తెలుగు పొడుపు కథలు - దాని కథా కమామీషు

పొడుపు కథలు - రకాలు 


జానపద సాహిత్య  ప్రక్రియలలో విజ్ఞాన ప్రధాన మైనవి పొడుపు కథలు. ఇవి ఇతర ప్రక్రియల్లాగా కేవలం వాగ్రూపమైనవి మాత్రమే కావు.  వీటిని బొమ్మలుగా వేసి చూప వచ్చు. భంగిమలుగా ప్రదర్శించ వచ్చు . లెక్కల రూపంలోనూ పొడుపు కథలున్నాయి.  వాక్యం, గేయం, కథ, సామెత, పద్యం, గొలుసు కట్టు నిర్మాణం ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను, పద్ధతులను తనలో ఇముడ్చుకున్న ఘనత వీటికి దక్కుతుంది. 


పొడుపు కథ అని పిలిచినా ఇది కథ కాదు. ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. స్ఫూర్తిని కలిగిస్తూ, వినోదాన్ని అందిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతూ, ఆనందాన్నిస్తూ , నిగూఢంగా ఉంటూ, జ్ఞానోదయాన్ని కలిగిస్తూ, ఎదుటి వాళ్లను సవాలు చేస్తూ చిక్కు ప్రశ్నలా భాసిస్తూ, అర్థం తెలియకుండా తల గోక్కొనేట్లు చేసి తిక మక పెట్టేవి పొడుపుకథలు. ఇవి  మెదడుకు మేత వేస్తాయి. బుద్ధికి నిశిత గుణాన్ని  కలిగిస్తాయి. ఆలోచనలను రెకెత్తిస్తాయి. వేసే వాళ్లకు, విప్పే వాళ్లకు యుక్తి ప్రయుక్తి ప్రకటనా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. 


విజ్ఞాన వినోదాల మేలు కలయికగా సాగి పోయే పొడుపు కథలు జానపద సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాయి. వీటిలోని పదాల నడక, అందచందాలు అందరికీ అందుబాటులో ఉంటూ ఆమోదయోగ్యాలుగా ఉన్నాయి. 


ఉదా: ఒక పొడుపు కథను చూడండి. 

'జీడీ వారి కోడలు 

సిరిగల వారి ఆడ పడుచు 

వయసున కుల్కే వయ్యారి 

వైశాఖంలో వస్తుంది ' 

                            - మామిడి పండు 

మామిడి కాయకు 'జీడి 'ఉంటుంది. మామిడి తోట సిరులు కురిపించే వనరు. అది నిగ నిగలాడుతుంటుంది. వైశాఖ మాసం లో వచ్చే పంట అది. కోడలిగా, ఆడపడుచుగా, వయ్యారిగా మామిడిని అభివర్ణించడం రమణీయం. 


పొడుపు కథలకు జానపద సాహిత్యం నుండి వేరు చేసే గుణం ఒకటుంది. అవన్నీ అప్రయత్నమైనవి. విషయాన్ని గోప్యంగా ఉంచడం లోను , సమాధానాన్ని అన్వేషించడం లోను పొడుపు కథల్లో ప్రయత్నం కనిపిస్తుంది. జవాబు తెలియగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదా: 


'కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు 

పశువు శిశువు తోడ పలక నేర్చు 

వనిత వేదములను వల్లించు చుండును 

బ్రాహ్మణుండు కాకి పలలము తిను ' 


సమస్య లేకుండానే ఉన్నట్లు భ్రమింప జేసే అపార్థ కల్పన ఇందులో ఉంది. . నెమలి పాలివ్వడం, పశువు శిశువుతో పలక నేర్చడం--- . ఈ పద్యం లో ఒక్కొక్క పాదం ఒక్కొక్క వాక్యంగా భాసించేట్లు రాయడంలో చమత్కారమంతా ఇమిడి ఉంది. ఈ సమస్యకు విరుపులతో పరిష్కారం దొరుకుతుంది. అదే విడుపు అవుతుంది. కొండనుండు నెమలి, కోరిన పాలిచ్చు పశువు , శిశువు తోడ పలక నేర్చు వనిత,వేదములను వల్లించు బ్రాహ్మణుడు, కాకి పలలము (మాంసము) తిను.


పొడుపు కథల్లో బుద్ధి చాతుర్యానికి ప్రాముఖ్య  మెక్కువ. గాంభీర్యం ఉట్టిపడేట్లు వెయ్యడం వేసే వాళ్ల వంతు. బుద్ధికి పదును పెట్టి ప్రతిభావంతంగా విప్పడం విప్పే వాళ్ల వంతు. ఉదా: 


' ఇరవై రెండు పులుల్లో ముప్పై ఒకటి చచ్చింది. మిగిలిన వెన్ని? ' 


ఇక్కడ ముప్పై ఒకటి అనడడంలో సమస్య ఉంది. విన్న వాళ్లకు ఇరవై రెండులో ముప్ఫై ఒకటి పోవడ మేమిటని తల పట్టు కొనే పరిస్థితి. ఇక్కడ ముప్పు + అయి = ముప్పయి అంటే ' ఆపద ' కలిగి ఒకటి చచ్చిందని అర్థం . అందుకే ఈ కథల్ని వేసే వాళ్లు ఆ అర్థం స్ఫురించ కుండా గంభీరంగా వెయ్యాలి. అప్పుడే ఈ పొడుపు కథకు అర్థం పరమార్థం. 


పొడుపు కథలు సంక్షిప్తంగా, ధ్వన్యాత్మకంగా ఉంటాయి . కొండంత భావాన్ని ' కొండ అద్ద మందు కొంచమై ఉండదా'  అన్నట్లు  అవి కొద్ది మాటల్లో అందిస్తాయి. ఉదా: 


'కట్ట మింద కన్నె పడుచు కట్ట కనే ఈనకనే దుత్తెడు పాలిస్తుంది .'దీనికి సమాధానం, ఈతచెట్టు లేదా తాటి చెట్టు . 


పొడుపు కథల్లో వక్త ఉద్దేశించిన సమాధానం ఒకటైతే శ్రోత మరో సమాధానాన్ని చెప్పి సమర్థించుకోవచ్చు. దీన్నే శ్లేష అంటారు. ఉదా: 


' సింగారమైన  తోటలో బంగారు పూలు కోసే చినదానా కొన విచ్చుకోని పువ్వు పేరేమి ? ' 

' గురుగు పువ్వు ' అనే సమాధానాన్ని వక్త ఆశిస్తే

' అరటి పువ్వు ' అనే సమాధానం  విప్పే వాళ్లకు తోచ వచ్చు . 


నిత్య  జీవితం లో జానపదులు గమనించిన అంశాలే వీటి లో ఉంటాయి. ఉదా: 


' చిక్కుల మేడలో చిలకల కొలికి 

తూగుటుయ్యాలలో ఊగుతూఉంటుంది 

అకటి కూటి ఆగంతకులను 

పీక పిసికి నులిమి చంపేస్తుంది ' 

దీనికి సమాధానం సాలె పురుగు . ఎద్దుల కొట్టాల్లో, పూరిండ్లలో సాలీడు అల్లుకున్న గూడును చూసిన పల్లె వాసులకు ఈ సమాధానం తప్పక బోధ పడుతుంది. 


పొడుపుకథల్లోని  లయ, యతి ప్రాసలు చెవికి ఇంపుగా తోస్తాయి. అందుకే ఒకటి రెండు సార్లు వినగానే నోటికొచ్చేస్తాయి . గుర్తుండి పోతాయి. ఉదా: 


' పెంకు కింది పక్షీ ! నీ పేరు చెప్పవే కమలాక్షీ !' 

జవాబు ' తాబేలు ' 


పొడుపు కథలు చాలా రకాలుగా ఉన్నాయి. 


వాక్య రూపంలో:

పొడుపు కథల్లో చిన్న చిన్న వాక్యాల రూపం లో ఉన్నవే ఎక్కువ. పల్లె ప్రజల కున్న వస్తు పరిచయం, చమత్కారం వీటిలో ప్రధానం 


చిన్న పిల్లోడు ఎగెరెగిరి రుమాల గట్టి నాడు

- పేలాలు 


సూదేసిన డాక్టరు మారాజులా పోతాడు - తేలు 


లయాత్మక మైన గద్య రూపంలో :

గద్య రూపంలో ఉన్న పొడుపు కథలు కొన్నిట్లో లయ కనిపిస్తుంది. 


కుర్ కుర్ రాజ్యంలో టుర్ టుర్ దొరసానులు  

కాలి నడక నడవ బోయి 

తూలి తూలి దుముకుతారు - పిచ్చుకలు 


గొలుసు కట్టు రూపంలో: 


మొదట చెప్పిన మాటల్లోని చివరి పదం రెండవసారి చెప్పే విషయానికి ముందు చేర్చ బడి గొలుసు కట్టు లాగా ఉంటుంది. ఉదా: 


అంబాలు  . అంబాలు మింద కుంబాలు - కుంబాలు మింద కుడిత్తొట్టి - కుడిత్తొట్టి మింద ఈరబలక - ఈరబలక మింద ఇనప గుండు- ఇనప గుండు మింద ఎదురు మోసులు- ఎదురు మోసుల్లో రేచు కుక్కలు 

- పాదాలు, మొకాళ్లు, పొట్ట- ఎదరొమ్ము - తల - వెంట్రుకలు - పేలు 


గేయ రూపంలో : 


యతులు ప్రాసలు పొడుపు కథల్లో ఉండడం వల్ల గేయాత్మకత వాటిలో కనిపిస్తుంది. 


'కాటుక రంగు - కమలము హంగు 

విప్పిన పొంగు- ముడిచిన కుంగు '

- గొడుగు 


'అమ్మ కడుపున పుట్టాను 

అంతా సుఖాన ఉన్నాను 

నీచే దెబ్బలు తిన్నాను 

నిలువున ఎండి పోయాను 

నిప్పుల గుండం తొక్కాను 

గుప్పెడు బూడిదైనాను '

- పిడక 


పద్యరూపంలో :


మామూలు మాటల పొందికలో  ఉన్న పొడుపు కథలు గ్రంథస్థమైనప్పుడు కొన్ని పద్యాలుగా రూపు దిద్దుకొని పాండిత్య ప్రదర్శకాలుగా ఉన్నాయి . ( ఈ పద్యాల్లో చమత్కారాలు, రకాలు చాలా ఉన్నాయి. వ్యాస పరిధి తక్కువ . ) ఉదా:


'శిల వృక్ష లతల బుట్టిన 

చెలువులు మువ్వురును గూడి చిడి ముడి 

                                   పడుచున్ 

తల వాకిట రమియింతురు 

సులభముగ దీని తెలియ సుజనులు గలరె ' 


- శిల నుంచి పుట్టింది సున్నం, చెట్టు నుంచి వచ్చింది వక్క, , లత అంటే తీగె నుంచి వచ్చింది తమల పాకు -- ఇవి మూడూ తల వాకిట అంటే నోట్లో కలిసిపోతాయి. అదే తాంబూలం 


'గాలి గండమె గాని నీటి గండము లేదు 

దేవతా రూపమై తిరుగుతుంది 

పగ బూని శత్రువును నోరార మింగితే 

చావు పాలవుతుంది చిత్రమండి '

- చేప. మత్స్యావతార ప్రసక్తి ఇందులో ఉంది ( దేవతా రూపమై) 


యక్ష ప్రశ్నల రూపంలో: 


నేల మీద కాయ - ఎండ్రకాయ

నెత్తి కెక్కిన కాయ - శీకాయ , కుంకుడు కాయ 

మూడు కన్నుల కాయ - టెంకాయ 

మానం కాసే కాయ - పత్తికాయ 

కాయ గాని కాయ- తలకాయ 


ప్రశ్నోత్తరాల రూపంలో: 


బ్రహ్మం గారి తత్వాలుగా పేరు పొందిన వాటిలో పొడుపు కథా లక్షణాలున్నాయి. 


'ఊరుకున్న దేదయా  ?- ఊగులాడే దేదయా ?

కాళ్ల సందు దేదయా ?- కమ్ము కొచ్చే దేదయా ? ' 


ఊరుకున్న దావయా - ఊగులాడేది దూడయా 

కాళ్లసందున ముంతయా- కమ్ము కొచ్చేది పాలయా 


పాటల రూపంలో : 


'ఓ తోట కాడి వన్నె కాడా 

నా నలుపులకు నీ తెలుపులిచ్చేవా ? ' 


సమాధానం కూడా పాట రూపం లోనే ఉంది చూడండి. 

'ఓ వగల మారి వయ్యారీ నీ నల్లని జడకు నే మల్లె లివ్వ లేనా.' 


కథల రూపంలో:


'పుటుక్కు- జర జర - డుబుక్కు- మే '. ఇది పొడుపు. విడుపు కథ రూపంలో ఉంటుంది. 


కొట్టం మీద అల్లుకున్న గుమ్మడి తీగె లోని కాయను ఒక ఎలుక 'పుటుక్కున'  కొరికేస్తుంది. అది అక్కడి నుంచి '  జర జరా 'జారి 'డుబుక్కున' కింద ఉన్న మేక మీద పడుతుంది. అది 'మే ' అని అరుస్తుంది 


సామెతల రూపంలో:


'కట్టె- కొట్టె- తెచ్చె '

సేతువు కట్టె- రావణుని కొట్టె - సీతను తెచ్చె అని రామాయణ కథను సూచించే సామెత ఇది. సునాయాసంగా ఏదైనా ఒక పనిని నిర్వహించినప్పుడు దీనిని వాడుతారు. ఇదే పొడుపు కథగా కూడా వ్యవహారం లోకి వచ్చింది. 


లెక్కల రూపంలో :


'పిల్లికి ముందొక పిల్లి , పిల్లికి వెనకొక పిల్లి.  పిల్లికీ పిల్లికీ మధ్య ఒక పిల్లి . మొత్తం పిల్లులెన్ని? '


దీనికి జవాబు :౩ పిల్లులు 


యుక్తి  ప్రధానాలు: 


'పులిలో దొరికే దాన్ని చాలా మంది మగ వాళ్లు కట్టుకుంటారు. పులి గోరు మాత్రం కాదు' 

- టై 


'కొట్టం మింది కోడి  పుంజు గుడ్డు పెడితే  ఏ పక్క పెడుతుంది' 

ఏ పక్క పెడుతుంది అనేదే ఆలోచిస్తారు కాని పుంజా, పెట్టా అనే ఆలోచన చాలా మంది చెయ్యరు. సమాధానం చెప్పక గుడ్లు తేలేస్తారు. కాని యుక్తి చాతుర్యం ఉన్న వాళ్లు వెంటనే చెప్పే సమాధానం ఇది.  - పుంజు గుడ్డు పెట్టదు 


అశ్లీలార్థకాలు : 


కొన్ని పొడుపు కథలు వినగానే అశ్లీలంగా గోచరిస్తాయి. సమాధానం తెలిసిన తార్వాత ఆ అశ్లీలం దూది పింజె లాగా ఎగిరి పోయి రమణీయంగా గోచరిస్తుంది. ఉదా: 


'ఆలూ మొగుడు వాటేసు కుంటే అల్లీ బాబా వచ్చి ఇడిపించె '

- తాళం, తాళం చెవి 


'అర లోపల తెర గట్టుకొని 

తెర లోపల మంచ మేసుకొని 

పరాయి దాని మొగుణ్ణి పక్కలో ఏసుకొని 

తన మొగుడికి తాంబూల మిచ్చు'  

సమాధానం - మగ బిడ్డను కన్న బాలింతరాలు 


సంజ్ఞల రూపంలో:


నీ  పేరేమమ్మా  అంటే ఎడమకంటిని చూపిందట

- వామాక్షి  

నీ మగని పేరేమమ్మా అంటే చినిగిన గుడ్డ పేలికను చూపిందట 

- కుచేలుడు 


తాత్విక రూపంలో:


కానని  అడవిలో కస్తూరి కోనలో

మంధర గిరి పర్వతం మింద ఒక మర్రి చెట్టు

చెట్టుకు కొమ్మలు చేర్పింప పదివేలు

కొమ్మ కొమ్మకు కోటి కాయలుండు 

నగధరంబైనట్టి నడి కొమ్మ మీదను 

నక్క ఒకటున్నది చుక్క వలెను 

చుక్క కిరు పక్కల సుస్థిరంబైనట్టి

సూర్య చంద్రాదుల ఇండ్లు తేజరిల్లు 


సమాధానం - మనిషి 

నరాలు , ఎముకలు , తల, ముక్కు , కండ్లు 


ఇలా పొడుపు కథలు వైవిధ్య భరితాలై వేల కొద్దీ దేశమంతా విస్తరించి జానపదులకు వినోదాత్మకాలుగా ఉంటూ చక్కని కాలక్షేపాన్ని అందిస్తూ వాళ్ల తెలివి తేటలకు సాన పెడుతున్నాయి . ఒకే వస్తువు మీద ఎన్నైనా పొడుపు కథలు పుట్టే అవకాశ ముంది . ప్రతి వస్తువుకూ వివిధ వస్తువులతో పోలికలుండడం వల్ల సమాధానం విప్పే వాడి ఊహను బట్టి రూపు దిద్దుకుంటుంది. 

ఉదా: 'ఎప్పుడూ తల కిందులుగా నిలిచేది ' 

దీనికి సమాధానం - ' గబ్బిలం 'కావచ్చు . ' మేకు ' కావచ్చు . 

అలాగే పొడుపుల్లో స్ఫురించే అశ్లీలం విడుపు వల్ల పటా పంచలవుతుంది. మౌఖిక ప్రచారాలు కావడం వల్ల వీటికి పాఠాంతరాలుంటాయి . 


మహాసముద్రం దేవకి

Comments