దీ విశాలమైన హాలు చిన్న సినిమా హాలంత. ఎటువైపు చూసినా వరస పెట్టి గదులు. పెద్ద మండువా లోగిలి .

ఆ ఇంటిని చుట్టూ పరికించి చూస్తున్న మమ్మల్ని 'అమ్మాయి గారండీ రండి ' అంటూ మేడ మెట్ల వైపు దారి తీసింది ఓ సుందరి . మాకు గది చూపెట్టి ' మొగాలు కడుక్కొండి కాపీ తెత్తాను. తర్వాత తానాలు చేత్తురు గానీండీ'. అంటూ వెళ్లింది.

అప్పటికే మా లగ్గేజి ఒక గదిలోకి చేరింది. సినిమాలో లాగా గోచి పోసి కట్టిన చీర , బిగుతుగా నడుముకు చెక్కిన చెంగు. అంచు జాకెట్టు . చెవులకు వేలాడే లోలాకులు. మెడకు కంటె,  కాళ్లకు కడియాలు , ఘల్లు ఘల్లున శబ్దంతో ఓ గజ్జెల గుర్రం గదిలోకి ప్రవేశించింది. పేరు భారతి  అట

'అమ్మాయి గార్లండీ ! ఈది వైపు గదిలో పెట్టమన్నారండీ మా అయ్య గారు, తమరి సామాన్లు . అక్కడి నుంచి బజారు బాగా కనిపిచ్చుద్దండీ ' అంటూ సామాన్లతో పాటు మమ్మల్ని మరో గదిలోకి తీసు కెళ్లింది.

'ఇంతకూ మీ అయ్యగారు ఎవరు? ' నేనే అడిగాను.

' అదేటండమ్మాయి గారూ ! అంత మాటడిగేసేరు . మీ కోసం టేషను కొచ్చింది ఎవరను కొనేరు? మా పెద్దయ్యగారేనండీ ! సుబ్బరాజు గారంటే మా ఇలాకాలో మా గొప్ప  పేరున్న మడిసండీ 'అంటూ భారతి వెళ్లి పోయింది.

' బిత్తర పోవడం మా వంతయింది. ఆయన స్థాయి ఏమిటి? మా స్థాయి ఏమిటి ? మా కోసం ఆయినే స్వయంగా స్టేషను కొచ్చి రిసీవ్  చేసుకోవడమా? ఛీ ! అంత ఉన్నత మైన వ్యక్తిని చూసి మేము ఎగతాళిగా నవ్వు కోడమా? ఇంటి నిండా నౌకర్లు, గుమస్తాలు ఇంత మంది ఉండగా ఆయనే వచ్చారంటే .... ఆయన సంస్కారం  ఎంత ఉన్నతమైంది.

' మన సారంటే ఆయనకు అంత గౌరవం అయ్యుంటుంది. ' ఎలిజబెత్ అంది.  అది నిజమే కావచ్చు. ఆ గౌరవం తోనే తన ఇంట్లో మాకు స్థానమిచ్చారు. కానీ అంత ఉదయాన్నే తానే స్వయంగా స్టేషన్ కు రావడం మాత్రం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం . సాష్టాంగ పడాలనిపించింది.

ఓ రెండు కప్పులు పట్టే పెద్ద పెద్ద మూడు  ఇత్తడి లోటాల్లో కాఫీ తీసుకొని సాధారణ చీర కట్టుతో ఓ నడి వయసు వ్యక్తి గదిలోకి ప్రవేశించింది.

ఆ కాఫీ రుచిని వర్ణించను మాటలు చాలవు . పక్క పక్కనే ఉన్న  మూడు గదుల్లో  వేణ్ణీళ్లు పెట్టి స్నానాలు  చెయ్య  మన్నారు . స్నానాలు  చేసి  భారతి వెంట ఇల్లు చూసి వచ్చాం . ఇంటి విస్తీర్ణమే అర ఎకరా ఉంటుంది .మూడు పక్కలనుండి పై కి  ఎక్కడానికి దిగడానికి మెట్లున్నాయి. వెనక వైపు ఖాళీ స్థలం . దాని తర్వాత వరసగా మూడు వైపులా గదులున్నాయి. ఎడమ పక్క గదుల్లో ధాన్యం , ఎదురుగాను,  కుడి వైపు ఉన్న గదుల్లో బెల్లం నిలువ చేస్తారట

టిఫినుకు పిలుపు వచ్చింది. ఓ అరవై ఏండ్ల వయసున్న గుండు ముత్తయిదువ ఆధ్వరైంలో ఇద్దరు ఆడవాళ్లు దగ్గరుండి  కొసరి కొసరి వడ్డన చేశారు. తర్వాత తెలిసింది వాళ్లిద్దరూ ఆ ఇంటి కోడండ్లని, ఆమె సుబ్బరాజు గారి శ్రీమతి అని. వంట గదిలోంచి పని మనిషి కాబోలు అప్పటికప్పుడు వేడి వేడిగా పెసరట్లు తెచ్చి వాళ్ల కందిచ్చింది. .

టిఫిన్ తిని డైనింగ్ హాల్లోంచి వరండా గుండా కాకుండా వాకిట్లోంచి గదికి చేరాలని ఆ చుట్టు భవంతి మేడను తిలకిస్తూ వాకిట్లో అడుగు పెట్టాము.

పెళ్లిళ్లలో బిరియాని చేసే పెద్ద పెద్ద గుండిగల్లాంటివి  ఐదారు వాకిట్లో ఉన్నాయి.వాటినిండా ఆవపిండి కలిపిన పచ్చి మామిడి ముక్కలు కండ్లు గోరగించేట్లు . ఇంకా నూనె కలపలేదంది భారతి. మరో పక్క పెద్ద పెద్ద ఈత చాపల పైన మాగాయి ముక్కలు ఆర బెట్టారు. వాటికి సంబంధించిన మామిడి  పులుసు అటువైపుగా రెండు గుండిగల్లో. పెద్ద పెద్ద జాడీలు గుండువి, నిలువివి ఓ ముప్ఫై దాకా గొడ అంచు దగ్గర  ఆర బెట్టి ఉన్నాయి. ఇంకాస్త దగ్గర రక రకాల సైజుల్లో జాడీలు . పచ్చళ్లు అమ్ముతారు కాబోలు అనుకున్నాము. అదే మాట భారతితో  అంటే
'అదేటండీ అలా అనేసేరు. మా అయ్యగారికి మామిడి తోటలున్నాయి కదండీ. పచ్చళ్లు పెట్టి బంధువులకు పంపకుంటే ఏటన్నా అనుకుంటారు కదండీ. ఆవ పచ్చడి, బెల్లమావ, మాగాయ ఓల్ బంధువులకు ఎల్తాయండీ. మా రాణమ్మ గారి బంధువులకే సుమారుగా అవుద్దండీ ! పచ్చడి లేకుండా ఎవరికి ముద్ద దిగుద్ది చెప్పండి? ' అంటూ మమ్మల్నే ప్రశ్నించింది.

' రాణమ్మ ఎవరు? ' నేను, శిరీష ఒకేసారి అడిగాము . ' మా అమ్మాయిగోరండీ ! వాళ్లత్త గారి బలగం బో పెద్దదండి ' అంది. ఎవరో మాత్రం చెప్ప లేదు. సుబ్బ రాజు గారి అమ్మాయి అయి ఉంటుందని తర్వాత మేము మా మాటల్లో తీర్మానించుకున్నాము .

గదిలో నుంచి మాకు కావలసిన సరంజామ తీసుకుందామని పైకి వెళ్లాము.మా వెనకే ఉదయం కాఫీ తెచ్చినావిడ పెద్ద పెద్ద గ్లాసులతో వచ్చింది. హార్లిక్స్ కలిపిన చిక్కటి పాలు తాగి కిందికి దిగాము .

సుబ్బరాజు గారు కుర్చీలో  కూర్చొని ఉన్నారు. ఉదయం జట్కా తోలిన మనిషి దూరంగా చేతులు కట్టు కొని నిలబడి ఉన్నాడు. మరో వ్యక్తితో మాట్లాడుతూ మా వైపు చూసిన సుబ్బరాజు గారికి అత్యంత భక్తితో చేతులు మోడ్చి  నమస్కరించాము. పైడిరాజు జట్కాలో లైబ్రరీ చేరుకున్నాము . ఎక్కువ దూరం లేదు కాని మొదటి రోజు అని కాబోలు ఆ ఏర్పాటు.

గిడుగు సీతాపతి 'భారతి' పత్రికకు సంపాదకులుగా ఉన్నప్పుడు 'బాలానందం ' శీర్షికను నిర్వహించారని  ముందే తెలుసు నాకు. కానీ నాకు అవి ఎక్కడా దొరక లేదు. పాత 'భారతి ' పత్రికలు కనిపిస్తే ముందు వాటి  పైన పడ్డాను. నా పరిశోధనాంశం ' తెలుగు బాల గేయ సాహిత్యం' ఎలిజా  పరిశోధనాంశం ' చారిత్రక నవలలు ' , శిరీషాది ' రచయిత్రుల సాంఘిక నవలలు ' వాళ్లిద్దరూ నవలల సెక్షన్లో తిష్ట వేశారు .

11 గంటలలు దాటింది. తాటి ముంజలు పైన ఉండే పొర కూడా తీసినవి ఒక టిఫిన్ బాక్స్ నిండుకు పెట్టి , ఫ్లాస్కు లో కాఫీ తీసుకొని ఒకతను వచ్చాడు.  ' అమ్మ గారు ఇచ్చిరమ్మన్నారు ' అంటూ . ఒంటి గంటకు గంట కొట్టినట్లు మళ్లీ పైడి రాజు దర్శనం. ' భోజనానికి వెళ్లాలంటా' అంటూ.

పేపర్లూ, పుస్తకాలు లిబ్రేరియన్ గదిలో పెట్టి భోజనానికి  వెళ్లాము . అప్పటికే సుబ్బ రాజు గారి భోజనం అయినట్లుంది. అత్తగారు, మాతో బాటు భోజనానికి కూర్చున్నారు. బయటి కెళ్లిన మగ వాళ్లు ఇంకా భోజనానికి వచ్చినట్లు లేరు. ఎర్రగా వేయించిన చేమ దుంపల వేపుడు , బీరకాయ కూర వడ్డించారు . వేడి వేడి అన్నం పెట్టి నెయ్యి వేశారు. వేపుడు కూరలు సాంబారుతోనో, రసంతోనో నంజుకోవడం మాత్రమే తెలుసు మాకు. అన్నంలో ఏకంగా కూరలు కలుపుకొని తినడం మొదటి సారిగా ఆ యింటి అత్త గారు నేర్పారు . ఎర్రగా ఎదురుగా కొత్త ఆవకాయ పచ్చడి కనిపిస్తుంటే కూరలు గొంతు దిగుతాయా? ఊహూ కూరల్ని మందు మింగి నట్లు మింగి . పచ్చడితో తృప్తిగా తిన్నాము. పల్చటి పెసర కట్టు వెయ్య బోతే వద్దన్నాము. పచ్చడి తిన్నారుగా వేడి  తగ్గుతుందంటూ బలవంతంగా వడ్డించారు. కర కర లాడే వడియాలతో రెండు ముద్దలు తిని గడ్డ పెరుగుతో భోజనం కానిచ్చాము .

మూడు రకాల స్వీట్లు మా ముందుకొచ్చాయి. కంటికింపుగా కనిపిస్తున్న నువ్వులంటించి చేసిన అరిసె ఒకటి తిన్నాను నేను . ఎలిజ ఒక్క గులాబ్ జాం తినింది. శిరీష జిలేబి ఇష్టమని తీసుకుంది.  గదికెళ్లి ఓ పది నిముషాలు రెస్ట్ తీసుకొని మళ్లీ గ్రంథాలయం దారి పట్టాము.

నాలుగు రోజులలా రాజ భోగాన్ని చవి చూసిన తర్వాత ఆండాలమ్మ అనే జూనియర్ కాలేజి లెక్చరర్ వచ్చి తాను వైజాగ్ వెళ్లడం వల్ల మాష్టారు గారి ఉత్తరం చూడ లేదని , లైబ్రరీకి వెళ్లి కనుక్కుంటే ఇక్కడున్నారని చెప్పారని హడావుడిగా వచ్చి అందరికీ సారీ చెప్పి వాళ్లింటికి తీసికెళ్లి పోతానని  సుబ్బరాజు గారిని అడిగింది.

' ఇంటికి తీసుకెళ్లమ్మా కాదనను. ఉండడమైతే ఇక్కడే ఉంటారు' అన్నారాయన. ఆయనకు ఎదురు చెప్పలేక ఆండాలమ్మ 'అలాగే 'అంది .

అనకా పల్లిలో మరో రెండు రోజులకు  పని పూర్తయింది. కాని బాలగేయ రచయిత కవుల ఆంజనేయ శర్మ గారి అడ్రస్  దొరకక అదనంగా మరో రోజు ఉండాల్సి వచ్చింది. ఆండాలమ్మ సహకారంతో ఆ పని కూడా పూర్తయింది.

సుబ్బరాజుగారి ఇంటిని , ఆ ఇంటి లోని  మనుషుల్ని, వాళ్ల ఆప్యాయతల్ని వదల లేక వదల లేక ఒక పూట ముందుగానే విశాఖపట్నం వెళ్లడానికి లగ్గేజీతో ఆండాలమ్మ గారి ఇల్లు చేరు కున్నాము .

నిండు కుండ తొణుకుతుందా? అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుందన్న మాటకు నిదర్శనంలా అనిపించారు సుబ్బరాజుగారు.  ఆయన ఇప్పుడు ఉండరని తెలుసు. ముసలి వాళ్లయి పోయిన కొడుకులు, కోడండ్లు ఉంటారు. మనవళ్లు మనవరాండ్లు మాత్రం ఏ విదేశాల్లోనో  ఉంటారు. వెళ్లినా మమ్మల్ని గుర్తు పట్టే వాళ్లుండరు. అసలాయింటిని నేను గుర్తు పట్టగలనా? తప్పని సరిగా ఆ ఇల్లు తన రూపాన్ని మార్చుకొనే ఉంటుంది. జీవితంలో ఒక్కసారయినా మళ్లీ సుబ్బరాజు గారి ఇంటికి వెళ్లాలన్న నా కోరిక మాత్రం తీరనే లేదు. ఎప్పుడు గుర్తొచ్చినా నా హృదయం నిండా కృతజ్ఞత మాత్రం తొణికిసలాడుతూనే ఉంటుంది.

మహాసముద్రం దేవకి
     9 - 10 - 2021 

Comments